Wednesday, April 11, 2018

పద్య సాహిత్యం

1. కులకాంత తోడ నెప్పుడుఁ
    గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
    కలకంరి౮ కంట కన్నీ
    రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!   

భార్యతో ఎప్పుడూ తగాదా పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలను ఆరోపించవద్దు. ఉత్తమ ఇల్లాలు కంట నీరు కింద పడిన ఇంటిలో లక్ష్మిదేవి ఉండదు.

2. ఎప్పటి కెయ్యది ప్రస్తుత
    మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌
   నొప్పించక, తా నొవ్వక,
   తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.   

 ఏ సమయములో ఏ మాటలాడితే సరిపోవునో ఆలోచించి,దానికి తగినట్టుగా ఇతరులని భాదించకుండా సమయోచితముతో మాట్లాడి వ్యవహారములను పరిష్కరించువాడే వివేకవంతుడు.

3.  చుట్టములు గానివారలు
    చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్‌
   నెట్టుకొని యాశ్రయింతురు
   గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!   

 ధనం ఎక్కువగా ఉన్నట్లయితే బంధువులు కాని వారు కూడా మేము మీకు బంధువులమే అంటూ పట్టుదలతో గట్టిగా మనల్ని ఆశ్రయించడానికి వస్తారు.

4.   కమలములు నీట బాసిన
      కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌
      తమ తమ నెలవులు దప్పిన
     తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.   

ఏ వస్తువయైనా సరే తమ తమ స్థానములలో ఉన్నప్పుడే వాటి మద్య స్నేహ భాందవ్యం చక్కగా సాగుతుంది.ఎపుడయితే ఆ స్థానాలు విడిచిపెడతారో తమ మిత్రులే శత్రువులుగా మారతారు.కమలము నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి వికసించును.ఎపుడైతే నీటిని విడుచునో అదే సూర్యకాంతికి వాడిపోవును.

5.   అప్పుగొని చేయు విభవము
     ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్,
     ద ప్పరయని నృపురాజ్యము
    దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ.

అప్పుచేసి చేయు వేడుకయు, ముసలితనమందు పడుచు పెండ్లామును, మూర్ఖుడు చేయు తపమును, తప్పు విచారింపని రాజు యొక్క రాజ్యమును - సహింపరానివై, తరువాత చెడును గలిగించును.

6.   అడిగిన జీతం బియ్యని
     మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‍
    వడిగల యెద్దుల గట్టుక
    మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ.

అడిగిన జీతమీయని ప్రభువుని సేవించి కష్టపడుట కన్న చురుకైన యెద్దులను గట్టుకొని పొలము దున్నుకొని జీవించుటయే మేలు.

7. అన్ని విషయాలు తెలిసిన యట్టివాడు
   తనకు కొంచెమైన తెలియ దనును గాదె!
   ఏమి యును లేని విస్తరి ఎగిరిపడగ
   అన్ని యున్నట్టి విస్తరి అణగి యుండు

అన్ని విషయాలు తెలిసినవాడు తనకేమీ తెలియదంటాడు. అన్నీ వడ్డించిన విస్తరి అణిగి ఉంటే ఏమీలేని (ఖాళీ) విస్తరి ఎగిరెగిరి పడటం లేదా.

No comments:

Post a Comment

Total Pageviews