Tuesday, April 4, 2017

నేటి బాలల శిక్షలు - బాలల స్పందినలు

మన ఆశలకి పిల్లలని బలిపశువులను చేస్తూ వారి అందమైన, ఆనందమైన బాల్యాన్ని, పసి తనపు అమాయకత్వాన్ని, ఉగ్గుపాలనాడే అమ్మని, కమ్మని అమ్మభాషని దూరంచేసి ఐ ఐ టీ కొచింగ్స్ ఎరలతో చదువును అమ్మకానికి పెట్టిన కాలేజీలు అనబడే చీకటి కోట్లలో బలిపశువులను చేస్తూన్న వైనం మన తెలుగు నాట ఎన్ని అమాయకపు జీవితాలు చమురుగా మారి కొన్ని ర్యాంకుల తెలుగు వెలుగులు ప్రసరింప చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచిద్దాం! మేధావులూ, పాలకులూ, తల్లి తండ్రులూ, కాలేజీ యాజమాన్యాలు ఒక్క సారి ఆలోచిద్దాం! ఇటువంటివి చదివినప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకుందాం!
Amarnath Vasireddy
శిక్ష
ఏ నేరం చేసానని నాన్నా .....
నన్నీ చెరశాలలో పెట్టావు ?
బ్రహ్మ గీసిన రేఖల్ని చెరిపేసి .....
నా నుదుట నువ్వే గీతలు గీసీ.....
తోకకు తాటికమ్మ కట్టి నిప్పంటించి
దూడని పరిగెత్తించినట్టు
నన్నీ చదువులదారుల్లో పరిగెత్తిస్తున్నావు ?
పూలతోటలు పెంచాల్సిన ప్రభుత్వాలు ,
గంజాయివనాలు పెంచుతున్న చోట -
పశువులమందలు రంకెలేస్తూ ,
పూలతోటల్ని ధ్వంసంచేస్తున్న చోట -
చదువులతల్లిని చెరపట్టి ,
కార్పోరేట్ కారాగారాల్లో బంధించిన చోట -
ఏ పాపం చేసానని నాన్నా....
నన్నీ నరకకూపంలోకి నెట్టేసావు ?
యిక్కడ పిట్టగూళ్లులాంటి గదుల్లో
బ్రాయిలర్ కోళ్లలా బతుకుతుంటాం !
యిక్కడ ట్యూబ్లైట్ల వెలుగులో
మాకు తెలీవు ఉదయాస్తమయాలు !
పీరియడ్లలో కొలుస్తారు కాలాన్ని !
గ్రేడులతో లెక్కిస్తారు జ్ఞానాన్ని !
 మా ఎడారికళ్ల మీద కునుకుచినుకు కోసం
ఎన్నేళ్లుగా ఎదురుచూస్తామో.....!
అన్నంపెట్టేటపుడు గుర్తుకు రావాల్సిన అమ్మ
చివికిన పుస్తకంలాంటీశిథిలదేహాన్ని
చింతబరికెలు చీలుస్తున్నపుడు గుర్తొస్తుంది !
అయినా ,బాధని పంటిబిగువున భరిస్తాన్లే నాన్నా....
మీ పరదేశీ ఆశలపల్లకీ మోయాలి కదా !
ఎక్కడ చిక్కిపోతామో అనీ....
పాలకోసం ఆలపశువులకు
దాణాలో మందులు కలిపినట్టు
మా కంచాన విసిరేసిన పిండాల్లో
కొలెస్ట్రాల్ పౌడరు కలుపుతారు !
పైకి దానిమ్మపళ్ళలా నిగనిగలాడతామేగానీ
లోన కుశులు జారిన కుక్కిమంచాలమైపోతాం !
అయినా , బతికేస్తాన్లే నాన్నా....
మనిషిలా కాకపోయినా మరబొమ్మలానైనా !
యిక్కడ బోధన
వాగు ఉరవడిలా సాగిపోతుంది !
గుక్కెడు నీళ్లు దోసిళ్లతో అందుకొని
గొంతు తడుపుకోలేను !
మొలకెత్తని విత్తనాలై సందేహాలు
మనసు మట్టిపొరల్లోనే మగ్గిపోతాయి !
గంటలలెక్కన కాలాన్ని
అమ్ముకుంటున్న అద్దెగురువులు
మా గుండెగడప వాకిటే ఆగిపోతారు !
పాఠాలవెంట పరుగెత్తలేక బట్టీ పెట్టలేక
తలమీద తట్టెడు ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోవాలనుంటుంది !
అయినా , బతికే ఉంటాన్లే నాన్నా....
మీ రంగులకలలకు రెక్కలు తొడగాలి కదా !
అనివార్యమైన పరుగుపందెంలో .....
గెలిచిన వాళ్లు కొద్దిమందే !
కానీ.....కిందపడీ ఓడీ ఒళ్లంతా నెత్తురోడే
వేనవేల కన్నీటిగాయాల చరితల్ని
యే పత్రికలూ టీవీలు ప్రకటించవు !
అయినా.....జ్ఞానంకోసం కాక
 కేవలం పరీక్షల కోసమే చదువులైతే.....
పరీక్షల్లో పాసైనా.....
బతుకులో ఫెయిలైపోతానేమో నాన్నా !
కార్పోరేట్ కంపెనీలకు కట్టుబానిసను చేసేందుకు
నా బతుకును మరీ యుద్ధరంగం చేయాలా ?
ఖైదీని చూసేందుకు వచ్చినట్టు
ఆమాసకో పున్నానికో వచ్చీ
' సర్దుకు పో.....' అంటూ
నీవు వెనుదిరిగిపోతున్నపుడల్లా.....
కళ్లచెలమల్లోంచి ఊరిన కన్నీటిఊట
ఎన్ని వేసవులొచ్చినా ఆరడం లేదు !
చదివించాల్సింది , కానీ.....
యింత శిక్షెందుకు వేసావు నాన్నా !! ( WhatsApp forward )

No comments:

Post a Comment

Total Pageviews