వెలుగుపండగ: అయిదు తంకాలు
కోసికుప్పనూర్చిన
పంటపొలాల్లో
హేమంతసంధ్య-
ఏరుకోని పరిగెలాగా
బంగారు కాంతి.
2.
రాత్రంతా ఎంత
మంచు కురిసిందో
ఒకరాత్రి వేళ లేచిచూస్తే-
తడిసిపోయిన
చందమామ.
3.
నాతో బంధం
పెనవేసుకున్నవాళ్ళకి
నేనివ్వగలిగేదల్లా-
అడవీ, కొండా
అంచులేని వెన్నెలా.
4.
ఏడాదిపొడుగునా
పీల్చుకున్న ఎండ
పండిన ప్రతి ఆకులోనూ-
హేమంతంలో జెండాకొండ
సూర్యకాంతశిల.
5.
ఈ వెలుగుపండగ
ఒకప్పుడు
ఆరుబయట జరుపుకునేవారు-
ఇప్పుడు తలుపులు మూసుకుని
టివీలో చూస్తున్నారు.
No comments:
Post a Comment