Wednesday, September 30, 2020

"నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి" ప్రేమికుడు అన్నవాడు తప్పకుండా విని తీరవలసిన పాట

"నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి"

ప్రేమికుడు అన్నవాడు తప్పకుండా విని తీరవలసిన పాట
1978 విడుదలైన ఇంద్ర ధనుస్సు చిత్రం కోసం
మనసుకవి మన సుకవి ఆచార్య ఆత్రేయ రాసిన
ఈ అధ్బుత భావుక ప్రేమ గీతం కె.వి. మహదేవన్
గారి స్వరకల్పనలో బాలు గారు ఒలికించిన
ఆ ప్రేమ తన్మయత్వానికి లోనవ్వని ప్రేమికుడు
వుండడేమో ఒక వేళ వుంటే వాడు ప్రేమికుడు కాడేమో
ఆ పల్లవి లోనే ఎత్తుగడ
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని....
ఆ మొదటి చరణం లో "తలుపు మూసిన తలవాకిటిలో పగలు రేయి నిలుచున్నా"
"తలవాకిలి" ఒక చక్కని అభివ్యక్తికి ఎంచక్కని పదం
ఇంత చక్కని పదాలను, పదబంధాలను నేడు మనం
ఎంత దూరం చేసుకుంటున్నాం? ఎంత చక్కని తెలుగును కోల్పోతున్నాం?
కనీసం ఇటువంటి మాటలు విని అర్ధం చేసుకుందుకైనా
తెలుగు నెర్చుకోవాలి, భావి తెలుగు నేర్పించాలి
అయ్యో ఇంకా మొదటి చరణంలోనే ఉండిపోయాం
"పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా"
ఒక భగ్న ప్రేమికుని హృదయ స్థితిని అర్థం చేసుకుంటే
ప్రేమోన్మాదం, యాసిడ్ దాడులు ఉండవు
"తలుపు మూసిన తలవాకిటిలో పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా"
నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని...
ఇక రెండో చరణంలో
పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షనూ పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని...
దోసిలి ఒగ్గాను, ఎడదను పరిచాను ఎదలో సవ్వడి లేపే పదాలు
ఇక మూడో చరణంలో
పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
రోజులు గడచి పొతూనే ఉన్నాయి అని
చెప్పడంలో ఎంత అమాయకత, ఎంత భావుకత
సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలునని
నీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను
నివురైపోతాను అన్న దానికి అర్ధం నివురుగప్పిన నిప్పు అంటారే బూడిద అన్నమాట

ఈ యూట్యూబ్‌ లింకుల్లో


https://www.youtube.com/watch?v=zICpJBzMJaQ

స్వరాభిషేకంలో బాలుగారు ఆ పాట పాడుతూ

పంచుకున్న జ్నాపకాలు చూసి ఆనందించండి.


https://www.youtube.com/watch?v=rZgGkbRPtcQ

సినిమాలో పాట చూసి ఆనందించండి.

ఒక మహనీయుని మహాభినిష్క్రమణం తర్వాత కేవలం జయంతులకు, వర్ధంతులకు పరిమితం కాకుండా వారి జ్నాపకాలను వారి ఘనకార్యాలను ప్రతినిత్యం ఇలా గుర్తుచేసుకుందాం అదే నిజమైన నివాళి! సత్యసాయి విస్సా ఫౌండేషన్‌




No comments:

Post a Comment

Total Pageviews