Wednesday, November 25, 2020

 మళ్ళీ ఆ రోజులు వచ్చేనా?

పరీక్షలయి వేసవి సెలవులు వస్తున్నాయంటే మహా సంబరం. దాదాపు నెలా పదిహేను రోజులు. ఎంత ఆనందం? ఇప్పటిలా దూర్దర్శన్ కార్యక్రమాలూ, స్మార్ట్ ఫోన్ లూ, డొరేమాన్ లూ ఏవీ ఉండేవి కావు.   ఎండలో బయటికి తిరగవద్దనీ అమ్మ ఆంక్ష. అయినా స్నేహితులందరం ఒక చోట చేరి చింతపిక్కలు, వామనగుంటలు, గవ్వలతో ఆటలు, ఇంకా వైకుంఠపాళి మొదలైన ఆటలతో సాయకాలమయుపోయేది. అమ్మ పెట్టిన ఏదో చిరుతిండి తిని కాసిని పాలు తాగి, ఆ వీధులోనే ఉన్న స్నేహితుల ఇళ్ళకు  పోయి ఉయ్యాలలూగడం, ఒప్పులకుప్పలు తిరగడం, తొక్కుడు బిళ్ళ ఆడుకోవడం ఓహ్. ఎంత సరదాగా ఉండేది. ఆటపాటలతో అలసి ఇంటికి వెళ్ళి కాసేపు ఏ చందమామో, బాలమిత్రో చదువుకుని అన్నం తిని పడుకునేవాళ్ళం. ఇప్పటి లా అర్ధరాత్రిదాకా మేలుకోవడం పొద్దెక్కినదాకా పడుకోవడం సెలవులయినా ఉండేది కాదు. ఆ రోజులు వేరు. ఒకోసారి సాయంకాలాలు పిల్లలందరం కలిసి పాటలు పాడుకోవడం, కథలు చెప్పుకోవడం, ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ గడిపే వాళ్ళం. ఒకోసారి మా నాన్నగారు బీచ్ కి తీసుకెళ్ళేవారు. అక్కడ కెరటాలతో ఆడుకోవడం, తరువాత ముంతకింద పప్పు తింటూ నాన్నగారు చెప్పే మంచి మంచి విషయాలు తెలుసుకుని ఆనందంగా ఇంటికి చేరేవాళ్ళం. అలసి పోయి కమ్మగా నిద్రపోయేవాళ్ళం. మరో ఆదివారం దగ్గరలో ఉన్న మామిడితోటకి తీసుకు వెళ్ళేవారు. ఇంటినుంచి ఒక చాకు, ఉప్పు కారం పొట్లాం కట్టి తీసుకుని వెళ్ళేవాళ్ళం. అక్కడ తోటమాలి నడిగి  నాన్నగారు మామిడికాయలు తెచ్చెవారు. అవి ముక్కలు చేసుకుని ఉప్పు కారం అద్దుకుని తింటుంటే ఎంత బాగుండేదో.. ఆ తోటలో కోతి కొమ్మచ్చి, దాగుడు మూతలు ఆటలు ఆడుకునే వాళ్ళం. అవన్నీ మథురస్మృతులుగా జ్ఞాపకాల పుటలలో కనిపిస్తూ ఉంటాయి.

ఇంక సెలవులు పూర్తి అయి పాఠశాలలు తెరుస్తారంటే అదో సరదా..పై తరగతికి వెళ్ళడం, కొత్త పంతులమ్మలు, కొత్త పుస్తకాలు, కొత్తగా ప్రవేసించిన విద్యార్ధుల పరిచయాలు మహదానందంగా ఉండేది. నాన్నగారు కొత్త తరగతి పుస్తకాలు కొని తెచ్చి వాటికి తీరువుగా అట్టలు వేసి, లేబిల్ అంటించి అందంగా నా పేరు, సబ్జెక్ట్ పేరు, తరగతి రాసి పెట్టేవారు. ఆయన అట్టలు వేస్తుంటే పక్కన కూచొని, కొత్త తరగతి, కొత్త స్నేహితుల గురించి ఎన్నో కబుర్లు చెప్తూ ఉండే దాన్ని. అన్నీ ఓపికగా, ఆసక్తిగా వినేవారు. ఇప్పటిలాగ పుస్తకాలూ, అట్టలూ అన్నీ పాఠశాల యాజమాన్యమే ఇవ్వడం, అమితంగా డబ్బు వసూలు చెయ్యడం ఉండేది కాదు. మా నాన్నగారు తెల్లకాయితాలు తెచ్చి అవి చక్కగా కుట్టి రూళ్ళకర్రతో రూళ్ళు గీసి రఫ్ పుస్తకాలకని ఇచ్చేవారు. కొత్తపుస్తకాల సువాసనని ఆస్వాదిస్తూ ఆ పుస్తాల మధ్య నెమలి కన్నులు దాచుకునేవాళ్ళం. వాటికి మేత కూడా పెట్టేవాళ్ళం. అదో పిచ్చి. అమ్మావాళ్ళు ఆవకాయలు పెట్టడం, అదో సందడి. నాన్నగారు కాయలు కోస్తే అమ్మ అన్నీ కలిపి ఆవకాయ పెట్టేది. పనంతా వాళ్ళు చేసుకుంటే మేము ఆ ముక్కలు పట్టుకుపోయి ఉప్పు కారం వేసుకుని తింటుండే వాళ్ళం.

ఒప్పులకుప్పలు తిరగడం, ఉయ్యాలలూగడం, తొక్కుడబిళ్ళ ఒంటికాలితో గెంతడం, స్తంభాలాట ఇవన్నీ ఎదిగే పిల్లలకి మంచి వ్యాయామం. అందుకే అప్పుడు స్థూలకాయాలు ఉండేవి కావేమో. ఏమైనా అప్పటి రోజులే వేరు, ఆ ఆనందాలే వేరు. మళ్ళీ ఆరోజులు వచ్చేనా అనిపిస్తుంది



Saturday, November 21, 2020

నా కవన జీవనం! సత్యసాయి విస్సా

తెలుగువల్లి వెలుగు దివ్వెల మల్లెలం      21-11-2020,  18:30 

తెలుగువల్లి మల్లెపరిమళాల

ప్రణమిల్లు శుభతరుణం 

ఏ జన్మాంతరాల ఋణమో    

పూర్వ పుణ్యాల ఫలమో 

ఈ  తెలుగు దివ్య జీవనం 

దివ్య గోదావరాది నదీ జలపానం 

ఆ తెనెలొలుకు పలుకు పలికి 

సాహితీ వెలుగుల శోభిల్ల

విశ్వమంతయు పరవశించి వహ్వయన 

తెలుగువల్లి మల్లియ వోలె 

పరిమళించి ప్రణమిల్లి  

ఋణము తీర్చుకుందాము తమ్ముడా చెల్లెలా 

చేసుకుందాము తెలుగు జీవన సాఫల్యం! 

తెలుగువల్లి మల్లెపరిమళాల

ప్రణమిల్లు శుభతరుణం! 

---------------------------------------------------------

ధన్య జీవనం!..ధాన్య ధన జీవనం!!

కొండా కొనల

స్వేచ్ఛగా  

అచ్చంగా

స్వచ్చంగా

అమాయకపు పల్లె

అందం

అదే ధ్యాసగా

చెరిగే బియ్యం

చెదిరి ఎగిరిన

చందం  

చూసే కనులకు

విందుగా

భలే పసందుగా

చిత్రంగా

చిత్రంలో

బందీ అయ్యిన

వైనం

రేపటి చింత లేని

ధన్య జీవనం! ...ధాన్య ధన జీవనం!!

---------------------------------

జయము జయము సిలికానాంధ్రదళమునకు 

జయము దిగ్విజయము ఆనందదళపతికిన్

విశ్వ మంత సాంస్కృతిక వెలుగు నింప

వెలిగెనొక దివ్వె

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయము

వెలిగించె నొకండు కడు ఆనందముగను

ముందు తరములు ముదమునంద

చెయ్యెత్తి జైకొట్టగా జనులారా రండు

జైకొట్టుటే కాదు చేయి కలిపి చేతనౌ సాయమున

పదము పదము కలిపి సాగగా ప్రగతి పధమున

బిందువు బిందువు సింధువవు నటుల

మనబడి, మన కూచిపూడి, అన్నమయ్య 

ఎన్నియో ఘనకార్యముల

సిలికానాంధ్రము ఆనంద సంద్రమై 

జగతినెదిగి జాతికి ఖ్యాతి తెచ్చే

జయము జయము సిలికానాంధ్రదళమునకు 

జయము దిగ్విజయము ఆనందదళపతికిన్

--------------------------


నీలాల నింగిని అనుక్షణం

అలల కలలతో తనలో

ప్రతిబింబించుకుంటూ

కలవరపు కెరటాలతో అందుకోవాలని

వాడిచూపుల వేడి నిట్టూర్పులు

విరహపు ఆవిరి మేఘసందేశాల

సాగర ఆరాటాన్ని చూసి

అల్లంత దూరాన దిగంతాన

నింగి వంగి చుంబిస్తోంది!

 25-09-16...5.15pm

-------------------------------------

శభాష్! చెన్నై నీవు త్వరగా కోలుకోవాలి!!

నిన్నమొన్నటి దాకా వన్నె చిన్నెల చెన్నై

నేడు చిన్నబోయిన చెన్నై ...వన్నెతగ్గిన చెన్నై

ప్రకృతి కన్నెర్ర చేసి నీటముంచినా...వెన్నుచూపని చెన్నై

శభాష్ చెన్నై నీవు త్వరగా కోలుకోవాలి!

నీ కష్టం ఇతర నగరాలకి మేలుకొలుపు కావాలి!!

సాగరతీరాన సుందరనగరం

నిరంతరం ఆక్రమించాలన్నఆత్రం జలతరంగాల ఆశయం

నెరవేరి యెడ తెగకుండా కురిసిన వర్షం వేళ!

యేరు ఊరు వాడా ఏకమై జలాశయం అయ్యింది!

బలవంతుడ, ధనవంతుడ నాకేమని చెరువు గురుతులు చెరిపి

ఆకాశానికి నిచ్చెనేసిన భవనాలు... జలానికి చిక్కిన వైనం...

పల్లమెరిగిన నీరు ముంచిన తీరు... నిజమెరిగిన దేముడి తీర్పుకు

బతుకు బేజారై... పాండీ బజారుపాలైన వైనం

ఒకటా రెండా ఇరవై రోజులు సూరీడు ముఖం చాటేసి

చుట్టూనీరు... కన్నీరు మున్నీరు... తాగటానికి లేదు తన్నీరు

నాలుగు గోడలు మధ్య బితుకు బితుకు బతుకు ఎటూ వెళ్ళ వీలు లేదు

కోట్లున్నా...ఆకలి తీర్చే కొట్టు లేదు

సాటి మనుషులతో అవసరం లేని

అవసరాల అన్వేషణలో... ఆవిష్కరణలన్నీమూగబోయినవేళ

మనసున్న మనుషుల ఆసరా...కొండంత ఓదార్పు

ఆపత్కాలంలో.. చెన్నై చూపిన నేర్పు ఓర్పుతో భావికై ఎదురుచూపు

జాతి కుల మత ఎల్లలు చెరిపి ప్రకృతి నేర్పిన పాఠం! మనకి గుణపాఠం కావాలి!!

మన జీవనంలో మార్పు తీసుకు రావాలి! ప్రకృతితో సహజీవన మార్పు తేవాలి!!

శభాష్! చెన్నై నీవు త్వరగా కోలుకోవాలి!!శభాష్! చెన్నై నీవు త్వరగా కోలుకోవాలి!!

మణిసాయి విస్సా ఫౌండేషన్.




teluguthesis.com| Download Telugu books and Sanskrit books free: వ్యాకరణ గేయాలు Vyakarana Geyalu

teluguthesis.com| Download Telugu books and Sanskrit books free: వ్యాకరణ గేయాలు Vyakarana Geyalu:         వ్యాకరణ గేయాలు           Vyakarana Geyalu వేదశ్రీ గంగాధరభట్ల వెంకటేశ్వర శర్మ  గారు రు ఉమ్మడి మెదక్ జిల్లా లో తెలుగు పండితుడిగా పనిచే...

Monday, November 16, 2020

కీర్తిశేషులు భావరాజు వేంకటా చలపతి రావు గారి గళంలో కార్తికపురాణం వినండి.

 ఘంటశాల గళంలో భగవద్గీతలా ఈ లింక్‌ లో

కీర్తిశేషులు భావరాజు వేంకటా చలపతి రావు గారి గళంలో
కార్తికపురాణం వినండి.
అన్ని గ్రూపుల్లొ పంచండి. పుణ్యాన్ని పెంచుకోండి.
ఈ లింక్‌ లో

Saturday, November 14, 2020

చక్ర పొంగలి పాత్ర దెక్కడ ? వేడి ' కుడుముల ' జాడ లేవీ ! పున్నాగ వన ' డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ

ఇప్పటికే నేటి తరం చాట్లు, ఫాస్ట్‌ ఫుడ్స్‌, నూడుల్స్‌, బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లకు బానిసలు అయ్యారు.

ఇప్పుడు మరో వింత రోగం ఏమంటే "పులిహార బాచ్‌" అని అపహాస్యం చేసే సంభాషణలు గమనిస్తే

ఇక ఆ వంటకాలు కూడా భవిష్యత్‌ లొ కనుమరుగై పోతాయి, మనకెందుకు పోనీలే అని ఉదాసీన వైఖరీతో మన భాషను, సంస్కృతిని మన ఆచార వ్యవహారాలను, ఆహార అలవాట్లను అపహాస్యం చేసే ప్రయత్నాలను మనం అడ్డుకుని ఆడ్డుకట్ట వెయ్యకపోతే జాతి అస్తిత్వానికే ప్రమాదం విజ్నులు ఆలోచించ ప్రార్ధన! సత్యసాయి విస్సా ఫౌండేషన్‌

చక్ర పొంగలి పాత్ర దెక్కడ ? వేడి ' కుడుముల ' జాడ లేవీ !

ఏవి తల్లీ నిరుడు విరిసిన , వంట ఘుమ ఘుమ లూ !
బాగ కాగిన నూనె దాకలొ , మునిగి తేలీ , వేగిమరగిన ,
కజ్జి కాయ లవెక్కడమ్మా / వుంది చూపించు !
అమృతాన్నే మరవజేసే .. ' గుత్తి వంకాయ్ ' కూరదెక్కడ ?
తాత తండ్రులు మెచ్చుకున్న ' దద్ధోజనం ' నేడేది తల్లీ !
పెసరసాంబారప్పడాలూ , చల్ల మిరపల రుచులవేవి ?
చిదిమి పంచిన గుమ్మడొడియపు , కరకర ధ్వనులెక్కడమ్మా !
ఎక్కడమ్మా ' కృష్ణ కాటుక ' / రాచ ' బీజపు ' రుచుల ఛాయలు ?
బాలపాపల ' పూతరేకులు ' / ' గవ్వ ' మురిపాలవేవి తల్లీ ?
' మినప సున్నీ 'చక్కిలాలు / కొబ్బరుండలు , పెసర పుణుకులు ,
మరవలేని మరమరాలు కానరావేమీ ?
పసిడి మనసులు విరిసి కాలం/ మురిసి పోయిన జాడలేవీ ?
ఏవి తల్లీ కడుపు నింపే పిండి వంటకములు !
( శ్రీ శ్రీ శ్రీ గారి కవితకు పేరడీ ! ఇవన్నీ చేయడం ' వనంలోని ' మహిళా రత్నాలకు , హెంథ మందికి వచ్చూ ?
అదీ ప్రశ్న ! ఏదీ జవాబూ ?? 🙂
' పున్నాగ వన ' మిత్ర బృందానికి ఉషోదయ శుభాకాంక్షలు 🙂 _/\_ .................................... డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ.
" కృష్ణ కాటుకలు " : మేలురకం , సన్నని పొడుగైన బియ్యం .
నా చిన్నతనంలో పండించేవారు ,

Friday, November 13, 2020

బాల బాలికలందరికీ "బాలల దినోత్సవ" శుభాకాంక్షలు! విస్సా ఫౌండేషన్‌ బాలమిత్ర చందమామలు వీడియోలు

 బాల బాలికలందరికీ "బాలల దినోత్సవ" శుభాకాంక్షలు!

ఏ పండుగ వచ్చినా మా విస్సా ఫౌండేషన్ బాలమిత్ర చందమామలు 

సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తారు. ఈసారి కరోనా కారణంగా సందడి లేకపోవడం వల్ల

గతంలో ఆ సందడిని  మా "యూట్యూబ్ ఛానల్ లింక్‌ల్లో -సత్యసాయి విస్సా ఫౌండేషన్" లో  ఆనందించండి. 

చిన్నారులను ప్రోత్సహించడం కోసం మా ఛానల్‌ సబ్‌ స్క్రైబ్‌ చెయ్యండి. 

1. 


2.



























































































నా చిన్నతనంలో దీపావళి విశేషాలు చదవండి


 

Thursday, November 12, 2020

సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలని మనవి. మీ - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌!

 ఈ మధ్య అందరికీ పర్యావరణ స్పృహ పట్ల అవగాహన బాగా పెరిగింది. 

అది కేవలం హిందూ పండగలకే మాత్రం పరిమితం అవ్వకూడదు 

నిజమే దీపావళికి బాణాసంచా కాలిస్తే వాయు కాలుష్యం ఉంటుంది. 

కానీ అది ఒక్క రోజు మాత్రమే అదీ ఒక దేశానికే పరిమితం 

గతంతో పొలిస్తే పెరిగిన ధరలు తగ్గిన సరదాలతో అది చాలా చాలా స్వల్పం 

కానీ మనం ప్రతి నిత్యం చేసే ఘనకార్యాలను ఓ సారి గమనిస్తే  

జనవరి 1 వ తేదీ ప్రపంచ వ్యాప్త బాణాసంచా వినియోగం కాలుష్యం కాదా 

కానీ మనం నిజమైన పర్యావరణ ప్రేమికులం అయితే ప్రతీ రోజూ ఊరుబయట 

చెత్తను ముఖ్యంగా ప్లాస్టిక్‌, టైర్లు, ఇతర హానికారక వ్యర్ధాలను తగలబెట్టడం 

యంత్రాలతో పంట కోసిన తర్వాత మిగిలిన దుబ్బులు తగులబెట్టడం 

వంటి వాటితో పోలిస్తే ఎంత? 

అయినా పసి పిల్లలను, అనారోగ్యంతో వున్నవారిని, పెద్దవారిని దృష్టిలో ఉంచుకుని 

ఎక్కువ ధ్వని కాలుష్యంతో వున్నవి కాకుండా తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకుని 

సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలని మనవి. 

మీ - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌! 

  

Wednesday, November 11, 2020

బంధాలను చిన్నచూపు చూడవద్దు! సత్యసాయి విస్సా

 బంధాలను చిన్నచూపు చూడవద్దు!  

ఇంటిలోంచి ఒక పెద్ద దిక్కు వెళ్ళి పొతే కొన్నితరాలను చూసిన అనుభవ జ్నానం దూరమైనట్లు 

"ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం కానీ మన కోసం కన్నీళ్లు కార్చే మనిషిని మాత్రం కొనలేం" అని  యాపిల్ కంపినీ సృష్టి కర్త స్టీవ్ జాబ్స్ తన ఆఖరి రోజులలో డైరీలో రాసుకున్న మాటలివి.

బంధాలు, అనుబంధాలు, అప్యాయతలు, అనురాగాలు మన భారతీయ కుటుంబ వ్యవస్థలో మూలస్తంభాలు  

మనుషుల బదులుగా వస్తువులను ప్రేమించే కాల క్రమంలో మనం చాలా దూరం వచ్చేసాం

"చందమామ వుంది వెన్నెల రాత్రులున్నాయి 

కానీ వెన్నెలలో ఆడుకునే పిల్లలు కరువవుతున్నారు  

ఆ వెన్నెల రాత్రిలో ఆరుబయట చందమామ కధలు చెప్పే పెద్దవారు కరువవుతున్నారు  

ఎండా కాలంలో వేసవి సెలవులు వున్నాయి 

కానీ ఆ వేసవి సెలవుల్లో అమ్మమ్మ నానమ్మల ఇంటికి వెళ్ళేవారు కరువవుతున్నారు 

నేటి తరానికి వృత్తిలో రాణించడానికి ప్రతీ అంశంలోనూ క్రాష్ కోర్సులు, వ్యక్తిత్వ వికాస కోర్సులు ఎన్నొ వున్నాయి.   

కానీ నైతిక విలువలు, సాంప్రదాయాలు, ప్రేమాభిమానాలు బంధాలు అనుబంధాలు చెప్పే పెద్దవారు ఒక్కొక్కరూ కనుమరుగవుతున్నారు  

“ప్రాణం ఉన్నదేది తన కోసం జీవించదు.. అలాగే ఒంటరిగా జీవించదు”  అని విలియం బ్లేక్ అన్న మాటల్ని మననం చేసుకోవాలి, మన జీవితంలో ప్రతీ బంధాన్ని నిలబెట్టుకోవాలి, ఎందుకంటే "

"Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS".

అందుకే 

When you say sorry to someone, It means that you are not wrong and other one is right. But it means that you have given importance to relationship more than 'EGO'

Let's have a smooth relationships.

ఈ నాలుగు మాటలు, అటు నాలుగు తరాలు ఇటు నాలుగు తరాలు చూసిన కీ.శే చెల్లాయమ్మ (పెద్ద అత్తయ్య గారు)  గారికి అంకితం

Tuesday, November 3, 2020

మిత్రమా! ఈ రేయి కొంత ఎకాంతంలో గడపాలి! వచ్చేది జన్మానికో నీలి వెన్నెల రాత్రి!

 

మిత్రమా!

రేయి కొంత ఎకాంతంలో గడపాలి!

వచ్చేది జన్మానికో నీలి వెన్నెల రాత్రి!

నీలి వెన్నెల వెదజల్లు చంద్రుని అధీనంలో మనం 

శరద్ పూర్ణిమ నీలిమ ఉత్తేజంలో మనం 

శరద్ యామినీ సౌదామిని

సురభామినిలా సిగలో తురిమే నీలి జాబిలి అందాల 

మన జీవితాలు రసభరితం సుధాపూరితం  

నీలి పూర్ణ చంద్రోదయం!

అదో అరుదైన అద్భుత దృశ్యం.

త్వరలో మరలా రాదు అద్భుత సన్నివేశం

కళ్ళు బాగా విప్పార్చి చూద్దాం తనివితీరా

చీకటి దిగంతాల ఆవల జరిగి జారిపోకముందే

కళ్ళు మూసి చిత్రం ముద్రించుకుందాం మనసారా

తెల్లవారి వెలుగుల్లో నీలి వెలుగు కరిగి ఆరిపోకముందే

వచ్చేది జన్మానికో నీలి వెన్నెల రాత్రి!

మిత్రమా!

రేయి కొంత ఎకాంతంలో గడపాలి! 30.12.2020  22:45 to 23.40 hrs

 

Monday, November 2, 2020

పండ్ల రసం గిన్నె---వాడ్రేవు చినవీరభద్రుడు

 పండ్ల రసం గిన్నె

______________
(రాదుగ ప్రచురణలవారి చెహోవ్ రచనల్లో అయిదవ సంపుటం నాటకాలు. ఆ పుస్తకం కోసం ఎన్నేళ్ళుగానో వెతుకుతున్నానని తెలిసి మిత్రుడు నరుకుర్తి శ్రీధర్ ఎక్కడో ఖండాంతరాలనుంచి ఆ పుస్తకం తెప్పించి నాకు పంపించాడు. వచ్చి చాలా రోజులయ్యింది. అప్పణ్ణుంచీ నా బల్లమీదనే ఉంది.)
~
బల్లమీద చెహోవ్ పుస్తకాలు, నాటకాల సంపుటి,
ఉత్తరాలు, సరికొత్త అనువాదంలో మరికొన్ని కథలు-
రోజూ వాటిని చూస్తుంటాను, కిటికీ బయట పొలాలు
రోజురోజుకీ పొంగుతున్న ఆకుపచ్చ,
దూరంగా కొండలు, కొండ కింద పల్లెలు
తెలి నీలిసరసులో మినుకుమనే దీపాలు.
బల్లమీద చెహోవ్ రచనలు,
గుండె ఉగ్గబట్టుకుంటేగాని
తెరవలేను.
ఒకప్పుడు నీకెవరో రాసిన ప్రేమలేఖల బొత్తి
తెరిస్తే చాలు చెప్పలేని శాంతి, సంతోషం, పారవశ్యం
ఇంక నువ్వు నిలవడం కష్టం
వెళ్ళిపోవాలని ఉంటుంది, అన్నీ వదిలిపెట్టేసి,
ఒక్క ఉదుటున, గడప దాటి, వీథి దాటి, ఊరు దాటి
నీ రోజువారీ ప్రపంచాన్ని పక్కకు నెట్టేసి
మరొక రోజువారీ జీవితంలోకి నడిచిపోవాలని ఉంటుంది.
ఒక పల్లె, తోటలో ఇల్లు, చెట్లమధ్య వెనక్కి జరుగుతున్న సాయంకాలపు నీడలు
మీరిద్దరో, ముగ్గురో, నలుగురో
కూచుని మాటాడుకుంటూ టీ తాగుతుంటారు.
ఇప్పుడో మరికొంతసేటికో పల్లెప్రజలు మీ దగ్గరికొస్తారు
పొలాలగురించో, పంటల గురించో
చదువు గురించో, సంధ్య గురించో మాటలు నడుస్తాయి.
మీకు జీవిస్తున్నామన్న స్ఫురణ ఉండదు
కాబట్టి జీవించడం బరువుగా తోచదు.
అట్లాంటి గ్రామంలో నువ్వొక ఉపాధ్యాయుడివవుతావు
ఒక వైద్యుడివవుతావు, నలుగురి అనుభవాలూ వినడం మొదలుపెట్టేక
నువ్వొక కథకుడిగా ఎదుగుతావు.
చెహోవ్ ని చదివిన ప్రతిసారీ ఆ గ్రామం
నన్ను పిలుస్తూనే ఉంటుంది.
ఆ పుస్తకం ముగించిన కొన్నాళ్ళదాకా
నేనొక దయాపూరితమానవుడిగా ప్రవర్తిస్తున్నట్టు
నాకు తెలుస్తూనే ఉంటుంది.
నేనెవరిని కలుసుకున్నా, మాట్లాడినా
వాళ్ళకి నా చూపుల్లో గొప్ప సాంత్వన గోచరిస్తూ ఉంటుంది
ఒక రోగి, అతడి సమస్య ఏమిటో అతడికే తెలియదు
నీ దగ్గరికొచ్చినప్పుడు, నువ్వతడి చేయి పట్టుకుని
చెప్పలేనంత కరుణతో అతడి నాడి కొలిచినట్టుంటుంది.
నా మాటల్లో కొంత స్తిమితం తేటపడుతుంది
కొన్నాళ్ళ పాటు నా సంభాషణల్లోంచి
ఫిర్యాదులు పక్కకు తప్పుకుంటాయి.
ఎవరినీ నిందించాలనిపించదు.
ఎంతసేపూ ఒకటే ఆలోచన:
వీళ్ళు మరికొంత ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?
అప్పుడే కోసి పిండి నింపిన
పండ్ల రసం గిన్నెలాగా
చెహోవ్ పుస్తకం.
పండ్లరసం నీలో ఏ ఉద్వేగాన్నీ రేకెత్తించదు.
నువ్వు తాగి మర్చిపోయేక మొదలవుతుంది
నీ రక్తనాళాల్లో ఒక శుద్ధి ఉద్యమం.
రోజు రోజుకీ కనబడకుండానే పెరిగే పంటపొలంలాగా
నిన్నటికన్నా ఈరోజు మరింత
వివేకంతో నిద్రనుంచి మేల్కొంటావు.

Total Pageviews