Wednesday, October 22, 2014

దీపావళి పై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మహాద్భుత ప్రవచన సుధా సారం...మీ కోసం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.



దీపావళి (అక్టోబర్ 23, 2014, గురువారం)

భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు!

భూదేవి- మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ -సత్యభామ గా జన్మిస్తారు . అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుడని తెలిసుకొన్న సత్యభామ ...తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకుని మరణానికి సంతోషంతో మర్నాడు అమావాస్య చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ది చెందడం జరిగాయి.

దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది.

తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.

దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.

అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారు.

స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం



1)  దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...

అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.





ఆశ్వయుజ కార్తీకములలో అత్యంత ప్రధానమైనది దీపము. దీపావళి అనగా దీపముల వరుస. దీపావళి అమావాస్యనాడు గంగ ఎక్కడున్నా మనం స్నానం చేస్తున్న నీటిలోనికి ఆవాహన అవుతుంది. 'తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్! అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే!! దీపావళి నాడు గంగ నీటిని, లక్ష్మి నూనెను ఆవహిస్తుంది. అందుకే నూనె రాసుకొని స్నానం చేయాలి. ఎందుకంటే లక్ష్మీ స్పర్శవల్ల అలక్ష్మీ పోతుంది. గంగ స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. ఆరోజు తప్పకుండా దీపముల వరుస వెలిగించి వాటి కాంతిలో అలక్ష్మిని తొలగగొడతారు. అంతరమందు జీవుని యొక్క ఉన్నతినీ, బాహ్యమునందు అలక్ష్మిని పోగొట్టుకొంటున్నాము అని చెప్పడానికి పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడిన వివిధరకములైన బాణా సంచా కాలుస్తాము. బాణసంచా కాల్చడానికి కారణం నరకాసురవధ అని కాదు...'అలక్ష్మీ పరిహారార్ధం'. పితృదేవతలకు మార్గం చూపించడానికి ఇంట్లోకి వెళ్లి కాళ్ళూ చేతులూ కళ్ళూ కడుక్కొని ఆచమనం చేసి లక్ష్మీ పూజ చేస్తారు. తరువాత దీపముల వరుసలు పెడతారు. ఆకాలమందు అమ్మవారు ఉత్తరేణి చెట్టు వ్రేళ్ళయందు ప్రవేశిస్తుంది. ఈరోజు మట్టితో కూడుకున్న ఉత్తరేణి తీసుకొని స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమీదనుంచి నీళ్ళు పోసుకుంటూ ఆ ఉత్తరేణి చెట్టు యొక్క మట్టి మీద పడేట్లుగా తిప్పుకోవాలి.





No comments:

Post a Comment

Total Pageviews