Tuesday, May 22, 2018

రుమలలో ఏం జరిగింది, ఏమి జరుగుతోందీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము

తిరుమలలో ఏం జరిగింది, ఏమి జరుగుతోందీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము



పూర్వం నుండి తిరుమల ఆలయంలో అర్చకత్వ బాధ్యతలు నిర్వహించే అర్చక కుటుంబాలు నాలుగు ఉన్నాయి. ఈ నాలుగుకుటుంబాల వారు తిరుమలకు నడకదారి కూడా సరిగాలేని రోజులనుండీ అర్చకత్వం చేస్తున్నారు.



1900 దశకంనుండి ఆదాయం బాగారావడం ప్రారంభమైనది. అప్పటి బ్రిటిష్ పాలకులు కూడా స్వామివారి పట్ల మంచిశ్రద్ధనే చూపారు. క్రమంగా భక్తుల రద్దీ పెరగడంతో, ఆలయనిర్వహణకు కొంతమంది అధికారుల అవసరం ఉందని గుర్తించి, కలెక్టర్ స్థాయి అధికారిని బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది.



 తరువాత వారే హథీరాంజీ మఠానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఆలయానికి వచ్చేభక్తులకు సౌకర్యాలు చేయడం, దర్శన వేళలు పర్యవేక్షణా వారి బాధ్యతలు. స్వాతంత్రం వచ్చాక, మన భారత ప్రభుత్వాలు రావడం జరిగింది.



 1950 లో తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనకు ప్రత్యేక పాలకమండలి అధికారులను, ప్రభుత్వం నియమించడం, వారు వచ్చే హుండీ ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించడం, జరుగుతూ ఉండేది. కానీ ఎవరు కూడా స్వామివారి కైంకర్యాల విషయాలలో కలుగజేసుకునేవారు కాదు.



ఆ బాధ్యతలు అర్చకులు, జీయర్ స్వాములు, ఆచార్యపురుషులు మాత్రమే నిర్వహించేవారు. సందేహాలు వస్తే, ఆస్థానపండితులు ఉండేవారు. స్వామివారి కైంకర్యానికి వచ్చే ద్రవ్యములు, ప్రసాదములు అర్చకులకు వచ్చేవి. ప్రత్యేక జీతభత్యాలు ఏమి లేవు.



ఆద్రవ్యములు, ప్రసాదాల ఆదాయంతోనే అర్చకులు జీవనం చేసేవారు. రానురానూ ఆలయంలో భక్తులు పెరగడం, ద్రవ్య లాభం పెరుగుతుండటంతో అర్చకులకు మంచి ఆదాయం సమకూరేది. ఇలా ఉండగా శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అర్చక వ్యవస్ధ గురించి ఒక కమీషన్ ను వేశారు.



ఆ కమిషన్ ఇచ్చిన సిఫార్సు ఏమంటే "అర్చకులు వంశపారంపర్య హక్కు ద్వారా, వారికుటుంబాలవారే అర్చకులుగా ఉంటున్నారు.. ఇది తప్పు! ఆలయాలలో అర్చకులకు జీతభత్యాలు ఇచ్చి, అక్కడ ద్రవ్య ఆదాయం తీసివేయాలి!" అని సిఫార్సు చేశారు.



ఆ సిఫార్సుని పరగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అర్చకులకు వంశపారంపర్య హక్కు తీసివేసి, ద్రవ్యఆదాయం స్థానంలో జీతాలు ఇస్తామన్నారు. ఇది తిరుమలకు మాత్రమేకాదు- రాష్ట్రవ్యాప్తంగా వర్తించినది. అప్పుడు అర్చకులు వారి వాదన ఇలా వినిపించారు.



"ఈ నిర్ణయమ్ వలన దేవాలయాన్ని నమ్ముకొని కొన్నితరాలుగా మనది అదేవృత్తి అని చిన్ననాటి నుండి ఈ శాస్త్రాన్ని గుడిని నమ్ముకున్న వారికి, తమ తదనంతరం, ఈ అర్చకత్వం మన అబ్బాయికి రాదు అనిఅంటే, మరి ఆలయాలను ఎవరు చూస్తారు?



ప్రతిఒక్క ఆలయ సంప్రదాయాలు ఎలా కాపాడబడతాయి? పురాతన ఆలయాలలో ఉన్న అనేక కట్టుబాట్లు ఎవరు అర్థం చేసుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి? తిరుమల ఆలయానికి అయితే రాబడివస్తుంది కాబట్టి జీతాలు ఇస్తారు.



 కానీ మిగిలిన ఆలయాలకు జీతాలు ఎలా ఇస్తారు?" ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తారు కానీ ప్రభుత్వ నిర్ణయం మారలేదు. దానితో తిరుమల అర్చకులు కోర్టుమెట్లు ఎక్కారు. 1987నుండి 1996 వరకు (9సంవత్సరాల కాలం) కోర్టులో కేసు జరిగింది. ఈ 9సంవత్సరాలు టీ.టీ.డీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులుగా ఉన్నారు.



హుండీ డబ్బు ఖర్చుపెట్టి, దర్జాగా ప్రభుత్వ లాయర్లు వాదించారు. ఈ 9సంవత్సరాలు తిరుమల అర్చకులు ద్రవ్యఆదాయాన్ని తీసుకుంటూనే ఉన్నారు.



1996 లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ "వంశ పారంపర్య హక్కు అర్చకులకు లేదని, కానీ ప్రస్తుతం ఉన్నవారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని, వారికి ద్రవ్య ఆదాయం మినహా అన్ని గౌరవమర్యాదలు ఇవ్వాలని, ఆగమకైంకర్యాలు వారు చెప్పినట్లే నిర్వహించాలని" సూచించారు. దానితో అర్చకకుటుంబాలకు నిరాశ ఎదురైంది. దానినే మిరాశీవ్యవస్థ రద్దుగా చెప్తారు.



 రోజురోజుకూ కేసు ప్రభుత్వం వైపు మొగ్గుతూండడంతో, ఎంతోమంది లాయర్లు చక్కగా అర్చకుల దగ్గర డబ్బులు స్వాహాచేయడం జరిగిపోయింది కానీ, ప్రయోజనం దక్కలేదు.



దీనివల్ల తిరుమల అర్చకులమాట ఎలాఉన్నా, మిగిలిన దేవాలయాల అర్చకుల పిల్లలు ఎవరూ ఆగమశాస్త్ర అధ్యయనం చేయడం మానేశారు. మనకు ఆలయం లేనప్పుడు, అన్నం దొరకాలంటే వేరొక వృత్తి చేయాలికదా! అని ఇతర లౌకిక విద్యలకు వెళ్లిపోయారు.



చాలా ఆలయాలు అర్చకులులేక మూతపడ్డాయి. టీ.టీ.డీవారు ఇంతటితో వదలక, కేసుజరుగుతున్న రోజులలో ద్రవ్యఆదాయాన్ని అర్చకులు తీసుకున్నారు గనుక, దానిని తిరిగికట్టాలని కోర్టులో కేసువేసి గెలిచారు.



దానితో అప్పటినుండీ, అర్చకులకు సంబంధించిన నలుగురి ఇళ్ళు తనఖాపెట్టుకొని, వారికి ఇచ్చే జీతంలో ప్రతినెలా డబ్బు పట్టుకొని (మినహాయించుకుని) మరీ ఇస్తున్నారు. ఇప్పటికీ 9మంది అర్చకుల జీతంలో ఈడబ్బు కట్ అవుతుంది.



సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అప్పుడు ఉన్న అర్చకులను తీసివేయకూడదు. అలాగే వారు చెప్పినట్లే కైంకర్యాలు నిర్వహించాలి.



వారి గౌరవం వారికి ఉండాలి అని చెప్పినందున ఆతీర్పు వచ్చేనాటికి ఎంతమంది దేవాలయంలో పనిచేస్తున్నారో వారిని టీటీడీ తమ ఉద్యోగులలాగా భావిస్తూ జీతాలు ఇవ్వడం ప్రారంభించింది.



శ్రీరాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, వంశపారంపర్య హక్కుకు సంబంధించి ఎండోమెంట్లో ఒక జీ.వో తెచ్చారు. దాని సారాంశం ఏమంటే- పూర్వమునుండి దేవాలయాన్ని నమ్ముకున్న అర్చక కుటుంబాలలో సమర్థులైన (అంటే) ఆగమ శాస్త్రాన్ని చదువుకున్న వారసులు ఉంటే, ఇప్పుడు వారు చేస్తున్న అర్చక ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇవ్వమని సిఫార్సు చేయవచ్చు.



అతను సక్రమంగా చదువుకొని ఉంటే, ఆఉద్యోగం అతనికే ఇవ్వాలి అన్నారు. దానివల్ల తిరిగి అర్చక కుటుంబాలలో మళ్ళీ ఆగమశాస్త్ర అధ్యయనం జరగడంకూడా కొంత పెరిగింది.



శుభపరిణామం అని అందరూ సంతోషించారు. 2010లో శ్రీకృష్ణారావు గారు తిరుమల మరియు గోవిందరాజస్వామి అర్చకుల జీతాలను కొంతమందికి ₹33000 చేసి పుణ్యం కట్టుకున్నారు. అప్పటిదాకా ₹8000 మాత్రమే ఉండేది.



 ఇప్పటికి టీ.టీ.డీ లో పనిచేసే 350మంది అర్చకుల జీతం ₹17000 మాత్రమే. ఇది ఇలా ఉండగా, 1999లోనే అర్చకులు సుప్రీంకోర్టు 3జడ్జీల బెంచికి కేసు పునఃపరిశీలనకు అడిగారు. 3 జడ్జీల బెంచ్ దానిని విచారణకు స్వీకరించింది.



2012 దాకా దాని విచారణ కొనసాగుతూనే ఉంది. 2012లో సుబ్రమణ్యం గారు ఈ.ఓ గా ఉండగా, "మీకు మంచి జీతాలు ఇస్తున్నాం గౌరవంగా చూస్తున్నాం! మీతరువాత యోగ్యులైన మీకుమారులకు కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కదా!



 మరి మీరెందుకు ఇంకా కేసు వాదిస్తారు? వెనక్కి తీసుకోమని" కోరారు. దానితో అర్చకులు కేసు వెనక్కి తీసుకున్నారు. కానీ జడ్జిగారు అడిగారు- "మీకు అన్ని మర్యాదలు జరుగుతున్నాయా?



మీ కుమారులకు అర్చకత్వం ఇస్తున్నారా? ఒకవేళ మీకు ఎక్కడ అన్యాయం జరిగినా నేరుగా 3బెంచి జడ్జీల దగ్గరకు రావచ్చ"ని చెప్పి, కేసు వెనక్కు ఇచ్చారు.



సాధారణంగా ఒకకేసు లో ఎవరూ అలా అనరు కానీ ఇప్పటికీ అర్చకుల హక్కులైన ఆలయ కైంకర్యాల నిర్వహణ, ఉత్సవాల నిర్వహణ, వంశ పారంపర్య హక్కు ద్వారా గల మర్యాదలు, అర్చకులకు ఉండాలని సుప్రీం కోర్టు చెప్పింది.



వంశపారంపర్య హక్కు గురించి కూడా మేము చదివాము అది తీసివేయడం వల్ల వచ్చిన పరిణామాలు కూడా బాగులేవని సుప్రీం కోర్టు అన్నారు.



తరువాత కేసు ఆగిపోయింది కానీ చిలుకూరు దేవాలయం అయ్యవారు శ్రీ సౌందరరాజన్ గారు వేరొక కేసువేసి దీని గురించి పోరాడుతూనే ఉన్నారు.



ఇంకొక కేసు అయిన చిదంబరం గుడి అర్చకులకేసులో 2016లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ- "ఆగమశాస్త్రాలనుఅనుసరించి మాత్రమే, ఆలయాలలో అర్చక నియామకం ఉండాలి- ఎవరిని కావాలంటే వారిని నియమించకూడదని" అన్నది.



 మొత్తానికి తిరుమల అర్చకులకేసు సుప్రీంకోర్టు నుండి బయట పడ్డాక, అధికారుల రాక్షస క్రీడ ప్రారంభమైనది. ఆలయం లోపలి అన్నివిషయాలలో అధికారుల హవా మొదలైనది.



 భక్తులరద్దీ సాకుగా కైంకర్యాలు వేళలు మార్చడం, స్వామివారికి ఏ ఆభరణాలు అలంకరించాలి? బ్రహ్మోత్సవాలు ఎవరు చేయాలి? పవిత్రోత్సవాలు ఎవరుచేయాలి? ఇటువంటి ఎన్నో ఆగమపరమైన నిర్ణయాలను అవగాహనారాహిత్యం తో తీసుకున్నారు.



ప్రధాన అర్చకులు వ్యతిరేకించినా లెక్కపెట్టలేదు. ప్రస్తుతం తిరుమలలో అర్చకుల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన పరిస్తితి ఉంది.



మిరాశీ అర్చకులు మా కుమారులు ఉన్నారు కదా? వారిని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ వారు ఒప్పుకోలేదు. జి.ఓ. ప్రకారం మీరు టీటీడీ ఎంప్లాయిస్ గా ఉంటే, మీకు మేము స్కెలు జీతం ఇచ్చి, అప్పుడు మీరు 65 ఏళ్ళు వచ్చాక విరమణ చేస్తే ఇస్తాము, లేకపోతే లేదు అన్నారు.




మేము ఉద్యోగులం కాదు, గౌరవస్తానంలో ఉండే అర్చకులము, మాకు ఇచ్చే డబ్బుని జీతం అనవద్దు- సంభావన ఆనండి. మాకు ఇది ఉద్యోగం కాదు - ఇది ఒక బాధ్యత మాకు - మీ రూల్స్ ఎలా పెడతారు? అని అడిగి, హైకోర్టులో వేశారు.



హైకోర్ట్ తీర్పుచెప్తూ, మిరాశీ అర్చకుల కుమారులను వెంటనే విధులలోకి తీసుకోవాలని, సుప్రీంకోర్టు వారికి ఆ విధమైన సౌకర్యాలు ఇచ్చిందని, కైంకర్యాలు ఉత్సవాలు వారు చెప్పినట్టే చేయాలని వారి గౌరవం కాపాడాలని మళ్ళీ తీర్పు ఇచ్చింది.



ఇలా ఉండగా, అధికారగణం మెల్లగా ఆ అర్చక వర్గాలలో చీలిక తెచ్చింది. మీకు మీరు చేరినప్పటి నుండీ స్కేలు జీతం ఇస్తాము, మీరు 65 ఏళ్ళ వరకు ఉద్యోగం చేయొచ్చు.



తరువాత మీ పిల్లలు ఉంటే, వారికి ఇస్తాము కదా! మీకు ఒక 20లక్షలు అరియర్స్ వస్తాయి. రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది ఎందుకు మీకీ హక్కులు? వీటివల్ల మీకు ఏమి ఒరిగిందీ?? దేవుడికి జరిగేది జరుగుతుందీ.. ఎవరో ఒకరు చూస్తారూ.. ఇలాంటి మాయ మాటలు చెప్పి అర్చకులలో ఒక వర్గాన్ని ఉద్యోగులుగా మార్చడానికి రంగం సిద్ధం చేసింది.




దీని వల్ల బాధ ఏమిటంటే, ఎప్పుడైతే అర్చకుడు ఉద్యోగిగా మారతాడో, అపుడతను తనకన్నా ఎక్కువ జీతం తీసుకునే ప్రతిఒక్కరికీ అతను సబ్-ఆర్డినెట్ అవుతాడు.



సర్వీస్ రూల్స్ ప్రకారం తిరుపతిలోని అర్చకులను బొంబాయికి, ఢిల్లీకి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు! వారు చెప్పినది వినక పోతే ఏమైనా చేయొచ్చు!!. కైంకర్యాలు వారు చెప్పినట్టు చేయాలి..



 ఉత్సవాలు వాళ్లు చెప్పినట్టు చేయాలి.. మొత్తం అధికారుల చేతులలోకి వెళ్ళి పోతుంది. అప్పుడు ఈ రాజకీయ నాయకులు, దొంగలు, ఆఫీసర్ చేతికి మొత్తం వెళ్ళిపోతే, ఇప్పటికే కొన్ని దేవాలయాలు ఏరకంగా ఎండోమెంట్ వారు నాశనం చేస్తున్నారో చూస్తున్నాం కదా!



అదే గతి మన తిరుమలకూ, పట్టబోతోంది.. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఆలయ కైంకర్యాలూ, అర్చకుల విషయంలో అధికార జోక్యం ఎంతప్రమాదమో గుర్తించిన రమణదీక్షితులు గారు ఎదురు తిరిగారు.



తరువాత ఎం జరుగుతోందో మీకు తెలుసు !!



ధర్మో రక్షతి రక్షితః



$$$$$$$$$$$$$$$$$

No comments:

Post a Comment

Total Pageviews