Tuesday, January 19, 2021

మన ప్రాంతంలో పురాతన ఆలయాల విశిష్టత తెలుసుకుందాం! ఏకాదశ రుద్రులలో రెండవ రుద్రుడు "మహాదేవరుద్రుడు"

 https://www.youtube.com/watch?v=nheX7aXZ_us



మన ప్రాంతంలో పురాతన ఆలయాల విశిష్టత తెలుసుకుందాం! 

ఏకాదశ రుద్రులలో  రెండవ రుద్రుడు "మహాదేవరుద్రుడు"

శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి వారి దేవాలయం. (కృష్ణా రాయుడు పెదపూడి) 

కే.పెదపూడి. అంబాజీపేట మండలం. తూ.గో.జిల్లా.

ఈ ఊరిలో పుట్టి పెరిగి, జీవితంలో ఎంతో ఎదిగినవారిలో ఒకరు "ధార్మిక రత్న" శ్రీ కొండా సత్యనారాయణ గారు. వైమానిక దళ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంబించి రక్షణ శాఖలో  దేశం నలుమూలలా ఉత్తమ ఉన్నతాధికారిగా విధి నిర్వహణలో తలమునకలుగా ఉంటూనే ఆధ్యాత్మిక ధార్మిక జీవితాన్ని గడిపిన వీరికి మా విస్సా ఫౌండేషన్ "ధార్మిక రత్న" బిరుదు ప్రదానం చేసి ఘన సన్మానం చేసింది. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండే వ్యక్తి, ఇటీవలే పదవీ విరమణ చేసి ఉన్నవారిలో బంధుమిత్రులతో, ఆధ్యాత్మిక, ధార్మిక శేష జీవితం గడపాలనే వారి సంకల్పం నెరవేరాలని ఎందరో తమ ప్రాంతాల్లో ఇటువంటి ఆశయాలు నెరవేర్చేందుగు స్ఫూర్తివంత మవుతుందని ఆశిస్తూ మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్  కొండా వారి మాటల్లో ఈ మహిమాన్విత శివ కేశవ  గురించి విందాం! 

పూర్వము  ఈ గ్రామ సమీపాన తపోవరం అనే ప్రాంతంలో విశ్వామిత్ర మహర్షి ఘోర తపస్సు చేస్తుండగా దానిని భగ్నం చేయడానికి ఇంద్రుడు మేనకను భూలోకమునకు పంపగా, ఆమె విశ్వామిత్రుని తపోభంగము గావించి, ఆడ బిడ్డకు (శకుంతల)  జన్మనిచ్చి తాను తిరిగి ఇంద్ర లోకము పోవ ప్రయత్నించగా, ఈ దుశ్చర్య కారణంగా ఆకాశంలోకి ఎగురలేక క్రింద పడిపోయినదట. అశరీర వాణి పలికిన సూచన మేరకు అక్కడ శివలింగ ప్రతిష్ట చేసిన తరువాత పైకి ఎగుర గలిగినా, ఈ గ్రామ ప్రాంతానికి వచ్చేసరికి  శక్తి చాలక నేలపై పడి పోగా మరలా ఈ ప్రాంతంలో తపస్సు చేసి, ఈ గ్రామంలో శివలింగ ప్రతిష్ట చేసిన తరువాత మేనక తన పూర్వశక్తిని తిరిగి పొంది ఇంద్ర సభను చేరుకోగలిగినదని స్థల పురాణము వలన తెలియుచున్నది. దేవకాంత మేనక చే ప్రతిష్టించబడిన కారణంగా ఈ దేవునికి శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామీ అని పేరు వచ్చినది.

ఒక పని సంకల్పించి శక్తి చాలక అపజయం కలిగే వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ మేనకేశ్వర స్వామికి అభిషేకాదులతో అర్చించుట వలన కార్యసిద్ది కలుగునని భక్తుల విశ్వాసము. ఈ ఆలయ గోడపై ప్రాచీన లిపిలో రాగి రేకు పై శాసనము కలదు ఈ గ్రామము కౌశికా తీరమున కలదు.

శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి ఆలయము ప్రక్కనే శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత  వేణుగోపాల స్వామి ఆలయము కలదు. ఈ ఆలయమును కృష్ణారాయుని ఆలయం అని అంటారు. స్వర్గీయ యర్రా క్రిష్ణారాయుడు అనే ఈ గ్రామవాసి పెద్దాపుర రాజాస్థానములో పనిచేసి వృద్దాప్యములో ఈ గ్రామములో నివసించి అనేక ప్రజాహిత కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి పేరు తెచ్చుకొనుటవలన ఈ పెదపూడి గ్రామమును కృష్ణారాయుడు పెదపూడిగా వ్యవహరించ బడుతున్నదని తెలిసినది. వీరు వేణుగోపాల స్వామి ఆలయంలో ఎక్కువ సమయం గడుపుతూ శ్రీ వేణుగోపాలుని పై శతక రచన చేసినారట ఈ కారణం గానే ఈ ఆలయమును శ్రీ కృష్ణారాయుని దేవాలయముగా పిలవ బడుతున్నట్లు చెప్పబడుతున్నది. స్వర్గీయ యర్రా క్రిష్ణారాయుని ఔనత్యము కారణము గా ఈ గ్రామం పేరు, ఆలయం పేరు ఆయన పేరున పిలువబడుతున్నట్లు స్థానికులు అంటారు.

కే. పెదపూడి గ్రామము రాజమండ్రి – అమలాపురం రహదారి లో అమలాపురంనకు 13 కి.మీ. దూరములోను రాజమండ్రి కి 60 కి.మీ. దూరములోనూ ఉన్నది. బస్సులో ఈ గ్రామము చేరుకోవచ్చును 

భక్తులు తప్పక శ్రీపార్వతీ సమేత మేనకేశ్వరుని ఆలయము సందర్శించి ఈ స్వామిని దర్శించి, అర్చించి, తరించండి.

No comments:

Post a Comment

Total Pageviews