నిజమైన రత్నాలు
"పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం
మూఢైః పాషాణ ఖండేషు రత్న సంజ్ఞా విధీయతే"
"ఈ లోకంలో జలం, అన్నం, సుభాషితం అనే మూడు మాత్రమే నిజమైన రత్నాలు. కానీ మూర్ఖులు మాత్రం కేవలం రాళ్ళనే రత్నాలని వ్యవహరిస్తారు" అని ఈ శ్లోకానికి భావం
.
రత్నాలు అంటే వజ్ర, వైడూర్యాదులు. ఇవి విలువైన రాళ్ళు. వ్యవహారంలో "రత్నము" అనే పదాన్ని శ్రేష్ఠతా వాచకంగా కూడా ప్రయోగిస్తారు.ఆ దృష్టితో ఆలోచిస్తే పృథివిలో మూడు శ్రేష్ఠ వస్తువులున్నాయి. అవి – నీరు, అన్నము, ఒక మంచిమాట. వీనిలో మొదటి రెండూ మానవులకు జీవశక్తిని ఇచ్చేవికాగా, మూడవది మానవులు మానవులుగా జీవించటానికి అవసరమైన సంస్కారాన్ని ఇస్తుంది.
"భాషాసు ముఖ్యా మధురా దివ్యా గీర్వాణ భారతీ
తస్మాద్ధి కావ్యం మధురం తస్మాదపి సుభాషితమ్"
(భాషలలో సంస్కృత భాష ముఖ్యం, మధురం, దివ్యం.దానిలో కావ్యం మధురం, ఆ కావ్యములోకూడా సుభాషితం మరింత మధురం) అని ఆర్యోక్తి. అందుకే వీటిని అమూల్య వస్తువులుగా భావించి ఆదరించాలి.
"Thousands have lived without love, not one without water" అంటుందొక ఆంగ్ల సూక్తి. అంటే, ప్రేమ రాహిత్య స్థితి ఉన్నా ఫరవాలేదని కాదు. తమ ప్రాణాలు నిలుపుకోవటానికి ప్రాథమికంగా జీవకోటి- జలాన్ని, ఆహారాన్ని ఆశ్రయించాలి. అందుకే నీటికి "జీవము" అనే పేరుకూడా ఉంది. అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావించటం సర్వవిదితం. అసలు జీవం ఉంటేనే కదా - ప్రేమాదులు!.
దేహధారణ ఫలితం-జ్ఞానసాధన. ఇది పశు, పక్ష్యాదులకు సాధ్యం కాదు. మానవులకే సాధ్యం. జ్ఞానం - వివిధ సాహిత్య ప్రక్రియలలో నిక్షిప్తమై ఉంది. "విశ్వ శ్రేయః కావ్యమ్" అన్నారు పెద్దలు. జ్ఞాన పరమావధి విశ్వ శ్రేయమే.
అల్పాక్షరాల్లో, సూత్రప్రాయంగా, సుబోధకంగా హితవు చెప్పే సుభాషితాన్ని మించిన రత్న మేముంది?"బాలాదపి సుభాషితమ్" (బాలునినుంచియైనా మంచిమాటను స్వీక రించాలి) అనేది మన పెద్దల విశాలదృక్పథం.
"సుభాషిత రసస్యాగ్రే సుధా భీతా దివంగతా" (సుభాషిత రస మాధుర్యంతో పోటీ పడలేక అమృతం స్వర్గానికి వెళ్ళిపోయింది) అన్నాడొక కవి.సుభాషిత ధారణ, తద్భావాచరణ మానవులను అమృత స్థితికి చేరుస్తాయనటంలో ఈషణ్మాత్రం సందేహం లేదు.
స్వస్తి! (శ్రీ సత్యనారాయణ చొప్పకట్లగారి సౌజన్యముతో)
------------------------శుభసాయంత్రం--------------
No comments:
Post a Comment