Monday, April 30, 2018

శుభసాయంత్రం

మంచిదైనట్టి తలపుల మర్మమంత
స్నేహితుల కెల్ల తెల్పుట శ్రేయమౌను;
అట్లు కాకుండ మదిలోన నణచి యుంచి
కుమ్మ బెట్టుట జనులకు కూడదెపుడు.

🌻మంచి ఆలోచనలు స్నేహితులతో పంచుకొనుము. అంతే కాని వాటిని మనసునందే అణచి యుంచటం ఎవరికీ కూడదు.🌻

భయము నెరుగని వాడు నిబ్బరము తోడ
జయము పొందును లక్ష్యపు జాడ నెరిగి;
భయము చేతనె సందేహ పడెడి వాడు
నెట్లు ఛేదించు లక్ష్యంపు టెరుక లేక.

🌹భయం తెలియనివాడు ఎంతో ధైర్యంతో లక్ష్యాన్ని ఛేదించి జయం పొందుతాడు. భయంతో సందేహించేవాడు ఏ విధంగాను లక్ష్యం సాధించలేడు.🌹

పెక్కుమంది జనులు భీతులై తమకంత
శక్తి లేదటంచు జాటు చుంద్రు;
ఉన్న శక్తి నైన నుపయోగ పరచని
వారి పైన జాలి పడగనేల?

🌻చాలామంది తమకు, శక్తి లేదని చాటుకొంటారు. ఉన్న శక్తిని ఉపయోగించలేని అట్టివారిపై జాలి పడరాదు.🌻

పెక్కు ఆలోచనల తోడ భీతి చెంది
కుమిలిపోవుచు మదిలోన నమితమైన
చెడ్డ తలపులు చేరంగ చింతపడుచు
వగవ ఫలమేమి, జనులకు దిగులు తప్ప?

🌻అనేకమైన ఆలోచనలతో భయం చెందుతూ మనసులో కుమిలిపోతూ, చెడ్డ ఆలోచనల వల్ల చింతిస్తూ విచారించి ప్రయోజనం లేదు.🌻

No comments:

Post a Comment

Total Pageviews