"అనేక శత భాండాని భిన్నాని మమ మస్తకే" దీనికొక కథవుంది.
పూర్వం ఒకగురువు దగ్గర శిషులు చదువుకునేవారు. ఆ గురువుగారి భార్య పరమ గయ్యాళి .గురువునెప్పుడూ తిడుతూ వుండేది. ఇలా గురువుగారిని ఆవిడ తిట్టడం ఒక శిష్యునికి నచ్చలేదు. వాడు గురువు దగ్గరికెళ్లి గురువుగారూ మీరు మహా జ్ఞాని కదా! మీ భార్యని అంత మాత్రం అదుపు చేయలేరా? అని అడిగాడు.ఆయన చిరునవ్వు నవ్వి యిలా అన్నాడు. నీకూ పెళ్ళయితే తెలుస్తుంది లేరా. అన్నాడు. నేనయితేనా దాన్ని నోరుకూడా తెరవనివ్వను.అంత అదుపులో పెట్టుకుంటాను. అని బీరాలు పలికాడు.గురువు సరేలేరా
అలాగే చేద్దువుగానీ నీకు పెళ్లయ్యాక నేను మీ యింటికి వచ్చి చూస్తాను లే. అన్నాడు.
శిష్యుని చదువు పూర్తయ్యాక వాడు గురువుగారివద్ద సెలవుతీసుకొని తన వూరికి వెళ్ళిపోయాడు.
తరువాత పెళ్లి చేసుకున్నాడు. వాడి భార్య గురువుగారి భార్యకన్నా మహా గయ్యాళి.
వాడేమైనా కోప్పడితే వీధిలోకి వెళ్లి గట్టిగా అరిచి గోల చేసేది. దానితో వీధిలోని వాళ్ళముందు శిష్యుడికి తలా కొట్టేసినట్లుండేది. తరువాత ఆమెని ఏమీ అనకుండా ఆమె ఏమన్నా భరించేవాడు.లేకుంటే పరువు తీసేస్తుందని భయం.
ఇదిలా వుండగా ఒకరోజు అతని గురువు గారు రేపు మీ యింటికి వస్తున్నానని కబురు చేశాడు. శిష్యుడి గుండె లో రాయి పడింది. ఎలాగయినా గురువుగారి ముందు పరువు కాపాడుకోవాలనుకొన్నాడు. భార్యాదగ్గరికెళ్ళి ప్రేమగా ఏమే! మా గురువుగారు రేపు భోజనానికి వస్తున్నారు. వంట నేనే చేస్తానులే. నీవు వడ్డించు చాలు దయచేసి నీవు మాత్రం నేనేమన్నా
ఆయన ఉన్నంత సేపూ కాస్త ఎదురు చెప్పకుండా వుండు. అని బ్రతిమాలాడాడు. దానికి ఆవిడ ఏ కళనుందో ఒప్పుకుంది కానీ నీవు నూరు తిట్లు తిట్టేవరకూ మాత్రమే వూరుకుంటాను.
దానిపైన ఒక తిట్టు తిట్టినా సహించేది లేదు అని షరతు పెట్టింది. శిష్యుడు తాను ఒప్పుకుందే చాలునని సంతోష పడిపోయాడు.
మరునాడు గురువుగారు వచ్చారు. శిష్యుడు ఏమే యిలారా!బుద్దుందా? గురువుగారొచ్చారు కాళ్లకు నీళ్లివ్వాలని తెలీదా? నీళ్ళుతీసుకొనిరా అని గద్దించాడు.ఆవిడ మారు మాట్లాడకుండా
నీళ్లు తెచ్చి యిచ్చింది. ఒక తిట్టు తిడుతూ త్వరగా పీట వేసి ఆకు వేసి వడ్డించు అని గద్దించాడు అప్పటినుండీ శిష్యుడు రెచ్చిపోయాడు.సందు దొరికింది కదా అని తిట్ల పురాణం విప్పాడు. ప్రతిదానికీ తప్పు పడుతూ తిడుతున్నాడు.అతని భార్య తెలివైంది నూరు చింతగింజలు పెట్టుకొని ఒక్కోతిట్టుకూ ఒకో గింజ బయటికి విసిరివేస్తూ వుంది.
గురువుగారు భోజనానికి కూర్చున్నారు ఆయనకు చాలా ఆశ్చర్యంగా వుంది.వీడు భార్యను బాగానే అదుపులో పెట్టుకున్నట్టున్నాడు. అనుకుంటూ.ఆవిడ వడ్ఢదించేంతవరకూ
ఏదో ఒకటి అంటూనే వున్నాడు. గురువుగారికి పులుసు మారు వెయ్యవే అంటూ మరో తిట్టు తిట్టాడు. అప్పటికి నూరు తిట్లూ పూర్తయ్యాయి. ఆవిడ కోపంగావేడి వేడి పులుసుకుండ తెచ్చిగురువుగారి నెత్తిన వేసింది. కుండ పగిలి వేడి పుసు గురువు మీద పడింది. ఆయన కేకలువేస్తూ పెరట్లోకి పరిగెత్తి అక్కడి తోటలోని నీళ్లు గుమ్మరించు కున్నాడు.ఆమ్మో మంట,మంట అని అరుస్తూ వున్నాడు.గబగబా లోపలి కి వచ్చి సంచీలోనుండి యింకో పంచె తీసి కట్టుకొని వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు.
అంతలో శిష్యుడి భార్య పరిగెత్తుకుంటూ వచ్చి ఓ అయ్యో అలా వెళ్ళిపోతే ఎలాగయ్యా?
పగిలిపోయిన కుండ డబ్బులిచ్చి మరీ కదులు అని గద్దించింది.అప్పుడు గురువు ఈశ్లోకం చెప్పాడు.
అనేక శతభా౦డాని భిన్నాని మమ మస్తకే
అహో గుణవతీ భార్యా భా౦డ మూల్యం న యాచతే
నా నెత్తిన ఇలాంటి కుండలు వందలు పగిలాయి. కానీ నాభార్య ఎంత గుణవతి ఒకసారికూడా పగిలిన కుండ డబ్బులిమ్మని అడగలేదు.
------------------------ శుభరాత్రి ----------------------
No comments:
Post a Comment