Wednesday, January 4, 2017

వినడం చేతకావాలి...

దయచేసి ఇది చదవండి!చాలా మంచి విషయం.
వినడం చేతకావాలి...
"మానవీయం"
మనుష్యుడిగా పుట్టిన రాముడు కూడా ఎన్నో చోట్ల తప్పులు చేయబోయాడు. ఒకానొకప్పుడు సీతమ్మ కనబడనప్పుడు రాముడికి చాలా కోపం వచ్చేసింది. 'ఈ లోకాలన్నింటినీ లయం చేసేస్తాను, దేవతలు కూడా సంచరించలేరు, బాణ ప్రయోగం చేస్తున్నాను లక్ష్మణా!' అని బాణం తీసి సంధించబోయాడు. నిజంగా అది చేసి ఉంటే... విద్య నేర్పిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు తలవంచుకుని ఉండేవారు. తన భార్య కనబడకపోతే ఇంతమందిని శిక్షిస్తాడా! లక్ష్మణస్వామి వచ్చి, కాళ్ళ మీద పడ్డాడు. ''అన్నయ్యా ! చంద్రుడికి కాంతి ఎలా ఉంటుందో, సూర్యుడికి ప్రభ ఎలా ఉంటుందో - రాముడు మంచివాడు, ధర్మం తప్పడని నీ నడవడి చేత నీకు కీర్తి అలా ఉంది.
మచ్చ వస్తుందన్నయ్యా! వద్దన్నయ్యా! ధర్మం తప్ప వద్దన్నయ్యా! నీవు ఇలా చేస్తే - 'రాముడు ఒకసారి ధర్మం తప్పి బాణాలు వేయలేదా' అన్న మాట శాశ్వతంగా నిలిచిపోతుంది. ధర్మాన్ని వదిలిపెట్టవద్దన్నయ్యా !'' అంటాడు. ''తమ్ముడా! నీవు చెప్పినది కూడా నిజమే'' అని తన కోపాన్ని నిగ్రహించుకుంటాడు రాముడు.
నీకు తెలియకపోవచ్చు. వినడం చేత కావాలి. తెలియకపోవడం తప్పు కాదు. ఒకరు చెప్పినప్పుడు వినడం చేతనై ఉండాలి. అది కూడా నాకు చేత కాదంటే... ఇక ఆ పరమేశ్వరుడు కూడా రక్షించలేడు వాణ్ణి! రావణాసురుడు పాడైపోవడానికి కారణం అదే. మంచి మాట వినకపోవడమే. చివరకు పది తలలు తెగి పడిపోయాడు. దుర్యోధనుడిదీ అదే పరిస్థితి. ఇంకాస్త ముందుకుపోయి 'జానామి ధర్మం న చ మే ప్రవృత్తి, జానామ్య ధర్మం న చ మే నివృత్తి' అన్నాడు. 'ధర్మం నాకు తెలియదా? తెలుసు! కానీ అలా చేయాలనిపించడం లేదు. ధర్మం ఏమిటో నేను చదువుకోలేదా? చదువుకున్నాను! కానీ నా కిష్టం ఉండదు - అలా చేయడం! అయినా నాలోని ఈశ్వరుడే నా చేత చేయిస్తున్నప్పుడు ఇవన్నీ నాకెందుకు చెబుతారు?' అని ఎదురు ప్రశ్నించాడు. ఇలా మెట్టవేదాంతం చెప్పబట్టే, తొడలు విరిగిపడిపోయాడు కురుక్షేత్రంలో.
తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. మంచిమాట విన్నప్పుడు దానికి అనుగుణంగా నీ నడవడిక మార్చుకోకపోవడం మాత్రం పెద్ద తప్పు. ధర్మాచరణ చేత తృప్తి పొందాలి. ''చూడు నాయనా! 'నాన్నగారు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలన్నారమ్మా'- అని ఇప్పటివరకు 'ధర్మం...ధర్మం' అంటూ దానికి కట్టుబడి వెళ్ళిపోతానంటున్నావు. అది అంత సులభం కాదు. రేపు మీ ఆవిడను తీసుకుని అడవుల గుండా వెళుతున్నప్పుడు క్రూరమృగాలు అరిస్తే, నీ భార్య ఉలిక్కిపడి నిన్ను పట్టుకుంటే... ఎక్కడో అంతఃపురంలో హంసతూలికా తల్పాల మీద పవ్వళించవలసిన నా భార్య ఇంత కష్టపడడమేమిటని అప్పుడు తిరిగి వచ్చి నాన్న గారి మీద తిరగబడకూడదు. ధర్మం తప్పకుండా ఉండాలి. అలా ఉండగలవా? ఏ ధర్మం కోసమని రాజ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో, ఆ ధర్మానికి కట్టుబడి వచ్చే కష్టనష్టాలు తట్టుకోగలవా? 'తట్టుకోగలను' అని అనుకుంటే ఆ ధర్మమే నిన్ను సదా రక్షించుగాక !'' అని కౌసల్య అంటుంది. ''యం పలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ, స వై రాఘవా శార్దూల ధర్మస్త్వామభిరక్షతు'' అని తల్లిగా కైకేయి చెప్పిన శ్లోకం రామాయణంలో బంగారు పాత్రలో పోసిన అమృతం లాంటిది. రాముడు ఎంతగా తట్టుకుని నిలబడ్డాడంటే... చివరకు ఒక రాక్షసుడు కూడా ఆయన గురించి చెబుతూ, ''రామో విగ్రహవాన్ ధర్మః'' అనక తప్పలేదు.
'అయ్యా! నాకీ సుఖం అనుభవించాలనుంది. నేనిది అనుభవించవచ్చా?' అని కొందరికి సందేహం. అంతరాత్మ చెప్పింది ప్రమాణం చేసుకో! 'ధర్మమే, అనుభవించేయ్' అన్నప్పుడు అనుభవించు. 'వద్దు! అది ధర్మచట్రంలో ఇమడదు' అన్నప్పుడు దాని జోలికి వెళ్లకు. 'పంచదార పరమాన్నం తెల్లగా, బెల్లం పరమాన్నం నల్లగా ఉంది. నాకు తెల్లగా ఉన్నది తినాలనిపిస్తోంది. తిననా?' సన్న్యాసివి కాదు కదా! గృహస్థువు. తప్పేమీ లేదు. దేవుడికి నైవేద్యం పెట్టి, కొద్దిగా ఇతరులకు పెట్టి, మిగిలినది నీవు తినేసెయ్. ఏ తప్పూలేదు. 'అయ్యా ! నా పక్కనున్నావిడ నల్లగా, ఎదురుగా ఉన్న ఆవిడ తెల్లగా కనిపిస్తోంది.' అది ధర్మ చట్రంలో ఇమడదు. అధర్మం. అలాంటి ఆలోచనలు రానీయకు అన్నప్పుడు వదిలేసెయ్. అదొక్కటే తీర్పు.
ఎందుకంటారా! ఇది మర్త్య లోకం. ఇందులో నువ్వు శాశ్వతంగా ఉండవు. ధర్మం చెప్పిన పరమేశ్వరుడు మళ్ళీ నిన్ను లెక్కలడుగుతాడు. ఈ జన్మలో ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకో. మిగిలిన జీవరాశులేవీ ఇలా విముక్తి పొందలేవు. అలా పొందగలిగినదీ, శాస్త్రాన్ని పట్టుకోగలిగినదీ, గురువును సేవించగలిగినదీ- భగవన్నామం పలుకగలిగినదీ, మంచిమాట చెప్పగలిగినదీ, తాను తరించగలిగినదీ, దేవత కాగలిగినదీ, ఉత్తరోత్తర జన్మలలో మనుష్య జన్మలోకి వచ్చి మళ్లీ ఇంకా ఎదగగలిగిన స్థితి పొందగలిగినదీ, ధర్మాన్ని విడిచిపెట్టి కిందకు వెళ్ళి కొన్ని కోట్ల జన్మల వెనక్కి పడిపోయి స్థావర జంగమమైపోగలిగినదీ కూడా మనుష్యుడే! నువ్వు ఏమవుతావన్నది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.
రోగాలెందుకు వచ్చాయని వైద్యుడు అడగడు. 'ఇక చేయకు అలాంటి పనులు. నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసి పంపిస్తా' అంటాడు. భగవంతుడు కూడా అంతే! ఒకసారి తప్పు తెలుసుకుని ఆయన పాదాల మీద పడిపోయావు. నిన్ను ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. ఈశ్వరుడి అనుగ్రహాన్ని, గురువు యొక్క సౌలభ్యాన్ని , శాస్త్ర పరమార్థాన్ని, ధర్మం వైశిష్ట్యాన్ని సమన్వయం చేసుకుని తరించగల స్థితి మానవుడికి ఒక్కడికే ఉంది. ఇతరాలకు లేదు. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకుని, ఈశ్వరానుగ్రహాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంత అవసరమో గుర్తించిననాడు దాని వైభవం మనకు అర్థమవుతుంది. కాబట్టి ధర్మాచరణ ద్వారా తరించగల అవకాశాన్ని పరమేశ్వరుడు మనందరికీ ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుందాం!

No comments:

Post a Comment

Total Pageviews