Tuesday, May 22, 2018

ఇంటర్ ఫలితాలు 750 వచ్చినా, 850 వచ్చినా, 985 వచ్చినా ఎవరికీ సంతోషం లేదు.

మొన్న ఇంటర్ ఫలితాలు వచ్చాయి.  నాకు తెలిసిన ఓ పదిమంది పిల్లలు పరీక్షలు రాసిన వారిలో ఉన్నారు.  వారి రిజుల్త్స్ కనుక్కుందామని కొందరికి ఫోన్ చేసాను.  ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ రిసీవ్ చేసుకింది.  "అమ్మాయి కు మూడ్ బాగా లేదు. పడుకుంది"  అని చెప్పింది ఆమె.  ఆ పిల్ల చాలా తెలివికలది.  పొరపాటున తప్పిందా అని అనుమానం వచ్చి "ఎన్ని మార్కులు వచ్చాయి?" అని అడిగాను.  975 అని జవాబిచ్చిది ఆమె.  అబ్బో.... చాలా మంచి మార్కులు... మరి మూడ్ బాగా లేకపోవడం ఏమిటి?  అన్నాను.  985 ఎక్స్పెక్ట్ చేసింది.  దాంతో డిప్రెషన్ లో ఉంది.  మాకు కూడా తృప్తి లేదు. అందుకే ఎక్కడికీ వెళ్ళలేదు"  అని చెప్పింది ఆమె.

  మరొకరికి ఫోన్ చేసాను.  ఆ అమ్మాయి పెద్దగా ఏడుస్తున్న సౌండ్ వినిపించింది.  వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుంది.  " మార్కులు బాగా తక్కువ వచ్చాయి.  పొద్దుటినుంచి ఏడుస్తున్నది. ఓదార్చడం మా వల్ల కావడం లేదు"  అన్నది ఆమె.  "ఎన్ని వచ్చాయి?" అడిగాను. " 985 వచ్చాయి."  చెప్పింది ఆమె.  నాకు చిరుకోపం వచ్చింది.  "పార్టీ అడుగుతాము అని మీరు అలా అంటున్నారు.  985 అంటే చాలా గొప్ప మార్కులు కదా? "  అన్నాను.  "మార్కులు రాగానే వాళ్ళ కాలేజి నుంచి ఎవరో ఫోన్ చేసారు.  ఇంకొక్క రెండు మార్కులు వచ్చినట్లయితే, నీ పేరు, ఫోటో ఫ్లెక్సీ లకు ఎక్కేది.  మంచి చాన్స్ మిస్ చేసుకున్నావు.  ఇంత తక్కువ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చెయ్యలేదు"  అని అన్నదట ఆమె ఎవరో...దాంతో దిగులు పడింది."  అన్నది ఆ తల్లి. 

 మరొకరికి ఫోన్ చేస్తే వాళ్ళ దాడి మాట్లాడాడు.  "ఎన్నో ఆసలు పెట్టుకున్నాం. డాక్టర్ని చేయ్యాలనుకున్నాము.  20 వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాము.  అయిదారు వేల రూపాయల్ డ్రస్సులు అడిగితె కొనిపెట్టాము.  లక్షల ఫీజులు కట్టాము.  కాలేజి కి వెళ్ళడానికి హోండా ఆక్తివా కావాలంటే కొనిపెట్టాము.  చివరకు 965 మార్కులు తెచ్చుకుని మా ఆశలు నీరు కార్చింది.  వాళ్ళ అమ్మ కోపం పట్టలేక చీపురు కట్టే తో చితక కొట్టింది.  ఇద్దరు ఏడుస్తూ గదిలో పడుకున్నారు. "  చెప్పాడు ఆ జనకుడు. 

 మరొకరికి ఫోన్ చేస్తే 750 మార్కులు వచ్చాయట.  వాళ్లకు అప్పటి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పడుకున్నారట.   అయిదారుగురు పిల్లలకు 850-950 మధ్యన మార్కులు వచ్చాయి.  వాళ్ళు  కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయి, ఇక  జీవితం వ్యర్ధం అన్నంతగా కుమిలి పోతున్నారు. 

  750 వచ్చినా, 850 వచ్చినా, 985 వచ్చినా ఎవరికీ సంతోషం లేదు.  అందరూ ఏడుస్తున్నారు. 

 లోపం ఎక్కడుంది?  విద్యా వ్యవస్థ లోనా?  టీచర్ల లోనా, చదువుల లోనా, పిల్లల లోనా, తల్లితండ్రుల లోనా, సమాజం లోనా, ప్రభుత్వం లోనా? 

  ఇప్పుడు 40 ఏళ్ల వయసు దాటి దేశ విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వారంతా టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు అత్తెసరు మార్కులతో పాస్ అయిన వారేనని ఈ పిల్లలు, తల్లితండ్రులు ఎప్పుడు తెలుసకుంటారు? ఏ బోధి వృక్షం కింద కూర్చుంటే  వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది?

No comments:

Post a Comment

Total Pageviews