“ఇంతకీ స్మశానానికెళతాడా?" చంద్రిక ఉత్సాహంగా అడుగుతోంది.
“ఏఁవోమరి? వచ్చీవారం వెళ్తాడేమో?" అంటూ నిట్టూర్పు విడిచింది రాజ్యలక్ష్మి.
“ఏఁవోమరి? వచ్చీవారం వెళ్తాడేమో?" అంటూ నిట్టూర్పు విడిచింది రాజ్యలక్ష్మి.
వింటున్న నాకు ఒళ్ళు జలదరించింది. ‘ఎవరా స్మశానానికెళ్ళేవాడు?'
అడగాలంటే సిగ్గు. క్లాస్‌మేట్ అమ్మాయిల్తో మాట్లాడటం చాలా తక్కువ. పాపం వాళ్ళు బానేవుంటారు చనువుగా. మనకే చొరవ తక్కువ.
అడగాలంటే సిగ్గు. క్లాస్‌మేట్ అమ్మాయిల్తో మాట్లాడటం చాలా తక్కువ. పాపం వాళ్ళు బానేవుంటారు చనువుగా. మనకే చొరవ తక్కువ.
వెంకటపతిరాజుగాణ్ణడిగాను. పెద్ద నవ్వు నవ్వేసి “ఎవరా ఇద్దరూ?" అన్నాడు డిటెక్టివ్ యుగంధర్లా.
నేను చెప్పగానే మళ్ళీ నవ్వడం మొదలెట్టాడు.
నాకు ఉడుకుమోత్తనం వచ్చింది.
“నాతోరా!" అంటూ బయల్దేరాడు. నేను విభాండకుడి వెనక ఋష్యశృంగుళ్ళా పరిగెట్టాను.
నాకు ఉడుకుమోత్తనం వచ్చింది.
“నాతోరా!" అంటూ బయల్దేరాడు. నేను విభాండకుడి వెనక ఋష్యశృంగుళ్ళా పరిగెట్టాను.
రెండంతస్తులూ ఎక్కి సరిగ్గా లైబ్రరీముందు ఆగాడు. “లోపలికిరా! ఇక్కడాగిపోతావేం?" అని చిట్టచివరి బల్లవేపు చూపించాడు.
చంద్రిక, రాజ్యలక్ష్మి చెరో వారపత్రికా పట్టుకుని పరీక్షగా పరీక్షలకి చదువుతున్నట్టు చదివేస్తున్నారు.
“వాళ్ళకదేపని. వచ్చిన పుస్తకం వచ్చిన వెంటనే వూదేస్తారు. అదేదో సీరియల్ విషయమై వుంటుంది. నువు సీరియస్ గా తీసుకున్నావ్! ఇప్పుడే తేల్చేస్తాను!" అన్నాడు.
“రాజీ! ఈవారందేనా భూమి?" అన్నాడు చనువుగా పేజీలు తిరగేస్తూ.
“లేదు రాజూ! ఇంకారాలేదు. ఛస్తున్నాం సస్పెన్సుతో! చందూ కూడా అడిగింది..వాళ్ళ చిన్నాన్నకి ప్రెస్‌లో తెలిసినవాళ్ళున్నార్ట! ఈసారి నాల్రోజులు లేటౌటుతుందిట!" అసహనంగావుంది ఆగొంతు.
“ఏ సీరియలేం?" అనడిగాడో లేదో
“ ‘తులసి' రాజూ! యండమూరిది. నువ్వు చదవ్వా?" అంది అదేదో ఆందరూ పారాయణ చెయ్యాల్సిన గ్రంథఁవన్నట్టు!
“మనకవేమీ ఎక్కవులే! ఇదిగో, వీడికోసం వచ్చాను. ఓ..లైబ్రరీ అంటే ఇదా? పెద్దదే!" అన్నాడు నాలుగువైపులా చూస్తూ.
వాడెప్పుడూ ఎంటరవని ప్రదేశాల్లో అదొకటి.
వాడెప్పుడూ ఎంటరవని ప్రదేశాల్లో అదొకటి.
ఈ సంఘటన తరవాత నా జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయని ఆక్షణం నాకు తెలీదు. వాళ్ళిద్దర్నేకాదు..ఇంకా చాలమందిని కుదిపిపడేస్తున్న ఆయన సంగతేఁవిటో తెలుసుకుని తీరాలని నేను నిర్ణయించుకున్న క్షణమది.
తులసి, అభిలాష, డబ్బు టుది పవరాఫ్ డబ్బు, అష్టావక్ర, మరణమృదంగం.... ఇలా వచ్చిన ప్రతీ సీరియలూ చదివేసేవాళ్ళం.
అప్పట్లో మావీధి చివర లక్ష్మణ్రావుగారికి ప్రభ వీక్లీ వచ్చేది. అందులో కొండముది శ్రీరామచంద్రమూర్తి గారి ‘సిరిమువ్వల మరుసవ్వడి', చివుకుల పురుషోత్తంగారి ‘మూడో పురుషార్థం', కొమ్మనాపల్లి నవలలు....ఇలా ఒకటేమిటి అన్నిరకాలూ చదివిపారేసేవాణ్ణి. ఇక మన ఫేవరెట్ రచయితైతే కొమ్మూరి సాంబశివరావుగారే!
మొదలెడితే వదలబుద్ధెయ్యదు ఆశైలి. డిటెక్టివ్ యుగంధరూ, ఆయన అసిస్టెంటు రాజూ మన ఇంట్లోవాళ్ళే అనిపిస్తారు. ఆయన పదజాలం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. బాత్రూమ్ అనడానికి నీళ్ళగది; తువ్వాల, ఎలికెలు, ఇడ్డెన్లు, వదినె.... ఇలా కొంచెం చిత్రమైన పదాలన్నీ కనబడతాయి ఆయన నవలల్లో.
వారి నవలల్లో ‘అనామకుడి హత్య' అనేది నాకు చాలాయిష్టం. కార్పస్ డిలెక్టిని ఆధారం చేసుకుని రాసిన ఆనవలని తరవాత మరో ప్రముఖ రచయిత కాపీకొట్టి మళ్ళీ రాయడం, దాన్ని సినిమా తియ్యడం కూడా జరిగాయి.
ఇక పుస్తకాలు అద్దెకిచ్చే వెంకట్రావుకి నానించి చాలా ఆదాయమే వచ్చేది. యద్దనపూడి నవలలన్నీ నాలుగురోజుల్లో ఊదిపడేశాను.
కీర్తకిరీటాలు చదివారా? అంగవైకల్యం వున్నవారికి మంచి ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. మంచి శైలి, భావోద్వేగాలు..వెరసి అద్భుతమైన కళాత్మక రచన!
ఆవిడ ఖ్యాతిని చూసి వాతలు పెట్టుకున్న రచయిత్రులు కొందరు ఇలావచ్చి అలా వెళిపోయారు.
ఇక మెడిసిన్లోకొచ్చాకా కొడవటిగంటి గురించి విన్నాను. ముందు ‘చదువు'తో మొదలెట్టాను..మరి ఆయన నా అభిమాన రచయితై కూర్చున్నాడు. ఆయనంత నిరాడంబరంగా రాసే రచయితని ఇప్పటికీ చూళ్ళేదు.
బుచ్చిబాబు చివరకు మిగిలేదితో జీవితంలో నిజమైన విషాదమంటే ఏమిటో తెలిసింది.
గోపీచంద్ శిథిలాలయం చదివితే ఈర్ష్యాసూయలు మనిషిని ఎంత దిగజారుస్తాయో అర్ధమైంది.
కేశవరెడ్డి, చలం, వివిన మూర్తి...ఒకరేమిటి అందరూ ఆకట్టుకున్నారు.
శ్రీరమణ మిథునం నాజీవితంలో మైలురాయి. చేసిందీ, చూసిందే రాయడం, నిజాయితీగా, నిజాన్ని వ్యక్తపరచడం ఆయన గొప్పతనం.
అమరావతి కథలైతే మనల్ని ఎత్తుకుని ఆవూరి తిరణాలకు తీసికెళతాయి. అలుపెరుగని ఆ ప్రయాణం అవకూడదనిపిస్తుంది.
ఇల్లేరమ్మని పరిచయం చేసిన నా క్లాస్‌మేట్ ఉషారాణికి ఎప్పుడూ ఋణపడివుంటాను. అది నిజంగానే మాయింట అభి‘మతగ్రంధం'లా మారిపోయింది. శ్రీమతి సోమరాజు సుశీలమ్మగారే రాసిన ‘దీపశిఖ' కూడా నిత్యం వెలుగుతూ వుంటుంది మాయింట!
బానేవుంది సంబడం...ఇంతమంది గురించి చెప్పి మల్లాదిని వదిలేసాడేఁవిటీ వీడూ అననుకుంటున్నారని నాకు తెలుసు. చెప్పొద్దూ..నాకాయన రచనలు నచ్చవు. ఎందుకో తెలీదు. ఇరవైపైనే చదివాను. అయినాసరే... అంతే!
ఇక మహాప్రస్థానాలు, అమృతం కురిసిన రాత్రులు, ఖడ్గసృష్టీ, కృష్ణశాస్త్రీ....ఇవన్నీ కవిత్వాలు! ఇదేదో మాయాబజార్లో డైలాగులా వుందికదూ?😜
రేడియో భాషను నేర్పిస్తే, రచయితలు భావాల్ని పలికించడం నేర్పారు. టీవీలో రోజారాణి, విజయదుర్గ, శాంతిస్వరూప్...అందరినీ మించి ఓలేటి పార్వతీశంగారు...వీళ్ళంతా వేలుపట్టి నడిపించారు ఉచ్ఛమైన ఉచ్చారణ వైపు!
తెలుగు చదవండి! తెలుగు మాట్లాడండి!! తెలుగు భాషను గౌరవించండి!!!
గౌరవించేవారినీ గౌరవించండి.
...........జగదీశ్ కొచ్చెర్లకోట
No comments:
Post a Comment