గంగి గోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వధాభిరామ, వినుర వేమ! అన్నట్లుగా
మన తెలుగురాష్ట్రాల ప్రధమపౌరుడి ఆవేదన చదవండి 'నేటి బాలలే రేపటి పౌరులు' అని పాలకులు ఎన్ని నినాదాలు వల్లెవేసినా నేటి పోటీ చదువుల వేటలో బలిపశువులుగా మారుతున్నారు, నాసిరకం చదువుల ర్యాంకుల రేసులో కార్పొరేట్ కాలేజీల మాయాజాలంలో , నాసిరకం చదువుల కాలేజీల వలలో పడకుండా, తల్లి తండ్రులు, పాలకులు, మేధావులు మరియు నేటి పౌరులమైన మన హక్కులు, కర్తవ్యాలు మరియు బాధ్యతలు గుర్తుచేసుకుని మసులుకుందాం!
నాసిరకం కాలేజీలు మూసేయండి
నాణ్యమైనవి పది ఉన్నా చాలు
సరస్వతి కాదు.. లక్ష్మీ నిలయాలుగా మారుస్తున్నారు
జేఎన్‌టీయూహెచ్ స్నాతకోత్సవంలో గవర్నర్ సూచన
శాస్త్రవేత్త వీకే సరస్వత్‌కు గౌరవ డాక్టరేట్
ఈనాడు - హైదరాబాద్
నాసిరకం ఇంజినీరింగ్ కళాశాలలను మూసివేయాలని, వాటివల్ల సమాజానికి ఏ ప్రయోజనమూ లేదని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జేఎన్‌టీయూహెచ్‌కు సూచించారు. ఇంజినీరింగ్ కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం జేఎన్‌టీయూహెచ్ 6వ స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. ప్రముఖ శాస్త్రవేత్త, నీతిఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. మొత్తం 111 మందికి బంగారు పతకాలు, 738 మందికి పీహెచ్‌డీ పట్టాలు అందించారు. జేఎన్‌టీయూహెచ్‌లో ఏటా 4 లక్షల మంది చదవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఇంతమంది ద్వారా సమాజానికి పనికొచ్చే పరిశోధనలు ఎన్ని జరుగుతున్నాయో చూపగలరా?’ అంటూ ప్రశ్నించారు. వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం, భూగర్భ జలాలు అడుగంటిపోకుండా చూడటం, తక్కువ ధరకు వైద్యం అందించడం తదితర ఎన్నో సమస్యలపై ఎందుకు పరిశోధనలు చేయడం లేదన్నారు. సౌర విద్యుత్ ప్యానెళ్లను ఇప్పటికీ జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, వాటిని తక్కువ ధరకు సమకూర్చుకునే పరిశోధనలు ఎందుకు జరగడంలేదంటూ ప్రశ్నించారు. సరస్వతీ నిలయాలను లక్ష్మీ నిలయాలుగా మార్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘నాసిరకం కళాశాలలను మూసేయాలని జేఎన్‌టీయూహెచ్ ఉపకులపతిని కోరుతున్నా.. నాణ్యమైన కళాశాలలు పది ఉన్నా చాలు’ అన్నారు. బంగారు పతకాలు, పీహెచ్‌డీలు అందుకున్నవాళ్లు సగటుమనిషి గురించి ఆలోచించాలని కోరారు.
సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి
విద్య, పరిశోధన సంస్థలు ఎన్ని ఉన్నా ఇప్పటికీ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని గౌరవ డాక్టరేట్ అందుకున్న వీకే సరస్వత్ ఆవేదన వ్యక్తంచేశారు. 30కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, వ్యవసాయం ద్వారా 15 శాతంలోపు జీడీపీ మాత్రమే సాధిస్తున్నామని చెప్పారు. అయిదేళ్లలోపు పిల్లల్లో 42 శాతం పోషకాహారలోపంతో తక్కువ బరువుతో ఉన్నారని వీటన్నింటికీ పరిష్కారాలు కనుక్కోవాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఉపకులపతి వేణుగోపాల్‌రెడ్డి, రెక్టార్ ఎన్‌వీ రమణారావు, రిజిస్ట్రార్ యాదయ్య పాల్గొన్నారు.
No comments:
Post a Comment