Tuesday, March 6, 2018

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి - 5

'ఆపిల్‌ తినొద్దు' అన్నాడు భగవంతుడు. 'ఎందుకూ?' అన్నాడు మనిషి. 'కారణాలు అడక్కు. ఆపిల్ తినొద్దన్నానంతే' అరిచాడు దేవుడు. ఆయన మాటలు వినకుండా అతడూ, అతడి భార్యా పండు తిన్నారు. కోపమొచ్చిన భగవంతుడు వాళ్ళకు ఒక పాఠం నేర్పాలనుకున్నాడు.
వారికి సంతానాన్ని ఇచ్చాడు.
...
"నేను రాక్షసుల్నీ, భూతాల్నీ పెంచుతున్నానా?" అన్నది మీ ప్రశ్నయితే దానికి సమాధానం… ‘కాదు. నిశ్చయంగా కాదు..!’
ఇంట్లో కుటుంబసభ్యులందరూ మాటిమాటికీ ఆనంద భాష్పాలు తుడుచుకోవటం కేవలం టీ.వీ. అడ్వర్టైజ్మెంట్లలోనే చూస్తాం. ఘర్షణలు లేకుండా ఏ ఇల్లూ ఉండదు. కానీ కొద్ది ప్రయత్నంతో ‘హౌస్’ని ‘హోమ్’ చేసుకోవచ్చు. ప్రేమ ఆప్యాయతలు సిమెంటు ఇసుకలుగా కలిపి పిల్లలకి ‘వ్యక్తిత్వo’ అనే మంచి భవంతిని నిర్మిస్తే, తిరిగి అంతే ప్రేమ వృద్ధాప్యంలో దొరుకుతుంది. బంధం మల్లె తీగలాంటిది. అది పెరిగి పూలు పూయాలంటే మంచి పోషణ కావాలి. పిల్లలు కూడా మంచి వ్యక్తిత్వంతో వికసించాలంటే, వయసుతో బాటు వచ్చే వారి మానసిక పరిణామాల గురించి తెలుసుకుంటూ దానికి తగ్గ పోషణనివ్వాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాo.
1. నమ్మకం / అపనమ్మకం:
పద్దెనిమిది నెలల వయసు వరకూ పిల్లలు ‘నమ్మకం/అపనమ్మకం‘ స్టేజ్లో పెరుగుతారు. తమ అవసరాలన్నీ పెద్దలు తీరుస్తూoటే, చుట్టూ ఉన్న వాళ్ళంతా దయార్ద్ర హృదయులనీ, ప్రపంచమంతా మంచిదనీ నమ్మకం పెంచుకుంటారు. తల్లి ఎలాగూ పక్కనే ఉంటుంది కాబట్టి, తండ్రి కూడా ఎక్కువ సమయం గడిపే కొద్దీ, పిల్లలకి మనుష్యుల పట్ల మరింత సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అలా కాకుండా... పనుల వత్తిడి వల్ల పెద్దలు చంటి పిల్లలని సరిగ్గా చూసుకో లేదనుకుందాం. పసి వయసులోనే ప్రపంచం పట్ల వారికి అపనమ్మకం ఏర్పడుతుంది. ఒక ఉదాహరణ ద్వారా ఇది పరిశీలిద్దాం.
ఇరవై ఏళ్ళ అమ్మాయి తల్లి అయింది. అందం చెడిపోతుందన్న భయంతోనో, ఫేస్బుక్ పిచ్చివల్లనో, చాటింగ్లో పడి పిల్లవాడి పెంపకం పట్టించుకోదు. పాలు కూడా ఇవ్వదు. ఏడ్చిఏడ్చి పిల్లవాడే ఆపాలే తప్ప ఆపాల గురించి పట్టించుకోదు. అప్పుడతడు రెండు రకాలుగా మారవచ్చు. (ఏ) ప్రతి చిన్న విషయానికీ ఇతరుల మీద ఆధారపడటం. (బి) ఎవరినీ లెక్క చేయకుండా ఏకాకిగా బ్రతకటం.
‘పిల్లలపై వారి బాల్యం తాలూకు ప్రభావం ఎలా ఉంటుంది’ అన్న విషయాన్ని, ప్రపంచపు అత్త్యుత్తమ ఇద్దరు సైకాలజిస్టులు కెల్లీ, ఫ్రాయిడ్ రెండు విభిన్నమైన దృక్పథాలతో చూస్తున్నారు.
 బాల్యం బాగా లేని ఎందరో ప్రముఖుల జీవితాలు పరిశీలించిన కెల్లీ “... చిన్న వయసులో కష్టాలు అనుభవించిన పిల్లలు స్వతంత్రభావాలతో ఎదిగి, తాము అనుకున్నది సాధిస్తారని" అంటాడు. లింకన్, థామస్ ఆల్వా ఎడిసన్, లాల్ బహదూర్ శాస్త్రి, హారిసన్ ఫోర్డ్ (ఇండియానా జోన్స్) లాంటి గొప్పవాళ్ళ ఉదాహరణలు చూస్తే ఈ థియరీ కరెక్టే అనిపిస్తుంది.
 మరో పక్క ఫ్రాయిడ్ దానికి వ్యతిరేకంగా “బాల్యంలో ప్రేమ రాహిత్యం వల్ల పిల్లలు మాఫియా లీడర్లు, టెర్రరిస్టులుగా మారతారు” అని వాదిస్తాడు. స్టాలిన్, హిట్లర్ మొదలైనవారి జీవితాలని చూస్తే ఆ థియరీ కూడా కరెక్టే అనిపిస్తుంది.
దీనిబట్టి మనకో విషయం అర్థం అవుతుంది. బాల్యంలో పెంపకం సరిగ్గా లేకపోతే పిల్లలు ఏదో ఒక విపరీత ధోరణిలో పయనించక తప్పదు. అటు కోపం, చెడు అలవాట్లు, డిప్రెషన్ లాంటి నెగటివ్ పరిణామాలు కావచ్చు. లేదా పట్టుదల, గమ్యం, కసి లాంటి పాజిటివ్ (మంచి) కావచ్చు. ఫ్రాయిడ్ చెప్పినా, కెల్లీ చెప్పినా అదే కదా..! పిల్లల భవిష్యత్తుని ‘విధి’ కి వదిలేయ్యాకుండా ఉండటమే ఉత్తమ పేరెంటింగ్.
2. నిర్ధారణ / అనుమానం:
ఒకటి నుంచీ మూడు సంవత్సరాల పిల్లల్లో, తమ చుట్టూ ఉన్న వాతావరణం పట్ల కుతూహలం మొదలవుతుంది. వారికో ఐడెంటిటి ఏర్పడుతుంది. తప్పటడుగులకే తల్లి సంబరం, ముద్దుముద్దు మాటలకి పెద్దలు ముచ్చటపడే విధానం, వీటన్నిటి వల్లా ప్రపంచం అంతా తననే ప్రేమిస్తుందన్న నమ్మకం కలుగుతుంది. తనని చూసి ఓ అబ్బాయి నవ్వగానే తనలో ఏదో గొప్పతనం ఉండే ఉంటుందన్న అమ్మాయి అమాయకత్వం లాంటి స్టేజి ఇది. దీని తరువాత పిల్లలు అతి ప్రమాదకరమైన మూడో స్టేజ్లోకి వెళ్తారు.
3. తెలివి / జడత్వం:
మూడేళ్ళ వయసులో పిల్లలు తొలిసారి ఇల్లు వదిలి బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమానురాగాల మధ్య పెరిగిన పిల్లలు టీచర్లు, ఆయాల సంరక్షణలోకి వెళ్తారు. స్కూల్లో తోటి పిల్లల మధ్య కొత్త వాతావరణం... ఇంట్లో ప్రేమ స్థానే బయట టీచర్ల విసుగు అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ ప్లే-స్కూల్స్ ని తక్కువ చెయ్యటం కాదు. ప్లే-స్కూల్స్‌లో ఆయాలు. టీచర్స్ చాలా ఓర్పు, సహనంతో ఉంటారు. అయినా వారూ మనుష్యులేగా..! అప్పుడప్పుడు వారి బాధ్యతారహిత రుసరుసల మధ్య పసిపిల్లల బాల్యం కొత్త మలుపు తిరుగుతుంది.
మరోపక్క ఇంట్లో వాతావరణం కూడా కాస్త వేడెక్కుతుంది. అల్లరికి తల్లిదండ్రులు విసుగు ప్రదర్శిoచటం మొదలుపెడతారు. అప్పటివరకూ అడిగిందల్లా ఇచ్చిన పెద్దలు, అసంబద్ద కోర్కెలని తిరస్కరిoచటం ప్రారంభిస్తారు. ‘నిరాదరణ’ అంటే ఏమిటో కొద్ది కొద్దిగా తెలుస్తుంది. జీవితం అంటే పరమాన్నమే కాదు, పచ్చిమెరపకారం అనేది తొలిసారి అర్థమవుతుంది.
ఈ షాక్‌ని వారు ఓపట్టాన తట్టుకోలేరు. తమ హక్కుల కోసం ప్రతిఘటించటం నేర్చుకుంటారు. అక్కడి నుంచీ అల్లరి ప్రారంభం అవుతుంది. పిల్లల హైపర్-ఆక్టివిటీకీ, పెద్దల కంట్రోల్ కీ మధ్య ఇల్లు యుద్ధరంగం అవుతుంది.
ఈ విషయమై 69 పిల్లల్ని కని ప్రపంచ రికార్డ్స్ సృష్టించిన మిస్సెస్ ఫీయొడెర్ “ఏడాది రాగానే పిల్లలకి ‘…మ్ ...మ్మ ...అమ్మ... అనమ్మా’ అంటూ ప్రోత్సాహిస్తాం. రెండేళ్ళు వచ్చేసరికి “దామ్మ... దా” అంటూ నడవమని బలవంతపెడతాము. ఆ తరువాత ఇరవై ఏళ్ళ పాటు వాళ్ళని “కాస్సేపు మాట్లాడకుండా ఉండవా, కదలకుండా కుదురుగా కూర్చోవా. ప్లీజ్. నీకు దణ్ణం పెడతాను’ అంటూ ప్రార్థిస్తాం” అంటుంది.
4. క్రియేటివిటి / ఆత్మన్యూనత:
అయిదు నుంచి పదమూడేళ్ళ వయసులో పిల్లలు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. తమ తెలివితేటలని బహిర్గత పరచాలన్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ సమయంలో వారి ఉత్సాహానికి ప్రోత్సాహం లభించిన పిల్లలు తెలివైన వారుగా; లేని పిల్లలు జడులుగా (జడత్వం అంటే క్రియేటివిటి లేకపోవటం), ప్రయాణం మొదలుపెడతారు. పెద్దల కోపం అర్థమవటం ప్రారంభం అవుతుంది ప్రేమ ఆప్యాయతలు బలంగా పెనవేసుకునేది ఈ స్టేజ్‌లోనే.. ఆ సమయంలో పెద్దల నుంచి నిరాదరణా, విమర్శా, దండనా ఎక్కువైతే వాళ్ళు ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు.
5. గెలుపు / అయోమయం:
13-20 మధ్య వయసులో పిల్లలకి ఒక రంగుల లోకం కనబడటం ప్రారంభం అవుతుంది. ఎవరికీ చెప్పుకోలేని శారీరకమార్పులతో పాటూ, అందం తాలూకు అవగాహన కూడా మొదలవుతుంది. కాస్త థ్రిల్. చాలా అయోమయం. ఆత్మగౌరవం, వ్యక్తిత్వం, తమపట్ల తమకి నమ్మకం ప్రారంభం అవుతుంది. ఆ నమ్మకం మితి మీరితే రాష్ డ్రైవింగ్ (సూడో-గెలుపు), అపోజిట్ జెండర్‌తో ప్రేమ (గుర్తిoప బడాలన్న కోరిక), చిన్న వయసులోనే సెక్స్ (విచక్షణా లేమి) మొదలైన - దార్లలోకి వెళ్ళవచ్చు. తమపై నమ్మకం తగ్గితే పిరికితనం, నత్తి, నిర్ణయలేమి మొదలైన అవలక్షణాలకు గురి అవ్వొచ్చు.
తల్లిదండ్రులని వదిలేసి స్నేహితుల వైపు మొగ్గే వయసిది. తమ అస్తిత్వం (ఐడెంటిటి) నిలుపుకోవడానికి వీళ్ళు తరచూ ఇంట్లో పోట్లాడుతూ ఉంటారు. ఎదిగిన ఒక పేరెంట్కీ, ఎదుగుతూన్న ఒక వ్యక్తిత్వానికీ మధ్య ఘర్షణే అల్లరి. ఈ పోరాటంలో గెలిచినా/ఓడినా పెద్దలకి దూరం అవుతారు. మరోరకంగా చెప్పాలంటే తమ పోరాటంలో పెద్దల్ని గెలిచిన తరువాత, తమ గెలుపుని (కొత్త మోటర్ బైక్, పబ్కి డబ్బులు) స్నేహితులతో పంచుకుంటారు. ఇంట్లో గడపటం తక్కువ అవుతుంది. ఒకవేళ పెద్దలు ఇటువంటివి నిరాకరించినా, ఆ కారణం వలన పెద్దలకి దూరం అవుతారు.
ఆ పైది యుక్త వయసు. ‘తన కుటుంబం’ అన్న ధ్యాస ప్రారంభం అవుతుంది. కొందరు లంచగొండితనం, స్వార్థం వైపు వెళితే, మరికొందరు సమాజంలో గుర్తింపు, ఇతరులకి సహాయం, దయాగుణo మొదలైనవి అలవర్చుకుంటారు. వీరు గెలిచినవారు. తాము సాధించిన విజయాలని తలుచుకుంటూ, మరణం గురించి దిగులు చెందకుండా వార్ధక్యపు అంతిమ గమ్యాన్ని సంతృప్తితో చేరుకుంటారు. అయితే ఈ పుస్తకం పిల్లల గురించే తప్ప ఇరవై ఏళ్ళు దాటిన వారి గురించి కాదు కాబట్టి ఈ వివరణ ఇక్కడితో ఆపుదాం.

పిల్లల మానసిక సమస్యలు - యండమూరి

పిల్లల మానసిక సమస్యలు
పిల్లల్లో కనపడే ఈ క్రింది సమస్యలకి డాక్టర్లు అవసరం లేదు. మీరు చాలు.
1. సమస్య - విశ్లేషణాలోపం: ‘హిమాలయాలకి అవతలి వైపు ఉన్న చైనా మన దేశానికి ఏ దిక్కున ఉన్నది? ఉత్తరమా? దక్షిణమా?’ అని అడిగితే ఇంటర్ చదివే అమ్మాయికి అసలు ప్రశ్నే అర్థం కాదు. కొందరు పిల్లలు ఈ విధంగా సమస్యల్ని విశ్లేషించలేరు. ఇది మానసిక రుగ్మత కాదు. చిన్న చిన్న క్విజ్ ప్రోగ్రాములు నిర్వహిస్తే ఈ సమస్య తగ్గిపోతుంది.
2. ధృక్పథ మార్పు లోపం: సమస్యని ఒకే దృక్పథంతో చూస్తూ, మరో రకంగా ఆలోచించలేకపోవటం కొందరి పిల్లల్లో లోపం. 'ఒక బెగ్గర్ అన్నయ్య చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి తమ్ముళ్ళు లేరు, ఎలా?' అన్న ప్రశ్నకి చాలాసేపు ఆలోచిస్తే అందులో తప్పేమీలేదు. కానీ 'బిచ్చగాళ్ళు అందరూ మగవారే అయ్యుండాలన్న రూల్ లేదు కదా' అని హింట్ ఇచ్చినా కూడా, సమాధానం చెప్పలేకపోతే ఈరకమైన లోపం ఉన్నదన్నమాట. ఈ పిల్లలు ‘ఆలోచించవలసిన’ ప్రశ్నల్ని అవాయిడ్ చేస్తారు. హేతువు, తర్కం పట్ల ఏ మాత్రం కుతూహలం ఉండదు.
3. కమ్యునికేషన్ లోపం: కొందరు పిల్లలు మాట్లాడుతూoటే అర్థంకాదు. అది మూడు రకాలుగా వస్తుంది. 1. నెమ్మది నెమ్మదిగా కూడబలుక్కుని మాట్లాడటం. 2. వేగంగా మాటలు దొర్లిస్తూ మాట్లాడటం. 3. కర్త కర్మ క్రియ లేకుండా మాట్లాడటం..! మొదటిదానికి స్పీచ్ తెరపిస్ట్ అవసరం. రెండోది హైపరాక్టివ్ లక్షణం. దీని గురించి తరువాత చర్చిద్దాం. మూడోది మాత్రం కాస్త ఆలోచించవలసిన విషయం. ఇంట్లో అందరూ వాడే భాషనే మాట్లాడుతున్నా, ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాడంటే ఎక్కడో లోపం ఉన్నదన్నమాట. అది భాషలోనా? మనస్తత్వంలోనా? అన్న విషయం గుర్తించాలి.
4. పక్క తడపటం (bed wetting): పిల్లల్లో ఉండే కొన్ని అతి సామాన్య లక్షణాలు పెద్దల్ని భయభ్రాoతులని చేస్తాయి. నిద్రలో ఉలిక్కిపడటం, పక్క తడపడం, మొదలైనవి ఉదాహరణలు. వారసత్వo, స్కూల్లో వత్తిడీ, ఇంట్లో గొడవలూ పిల్లలు పక్క తడపటానికి ముఖ్యకారణాలు. దాదాపు 80% పిల్లల్లో అయిదేళ్ళ వయసొచ్చేసరికి తగ్గిపోతుంది. ఈ లక్షణం దానంతట అదే తగ్గిపోవటo నిజానికి చాలా మంచి పరిణామo. అప్పటివరకూ బెడ్-వెట్టింగ్ చేసిన పిల్లవాడు ఆ అవలక్షణం పోగానే ‘నన్ను నేను కంట్రోల్ చేసుకోగలిగాను’ అని ఫీల్ అవుతూ స్వీయగౌరవాన్నీ, తన పట్ల నమ్మకాన్నీ పెంచుకుంటాడు. మీకు తెలుసా? సచిన్ టెండుల్కర్ నిద్రలో కలవరించేవాడు. అంతే కాదు, అతడికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉండేది. కానీ ఆ తరువాత అతడు క్రికెట్ వీరుడయ్యాడు.
5. ప్రతిస్పందనా లోపం: అడిగిన ప్రశ్నలకి మీ పిల్లలు ఎంత తొందరగా సమాధానాలు చెపుతున్నారు? ప్రతిస్పందనలునాలుగు రకాలు. 1) 1000+ 40+ 1000+ 30+ 1000+ 20+ 1000+ 10 ఎంతని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా 5000 అనటం తొందరపాటు ప్రతిస్పందన. 2) ఆరుగుళ్ళ రివ్వాల్వర్‌లో ఒక బులెట్ పెట్టి మాగజైన్ గిర్రున తిప్పి పేలిస్తే, అవతలివారు చావటానికి 1/6 ఛాన్స్ ఉంటుందని ప్రతిస్పందించటం కాన్ఫిడెన్స్. నుదిటి మీద పెట్టుకుని పేల్చి చూపించటం ఓవర్-కాన్ఫిడెన్స్. 3) రాముడి తండ్రికి సీత కొడుకు ఏమవుతాడని అడిగితే రెండు నిముషాలు ఆలోచించటం జడత్వ ప్రతిస్పందన (స్లో రిఫ్లెక్స్). 4) అసలు ఆలోచించటానికే ఇష్టపడక పోవటం ప్రతికూల ప్రతిస్పందన.
6. ఎడమ చేతివాటం: ఇది అసలు అవలక్షణమే కాదు. ఒక రకంగా అది మంచిది కూడా. రెండు చేతులూ సమానంగా ఉపయోగపడి, ఎడమ చేతివాటం ఉన్నవారు మిగతా పిల్లలకన్నా చురుగ్గా ఉంటారు.
6. అతి వాగుడు Vs ఇంట్రావర్షన్ Vs రిజర్వ్‌డ్‌నెస్: అవసరం లేకపోయినా మాట్లాడటం అతి వాగుడు, అవసరo ఉన్నా మాట్లాడ లేకపోవడం ఇంట్రావెర్షన్. రెండూ తప్పే. క్లుప్తంగా మాట్లడడం రిజర్వ్‌డ్‌నెస్. క్లాసులో ‘అమెరికా ప్రధానమంత్రి ఎవరు?’ అని అడగగానే దూరంనుంచి మరెవరో ‘మోడీ’ అని సమాధానం చెప్తారు. ‘ఆడిగింది ఎవరిని? నువ్వెందుకు చెప్తున్నావు?’ అని ప్రశ్నిస్తే అటునుంచి సమాధానం ఉండదు. జ్ఞానులు మాట్లాడవలసి ఉంది కాబట్టి సంభాషిస్తారు. అజ్ఞానులు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. అవసరం లేకపోయినా ఎక్కువ మాట్లాడటాన్ని ‘డయేరియా ఆఫ్ టాకింగ్’ అంటారు. ఒక వయసు వచ్చాక కూడా పిల్లలు లొడలొడా మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులకి బావుంటుందేమో కానీ, అది ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అలా అని ఏమీ మాట్లాడకుండా ముంగిలా ఉంటే అది మరింత ప్రమాదకరం. స్నేహంగా హుషారుగా ఉండటం వేరు, అతివాగుడు వేరు.
పరిష్కార మార్గాలు:
1. ముందు పిల్లవాడికి ఫలానా బలహీనత ఉంది అని నమ్మండి. (a+b)2 ఎంతో చెప్పగలిగిన కుర్రవాడు (b+a)2 చెప్పలేకపోతే జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. వాళ్ళ తెలివితక్కువతనం మీదా, బలహీనతల మీదా దృష్టి నిలపకుండా, వాటినుంచి బయట పడడానికి వారు చేసే ప్రయత్నాలకి చేయూతనివ్వండి.
2. షాప్కి వెళ్ళి నెలసరి దినుసులు తీసుకురావటం, బిల్లు సరిగ్గా ఉన్నదో లేదో చూడటం, సొంతంగా ఆటో మాట్లాడుకుని సామాన్లు ఇంటికి తీసుకురావడం లాంటి చిన్నచిన్న విషయాలు కూడా మానసిక వికాసానికి తోడ్పడతాయి.
3. చాలెంజస్లో పాల్గొనేలా చేయండి. ఉదాహరణకి మీ ఎత్తు ఎంతో ఉజ్జాయింపుగా చెప్పమని బంపర్ బహుమతి ఆఫర్ చెయ్యండి. మీ డైనింగ్ టేబుల్ పొడవు 70 అంగుళాలా? అంతకన్నా ఎక్కువా? అని మీ పిల్లల్తో పందెం కట్టండి. ఆ తరువాత స్కేల్తో కొలిచి చూడండి. ఉత్సాహభరితమైన ఈ రకo లెక్కలు పిల్లల్లో చురుకుదనాన్ని ప్రేరేపిస్తాయి.
4.. చిన్న వయసులోనే పిల్లలకి డైరీ రాసే అలవాటు చేయండి. పిల్లలకి మీరిచ్చే గొప్ప బహుమతి అది. డైరీ అంటే మనసుతో డేటింగ్ చేసుకోవటం. ముఖ్యంగా ఇంట్రావర్ట్ పిల్లలకి ఈ అలవాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 'పడుకోబోయే ముందు, మరోలా చెప్పాలంటే, రోజు చివర్లో స్వీయ-విమర్శ చేసుకోవటం కోసం అయిదు నిమిషాలు గడపలేని వాడు జంతువుతో సమానం. ఎందుకంటే జంతువులు డైరీలు రాయవు' అంటాడు బెర్నాడ్ షా.
6. తల్లిదండ్రులు పక్కన లేకపోతే తమ పనులు తాము చేసుకోవటం, తోటి పిల్లలతో కలిసి పని చేయాల్సిన అవసరం... ఆ విధంగా పిల్లలు తమ గుహలోనుంచి బయటకి రావడానికి సమ్మర్ కాంప్స్, టూరిజం మొదలైనవి సహాయపడతాయి. వారి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.
7. చిత్రలేఖనం, మ్యూజిక్ మొదలైన అభిరుచుల్ని కొందరు పెద్దలు మొగ్గలోనే త్రుoచివేయటంతో, మరే రకమైన అభిరుచీ, ఆర్టూ లేని పిల్లలు అతివాగుడికి అలవాటు పడతారు. ఈ చిన్న విషయం పేరెంట్స్ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బావుంటుంది.
పిల్లలకి ఇంకా మాటలు రాలేదనీ, చెవులు వినిపించటం లేదనీ కంగారూ పడే పేరెంట్స్ ఒక విషయం గమనిచాలి. భయం వేరు. జాగ్రత్త వేరు. పిల్లల్లో హైపర్-ఆక్టివ్ డిజార్డర్ పదేళ్ళు వచ్చేసరికి దాదాపు తగ్గిపోతుంది. కొన్ని స్వభావ సిద్ధమైన సహజ ప్రవర్తనా లోపాలు వయసు పెరిగిన తరువాత కూడా కొనసాగితే భయపడాలే తప్ప, చిన్నపిల్లల్లో అలాంటి లక్షణాలు ‘లేకపోతేనే’ భయపడాలి. పొరపాటున మీరు ఏ ‘ఫేక్’ కౌన్సిలర్ దగ్గరకో, హిప్నాటిస్ట్ దగ్గరకో వెళ్తే మిమ్మల్ని మరింత భయపెట్టే ప్రమాదం ఉంది. ముందే చెప్పినట్టు, మంచి క్వాలిఫైడ్ వైద్యుడి దగ్గరకు మాత్రమే తీసుకువెళ్ళండి. అది కూడా, వయసు పెరిగిన తరువాత కూడా ఆ లక్షణాలు ఉంటేనే..! లేకపోతే మీ లావు పర్సు సన్నబడుతుంది.

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి 4

నిశ్శబ్దం రెండు రకాలు. లోపలా, బయట..! ఎనిమిదో క్లాసు వరకూ బాగా వచ్చిన మార్కులు సడెన్‌గా తగ్గిపోతే, దానికి చాలా కారణాలు ఉండవచ్చు. అందులో ఒకటి స్ట్రెస్. పిల్లల్లో నిరంతరం లోలోపల ఛాటింగ్ జరుగుతూనే ఉంటుంది. అది ఒక విధమైన మానసిక అలసటకి దారి తీస్తుంది. దానికి బెస్ట్ మందు ‘ధ్యానం’. అంటే ముక్కు మూసుకోవటం కాదు. నిశ్సబ్దంగా ఉండటం.
నిశ్శబ్దం అంటే చుట్టూ ఉన్న బిజీ, క్రేజీ ప్రపంచంలో నీ అస్థిత్వాన్ని నువ్వు గుర్తించుకోవటo. గమ్యం మీద దృష్టి నిలుపుతూ తనలోకి తాను అంతర్ముఖుడవటం. ఎంతోసేపు అవసరం లేదు. అయిదు నిముషాలు. మొదట్లో అయిదు నిమిషాలుగా ప్రారంభమైన ఈ ప్రక్రియ, సాగిoచే కొద్దీ మరింత ఆనందప్రసాదిని అవుతుంది. మిత్రుడు సీతారామశాస్త్రి వ్రాసినట్టు తనతో తాను రమించటమంటే అదే. ఆత్మవిమర్శకీ, అంతర్విమర్శకీ రోజుకో అయిదు నిముషాలు కేటాయించటంలో నష్టమేమున్నది?
ఒంటరితనం వేరు - ఏకాంతం వేరు. ఏకాంతం అంటే నీ నిశ్శబ్దాన్ని నువ్వు ప్రేమించటం. ఒంటరితనం అంటే నీ ఏకాంతాన్ని నువ్వు భరించ లేకపోవటం.
ఏకాంతం అంటే నీతో నువ్వు కమ్యూనికేట్ చేసుకోవటం. ఒంటరితనం అంటే ఛాటింగ్ కోసం మనసు తహతహలాడటం.
“కేవలం నా నిశ్శబ్దపు గ్యాపులను పూరించటానికి మాత్రమే మాటల్ని వాడతాను” అని ఎక్కడో వ్రాసాను. నిశ్శబ్దంగా పని చేసుకోవటం ఒకసారి అలవాటయితే, ఈ 'నిశ్శబ్దంతో మాట్లాడే ప్రక్రియ'ని, పిల్లలు తొందర్లోనే పెంచుకుంటారు.

టీన్స్ పెంపకం ఒక కళ - యండమూరి -3



ప్రతి ఇంట్లోనూ పిల్లలు పెద్దల ప్రేమ పొందుతారు. కానీ పెద్దల ‘గౌరవం’ పొందగలగటం కొందరు పిల్లలు మాత్రమే సాధించగలిగే అద్భుతమైన అనుభవం. ‘మీ ఇంట్లో మీకు గౌరవం ఉందా’ అని అడిగినప్పుడు పిల్లలకి అర్థం కాదు. ఇంట్లో గౌరవం అంటే ఏమిటి? రాత్రి సెకండ్ షో చూసొచ్చి మధ్యాహ్నం నిద్ర పోతూన్న కుర్రాడు, తమ్ముణ్ణి కాస్త గొడవ చెయ్యొద్దని చెప్పమంటే ‘వెధవ నిద్రా నువ్వూనూ’ అంటుంది తల్లి. దేశం తరపున అండర్ 19 ఆడి వచ్చి పడుకున్న కుర్రాడి తమ్ముడు గొడవ చేస్తూoటే ‘అన్నయ్య నిద్ర పోతున్నాడు. అల్లరి చెయ్యకు’ అంటుంది. ఇంట్లో గౌరవం సంపాదించటం అంటే అదే.
ప్రతి విద్యార్థి లోపలా ఒక బహుమతి ప్యాక్ చేయబడి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో దాన్ని విప్పుతారు. కొంతమంది తమలో ఆ ప్యాకెట్ ఉందన్న విషయం చివరివరకూ కూడా తెలుసుకోరు.
పిల్లలు విశ్వనాథన్ ఆనంద్, విరాట్ అంత గొప్పవాళ్ళు కాకపోవచ్చు కానీ చదువు మధ్యలో ఖాళీ సమయాల్లో తమకిష్టమైన రంగంలో నిమగ్నులైనప్పుడు... ఆటోమాటిగ్గా ఆ గౌరవం లభిస్తుంది. ఒక ఇంట్లో అందరూ టీ.వీ చూస్తున్నారనుకుదాం. ఒక కుర్రాడు మాత్రం గదిలో తమ్ముడికి పాఠాలు వివరిస్తున్నాడు. ఆ కుర్రాడిపై ఇంట్లో అందరికీ ప్రేమతో కూడిన 'గౌరవం' ఉంటుంది. కారణం? మిగతా అందరూ ‘ఇంకొకరి’ క్రియేటివిటీ చూస్తున్నారు. కుర్రాడు తన జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇంకొకరికి విద్యాదానం చేస్తున్నాడు. అదీ తేడా.
(From: Teens pempakam oka kala).

Monday, March 5, 2018

బ్రాహ్మణ విద్యార్థులకు వేదం చదవడానికి కంచి పీఠం సువర్ణావకాశం!


"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి పుస్తకం నుంచి కొన్ని మంచి విషయాలు 2

టీన్స్ - సెల్ఫ్ లవ్:
తమ ఛార్మ్ అందం, స్టయిల్, సంభాషణతో ఇతరులని ప్రభావితం చేసేందుకు టీన్స్ అమితంగా ఇష్టపడతారు. తాము ఎత్తయిన స్టేజిపై ఉన్నామనీ, క్రింద నిల్చుని యావత్ ప్రపంచం తమవైపు కళ్ళప్పగించి చూస్తోందనీ ‘నిజాయితీగా’ నమ్ముతారు. అందుకే అద్దం ముందు గంటల కొద్దీ గడుపుతారు. ఆ చర్యని ఎగతాళి చేసినప్పుడు వారు అమితంగా హర్ట్ అవుతారు. కొందరు రివోల్ట్ అవుతారు. పైకి ఎలా కనపడినా, చాలామంది టీన్స్ మనసులు అతి సున్నితం. వాళ్ళ మూడ్ పాడుచేయడానికి చిన్న కామెంట్ చాలు. వాళ్ళ అందాన్ని, ఫ్యాషన్నీ, బ్రతికేవిధానాన్నీ విమర్శించినా, ఏడిపించినా అది వాళ్ళని ఎంతగా బాధిస్తుందంటే, వారు తమ గుహలోకి వెళ్ళిపోయి, ఇక బయటికి రారు.
అలా కామెంట్ చెయ్యటం కన్నా చిన్న చిన్న ప్రాపంచిక సహజ స్వాభావిక మానసిక సూత్రాలు వారికి వివరించండి. పిల్లలకి సెల్ఫ్-అడ్మిరేషన్ మరీ ఎక్కువ అవుతోందని అనిపించినప్పుడు సున్నితంగా మందలించండి. "…ఎప్పుడూ నువ్వు నీ గురించే ఆలోచించడం వల్ల నీకు నీపట్ల అవసరమైన దాని కన్నా ఎక్కువ అభిమానం (నెగెటివ్ సెల్ఫ్-ఈగో) ఏర్పడుతుంది. అందరూ అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ ఉంటారన్న అభిప్రాయం మార్చుకో. అవతలివారికి నువ్వు ఎంతో దగ్గరయితే తప్ప, నీ గురించి ఆలోచించడానికి ఎవరికీ అంత సమయం ఉండదు అందరిలోకీ స్పెషల్‌గా ఉండాలన్న ఆలోచన మంచిదే కానీ, దానికి కావలసింది మొహo మీద మేకప్ కాదు. నీ ప్రవర్తన" అన్న వాస్తవo వారికి అర్థమయ్యేలా చెప్పండి.
నార్సిస్-సిస్ట్ మనస్తత్వం:
నార్సిసేస్ అనే యువకుడు చెరువులో మొహం చూసుకుని తనతోనే ప్రేమలో పడతాడు. అందులోంచి వచ్చిందే ఈ పేరు. సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ ప్రకారం, ఈ రకమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు తమని తాము అవసరమైనదానికన్నా ఎక్కువ ప్రేమించుకుంటారు. లేని లక్షణాలని ఆపాదించుకుంటారు. తాము నమ్మిందే వేదం అని భావిస్తారు. స్వీయ-ప్రేమ మంచిదే కానీ అవధులు దాటితే, అవతలి వారు చెప్పిన సలహాల్ని పాటించనివ్వదు. ఈ లక్షణాలున్న పిల్లలందరూ నిశ్శబ్దం, ఆవేశం, దుఃఖం మొదలైన ఆయుధాలతో తమ కోపాన్నీ / అసంతృప్తినీ బహిర్గతపరుస్తూ ఉంటారు. సెల్ఫ్-లవ్ మరీ ఎక్కువైతే, అది మిసంత్రోప్ మనస్తత్వానికి దారి తియ్యవచ్చు.
మిసాంత్రోప్ మనస్తత్వం: పక్క ప్రయాణీకుడు సైకాలజిస్ట్. అభిమాని. మాటల సందర్భంలో ‘దున్నపోతులు’ అన్న కథాంశం ప్రసక్తి వచ్చింది. “టైటిల్ ఇంటరెస్టింగ్ గా ఉంది. కథ ఏమిటి?” ఉత్సుకంగా ప్రశ్నించాడు. “... ఒక మనిషికి కొద్దికొద్దిగా కొమ్ములు పెరుగుతాయి. కుడితి తాగాలని కోరిక పుడుతుంది. గేదెల మీద రొమాంటిక్ కోరిక పెరుగుతుంది. ఒక స్టేజ్ వచ్చేసరికి, ప్రపంచంలో ప్రతివాడూ దున్నపోతుగా మారిపోయి, ఒక్క హేతువాది మిగులుతాడు. దున్నపోతులన్నీ కలిసి ఆ మనిషిని కొమ్ములతో కుమ్మి చంపేస్తాయి” సంక్షిప్తంగా వివరించాను. వెళ్ళేటప్పుడు కరచాలనం చేస్తూ, "నేను మీ గురించి అనుకున్నది కరక్టే. మీరూ రాoగోపాల్ వర్మ లాగే మిసాంత్రోప్” అని వీడ్కోలు తీసుకున్నాడు.
అది నాకు కొత్త పదం. విమర్శనో, పొగడ్తో అర్థం కాలేదు. తరువాత పరిశీలిస్తే ఆయన చెప్పింది నిజం అనిపించింది. మిసాంత్రోప్ అంటే తన అభిప్రాయాల మీద నమ్మకం వల్ల ప్రపంచం పట్ల కలిగిన కోపంతో ప్రతిస్పందించే వాడు. వీరు కళాకారులైతే రచనల్లోనో, సినిమాల్లోనో, పాటల్లోనో ఇది ప్రతిబంబిస్తూ ఉంటుంది. "ఈ ప్రపంచంలోకెల్లా నేను ఎక్కువ అసహించుకునే జంతువు - మనిషి" అంటాడు అలెగ్జాండర్ పోప్. ఆస్కార్ వైల్డ్, జాపాల్ సార్త్రే, జోనాథన్ స్విఫ్ట్ ఈ వర్గం వారే.
వీరు మనుషులలోని నెగటివ్ కోణాన్ని ఎక్కువ పరిశీలిస్తూ, నచ్చని వాళ్ళని మొదటిక్షణంలోనే అవాయిడ్ చేస్తారు. అవతలి వారిని ఇంప్రెస్ చేయటం కోసం ముసుగు వేసుకోరు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఏదో జనాల్తో కలిసి బ్రతకాలి అన్నట్టు ఉంటారు. అందువల్ల వీరికి (తమ గ్రూపు తప్ప) మిత్రులు చాలా తక్కువ ఉంటారు. వీరు తమ సిద్ధాంతాలే నమ్ముతారు. ఏకీభవించని వారందరూ మూర్ఖులు. వారి పట్ల కోపం. జాలి. బలమైన స్నేహాలుoడవు. ప్రపంచానికి ‘అవుట్ సైడర్’ గానే జీవిస్తారు. తాము నమ్మిందే వేదం అన్న ఫీలింగ్ తప్పు కాదు కానీ, కొంత వయసు వచ్చాక ఒంటరి అయిపోతారు. సాధారణంగా ఎక్కువ నవ్వరు.
ఈ మనస్తత్వం మితి మీరితే అది అమానుషం అవుతుంది. తమ వాదన వినని వ్యతిరేకుల్ని అమితంగా ద్వేషిస్తారు. అమాయకుల్ని చంపే ఐ.ఎస్ ఉగ్రవాదులనుంచీ, ప్రేమించిన అమ్మాయి మీద ఆసిడ్ పోసేవారు ఇలాంటి శ్రుతి మించిన మిసాంత్రోప్ మనస్తత్వంవారే.
ప్రస్తుతం టీనేజ్ యువతలో ఈ మనస్తత్వం ఎక్కువ అవుతోంది. హుక్కా తాగినా, పదహారేళ్ళ వయసులో ప్రేమలోపడినా, తాగి ఆక్సిడెంట్ చేసినా తన సిద్దంతమే తన మతం..! పెద్దల మార్గదర్శకత్వాన్ని ఆమోదించటం లేదు. మాటని గౌరవించటం లేదు. (పెద్దల గతం కూడా గౌరవిoచేటంత గొప్పగా లేకపోవటం ఒక కారణం అయ్యుండవచ్చు). వీరి దృష్టిలో కష్టాలు స్వయంకృతాపరాధాలు. ఇతరుల కష్టాల్లో పాలుపంచుకోరు.
భవబంధాలు ఎక్కువ ఉండవు కాబట్టి వీరికి దుఃఖం కూడా తక్కువ ఒక వ్యక్తి కూతురు వేరే కులం మనిషిని పెళ్ళి చేసుకుందనుకుందాం. సమాజం ఏమనుకుంటుందో అని ఆ తండ్రి అని విలవిలలాడిపోతాడు. 'మిసాంత్రోప్' వ్యక్తి అసలు పట్టించుకోడు.. ఇష్టం ఉంటే కూతురిని తిరిగి ఆహ్వానిస్తాడు, లేదా నిర్ధాక్షణ్యంగా వదిలేస్తాడు. సమాజం గురించి క్షణం కూడా ఆలోచించడు. ఎవరూ లేకపోయినా బ్రతగ్గలనన్న ధైర్యo, పేరు ప్రఖ్యాతలు, ధనము ఉంటే పర్వాలేదు కానీ, లేకపోతే ఈ రకమైన 'మిసాంత్రోప్' మనస్తత్వం మనిషిని అజాత మిత్రువుగా చేస్తుంది.

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి పుస్తకం నుంచి కొన్ని మంచి విషయాలు 1

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి పుస్తకం నుంచి కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకోవలసినవి, మనం అందరం ఆచరించవలసినవి. అందుకే మంచి పుస్తకాలు చదువుదాం! పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు చేద్దాం! సత్యసాయి విస్సాఫౌండేషన్! .......ఒక వాస్తవం జీవితాన్ని మారుస్తుంది:

డెలాయిట్ కంపెనీలో సెమినార్ పూర్తయిన తరువాత ఒక యంగ్ ఎగ్జిక్యూటివ్ తన అనుభవం చెప్పాడు. "మాది మధ్య తరగతికి కాస్త దిగువ కుటుంబం. డిగ్రీ చదువుతున్న అన్నయ్య. పెళ్లి కావలసిన ఇద్దరు అక్కలు. నేను ఇంటర్ చదివే రోజులు. మా స్నేహితులందరికీ మోటార్ సైకిల్స్ ఉండేవి. రైడింగ్ నాకు చాలా ఇష్టం. మా నాన్నని కొనమని అడిగాను. ఒప్పుకోలేదు. ‘ఎలాగైనా కొనాల్సిందే’ అని తిండి మానేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసాను. మామూలుగా కన్నా ఎక్కువ నీరసం నటించాను. మూడు రోజులయ్యేసరికి నాన్న దిగివచ్చారు. గదిలో పడుకుని ఉన్నాను. అమ్మ నా పక్కనే కూర్చొని బ్రతిమాలుతోంది. నాన్న లోపలకి వచ్చి అమ్మతో ముక్తసరిగా, “వాణ్ణి తిండి తినమను. రేపు కొనిస్తానని చెప్పు" అని వెళ్ళిపోయాడు. అంత తొందరగా నాన్న దిగి వస్తాడనుకోలేదు. ఎవరెస్టు ఎక్కినంత సంతోషం వేసింది. అమ్మ తడి గుడ్డతో మొహం తుడిచి వంటింట్లోకి తీసుకెళ్తూండగా, వాష్ బేసిన్ దగ్గర నాన్న నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ఏడుస్తూ ఉండటం చూసాను. వళ్ళంతా జలదరించింది. బహుశా అప్పుడే నా జీవితం మలుపు తిరిగి ఉంటుంది. నేనీ రోజు ఇక్కడ ఇలా ఉన్నతస్థితిలో ఉన్నానంటే ఆ సంఘటనే కారణం. ఉద్యోగంలో చేరిన అయిదు సంవత్సరాలవరకు బైక్ కొనలేదు. ముందు నాన్నగారి ఇంటి అప్పు తీర్చాను."

యూ ఆర్ డిఫరెంట్:

స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని కాలేజికి వెళ్ళటం మానేసిన అమ్మాయి, పిక్నిక్ కి డబ్బులివ్వలేదని చేతి నరం కోసుకున్న అబ్బాయి మాకు తెలుసు. పిల్లలకు మీ ఆర్థిక పరిస్థితులు అర్థమయ్యేట్టుగా చెప్పండి. సర్దుకుపోవడం, రాజీపడడం నేర్పoడి. క్రికెటర్ రోహిత్ శర్మ తండ్రి, కొడుకుని సరిగ్గా పోషించలేక తన తండ్రి (తాత) దగ్గర వదిలేసాడు. రోహిత్ శర్మ పని చేస్తూ చదువుకున్నాడు. సి.ఏ. చదివేరోజుల్లో మధ్యాహ్నం లంచ్ కి మా ఇంట్లో ముప్పై పైసలు ఇచ్చేవారు. దానికి ఒక దోశ వచ్చేది. చెట్ని ఫ్రీ కాబట్టి ఐదారుసార్లు వేయిoచుకునే వాడిని. ఇదంతా, రొమాంటిసైజింగ్-ది-పాస్ట్ గా గొప్పలు చెప్పటం కాదు. అర్థం చేసుకునే వయసు రాగానే, లేనిపోని హెచ్చులకి పోకుండా తమ ఆర్థిక పరిస్థితి చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశ్యం.

"క్లాసులో అందరికీ సెల్ఫోన్స్ ఉన్నాయి. నాకే లేదు" అని మీ పిల్లవాడు పోరు పెడుతూంటే, "నువ్వు డిఫరెంటమ్మా. వాళ్ళు వేరు, మనం వేరు. మనకి అంత స్తోమతులేదు” అనండి.

“వడ్డున కుర్చుని సలహాలివ్వటం సులభం. మీకేం తెలుసు? అడిగింది ఇవ్వకపోతే ఇల్లు పీకి పాకం పెడతారు” అంటారా? అవసరాలు మానుకుని పిల్లలు అడిగిందల్లా కొనివ్వటం, సుఖాలు తగ్గించుకుని వారికి సౌఖ్యాలు అమర్చటం... ఇలా చేస్తూ పోతే, కొంతకాలం అయ్యేసరికి పిల్లలు దాన్ని ప్రేమగా గుర్తించరు. ఇవ్వటం మీ బాధ్యత అనుకుంటారు. ఇవ్వటం ప్రేమ కాదు. ఏది, ఎప్పుడు, ఎందుకు, ఎంత ఇవ్వాలో తెలుసుకుని అంతే ఇవ్వటం ఆరోగ్యకరమైన ప్రేమ. మరోలా చెప్పాలంటే, వారి పట్ల మీ ప్రేమ ప్రూవ్ చేసుకోవటం కోసం ఇవ్వటం కన్నా... వారి మంచి భవిష్యత్తు కోసం, కోర్కెల్ని కంట్రోల్‌లో పెట్టుకునే గుణం వారికి నేర్పటం కోసం… కావలసింది మాత్రమే ఇస్తున్నారన్న మాట. పిల్లల్ని ఇన్వాల్వ్ చెయ్యటమంటే, మీ (ఆర్థిక) సునామీ ఆటుపోట్లలో చుక్కాని వారి చేతికి ఇవ్వటం అన్నమాట. ఆ చుక్కానికి మరో పేరే ‘బాధ్యత’.
From: TEENS PEMPAKAM OKA KALA

Total Pageviews