Monday, November 2, 2020

పండ్ల రసం గిన్నె---వాడ్రేవు చినవీరభద్రుడు

 పండ్ల రసం గిన్నె

______________
(రాదుగ ప్రచురణలవారి చెహోవ్ రచనల్లో అయిదవ సంపుటం నాటకాలు. ఆ పుస్తకం కోసం ఎన్నేళ్ళుగానో వెతుకుతున్నానని తెలిసి మిత్రుడు నరుకుర్తి శ్రీధర్ ఎక్కడో ఖండాంతరాలనుంచి ఆ పుస్తకం తెప్పించి నాకు పంపించాడు. వచ్చి చాలా రోజులయ్యింది. అప్పణ్ణుంచీ నా బల్లమీదనే ఉంది.)
~
బల్లమీద చెహోవ్ పుస్తకాలు, నాటకాల సంపుటి,
ఉత్తరాలు, సరికొత్త అనువాదంలో మరికొన్ని కథలు-
రోజూ వాటిని చూస్తుంటాను, కిటికీ బయట పొలాలు
రోజురోజుకీ పొంగుతున్న ఆకుపచ్చ,
దూరంగా కొండలు, కొండ కింద పల్లెలు
తెలి నీలిసరసులో మినుకుమనే దీపాలు.
బల్లమీద చెహోవ్ రచనలు,
గుండె ఉగ్గబట్టుకుంటేగాని
తెరవలేను.
ఒకప్పుడు నీకెవరో రాసిన ప్రేమలేఖల బొత్తి
తెరిస్తే చాలు చెప్పలేని శాంతి, సంతోషం, పారవశ్యం
ఇంక నువ్వు నిలవడం కష్టం
వెళ్ళిపోవాలని ఉంటుంది, అన్నీ వదిలిపెట్టేసి,
ఒక్క ఉదుటున, గడప దాటి, వీథి దాటి, ఊరు దాటి
నీ రోజువారీ ప్రపంచాన్ని పక్కకు నెట్టేసి
మరొక రోజువారీ జీవితంలోకి నడిచిపోవాలని ఉంటుంది.
ఒక పల్లె, తోటలో ఇల్లు, చెట్లమధ్య వెనక్కి జరుగుతున్న సాయంకాలపు నీడలు
మీరిద్దరో, ముగ్గురో, నలుగురో
కూచుని మాటాడుకుంటూ టీ తాగుతుంటారు.
ఇప్పుడో మరికొంతసేటికో పల్లెప్రజలు మీ దగ్గరికొస్తారు
పొలాలగురించో, పంటల గురించో
చదువు గురించో, సంధ్య గురించో మాటలు నడుస్తాయి.
మీకు జీవిస్తున్నామన్న స్ఫురణ ఉండదు
కాబట్టి జీవించడం బరువుగా తోచదు.
అట్లాంటి గ్రామంలో నువ్వొక ఉపాధ్యాయుడివవుతావు
ఒక వైద్యుడివవుతావు, నలుగురి అనుభవాలూ వినడం మొదలుపెట్టేక
నువ్వొక కథకుడిగా ఎదుగుతావు.
చెహోవ్ ని చదివిన ప్రతిసారీ ఆ గ్రామం
నన్ను పిలుస్తూనే ఉంటుంది.
ఆ పుస్తకం ముగించిన కొన్నాళ్ళదాకా
నేనొక దయాపూరితమానవుడిగా ప్రవర్తిస్తున్నట్టు
నాకు తెలుస్తూనే ఉంటుంది.
నేనెవరిని కలుసుకున్నా, మాట్లాడినా
వాళ్ళకి నా చూపుల్లో గొప్ప సాంత్వన గోచరిస్తూ ఉంటుంది
ఒక రోగి, అతడి సమస్య ఏమిటో అతడికే తెలియదు
నీ దగ్గరికొచ్చినప్పుడు, నువ్వతడి చేయి పట్టుకుని
చెప్పలేనంత కరుణతో అతడి నాడి కొలిచినట్టుంటుంది.
నా మాటల్లో కొంత స్తిమితం తేటపడుతుంది
కొన్నాళ్ళ పాటు నా సంభాషణల్లోంచి
ఫిర్యాదులు పక్కకు తప్పుకుంటాయి.
ఎవరినీ నిందించాలనిపించదు.
ఎంతసేపూ ఒకటే ఆలోచన:
వీళ్ళు మరికొంత ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?
అప్పుడే కోసి పిండి నింపిన
పండ్ల రసం గిన్నెలాగా
చెహోవ్ పుస్తకం.
పండ్లరసం నీలో ఏ ఉద్వేగాన్నీ రేకెత్తించదు.
నువ్వు తాగి మర్చిపోయేక మొదలవుతుంది
నీ రక్తనాళాల్లో ఒక శుద్ధి ఉద్యమం.
రోజు రోజుకీ కనబడకుండానే పెరిగే పంటపొలంలాగా
నిన్నటికన్నా ఈరోజు మరింత
వివేకంతో నిద్రనుంచి మేల్కొంటావు.

No comments:

Post a Comment

Total Pageviews