Wednesday, November 25, 2020

 మళ్ళీ ఆ రోజులు వచ్చేనా?

పరీక్షలయి వేసవి సెలవులు వస్తున్నాయంటే మహా సంబరం. దాదాపు నెలా పదిహేను రోజులు. ఎంత ఆనందం? ఇప్పటిలా దూర్దర్శన్ కార్యక్రమాలూ, స్మార్ట్ ఫోన్ లూ, డొరేమాన్ లూ ఏవీ ఉండేవి కావు.   ఎండలో బయటికి తిరగవద్దనీ అమ్మ ఆంక్ష. అయినా స్నేహితులందరం ఒక చోట చేరి చింతపిక్కలు, వామనగుంటలు, గవ్వలతో ఆటలు, ఇంకా వైకుంఠపాళి మొదలైన ఆటలతో సాయకాలమయుపోయేది. అమ్మ పెట్టిన ఏదో చిరుతిండి తిని కాసిని పాలు తాగి, ఆ వీధులోనే ఉన్న స్నేహితుల ఇళ్ళకు  పోయి ఉయ్యాలలూగడం, ఒప్పులకుప్పలు తిరగడం, తొక్కుడు బిళ్ళ ఆడుకోవడం ఓహ్. ఎంత సరదాగా ఉండేది. ఆటపాటలతో అలసి ఇంటికి వెళ్ళి కాసేపు ఏ చందమామో, బాలమిత్రో చదువుకుని అన్నం తిని పడుకునేవాళ్ళం. ఇప్పటి లా అర్ధరాత్రిదాకా మేలుకోవడం పొద్దెక్కినదాకా పడుకోవడం సెలవులయినా ఉండేది కాదు. ఆ రోజులు వేరు. ఒకోసారి సాయంకాలాలు పిల్లలందరం కలిసి పాటలు పాడుకోవడం, కథలు చెప్పుకోవడం, ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ గడిపే వాళ్ళం. ఒకోసారి మా నాన్నగారు బీచ్ కి తీసుకెళ్ళేవారు. అక్కడ కెరటాలతో ఆడుకోవడం, తరువాత ముంతకింద పప్పు తింటూ నాన్నగారు చెప్పే మంచి మంచి విషయాలు తెలుసుకుని ఆనందంగా ఇంటికి చేరేవాళ్ళం. అలసి పోయి కమ్మగా నిద్రపోయేవాళ్ళం. మరో ఆదివారం దగ్గరలో ఉన్న మామిడితోటకి తీసుకు వెళ్ళేవారు. ఇంటినుంచి ఒక చాకు, ఉప్పు కారం పొట్లాం కట్టి తీసుకుని వెళ్ళేవాళ్ళం. అక్కడ తోటమాలి నడిగి  నాన్నగారు మామిడికాయలు తెచ్చెవారు. అవి ముక్కలు చేసుకుని ఉప్పు కారం అద్దుకుని తింటుంటే ఎంత బాగుండేదో.. ఆ తోటలో కోతి కొమ్మచ్చి, దాగుడు మూతలు ఆటలు ఆడుకునే వాళ్ళం. అవన్నీ మథురస్మృతులుగా జ్ఞాపకాల పుటలలో కనిపిస్తూ ఉంటాయి.

ఇంక సెలవులు పూర్తి అయి పాఠశాలలు తెరుస్తారంటే అదో సరదా..పై తరగతికి వెళ్ళడం, కొత్త పంతులమ్మలు, కొత్త పుస్తకాలు, కొత్తగా ప్రవేసించిన విద్యార్ధుల పరిచయాలు మహదానందంగా ఉండేది. నాన్నగారు కొత్త తరగతి పుస్తకాలు కొని తెచ్చి వాటికి తీరువుగా అట్టలు వేసి, లేబిల్ అంటించి అందంగా నా పేరు, సబ్జెక్ట్ పేరు, తరగతి రాసి పెట్టేవారు. ఆయన అట్టలు వేస్తుంటే పక్కన కూచొని, కొత్త తరగతి, కొత్త స్నేహితుల గురించి ఎన్నో కబుర్లు చెప్తూ ఉండే దాన్ని. అన్నీ ఓపికగా, ఆసక్తిగా వినేవారు. ఇప్పటిలాగ పుస్తకాలూ, అట్టలూ అన్నీ పాఠశాల యాజమాన్యమే ఇవ్వడం, అమితంగా డబ్బు వసూలు చెయ్యడం ఉండేది కాదు. మా నాన్నగారు తెల్లకాయితాలు తెచ్చి అవి చక్కగా కుట్టి రూళ్ళకర్రతో రూళ్ళు గీసి రఫ్ పుస్తకాలకని ఇచ్చేవారు. కొత్తపుస్తకాల సువాసనని ఆస్వాదిస్తూ ఆ పుస్తాల మధ్య నెమలి కన్నులు దాచుకునేవాళ్ళం. వాటికి మేత కూడా పెట్టేవాళ్ళం. అదో పిచ్చి. అమ్మావాళ్ళు ఆవకాయలు పెట్టడం, అదో సందడి. నాన్నగారు కాయలు కోస్తే అమ్మ అన్నీ కలిపి ఆవకాయ పెట్టేది. పనంతా వాళ్ళు చేసుకుంటే మేము ఆ ముక్కలు పట్టుకుపోయి ఉప్పు కారం వేసుకుని తింటుండే వాళ్ళం.

ఒప్పులకుప్పలు తిరగడం, ఉయ్యాలలూగడం, తొక్కుడబిళ్ళ ఒంటికాలితో గెంతడం, స్తంభాలాట ఇవన్నీ ఎదిగే పిల్లలకి మంచి వ్యాయామం. అందుకే అప్పుడు స్థూలకాయాలు ఉండేవి కావేమో. ఏమైనా అప్పటి రోజులే వేరు, ఆ ఆనందాలే వేరు. మళ్ళీ ఆరోజులు వచ్చేనా అనిపిస్తుంది



No comments:

Post a Comment

Total Pageviews