Thursday, May 17, 2018

కానుక

కానుక
పూజ్యులైన అమ్మానాన్నలకు ప్రదీప్‌ నమస్కరించి వ్రాయునది. ఉభయకుశలోపరి. నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం దొరికింది. నేనూ మీ కోడలూ ఇక్కడి ఉద్యోగాలకు రాజీనామా చేశాం. ఈ నెలాఖరులోగా ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాం. మిగిలిన వివరాలు వచ్చాక మాట్లాడుకుందాం.
ఇట్లు
మీ కుమారుడు
ప్రదీప్‌
క్లుప్తంగా ఉన్న ఆ ఉత్తరం చదివిన సీతారామయ్య, వైదేహీల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆరు అంకెల జీతంలో ఉన్న కొడుకూ అయిదంకెల జీతంలో ఉన్న కోడలూ
ఉద్యోగాలకు రిజైన్‌ చేసి ఇండియాకి తిరిగి వచ్చేయడమేమిటీ..? ఇక్కడ... ఈ హైదరాబాద్‌లో అంత జీతం ఎక్కడుందీ? ఎవరిస్తారూ? అయినా చుట్టపుచూపుగా ఇండియాకి రావడమేగానీ, తాము
అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోతామని ప్రదీప్‌ కచ్చితంగా తన నిర్ణయాన్ని ఏనాడో చెప్పేశాడుగా! మరి ఈ ఉత్తరం ఏమిటీ? వాడు పనిచేసేచోట ఏమన్నా గొడవలు జరిగాయా? భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చాయా? సందేహాల సునామీలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారా వృద్ధ దంపతులు.
‘‘ఏమిటండీ ఇది?’’ భర్తని అడిగింది వైదేహి.
‘‘ఉత్తరం’’ సింపుల్‌గా అన్నాడు సీతారామయ్య. భర్త జవాబుతో తెల్లబోయిన వైదేహి మొహంచూసి చిన్నగా నవ్వి ‘‘నాకొకటి తెలిస్తేగా నీకు చెప్పడానికి’’ అన్నాడు.
ఉత్తరం వచ్చినప్పటి నుంచి అన్య
మనస్కంగానే గడిపారా ఇద్దరు. సాయంకాలం వాలుకుర్చీలో నడుంవాల్చి అదే ఆలోచనల్లో
ఉన్న సీతారామయ్యకి చటుక్కున సందేహం కలిగింది. ఒకవేళ ప్రదీప్‌ తానిచ్చినదాన్ని చూశాడా? దానిని ఎప్పుడు చూడాలో తాను స్పష్టంగా చెప్పాడుగా? ఒకవేళ చూసినా, వీడు ఇండియాకి తిరిగి వచ్చేయడానికీ
దానికీ ఏమన్నా సంబంధం ఉందా?
ఎటూ తేల్చుకోలేకపోతున్నాడాయన. దానిని ప్రదీప్‌కి అందజేసిన రోజు జ్ఞాపకం
వచ్చిందాయనకు. ఆరోజు...
రెండేళ్ళక్రితం తల్లిదండ్రులను చూడటానికి
కాలిఫోర్నియా నుండి భార్యా పిల్లలతో వచ్చాడు ప్రదీప్‌. నెలరోజులు సరదాగా గడిచిపోయాయి. మరుసటిరోజే తిరుగుప్రయాణం. వైదేహి కోడలినీ పిల్లలనూ తీసుకుని తెలిసినవారింటికి వెళ్ళింది. ఇంట్లో తండ్రీకొడుకులు మాత్రమే ఉన్నారు.
‘‘బాబూ... దీపూ!’’ గదిలో బ్యాగ్‌ సర్దుకుంటున్న ప్రదీప్‌ తలెత్తిచూశాడు. ఎదురుగా తండ్రి.
‘‘ఏమిటి నాన్నగారూ’’ అన్నాడు ప్రదీప్‌.
తన చేతిలోని ఒక ప్యాకెట్‌ కొడుకుకి అందిస్తూ ‘‘ఇది నీ దగ్గర భద్రంగా ఉంచు’’ అన్నాడు
సీతారామయ్య.
‘‘ఏమిటిది?’’ ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్‌.
‘‘అది ఇప్పుడు చెప్పను. దీన్ని నేనూ మీ అమ్మా మరణించిన తర్వాతే తెరిచి చూడాలి. మరణించిన వెంటనే చూడాలని రూలేం లేదు. ‘మేము లేము’ అని తెలిసిన తర్వాత మాత్రమే ఎప్పుడన్నా చూడాలని అనిపిస్తే చూడు. అప్పటివరకూ దీన్ని ఓపెన్‌ చేయకు’’ అన్నాడు సీతారామయ్య. కొడుకు మరోమాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గదిలోనుండి ఇవతలకి వచ్చేశాడు.
కొడుకు ‘ఆ ప్యాకెట్‌నుగాని తెరిచి చూశాడా?’ అన్న సందేహమే ఇప్పుడు సీతారామయ్యకి వచ్చింది. ఆయనకి వచ్చిన సందేహం యధార్థమే... జరిగింది అదే.
ప్రదీప్‌ని గత కొద్దికాలంనుండి ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతోంది. స్వంత ఇల్లు, కారు, బ్యాంక్‌ బ్యాలన్స్‌... జీవితంలో కోరుకున్నవి అన్నీ సాధించినా, వాటి తాలూకు ఆనందం మనసుని తాకడంలేదు. ఇవేవీకావు, ఇంకా... ఇంకా... ఏదో కావాలని ఆరాటం... ఏమిటది? ఏసీ గదిలో భార్యాపిల్లలు ఒళ్ళెరగకుండా నిద్రపోతున్నా, తనకిమాత్రం కంటిమీద కునుకురాక నిద్రలేమితో బాధపడేవాడు. దాని ప్రభావం
ఉద్యోగంమీద పడుతోంది. అసలు తన అసంతృప్తికి కారణం ఏమిటో తెలిస్తే కదా, పరిష్కారం గురించి ఆలోచించడానికి.
చిన్నప్పటినుండి ప్రదీప్‌ చదువులో ఫస్ట్‌.
ఇంటర్‌లో ర్యాంక్‌ వచ్చాక తనకిష్టమైన కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేయాలని ఎంతో ఉబలాటపడ్డాడు. స్కూల్‌ టీచరైన తండ్రి తనకంత శక్తిలేదంటే
అతి కష్టంమీద ఒప్పించి, తరతరాలనుండి వస్తున్న ఇంటిని తనఖా పెట్టించి ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాడు. అన్ని సరదాలు చంపుకుని పుస్తకాలకే
అంకితమైపోయాడు. ఇంజినీరింగ్‌లో కూడా ర్యాంక్‌ రావడం... అతడి మరో చిరకాలవాంఛ- అమెరికాలో ఉద్యోగం... అన్నీ చకచకా జరిగిపోయాయి.
తనఖా పెట్టించిన ఇంటిని విడిపించి, తన చదువుకోసం చేసిన అప్పులన్నీ తీర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి మంచి పొజిషన్‌లోకి వచ్చాడు. ఆరంకెల జీతాన్ని తొలిసారిగా అందుకున్నప్పుడు ఎవరెస్ట్‌
శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినంత ఫీలింగ్‌... తనని ప్రాణాధికంగా ప్రేమించే భార్య మంజుల... ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు- రమ్య, సిద్ధార్థ... భార్యాభర్తలిద్దరి ఆర్జన... ‘జీవితంలో అనుకున్నవన్నీ సాధించాను. నాకింక లోటేమీలేదు’ అని భావించిన ప్రదీప్‌లో అసంతృప్తి అదృశ్యరూపంలో వెన్నాడటం మొదలయింది.
ఆరోజు... ఇండియా నుండి వచ్చిన ఇరవైరెండు నెలల తరవాత... అర్ధరాత్రి పన్నెండయ్యింది.
ఎప్పటిలాగానే నిద్రపట్టక బెడ్‌రూంలో పచార్లు చేస్తున్నాడు. భార్యాపిల్లలు ప్రశాంతంగా నిద్ర
పోతున్నారు. బెడ్‌రూం నుండి రీడింగ్‌రూమ్‌లోకి వచ్చాడు. కాసేపు ఏదైనా మంచి సంగీతం
విని రిలాక్సవుదామని క్యాసెట్‌ కోసం షెల్ఫ్‌ దగ్గరికి వచ్చాడు. ఎదురుగా ఇండియా నుండి తీసుకువచ్చిన గజల్‌ శ్రీనివాస్‌ పాటల క్యాసెట్‌ కన్పించింది. ఆ క్యాసెట్‌ తీస్తుండగా, షెల్ఫ్‌లో కన్పించింది తండ్రిచ్చిన ప్యాకెట్‌.
ఇండియా నుండి వచ్చిన తరవాత ఒకటి రెండుసార్లు ‘ఆ ప్యాకెట్‌ ఓపెన్‌చేసి చూద్దామా?’ అని అనిపించింది. కానీ తండ్రిమీద గౌరవంతో ఆ పని చేయలేక షెల్ఫ్‌లో అలా పడేశాడు. ఇప్పుడు తిరిగి కనబడేసరికి మళ్ళీ కుతూహలం మొదలయింది. ప్యాకెట్‌ చేతిలోకి తీసుకున్నాడు. ‘ఒక్కసారి తీసిచూస్తే’ అన్పించింది. కానీ తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం రావడంతో ‘భావ్యం కాదు’ అనుకుని తిరిగి షెల్ఫ్‌లో పెట్టేయబోయి ఆగాడు. ‘తప్పేంటీ? ఎప్పటికైనా చూడమనేగా తండ్రి తనకిచ్చింది. చెప్పినదానికన్నా కొద్దిగా ముందు చూస్తున్నాడు... అంతేగా’ మనసుకి సంజాయిషీ ఇచ్చుకోవడానికి ప్రయత్నించాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. చివరికి అతనిలోని కుతూహలమే జయించింది.
‘నాన్నగారూ! మీ మాటను ఉల్లంఘిస్తున్నందుకు క్షమించండి’ అని మనసులోనే అనుకుని సీల్‌ చేసిన ఆ ప్యాకెట్‌ని ఓపెన్‌ చేశాడు. ‘తండ్రి అంతగా చెప్పాడంటే అందులో ఏదో విశేషమే ఉంటుంది’ అనుకుని ఆశపడ్డ ప్రదీప్‌కి తీవ్ర ఆశాభంగమే
ఎదురైంది. ప్యాకెట్‌లో రెండు సీడీలూ ఒక లెటరూ
ఉన్నాయి. అంతే... నిర్లిప్తత ఆవరించిన ప్రదీప్‌ అన్యమనస్కంగానే ఉత్తరం అందుకుని చదవసాగాడు.
‘‘బాబూ, దీపూ! మీ అందరికీ మా ఇద్దరి ఆశీస్సులు. ఈ ఉత్తరం నువ్వు చదివే సమయానికి నేనూ అమ్మా ఈ లోకంలో ఉండమని మాకు తెలుసు. మృత్యువు తాను వచ్చేముందు ఎటువంటి హెచ్చరికలూ చేయకుండా సడెన్‌గా వచ్చేయవచ్చు. మా మరణవార్త తెలిసిన తరవాత నువ్వెంత ఆఘమేఘాల మీద పరిగెత్తుకు రావాలనుకున్నా, ఆఫీసులో సెలవు దొరికి, ఫ్లైట్‌లో సీటు దొరికి ఇక్కడికి వచ్చేసరికి మా చితాభస్మమే తప్ప, మా భౌతికకాయాలను ఆఖరిసారిగా చూసే అవకాశం కూడా నీకు లేకపోవచ్చు. మరణించేముందు ప్రతీ తల్లికీ తండ్రికీ తమ సంతానానికి ఏదో చెప్పాలని తాపత్రయం... ఉబలాటం. దానికి మేం కూడా అతీతులేంకాదు. కానీ ఆ అవకాశం మాకులేదు. ఎలా..? ఒకసారి టీవీలో ‘మాయాబజార్‌’ సినిమా చూస్తున్నా. ఎప్పుడో యాభై ఏళ్ళనాటి సినిమా. అందులో నటించిన యస్వీఆర్‌, యన్టీఆర్‌, సావిత్రి, రేలంగి... వీళ్ళల్లో ఎవ్వరూ ఈనాడు లేరు. అయినా వారి నటనాకౌశలాన్ని ఈనాడు మనం చూడగలుగుతున్నాం. ఆనాటి ఘంటసాల గానం ఈనాటికీ మన గుండెలోతులను స్పృశిస్తోంది. దీన్ని గురించే ఆలోచిస్తుంటే హఠాత్తుగా ఒక ఆలోచన స్ఫురించింది. మనం మరణించాక మన పిల్లలు మనల్ని చూడాలనుకుంటే ఫొటోలే ఆధారం. లేదా వాళ్ళ పెళ్ళి వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకు ‘అదిగోరా మీ తాతయ్య... అదిగో మీ నాన్నమ్మ...’ అని చూపిస్తారు. అంతేగా! కానీ మా కంఠస్వరాలు
వినలేరు కదా! ఎప్పుడో ఏళ్ళనాటి సినిమా ఇప్పుడు కూడా చూడగలుగుతున్నప్పుడు, వాళ్ళ మాటలూ పాటలూ వినగలుగుతున్నప్పుడు, మరణించిన తల్లిదండ్రుల మాటలు మాత్రం ఎందుకు వినలేం?
నా సమస్యకి పరిష్కారం లభించింది. దాని ఫలితమే ఈ సీడీలు. మేము లేకపోయినా మా రూపం, మా మాట నీముందుంటుంది. అమ్మానాన్నలను చూడాలని ఉందా? మరి ఆలస్యం దేనికీ?
సీడీలు చూడూ...
ఇట్లు
నీ నాన్న’’
విపరీతమైన సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రదీప్‌ ఉత్తరాన్ని మడిచి, ‘అమ్మ’ అని లేబుల్‌ అంటించిన సీడీ తీసి, డి.వి.డి.ప్లేయర్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు.
తలలో పూలు, నుదుట రూపాయి కాసంత బొట్టు, పట్టుచీర, చేతులనిండా గాజులు... మూర్తీభవించిన ముత్తైదువ రూపంలో చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ అమ్మ...
‘బాబూ, దీపూ... మీ నాన్నగారు- అబ్బాయితో ఏమన్నా మాట్లాడు’ అన్నారు. ‘ఏం మాట్లాడనురా కన్నా? దీపూకి నా మాటకంటే పాటే ఇష్టం. నా పాటే వినిపిస్తాను’ అన్నాను. ‘మరి నా పాట వింటావా?’ వైదేహి అడుగుతోంది ప్రదీప్‌ని.
అవును... అమ్మ అద్భుతంగా పాడుతుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. రేడియో ఆర్టిస్ట్‌ కూడానూ. తను అమ్మ దగ్గరేగా సంగీతం నేర్చుకుంది? అమ్మంత గొప్పగా కాకపోయినా, తనుకూడా బాగానే పాడగలడు. స్కూలు, కాలేజీ, యూనివర్శిటీ... పాటల పోటీలలో ఎప్పుడూ ప్రథమస్థానం తనదే. దానికి కారణం అమ్మపెట్టిన సంగీత భిక్ష. ఇప్పుడీ యాంత్రిక జీవితంలో పడిన తరవాత తనకి సా...పా...సా వచ్చునన్న సంగతే మర్చిపోయాడు. ఆలోచనలనుండి తేరుకుని స్క్రీన్‌ వంక చూశాడు.
పూజా మందిరంలో దేవుని ముందు కూర్చుని వైదేహి ‘ఎందరో మహానుభావులు’ కీర్తన ఆలపిస్తోంది. తరవాత ‘నగుమోము కనలేని’ కీర్తన... అలా వరసగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి కీర్తనలు... హాలులో నటరాజ విగ్రహం ముందు కూర్చుని తంబుర మీటుతూ ‘కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ’ అంటూ అన్నమయ్య కీర్తనతో మొదలుపెట్టి, రామదాసు, పురందరదాసు కీర్తనలు... పెరట్లో పూలమొక్కల మధ్య విహరిస్తూ శ్రీరంగం గోపాలరత్నం పాడిన ‘అమ్మదొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ’ వంటి
లలితగీతాలు పాడుతూ...
సంగీతామృత జలపాతంలో నిలువెల్లా తడిసిముద్దయిపోతూ ఉక్కిరిబిక్కిరైపోతున్న ప్రదీప్‌కి వూపిరి
పీల్చడమే కష్టమైపోతోంది. హృదయంలో ఏవేవో ప్రకంపనలు... అమ్మ పాడుతున్న ఆ పాటలన్నీ తనకీ వచ్చు... అమ్మేగా నేర్పిందీ..? పసితనంలో ఒళ్ళొ కూర్చోబెట్టుకుని మాతృమూర్తిలా... ఎదిగిన తరవాత ఒక గురువులా ఎన్ని పాటలు నేర్పిందీ? ఏవీ ఆ పాటలూ... ఏవీ ఆ మధురానుభూతులూ..? సీడీ పూర్తయ్యేసరికి మనసులో తీవ్రమైన సంఘర్షణ... స్నానం చేసినట్టు స్వేదంతో శరీరమంతా తడిసిపోయింది. వణుకుతున్న చేతులతో ‘నాన్న’ అన్న లేబిల్‌ అంటించి ఉన్న రెండో సీడీని ప్లేయర్‌లోపెట్టి ఆన్‌ చేశాడు. మల్లెపూవులాంటి పంచె, లాల్చీ ధరించిన సీతారామయ్య చిరునవ్వులు చిందిస్తూ కుర్చీలో కూర్చుని ఉన్నాడు.
‘‘దీపూ... బాగున్నావురా బాబూ? ‘నాన్న ఏం చెబుతారులే- ధర్మపన్నాలూ నీతిబోధలూ చేసి ఉంటారు’ అనుకుంటున్నావు కదూ. అవన్నీ చెప్పడానికి నేనెవరినిరా? ఎవరి వ్యక్తిగత జీవితాలు వారిష్టం. అవతలివారు కోరుకున్నట్లు తానుండలేని మనిషి, ఎదుటివారు మాత్రం తాను కోరుకున్నట్లు ఉండాలనుకోవడం అజ్ఞానం కాక మరేమిటి? అయినా ఇంత వయసు వచ్చిన నీకు మరొకరి సందేశాలూ హితబోధలూ అవసరమా? మరి నీకు ఏం చెప్పాలి? ఆ... లోకంలో సంపదనంతా గుమ్మరించినా కాలచక్రంలో ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తిప్పలేరన్న సంగతి నీకు తెలియంది కాదు. అవునా? అందుకే నిరుపయోగమైన సందేశాలకంటే మధురమైన నీ బాల్యస్మృతులు ఒక్కసారి నీకు జ్ఞప్తికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మాతో కలిసి పంచుకున్న ఆ అనుభూతులు నీ కళ్ళముందే కదలాడుతుంటే నీ స్మృతిపథంలో మేం కనీసం ఆ కొన్ని క్షణాలైనా తిరిగి సజీవులౌతామేమోనన్న చిన్న ఆశ. దీపూ... నీకు గుర్తుందా..?’’ అంటూ సీతారామయ్య ప్రదీప్‌ చిన్ననాటి సంగతులు ఒక్కొక్కటీ చెప్పనారంభించాడు...
పదినెలల వయసులో అతి కష్టంమీద లేచినిలబడి అడుగులు వేయడం... తండ్రి ‘ఒకటి, రెండు, మూడు’ అంటూ లెక్కపెట్టడం... నాలుగు అడుగులువేసి పడిపోతే తల్లి కంగారుగా ఎత్తుకోబోతూ ఉంటే, తండ్రి వారించడం... అల్మారాలో ఉంచిన అటుకుల డబ్బాకోసం తల్లి చూడకుండా కుర్చీని కష్టంమీద లాక్కొచ్చి డబ్బా అందుకోబోతే, మూతలేని డబ్బా జారి అటుకులు మొత్తం నెత్తిమీదగా తలంబ్రాల్లా పడటం... తండ్రి మెడచుట్టూ చేతులువేసి ఉప్పుమూటలా వూగుతూ- వేమన, సుమతీ శతకాలలోని పద్యాలు నేర్చుకోవడం... ఇంటిపని చేసుకుంటూ తల్లి పాడుతూ ఉంటే, వచ్చీరాని మాటలతో వంతపాడాలని ప్రయత్నించడం... రెండోక్లాస్‌ చదువుతున్నప్పుడు రోడ్డుమీద దొరికిన రోల్డ్‌గోల్డ్‌ గుళ్ళగొలుసులో ఒక పూస పట్టుకొచ్చి ‘అమ్మా! నీకోసం బంగారం పట్టుకొచ్చా’ అంటే, తల్లిదండ్రులు పగలబడి నవ్వడం... అదిచూసి బుంగమూతి పెట్టుకుని ‘పో అమ్మా, నీకోసం ఎంతో కష్టపడి తెస్తేనూ...’ అంటున్న ప్రదీప్‌ అమాయకత్వానికి తల్లి అక్కున
చేర్చుకుని ముద్దాడటం... తండ్రి ఒళ్ళొ కూర్చోబెట్టుకుని ‘ల, ళ, ర, ఱ, శ, ష, స’ అక్షరాలు స్పష్టంగా పలికే విధానం నేర్పించడం... నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఆటల్లో చెయ్యి విరక్కొట్టుకుంటే, ‘అసలే డబ్బుకి ఇబ్బందిగా ఉందనుకుంటే, మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఖర్చు; నాన్న ఎక్కడ్నించి తెస్తారు?’ అని తల్లి మందలిస్తే, ప్రదీప్‌ చిన్నబుచ్చుకున్న మొహంతో తండ్రి దగ్గరకొచ్చి ‘నాన్నా, అమృతాంజనం రాసుకుని కాపడం పెట్టుకుంటా, అదే తగ్గిపోతుంది. డాక్టరు దగ్గరికి వద్దు’ అని అంటే- తండ్రి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగి
ప్రదీప్‌ని దగ్గరకు తీసుకోవడం... రేపు సెవెన్త్‌క్లాస్‌ పబ్లిక్‌ పరీక్షలనగా, వీధిలో పిల్లలు ఆడుకుంటున్న క్రికెట్‌ ఆటని ప్రదీప్‌ చూస్తుండగా, క్రికెట్‌బంతి వచ్చి ప్రదీప్‌ మోకాలిచిప్పకు బలంగా తగిలి, మోకాలు బత్తాయిపండు సైజులో వాచిపోతే, పరీక్షకి వెళ్ళలేనేమోనని ప్రదీప్‌ ఏడుస్తుంటే, తండ్రి రిక్షాలో స్కూల్‌కి తీసుకెళ్ళి, అక్కడినుండి పరీక్ష రాసేగదికి రెండు చేతులతో ఎత్తుకెళ్ళి పరీక్ష రాయించడం...
ఇలా ఒకటేమిటి, సీతారామయ్య ప్రదీప్‌ చిన్ననాటి సంఘటనలు ఒక్కొక్కటీ వివరించి చెబుతూ ఉంటే, ఒక్కొక్క సంఘటనా, ఒక్కొక్క మిస్సైల్‌లా ప్రదీప్‌ గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. సీడీ పూర్తయ్యేసరికి ప్రదీప్‌ ఒక కంటినుండి నయాగరా, మరో కంటినుండి శివసముద్రం జలపాతాలు. కంట్రోలు చేసుకోవడం అతని శక్తికి మించిన పనే అయింది.
ఏమిటా కన్నీళ్ళకి అర్థం? వేదనాభరితమైన హృదయం కార్చిన కన్నీరా? సీడీ మొత్తంలో
తండ్రి ఎక్కడా కూడా ప్రదీప్‌ని మందలించలేదు... విమర్శించలేదు... హితబోధలు చేయలేదు.
మరి ఎందుకీ కన్నీరు? అవి... ఆనందబాష్పాలా? కాదు... యాంత్రికజీవనం, కృత్రిమత్వంతో హృదయంలో నిర్మించిన ఆనకట్ట, మానవ అనుబంధాలనే వరదతాకిడికి బద్దలై, అనురాగం, అభిమానం,
ఆత్మీయతా ఆప్యాయతా వంటి కెరటాలు ఉవ్వెత్తున ఎగసి గుక్కతిప్పుకోనివ్వకుండా, వూపిరందకుండా చేస్తున్నప్పుడు కలిగే భావన అది. అక్షరాలకు అందని అనుభూతి అది.
అలా ఎంతసేపు వెక్కివెక్కి ఏడ్చాడో ప్రదీప్‌... చాలాసేపైన తరవాత, కొద్దిగా తేరుకుని, మనసు కంట్రోల్‌ చేసుకోవడానికి ‘గజల్‌ శ్రీనివాస్‌’ పాటల క్యాసెట్‌ టేప్‌రికార్డర్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు.
‘‘ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయ్‌
నా సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయ్‌...’’
టేప్‌లో గజల్‌ శ్రీనివాస్‌ గొంతు మధురంగా విన్పిస్తోంది. ‘ఎంత కోఇన్సిడెన్స్‌... నాన్న చెప్పిన బాల్యం సారాంశం ఒక్క పాటలో కళ్ళముందుంచాడు... పాదాభివందనం శ్రీనివాస్‌’ అనుకుంటున్న ప్రదీప్‌ మెదడులో తటిల్లంటూ మెరిసింది ఒక పెద్దమెరుపు. తనని ఇంతకాలం పీడిస్తున్న అసంతృప్తికి మూలమేమిటో తెలిసింది.
మానవ సంబంధాల లేమితో తను బాధపడుతున్నాడు... యస్‌... కమ్యూనికేషన్‌ గ్యాప్‌...
ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టూ ఎవరో భయంకరమైన వేటకత్తి తీసుకుని చంపడానికి వస్తున్నట్టూ ఉరుకులు
పరుగులు... కేర్‌టేకర్‌కి పిల్లల్ని అప్పగించి తనో దిక్కుకూ తన భార్యో దిక్కుకూ మారథాన్‌ రన్నింగ్‌. అలసిన శరీరాలతో ఏ రాత్రికో ఇల్లు చేరటం, ఏదో తిన్నామన్న పేరుకి అన్నం మెతుకులు కతికి, ఎప్పుడు పక్కమీదకు చేరి విశ్రాంతి తీసుకుందామా అన్న ఆరాటం... మొక్కుబడి పలకరింపులు...
అతికించుకున్న ప్లాస్టిక్‌ చిరునవ్వులు... తమ ధనవ్యామోహాన్ని కప్పిపుచ్చుకుంటూ ‘ఇదంతా సంతానం ఉజ్వల భవిష్యత్‌ కోసమే’నంటూ ఆత్మవంచన స్టేట్‌మెంట్స్‌... వీకెండ్‌కి అందరూ కలసి ఎక్కడికన్నా వెళ్తే, ఈ ఆరురోజులు కలిసిలేమన్న బాకీ తీరిపోయినట్లు కృత్రిమ ఆత్మసంతృప్తి... తల్లిదండ్రులకూ
పిల్లలకూ మధ్యగానీ భార్యాభర్తల మధ్యగానీ
కరువైపోయిన ఆప్యాయతా ఆత్మీయతా.
తన అసంతృప్తికి కారణం తెలిసిన తరవాత
ప్రదీప్‌కి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ‘ఏ తల్లీతండ్రీ ఇస్తారు తమ సంతానానికి ఇంతటి అపురూపమైన కానుక... పరుషంగా ఒక్కమాట కూడా అనకుండా తాను జీవితంలో కోల్పోతున్నదేమిటో తన తండ్రి ఎంత తెలివిగా చెప్పాడు’ అనుకున్నాడు. సమస్యేమిటో తెలిశాక పరిష్కారం కనుక్కోవడం పెద్ద
కష్టమేమీకాలేదు.
అప్పటికే తెల్లవారిపోయింది. భార్య లేచిన
తరవాత ‘‘నేనివ్వాళ ఆఫీసుకి సెలవు పెట్టేస్తున్నాను. నువ్వూ సెలవు పెట్టేయ్‌’’ అన్నాడు.
‘‘ఎందుకూ?’’ ఆశ్చర్యంగా అడిగింది మంజుల.
‘‘చెబుతాగా’’ అన్నాడేగానీ వివరాలు చెప్పలేదు. స్నానం, టిఫిన్‌ కానిచ్చి, కొలీగ్‌కి తన సెలవు గురించి చెప్పి, తండ్రిచ్చిన సీడీలూ ఉత్తరం భార్య చేతిలోపెట్టి తాను మంచమెక్కాడు ప్రదీప్‌. పడుకున్న వెంటనే పట్టేసింది నిద్ర. చాలాకాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు లేచాడు. భార్యవంక చూశాడు. మంజుల మొహం బాగా ఏడ్చినట్లు ఉబ్బి కళ్ళు
ఎర్రబారి ఉన్నాయి.
‘‘మనం... మనం... ఇండియా వెళ్ళిపోదామండీ!’’ భోజనం చేస్తున్న ప్రదీప్‌ మీద చెయ్యివేసి అంది మంజుల. తన నిర్ణయాన్ని చెప్పేముందు భార్యని మానసికంగా సిద్ధంచేయాలన్న తలంపుతో, సీడీలు చూడమని చెప్పిన ప్రదీప్‌, తన నిర్ణయమే భార్య నోటివెంట వెలువడేసరికి ఆశ్చర్యంతో తలమునకలవుతూ తలాడించాడు. సీడీలోని పాత్రలూ సంఘటనలూ వేరుకావచ్చు... కానీ అనుభూతి ఒక్కటేగా!
‘‘ఇండియా వెళ్ళిన తరవాత నేను నా పిల్లలకి తల్లిగా, నా భర్తకు భార్యగా ఉండదలచుకున్నాను. ఏటియం మిషన్‌లా కాదు. అందుకే ఉద్యోగం
చేయదలచుకోలేదు’’ అంది మంజుల భర్తని ఇంకా ఆశ్చర్యపరుస్తూ.
ఫారిన్‌లో జాబ్‌ చేస్తున్న ప్రదీప్‌కి ఇండియాలో జాబ్‌ రావడం కష్టంకాలేదు. జీతం అక్కడకంటే తక్కువే అయినా భార్యాభర్తలకది బాధ
అనిపించలేదు.
ఇండియా వచ్చాక హైదరాబాద్‌లోనే ఆఫీసుకి దగ్గర్లో ఫ్లాట్‌ తీసుకోవాలనిపించినా, మళ్ళీ వద్దులే అనుకుని, దూరమైనా తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా తమ స్వంత ఇంటినే రీమోడల్‌ చేయించాడు.
ఆరోజు ఆఫీసులో వర్క్‌ త్వరగా పూర్తికావడంతో ప్రదీప్‌ ఇంటికి త్వరగా వచ్చేశాడు. అప్పుడు సాయంత్రం అయిదున్నర అవుతోంది.
అరుగుమీద వాలుకుర్చీలో పడుకున్న సీతారామయ్య పొట్టమీద కూర్చున్న రమ్య, తాతయ్య చెబుతున్న ‘అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను’ పద్యాన్ని వల్లెవేస్తోంది. ఆ దృశ్యాన్ని తన్మయత్వంతో చూస్తున్న కొడుకుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు
సీతారామయ్య.
తన గదిలోకి వెళ్ళి డ్రెస్‌ మార్చుకుని హాల్‌లోకి వచ్చాడు ప్రదీప్‌. వంటగదిలో మంజుల ఉల్లిపాయ పకోడి చేస్తున్నట్లుంది. ఘుమఘుమల వాసన ముక్కుని అదరగొట్టేస్తుంది. హాలులో స్తంభానికి చేరగిలబడి వైదేహి కూర్చొనుంది. ఆమె ఒడిలో
తలపెట్టుకుని సిద్ధార్థ పడుకుని నాన్నమ్మ పాడుతున్న రామదాసుకీర్తన చెవులప్పగించి వింటున్నాడు.
‘‘ఇరవుగ నిసుకలోన బొరలిన యుడుతభక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి
పలుకే బంగారమాయెరా’’
‘ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ గొంతులో శ్రావ్యత అలానే ఉంది’ అనుకుంటూ మెల్లిగావచ్చి తల్లి ఒడిలో రెండోవైపు తలపెట్టి పడుకున్నాడు. పాలసంద్రమైపోయింది మనసు. ఎంత హాయి అమ్మ ఒడి... ఈ సంతృప్తిముందు తాను
అమెరికాలో తొలిసారిగా ఆరంకెల జీతం అందుకున్నప్పటి తృప్తి మేరుపర్వతం ముందు ఇసుక
రేణువులా అన్పించింది. ఆ ఆనందంలో అప్రయత్నంగా తల్లి గొంతుతో శృతి కలిపాడు.
‘‘ఎంతో వేడిన నీకు సుంతైన దయరాదు
పంతంబుసేయ నేనెంతటి వాడను తండ్రీ
పలుకే బంగారమాయెరా!’’
భర్తకి ప్లేట్‌లో పకోడీలు పట్టుకొచ్చిన మంజుల అక్కడి దృశ్యం చూసి అలాగే నిలబడిపోయింది.

No comments:

Post a Comment

Total Pageviews