Wednesday, September 30, 2020

 మిత్రమా కుశలమా! 

జీవితంలో ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా 

ఎక్కడో ఉన్న బాల్య స్నేహితుడి ఫోన్ నంబరు సంపాదించి... 

పలకరించిన ఆనంద సంపద ముందు అవన్నీ దిగదుడుపే 

అలాంటి చిన్ననాటి చందమామ బాలమిత్రులలో నువ్వొకరు మిత్రమా 

నీలాంటి వారికి ఈ చిరు కవితాచందన అభివందనం 


జీవితపు తీపి సంతకం! మరువని జ్ఞాపక సంకేతం!

ఇరుగింట్లో, పొరుగింట్లో, బడిలో, గుడిలో

శ్రీరామ నవమి, చవితి పందిట్లో నాలుగుస్తంభాలాట 

నేలా-బండా ... మాష్టారింట్లో  కోడిగుడ్డు దీపం వెలుతుర్లో

సవర్ణదీర్ఘాది సంధులు, పైథాగరస్ సూత్రాల వల్లెల్లో సందుల్లో గొందుల్లో గోలీ బొంగరాల ఆటలు 

పుస్తకాల్లో నెమలీక పంపకాలు అలకలు ఆనందాలు

గుడి మైకులో గీతాలు కొమ్మల్లో కోతికొమ్మచ్చి, తొక్కుడు బిళ్ళాటలో

వయ్యారి బొమ్మల్లో, ఒప్పులకుప్పల్లో, చెమ్మచెక్కల్లో

అమ్మ ఇచ్చిన పప్పుచెక్కల్లో పంచుకున్న కాకెంగిలి 

శివరాత్రి జాగరణలో, అట్లతద్ది దాగుడుమూతలాటల్లో

నెల పట్టిన సంక్రాంతి ముగ్గుల్లో, గొబ్బి తట్టే వేళల్లో

వినాయకుడికి పత్రి కోసే వేళల్లో

అమ్మ పూజకి నందివర్ధనాల్ని ఎంచే వేళల్లో

పరీక్ష ముందు భయంలో పరీక్షలయిపోయిన సంబరంలో

వేసవి శలవుల్లో దొంగా-పోలీసు అయిన వైనాల్లో

మల్లెపూల జడల మురిపాల్లో, మొగలిరేకుల్లో

యవ్వనపు తొలిరోజుల చిరు రహస్యాలలో

మలి నాళ్ల భావోద్రేకాల్లో

ఎండల్లో, వానల్లో, చలిలో

మబ్బులు ముసురు పట్టిన వేళల్లో

రాత్రి లో, పగటిలో, కష్టం లో, సుఖం లో

ఎప్పుడూ నాతోనే వుండే చిరుజ్ఞాపకం సంకేతం!

జీవితపు తీపి సంతకం!!  

No comments:

Post a Comment

Total Pageviews