Monday, September 28, 2020

ఇదేబావులేదయ్యా! బాలూ గారూ

 తెలుగోడి గోడు!! ( SekaraNa )


అమ్మయ్యా...

ఇక భాష గురించి వెంటబడే వారు లేరులెండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు.  మాటని పాటని చింపి పోగులు పెట్టుకోవచ్చు.  

'నోరు తిరిగాలి', 'గొంతులో ప్రతీ అక్షరం పలకాలి'.. అంటూ సలహాలు ఉండవు.  'ఈ మాటకి అర్ధం తెలుసా', 'ఈ పదం ఎంత బావుందో', 'ఇంకో కవి రాయగలడా', ఎక్కడ్నుంచి తెస్తారండీ భావుకత' .. అంటూ మాట్లాడే గొంతుక వినబడదు.  'పదహారణాల తెలుగు పిల్లలా ముచ్చటగా ఉన్నావు.  'తెలుగుదనం ఉట్టిపడింది.. నీ గోంతులా'  అంటూ వంద కేజీల అభిమానాన్ని ఒలకబోసే అప్యాయత మాటలు పిల్లలకి ఉండవు.  

అసలు..  ఏ ఇంట్లో చూసిన.. ఎదో మాట, పాట టివిలోనో, రేడియోలోనో, ట్యూపుల్లో, అరచేతుల్లోనో  వినబడుతూ ఉండొచ్చు. వింటూ ఉండొచ్చు.    కాని అచ్చంగా మన వెంటా,  అదృశ్యంగా తిరిగే నిత్యనూతన నవయవ్వన గందర్వుడు కనపబడడు.  'అబ్బా.. ఇవాళ మిస్ అయ్యాను' అనే మాట ఇక శాశ్వతమై పోయింది. 

'మేం తెలుగు వాళ్లమని' (ఆయన అన్నట్టు) ఘ..ర్వ..ం గా చెప్పడానికి ఓ గొంతు ఉండేదని మనం చరిత్రలో రాసుకోవచ్చు.  ఒకటా.. రెండా..ఎన్ని వ్యసనాలు అలవాటు చేసిసారండి బాబు!  పాటలు వినడం, మాటలు వినడం,  ఆయన ఉర్లోకొస్తే..  టై కట్టుకున్న వాడి దగ్గర్నుంచి, ఆటో నడిపేవాడి వరకు ఎగేసుకుని ఆయన్ని చూడ్డానికి, వినడానికి వెళ్లడం, చెవులు సాగదిసుకుని మరీ మైమరచిపోవడం, భళ్లున నవ్వి చేతులు చరుచుకోవాడం.. ఇలా అడ్డమైన అలవాట్లు చేసేసి, మన కొంప కొల్లేరు చేసి వెళ్లిపోయాడు.  పైపెచ్చు మన ఇంట్లో, వంట్లో తిష్ఠ వేసేసి 'నేను త్యరగా వస్తాను లెండి!  ఫోన్లు చేయకండి!' అంటూ అందరికి  'చెయ్యి'  ఇచ్చి, పారిపోయాడు. 

ఎంత ఇబ్బంది పెట్టిసారండి బాబు. 

లేకపోతే ఏఁవిటండి.. 

.. ఆయనకి మన భాష అంటే అంత ఇదా..! ఉండొచ్చు!  అరే.. పాటలు పాడుకోవచ్చుగా.. కబుర్లు చెప్పొచ్చుగా.. ! అబ్బే అలా ఊరుకుంటే ఆయన బాలు ఎలా అయ్యాడు.  పాటలో మాటల్నుంచి, మాటల్లో పాటల వరకు ఒహటే వర్రి అయిపోయాడు. పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు గోరుముద్దలు తినిపించినట్టు ఆ నేర్పడాలు, పదిసార్లు వల్ల వేయించడాలు, టీకా తాత్పర్యాలతో ఆ పాఠాలు ఎందుకు చెప్పండి! మన ఇంట్లో మనతో మాట్లాడినట్టు ఆ హితబోధలు, మంచి చెడ్డా, పాత కొత్త విషయాలు, అనుభవాలు, ఆత్మీయపలుకులు.. ఇవాన్ని అలవాటు చేసేసి, ఇప్పుడు చెప్పా చేయకుండా అలా నిష్కరమిస్తే, ఈ తెలుగుజాతి ఎక్కడికి పోతుంది చెప్పండి! 

ఇప్పటికే.. మన భాషలోని పాట, మాటల్ని చిలక్కోట్లు కొట్టిసి, పట్టుకు పోతున్నారు. అలాంటి టైములో,  టా ఠ్ వీల్లేదు అని అడ్డం పడి బెత్తం పట్టుకునే ఆ మనిషి,  చేసింది ఏఁవైనా బావుందా చెప్పండి! 


ఏఁవిటో ఆయన పిచ్చి గాని, పాటల్లో, మాటల్లో కూడా భాషని గురించి ఒహెటే వర్రీ.. మరీ అంతలా పట్టించుకోవాలా? 

'బాస కాదు.. భాష అనాలి' అని అక్షరాలన్ని బతికించారు.

'అది విసయం కాదమ్మా.. విషయం అని పలకాలి' అంటూ అసలు విషయాలు చెప్పారు.

'పెల్లి కాదయ్యా.. పెళ్ళి.. ళి..ళి.. అనాలి. తెలుగులో ల కి ళ కి తేడా ఉంది.' అంటూ లక్షణంగా పాఠాలు చెప్పారు. 

'శృతి, లయ, గమకాలు, చమకాలు.. అన్నీ పస్ట్ క్లాస్ గా ఉన్నాయి. కాని పాట అర్ధం తెలుసుకుని అది అనుభవించి పాడితే ఇంకా బావుంటుంది' అంటూ చూరకలు వేసి, పాటల భావాలకి పెద్దపీట వేసారు.

"సరే బండి  ఱ ని అటకెక్కించిసారు. కనీసం ఉన్న 'ర' ని   రాసి రంపాన పెట్టకండి." అంటూ తెలుగు మాష్టారిలా అక్షరాలకి ఆయువు పోసారు.

పిల్లల్ని, పెద్దల్ని, తోటి వారిని, పక్కవాళ్లని, ఎక్కడో ఉన్నవాళ్లని, అక్కడే ఉన్నవాళ్లని, రాసిన వారిని, రాస్తున్న వారిని,  వాయించిన వారిని, వాయిస్తున్న వారిని.. అలా పాటకి మాటకి పట్టం కట్టిన ప్రతి ఒక్కరిని మెచ్చుకున్నారు.

ఎదుటివారికి నమస్కారం పెట్టే సంస్కారం, తనని మొసిన బోయిలా పాదాలకు నమస్కారం పెట్టి బుణం తీర్చుకున్నాడు.


పెద్దాయనలా నాలుగు పాటలు పాడి వెళ్లొచ్చుగా.. అబ్బే అలా చేయకుండా పాటలు, మాటలు, నటనలు...ఒకటేమిటి,  ఇలా అన్ని చిందులూ వేసి డెబ్బై ఏళ్ల వయసులో లో కూడా ఇరవై ఏళ్ల 'బాలుడి'గా కోట్లాది కొంపల్లో కూర్చుని, ఒక్కసారిగా లేచి వెళ్లిపోవడం అస్సలు బాలేదు. 


పాట ఉన్నంత వరకు ఆయన మనతో ఉంటారని సరిపెట్టుకోవడం.. జీవితంలో రాజీ పడటమే! 

అసలు రాజీ పడలేని విషయం ఏఁవిటో తెల్సా..

తెలుగు మాటకి, పాటకి.. చివరికి ఒంటరి ఆక్షరానికి కూడా పెద్ద దిక్కు.. అర్దంతరంగా వలస వెళ్లిపోయింది. 

తెలుగు పలుకలకు జీవం పోసే నాధుడు..  వెంటుండి కాపాల కాసే కాపరి .. కాటికి చేరిపోయాడు.

ఆనాధిగా మిగిలిపోయిందనే వేదన అక్షరానికి మిగిలిపోయింది!

చివరిగా ఒక్కమాట..

ఎదుటివారికి నమస్కారం పెట్టే సంస్కారంతో పాటు, తనని మోసిన బోయిలకి సైతం.. పాదాలు తాకి బుణం తీర్చుకున్నారు. కాని తనని మోసిన ఈ ఐదు తరాల బోయిలకు మాత్రం.. చెప్పా చేయకుండా శెలవుచీటి పంపిసారు!

ఇదేం.. బావులేదయ్యా!

ఇది తెలుగోడి గోడు!!


           ... జయంతి ప్రకాశ శర్మ

No comments:

Post a Comment

Total Pageviews