Thursday, June 7, 2018

హిమాలయ మంచు శ్రేణుల్లో కూడా సెల్ సిగ్నల్స్ లేవని బాధపడేవారు.

హేమంతం, వసoతo. గ్రీష్మం, ఆ పై వర్షం.. మనసుకి కళ్ళు, చెవులూ ఉంటే ప్రతి ఋతువు అద్భుతమైనదే. అంతా రసరమ్య కావ్యమే. వర్షాకాలాన్నే తీసుకోండి. ఆ రోజుల్లో నేను బి.కాం., చదివేవాడిని. సముద్రానికి కాస్త దూరంగా, ఇసుక తిన్నెల మధ్యలో చిన్న పెంకుటిల్లు. వెళ్ళటానికి దారి కూడా లేదు. సైకిల్ కూడా చేతుల మీద మోసుకు వెళ్ళాల్సిందే. వర్షం వస్తే ఆ మట్టి వాసన మధురంగా ఉండేది. రాత్రి పదకొండిoటికి అప్పుడే వర్షం వచ్చి వెలిసిన తరువాత హరికెన్‌ లాంతరు వెలుగులో చదువుతూ ఉంటే, గాలి తెరలు కిటికీ రెక్కల సందుల్లోంచి అలలు అలలుగా శబ్దం చేసేవి. ఎక్కడో దూరం నుంచి సముద్రపు హోరు. అంతలో ఒక రైలు కూత వినబడేది. క్రమక్రమంగా ఆ రైలు దగ్గరికి వస్తూ ఉంటే ఎంతో ఫాసినేటింగ్‌గా ఉండేది. పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయేది. మళ్ళీ నిశ్శబ్దం, ఇప్పటికీ అది నాకు చాలా రొమాంటిసైజింగ్‌ అనుభవం. అందుకే రైల్వే ట్రాక్ పక్కనే విద్యాపీఠం కట్టాను.
చిత్రం ఏమిటంటే ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త విన్సెంట్‌ పీలే’ కూడా ‘ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ అన్న పుస్తకంలో “సరిగ్గా ఇదే” అనుభవాన్ని వర్ణించాడు. ‘‘రైలు శబ్దం నన్ను ఉద్వేగపరుస్తుంది. అర్ధరాత్రి పక్కమీద పడుకుని నిద్రపోతూ ఉండగా దూరం నుంచి మిత్రుడు పిలిచినట్టు రైలు కూత వినిపిస్తుంది. చప్పున లేచి కిటికీ తలుపు తెరిచి చీకట్లోకి చూస్తాను. ఏమీ కనబడదు. కానీ శబ్దం మాత్రం దగ్గరవుతూ ఉంటుంది. దూరంగా చిన్న దీపం. రైలు క్రమక్రమంగా దగ్గర కొచ్చి, కొండ లోయల్లోoచి ఏరిన ధ్వనులన్నిటినీ మా ఇంటి చుట్టూ నక్షత్రాల్లా వెదజల్లి నిశ్శబ్దంలోకి సాగి పోతుంది’’ అంటాడు. ఆ తరువాత వ్యాసాన్ని కొనసాగిస్తూ ‘‘కొందరు మనుషులు ఎంతో తొందరగా తమ జీవితపు పరిమళాన్ని కోల్పోయి ప్రాపంచిక విషయాలలో గడపటానికి అలవాటు పడిపోతారు!’’ అంటూ వాపోతాడు ఈ మానసిక శాస్త్రవేత్త.
కొంచెం కూడా సౌందర్యారాధన, ప్రకృతి పట్ల ఇష్టం లేకుండా బ్రతికేవారిని చూస్తే ఆశ్చర్యo కలుగుతుంది. బ్రతకటానికీ జీవిoచటానికీ తేడా తెలియని వీరు, భూమాత చలికి తెల్ల దుప్పటి కప్పుకుందేమో అన్నట్టున్న హిమాలయ మంచు శ్రేణుల్లో కూడా సెల్ సిగ్నల్స్ లేవని బాధపడేవారు.

No comments:

Post a Comment

Total Pageviews