Wednesday, July 27, 2016

ఎల్.ఎమ్.బ్రౌనింగ్ అమెరికాకి చెందిన రచయిత్రి by Vadrevu China Veerbhadrudu

ఎల్.ఎమ్.బ్రౌనింగ్ అమెరికాకి చెందిన రచయిత్రి,కవయిత్రి. తత్త్వశాస్త్రం, ప్రకృతి, మతవిశ్వాసాల విద్యార్థి. ఆమె తన అన్వేషణలో భాగంగా ఇటీవలి కాలంలో డ్రూయిడ్రి, ఆదిమ షామానిజంలలో ఆసక్తి పెంచుకుంది. ఆ ఆసక్తి గాఢమైన ఆవేదనగా మారి, OakWise (2010) పేరిట ఒక దీర్ఘకావ్యంగా వెలువడింది.
ఆమె మాటల్లోనే చెప్పాలంటే:
'నాకు ఒక మతమంటూ లేదు. నా జీవితయాత్ర పొడుగునా నేను కూడగట్టుకున్న అనేక ఆదర్శాలు, తాత్త్విక ధోరణులు, వ్యక్తిగతంగా తెలుసుకున్న సత్యాల మీంచి నా ఆధ్యాత్మికత రూపుదిద్దుకుంది. గత పదిహేనేళ్ళుగా సాగుతున్న నా ప్రయాణంలో నేను కాథలిక్, బౌద్ధ, యూదీయ, డ్రూయిడు, ఆదిమ షామానిజం ల దారిన ప్రయాణిస్తూవచ్చాను. OakWise - డ్రూయుడు, ఆదిమ షామాన్ విశ్వాసాల ద్వారా నా ప్రయాణాన్ని విశదీకరించే కావ్యం. ఈ రెండు ఆరాధనా సంప్రదాయాల దారిన నా ప్రయాణం ద్వారా నాకు రెండు విషయాలు బోధపడ్డాయి. మొదటిది, ప్రకృతికన్నా పవిత్రమైనది మరేదీలేదని, ఈ భూమిని మించిన దేవాలయం లేదని డ్రూయిడ్రి ద్వారా నాకు నమ్మకం కలిగింది. రెండవ నమ్మకం ఆదిమ షామానిజం కలిగించింది. అదేమంటే, మనిషికీ, దైవత్వానికీ ప్రత్యక్ష సంబంధం ఉందని. పవిత్రమైన ఒక దివ్యాస్తిత్వంతో మనిషి సంభాషించడానికి మరే మాధ్యమం అవసరం లేదని. అది అపరోక్ష అనుభూతి అని.'
డ్రూయిడ్రి అంటే చాలామంది దృష్టిలో ఐర్లాండుకి చెందిన వనదేవతారాధన. కాని గత ముఫ్ఫై నలభయ్యేళ్ళుగా ప్రపంచంలో డ్రూయిడ్రి పట్ల పెరుగుతున్న మక్కువ వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. డ్రూయిడ్రి మూలాల గురించిన అన్వేషణ మరింత తీవ్రతరమవుతున్నది. దీన్ని ఒక పృథ్వీ-పితృదేవతారాధనగా చూడటమే కాక, తక్కిన ప్రపంచంలో వర్థిల్లిన ప్రాచీన పృథ్వీ-పితృదేవతారాధనలు- అమెరికన్ ఇండియన్, మావోరి, హుణా, అస్ట్రేలియన్ ఆదిమ తెగలు, ప్రాచీన ఆఫ్రికా తెగలు, ఆసియా జాతుల క్రతువులకూ, విశ్వాసాలకూ సన్నిహితమైన విశ్వాసంగా, క్రతుకాండగా చూస్తున్నారు.
మానవచరిత్రలో మతవిశ్వాసాల పరిణామాన్ని నిశితంగా పరిశీలించినవారికి మూడు దశలు కనిపిస్తాయి. మొదటి దశ, ఏ ప్రాచీనకాలంలోనో మొదలై, క్రీ.పూ 4000-3000 సంవత్సరాల దాకా కొనసాగింది. వేట, ఆహారసేకరణ ముఖ్య జీవనోపాధిగా బతికిన ఆనాటి మానవుడికి భూమిని మించిన దేవత లేదు. అయితే, అతడి భూమి కేవలం నేల కాదు. ఇప్పుడు మనం universe గా పరిగణిస్తున్నదంతా కూడా అతడికి భూమినే. ఆ భూమిలో దృశ్యప్రపంచంతో పాటు, పితృదేవతానీకంతో కూడుకున్న అదృశ్య ప్రపంచం కూడా ఉంది. కాబట్టి అతడు భూమినీ,పితృదేవతల్నీ ఆరాధించేవాడు. క్రీ.పూ నాలుగవ సహస్రాబ్దం నుండి క్రీ.పూ 600 దాకా, మానవచరిత్రలో వ్యావసాయిక యుగం మొదలయ్యాక, భూమి, నేలగానూ, నింగిగానూ విడిపోయింది. భూమికన్నా అకాశానికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఆకాశదేవతలు, సౌర, చాంద్ర, తారాదేవతలు, వారికి సంబంధించిన పురాణగాథల్తో కూడుకున్న సుమేరియన్, బేబిలోనియన్, అసీరియన్, ఈజిప్షియన్, గ్రీకు నాగరికతల్తో పాటు అవెస్తా, వైదిక దేవతలు, క్రతువులూ ఈ కాలానికి చెందినవే. క్రీ.పూ 600 నుంచి క్రీ.శ 600 దాకా ఒక ప్రవక్తని ఆధారం చేసుకున్న మతాలు ప్రభవించాయి. జొరాస్టరీయం, బౌద్ధం, జైనం, క్రైస్తవం, ఇస్లాం ఆ కోవకి చెందిన మతాలు. ఆ తర్వాత ఆయా మాతాల్లోనో లేక ఆ మతాలకి చెందిన వివిధ శాఖల్లోనో గురువుని కేంద్రంగా చేసుకున్న అసంఖ్యాకమైన విశ్వాసాలు, ఆరాధనా సంప్రదాయాలు ప్రభవిస్తూ వచ్చాయి.
ప్రతి దశలోనూ, కొత్త మతాలు పాతమతాలతో తీవ్రంగా తలపడ్డాయి.అసీరియన్-ఈజిప్షియన్ మతాలతో పాతనిబంధన ప్రవక్తలు తలపడ్డట్టు. కొన్ని సార్లు సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించేయి. ఋగ్వేదం లాగా. కాని ప్రతి సారీ కొత్త మతాలు పాతమతాల్ని వాటి క్రతుస్వభావంనుంచి బయటపడెయ్యడానికే ప్రయత్నించేయి, బుద్ధుడు వైదిక క్రతువులమీద తిరుగుబాటు చేసినట్టుగా. గ్రీకు దేవతలమీద, ఆ దేవతలని చిత్రించిన హోమర్, హెసియోద్ ల మీద తిరుబాటు చేసిన సోక్రటీస్, అతడి పూర్వపు ఋషులూ తీసుకొచ్చిన కొత్తధోరణిని philosophy (జ్ఞానప్రేమ)అన్నారు. కాని, ఆక్వినాస్, కాంట్, డెరిడా ల్ని చదివినవాళ్ళకి, philosophy కూడా ముసుగేసుకున్న మతమేననని స్పష్టంగా తెలుస్తుంది.
కాని, ఆదిమ మతవిశ్వాసాలనుంచి గురువు కేంద్రంగా వికసించిన విశ్వాసాల దాకా జరిగిన పరిణామంలో ఒక ముఖమైన మార్పు సంభవించింది. అదేమంటే, ఒకప్పుడు ఆదిమజాతులు భూమినీ-పితృదేవతల్నీ కొలిచినప్పుడు, వారికి తమ చుట్టూ ఉన్న దృశ్య-అదృశ్య ప్రపంచమంతా ఒక అఖండ అస్తిత్వం. అందులో ఏ భాగాన్ని తాకినా తక్కిన అస్తిత్వమంతా స్పందిస్తుందని వారు నమ్మేరు. కాని, రాను రాను ప్రవక్తలు, పవిత్రగ్రంథాలు, గురువులు కేంద్రంగా వికసించిన మతాల్లో, ఆయా విశ్వాసుల ప్రపంచం వారి విశ్వాసవర్గానికి మాత్రమే పరిమితమైపోయింది. అంటే, విశ్వమంతా ఒకే అస్తిత్వంగా భావించిన ఆదిమానవుడినుంచి, తన మతశాఖని మాత్రమే సవ్యమైందిగా భావించే ఆధునిక మానవుడిదాకా మతపరిణామం జరిగింది.
ఇట్లా ఒకప్పుడు మానవసముదాయమంతటినీ కలిపి ఉంచగలిగిన మతవిశ్వాసాలు మనుషుల్ని విడదీసేవిగా మారిపోయాయి. దీన్నుంచి బయటపడటానికి రెండు ప్రత్యామ్నాయాలు: ఒకటి, విశ్వాసాన్ని కాకుండా హేతువుని కేంద్రం చేసుకుని మనుషుల్ని కలపాలనే ప్రయత్నం. తత్త్వశాస్త్రమూ, సైన్సూ చేస్తూ వస్తున్నదిదే. కాని,మనుషులకి ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒకదానిపట్ల విశ్వాసం అవసరం. అది మనుషుల ఆధ్యాత్మిక అవసరం. అందుకని, రెండో ప్రత్యామ్నాయం, మతం (religion) నుండి ఆధ్యాత్మికత (spirituality) ని విడదీయడం. కాని, ఈ రెండో ప్రత్యామ్నాయానికున్న పెద్ద లోపమేమిటంటే, ఇది క్రతువుల్ని (ritual) తక్కువ చేస్తుంది. కాని, క్రతువులేని ఆధ్యాత్మికత, ఆచరణ లేని సిద్ధాంతం లాంటిది.
కాబట్టి, ఇప్పుడు మనుషుల ఆధ్యాత్మిక అవసరాలు తీరాలనీ, అదే సమయంలో వారి క్రతువులు వార్ని ఒకరినుంచి ఒకరిని వేరుచేసేవిగా ఉండకూడదనీ అనుకునేవాళ్ళు, కొత్త ritual ని అన్వేషిస్తున్నారు. అంతేకాక, మతాలు రెండవదశనుంచీ ఇప్పటిదాకా పూర్తిగా మానవకేంద్రీకృతంగా ఉన్నాయనీ, ఒక్క ఆదిమవిశ్వాసాలు మాత్రమే, మట్టినీ, మనుషుల్నీ, సమస్త ప్రాణికోటినీ ఒక్కటిగా చూడగలిగాయనీ, అందువల్ల, మనం కోరుకోవలసిన కొత్త క్రతుకాండ, మొత్తం పర్యావరణమంతటినీ ఒక్కలాగా భావించేదిగా ఉండాలనీ వాళ్ళు కోరుకుంటున్నారు.
ఇప్పుడు బ్రౌనింగ్ డ్రూయిడ్ల దారిలో కవిత్వం చెప్పినప్పుడు ఆమె కేవలం సర్వే జనా: సుఖినోభవంతు అనుకోవడం లేదు, సర్వ ప్రాణులూ సుఖంగా ఉండాలని కూడా కాదు, చేతనాచేతనాలతో కూడుకున్న స్థావరజంగమాత్మకమైన సమస్త విశ్వానికీ ఆమె శాంతి కోరుకుంటున్నది.
ఈ వాక్యాలు చూడండి:
'గతాన్ని మేల్కొల్పవలసిన తరుణం ఆసన్నమైంది
.. దాన్ని నెమరు వేసుకోవడానికి కాదు,
ఆవాహన చెయ్యడానికి
గతించిపోయిన చరిత్రల్ని నమోదు చెయ్యడానికి కాదు
ప్రాచీన జీవనపద్ధతులకి
మన జీవితాన్ని జోడించి
వాటిని పునర్నవం చెయ్యడానికి
ప్రాచీనవివేకస్రవంతిని పైకిలేపి
ఊషరక్షేత్రాలకు నీళ్ళు పెట్టవలసిన
సమయం సిద్ధమైంది.
ఆధునికం మన ఆకలి తీర్చలేకపోయింది
మనం ఆ చిన్నప్పటి మన ఇంటికోసం బెంగపెట్టుకున్నాం
ఇల్లంటే, మనం పుట్టి పెరిగిన ఇల్లు కాదు
మానవజాతికంతటికీ ఊయెలతొట్టిలాంటి
ప్రకృతి ఒడి.
మనమెక్కడినుంచి వచ్చామో మర్చిపోయాం
అయినా మనం గృహోన్ముఖులమైనాం
ఆధునిక జీవితంలోకి వలసవచ్చాం, కానీ
చివరికి మళ్ళా మనం చేరేది ఆ అడవికి, ఆ పొలానికే.
ఈ ఆకాశ హర్మ్యాల, నియాన్ దీపాల
విదేశంలో జీవిస్తున్నాం కానీ
ఇక్కడ మనం మనం కాము.
కాబట్టి, పునర్యాన తరుణం సమీపించింది
మన ఆరాటాలు మనల్ని పడమటికి లాక్కొచ్చాయి
కాని మన బెంగ మనల్ని తూర్పుదిశగా తిప్పుతున్నది'
ఇట్లా ఈ కావ్యం ఆసాంతం తెలుగు చెయ్యాలని ఉంది. మతాలకి అతీతమైన ఆధ్యాత్మికత కావాలంటే, మనం మనుష్యకేంద్ర విశ్వాసాల నుంచి పర్యావరణ కేంద్ర విశ్వాసానికి (ecological faith) పయనించాలన్నదే Oak Wise సారాంశం.

విదేశీ పిల్లవాని తెలుగు పలుకు

సిగ్గుగా ఉంది!  
ఈ విదేశీ చిన్నారి ముందు సిగ్గుతో తలదించుకోవాలనుంది!
తెలుగు రాని తెలుగు వారం! 
తెలుగు పలుకు పలకలేని మూగ వారం!
తెలుగు నాట తెలుగు నోట పలుకు వినలేని బధిరులం! (చెవిటివారం)!
తెలుగు రాత రాయలేని అవిటివారం! చదవలేని గుడ్డివారం
భాష మీద అభిమానం లేని... బ్రతికేందుకు భాషను చంపే కసాయి వారం!   
ఏదేశ మేగినా ఎందుకాలిడినా నిలుపరా నీజాతి నిండు గౌరవము అని వాపోయిన 
మన పెద్దాయన రాయప్రోలు ...
మన జాతి నిండు గౌరవాన్ని నిలబెడుతున్న ఈ విదేశీ పిల్లవాడు!
తెలుగు నెలలో విదేశీ భాషలు నేర్పే సీఫెల్ వంటి సంస్థలు ఎన్నో ఉన్నా...   
కానీ తెలుగు నేర్పేవి మాత్రం సున్నా! 
తెలుగు వారు ఇతర భాషలను ఎంతో సమర్ధవంతంగా నేర్చుకోగలరు 
అనర్గళంగా పలుక గలరు... తెలుగు తప్ప 
పురోగమనమా? తిరోగమనమా?
ఆలోచన రేకెత్తించిన ఓ విదేశీ చిన్నారి     
వర్ధిల్లు తమ్ముడా! వర్ధిల్లు నిండు నూరేళ్లు నిండుగా వర్ధిల్లు!!

 సత్యసాయి - విస్సా ఫౌండేషన్  

ఈ లింక్ క్లిక్ చేసి చూడండి 

Monday, July 18, 2016

కాగితాలను,పుస్తకాలను, మనుషులను కాళ్ళతో తగలకూడదు ఎందుకు?

హిందువుల ఇళ్ళల్లో, చిన్నప్పటినుంచీ కాగితాలకి, పుస్తకాలకి మరియు మనుషులకి కాళ్ళను తగలనివ్వ కూడదని నేర్పించబడుతుంది. ఒకవేళ పొరబాటున కాగితాలకి, పుస్తకాలకి, సంగీత సాధనాలకి లేదా ఏ ఇతరమైన విద్యా సంబంధమైన వస్తువులకి కాలు తగిలితే క్షమాపణకి గుర్తుగా కాలు తగిలిన వస్తువుని గౌరవపూర్వకముగా చేతితో తాకి కళ్ళకద్దుకోవాలని పిల్లలకు నేర్పబడుతుంది.
కాగితాలకు, మనుషులకు కాళ్ళు ఎందుకు తగలరాదు?భారతీయులకు జ్ఞానము పవిత్రము, దివ్యము ఐనది. అందువలననే దానికి ఎల్లవేళలా గౌరవమివ్వాలి. ఈ రోజుల్లో పాఠ్యంశములను ఆధ్యాత్మికము ఐహికము అని విడదీస్తున్నాము. కానీ ప్రాచీన భారతదేశములో ప్రతి విషయము శాస్త్ర సంబంధమైన లేక ఆధ్యాత్మ సంబంధమైనది అయినా సరే పవిత్రంగా పరిగణించి గురువుల చేత గురుకులాల్లో నేర్పించబడేది.
చదువుకి సంబంధించిన వస్తువులని తొక్క కూడదనే ఆచారము భారతీయ సంస్కృతి విద్యకు ఇచ్చే ఉన్నత స్థానాన్ని తరచూ గుర్తు చేస్తుంది. చిన్న తనమునుంచే ఈ విధముగా నేర్పడము వలన మనలో పుస్తకాల పట్ల, విద్య పట్ల శ్రద్దాభక్తులు నాటుకు పోతాయి. జ్ఞానాధి దేవతకు అర్పణగా సంవత్సరానికి ఒకసారి సరస్వతీ పూజ లేదా ఆయుధపూజ రోజున మనము పుస్తకాలని వాహనాలని మరియు పనిముట్లని పూజించడానికి కూడా ఇది ఒక కారణము. మనము చదువుకునే ముందు ఈ క్రింది విధంగా ప్రార్థిస్తాము .......
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
వరాలనిచ్చి, కోరికలని తీర్చే ఓ సరస్వతీ దేవీ! నా చదువును ఆరంభించే ముందర నీకు నమస్కారము చేస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా కోరికలు తీర్చుదువు గాక!
పిల్లలు పొరపాటున ఎవరికయినా కాళ్ళు తగిలినప్పుడు చాల భయపడతారు. ఒకవేళ పొరపాటున తగిలితే క్షమాపణకై మనము ఆ వ్యక్తిని చేతితో తాకి వేళ్ళను కళ్ళకు అద్దుకోవాలి. పెద్దవాళ్ళయినా చిన్నవాళ్ళని అజాగ్రత్తతో కాళ్ళతో తగిలితే, వారు వెంటనే క్షమాపణ చెప్తారు.
ఇతరులకి కాళ్ళు తాకడము చెడునడవడిగా పరిగణింప బడుతుంది - ఎందుకు?మానవుడు ఈ భూమి మీద ప్రాణముతో, భగవంతుని యొక్క చక్కటి ఆలయముగా పరిగణింప బడుతాడు. అందువల్ల ఇతరులను పాదాలతో తాకడము అంటే వారిలో నున్న దివ్యత్వాన్ని అగౌరపరచడం వంటిదే. అందుకే పొరపాటున తగిలినా కూడా వెంటనే భక్తీ, వినయములతో కూడిన క్షమాపణను చెప్పాలి.
పై విధముగా మన ఆచారములు చాల సరళమైనవి. కానీ అవి చాలా శక్తివంతమైన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సత్యాలను గుర్తుకు తెస్తాయి. ఇటువంటి ఆచారాలు శతాబ్దాలనుండి భారతీయ సంస్కృతిని సజీవముగా నిలబెట్టడానికి కారణమయ్యాయిఅని పెద్దలు చెపుతారు.

శుభసాయంత్రం!!


రేపు అనగా 19-07-2016న *గురుపూర్ణిమ*. ఈ సందర్భంగా గురుపూర్ణిమకు సంబందించిన కొన్ని విషయాలు మీఅందరితో పంచుకోవాలని అనుకుంటూ...మీ అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు.

ఓం శ్రీ గురుభ్యోం నమహా: ఓం శ్రీ మహాగణేశాయ నమహా : ఓం శ్రీ సరస్వత్యై నమహా:
" గురుపూర్ణిమ " పర్వదిన సందర్భంగా గురుదేవులందరికీ, ముఖపుస్తక మిత్రులకు, బందువులకు, చిన్నారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
గురుర్బ్రహ్మా గురువిష్ణు: గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమహా:
అంటూ పిల్లలకు విద్యాభ్యాసాన్ని ప్రారంబిస్తారు.పై శ్లోకం గురుదేవుడనే మాటకు అర్ధం చెపుతుంది.గురువు అంటే త్రిమూర్తులతో సమానమని ఉద్భోదిస్తోంది. మన " శ్రీ గురువు " కనులముందు కనిపించే మహానీయుడు. అందుకే ప్రతి శిష్యుడు గురువును దైవంగా పూజించాలి. మంచి విద్యాబుద్ధులు ప్రసాదించి, మంచి జీవితాన్నిచ్చిన గురువుకు శిరస్సు వంచి పాదాభి వందనం చేయాలని గుర్తు చేస్తోందీ గురు పూర్ణిమ.
మనిషి తన జీవితంలో తీర్చుకోలేనిది గురువు రుణం ఒక్కటే. అందువల్లనే " మాతృదేవోభవ " "పితృదేవోభవ " అన్న తరువాత " ఆచ్చార్యదేవోభవ " అని చెప్పి గురువు స్థానాన్ని తెలియచేసారు మన పూర్వీకులు. తల్లితండ్రి తరువాత స్థానం గురువుదే. దైవత్వాన్ని కుడా గురువు ద్వారానే దర్శించవలసి వుంటుంది.
ఈ సందర్భంగా గురువులకే గురువు, విజ్ఞాన ఖని, విశ్వ గురువు అయిన శ్రీ దత్తాత్రేయుడిని
జన్మ సంసార బన్ధఘ్నమ్స్వరూపానంద దాయకం
నిశ్రేయసప్రద వందే స్మర్త్రుగామీ నమావతు!
అని స్మరించుకుందాము. మహాభారత గ్రంధకర్త , మన పురాణాలలో పేర్కొన్న చిరంజీవులలో ఒకరైన వేదవ్యాసుడు జన్మించినది ఈరోజే. "వ్యాసో నారాయణో హరి:" అసలు ఈయన పేరు "కృష్ణద్వైపాయనుడు". భూత భవిష్య ధ్వర్తమానాల నెరిగిన మహా పౌరాణికుడు.ఋషులకే ఋషి, పండితులకే మహా పండితుడాయన.
"వ్యాసం వశిష్టనప్తారం శక్తే: పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాటం తపొనిధిమ్,
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే,
నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమహా:"
అని స్మరిసూ అదేవిధంగా ఆది గురువైన శంకరా చార్యులను, సదా శివుని స్వరూపమైన దక్షిణా మూర్తి ని స్మరిస్తూ ఆది నుండి ఈ నాటి గురువరేణ్యు లందరికీ శతసహస్ర పాదాభివందములు. గురు పూజోత్సవ శుబాకాంక్షలు.



Friday, July 15, 2016

నవ్వు నవ్వించు!!

“ఎంతోయ్ ఒక్కో అరటిపండు?” అడిగాడు శివకోటి పండ్లు అమ్మేకుర్రాడిని.
“ఒక్కోటి రూపాయి సార్” చెప్పాడతను.
“ముప్పావలాకిస్తావా?”
“ముప్పావలాకు తొక్కవస్తుంది.”
“సరే…. అయితే ఈ పావలా తీసుకుని తొక్క నువ్వుంచుకుని పండు నాకివ్వు” అన్నాడు శివకోటి.


శుభోదయం.../i\...

మంగళ మోశుభాంగ జయమంగళమో ఇలవేల్పుదైవమా 
మంగళమమ్మపద్మ  జయమంగళమో  యలివేలుమంగకున్
మంగళ మాత్మవాసునకు మంగళమో సకలార్థదాయికిన్
మంగళమాదిదేవునకు మంగళదాయికి తిర్మలేసుకున్!     






Thursday, July 14, 2016

నవ్వే నగుమోముకు అందం...ఆరోగ్యం.
బస్సు వెళ్తోంది. హఠాత్తుగా కనకరావు కేకపెట్టాడు.
"బాబూ.. నా పర్సు పోయింది. దాన్లో పదివేల రూపాయలున్నాయి. నా పర్సు నాకిస్తే వారికి వంద రూపాయలిస్తాను" ఏడుస్తూ అన్నాడు.
"నాకిస్తే ఐదొందలిస్తాను" మరో వ్యక్తి అరిచాడు.
"నాకిస్తే వెయ్యి"
"నాకిస్తే రెండు వేలు..."
"నాకిస్తే నాలుగు వేలు..."
"అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగా" అన్నాడొక ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ.
మనకు సంస్కృత భాష మాతృభాషవంటిది. అన్ని భాషలూ ఇందులోంచి పుట్టాయంటారు. సంస్కృత భాష చక్కగా తెలియాలంటే "పంచ కావ్యాము" లున్నాయి. అవి :
1. రఘువంశము
2. కుమారసంభవము
3. మేఘసందేశము.
4. కిరాతార్జునీయము
5. శిశుపపాలవధము
మొదటి మూడు కాళిదాసు రచనలు .
కిరాతార్జునీయము - ఇది రాసినది భారవి 
శిశుపపాలవధము.ఇది  రాసినది మాఘుడు.

* తొలి ఏకాదశి * పర్వదిన శుభాకాంక్షలు.

                                               'తొలిఏకాదశి'( 15-07-2016)

హిందూ సాంప్రదాయములో పరమపవిత్రమైన తిథి ఏకాదశి. ఏ మంచిపని ప్రారంభించినా దశమి, ఏకాదశులకోసం ఎదురుచూడటం అందరికీ అలవాటు.  ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తొలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట!  తొలిఏకాదశి వచ్చిందంటే ఇక వరుసగా పండుగలు వస్తాయన్నమాట! అప్పటికి రెండు నెలలుగా ఎలాంటి పండుగలూ లేక బోసిపోయిన ఇళ్ళకి కొత్తకళ వస్తుంది. ఈ ఏకాదశితో మొదలుపెడితే వెంటనే గురుపూర్ణిమ వస్తుంది. ఆషాడం వెళ్ళగానే శ్రావణమాసం నోములు, వ్రతాలు, తరువాత వినాయకచవితి, ఆపై దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి...ఇలా పండుగలు పండుగలు. ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.ఈరోజున ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించడం ఆచారంగా పాటిస్తారు భక్తులు.

చాలా ప్రాంతాల్లో ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.

చాలామంది ఈ తొలిఏకాదశి పర్వదినాన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఆ స్వామి అనుగ్రహం పొందుతారు.ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుందాము. మన సంస్కృతి ...సాంప్రదాయాలను రక్షించుకుందాము.

మరొక్కసారి అందరికీ * తొలి ఏకాదశి * పర్వదిన శుభాకాంక్షలు.

Wednesday, July 13, 2016

ముందుచూపు
ఒక అడవిలో చాలా పక్షులు కలిసి జీవిస్తూ ఉండేవి. ఆ అడవికి దగ్గర్లో ఉన్న పొలాలలో రైతులు రకరకాల పంటలు పండించేవారు. ఒకనాడు పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉండగా, క్రింద పొలంలో ఒక రైతు ఏవో గింజలు నాటుతూ కనబడ్డాడు. అన్ని పక్షులూ 'అది మామూలే' అనుకొని, తమ మానాన తాము ఎగురుకుంటూ‌వెళ్లిపోయాయి. కాని చురుగ్గా ఆలోచించే ఓ చిన్న పిచ్చుక మాత్రం ఆ పొలంలోకి దిగి, ఆ రైతు ఏం విత్తనాలు నాటుతున్నాడో గమనించింది జాగ్రత్తగా. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఆ పిచ్చుకకు అర్థమైపోయింది వెంటనే.
"ఆ రైతు తన పొలంలో జనప విత్తనాలు నాటుతున్నాడు. ఆ మొక్కల నుంచి వచ్చే నారతో తాళ్లనూ, వలలను తయారు చేస్తారు. ఆ వలలతో మన లాంటి పక్షులని, చేపలను పట్టుకుంటారు. అందుకని మనం వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి " అని తెలివైన ఆ పిట్ట తన జట్టు పక్షులతో అంది.
కాని, దాని మాటలను ఏ పక్షీ వినిపించుకోలేదు. కొన్ని రోజులకు పొలంలో జనప మొలకలు వచ్చాయి.
"ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇకనైనా మనం మేలుకోవాలి. వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి" అన్నది పిచ్చుక.
"ఆ... ఇప్పుడే ఏం తొందరొచ్చింది?!" అంటూ మిగతా పక్షులు దాని మాటలు పెడచెవిన పెట్టాయి.
రోజు రోజుకూ మొక్కలు పెరగసాగాయి! కొంతకాలం గడిచాక, "ఇక లాభం లేదు" అని, తెలివైన ఆ పిచ్చుక అక్కడినుండి మరో ప్రాంతానికి వలస వెళ్లిపోయింది.
ఇంకొంతకాలానికి నిజంగా ఆ పిచ్చుక చెప్పినట్లే జరిగింది. కొందరు మనుషులు జనపనారతో వలలను చేసి, వాటితో పిట్టలను, చేపలను పట్టడం మొదలుపెట్టారు. పిచ్చుక హెచ్చరికను పెడచెవిన పెట్టిన పిట్టలన్నీ ఆ వలలో చిక్కుకొని పోయాయి, పాపం!!
నవ్వే ఆరోగ్యం :
ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి
"ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.
"మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి.
"కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని" చెప్పాడు దంతనాధం
పట్టిసం వీరేశ్వరుడు

పట్టిసం, పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలానికి చెందిన గ్రామము. నిజానికి ఇది ఒక గ్రామముగా లెక్కలలో ఉన్నా ఇది ఒక ప్రసిద్ద శైవ క్షేత్రము. ఈ క్షేత్రము కొవ్వూరుకు 25 కి.మీ. దూరంలో ఉన్నది.

గోదావరీతీర పుణ్యక్షేత్రాలలో పట్టిసాచలం ఒకటి. ద్వాదశజ్యోతిర్లింగాలు, అష్టాదశశక్తి పీఠాలవలె దేశవ్యాప్తంగా ఉన్న వీరభద్రక్షేత్రాల్లో ఇదొకటి. అలాగే వీరభద్రస్వామి లింగరూపంలో పూజలందుకుంటున్న అరుదైన క్షేత్రాలలో ఇదొకటి. అందుకే..

శ్రీశైలం కాశి కేదారం కాళహస్తించ పట్టసం
పంచక్షేత్ర పఠేన్నిత్యం మహాపాతకనాశనం

అని అన్నారు. శ్రీశైలం, కాశి, కేదారం, కాళహస్తి, పట్టసం క్షేత్రాలను స్మరించినంతమాత్రానే సర్వపాతకాలు నశిస్తాయి. అగస్త్యమహర్షి కొల్లాపురానికి వెళుతూ లోపాముద్రకు పట్టసాచలంలో వెలసిన వీరభద్రస్వామి గురించి వివరించినట్లు శ్రీనాథ కవిసార్వభౌముడు తన కాశీఖండంలో ఈ క్రింద విధంగా వివరించాడు.

అంతః ప్రవాహమై యావిర్భవించె నే
ధరణీధరము పొంత దుల్యభాగ
పాఱెనే శైలము పాదమూలంబున
గల్లేటితో వృద్ధగంగవాసి
యుదయించె నేకొండ యుత్తరాశా రసా
తల క్షుక్షి సప్తగోదావరంబు
జనియించె నే శిలోచ్చయము దక్షిణమున
గణ్యవాహిని యుప్పుగడలికొమ్ము
దక్షిణానంద విపినమధ్యంబు నందు
గ్రతువిధి ధ్వంసవేళ దేవతలనుం పె
వీరభద్రేశుడీయద్రి వెన్నుదన్ని
గౌతమీవారి దవనాలు గడిగివాడు

స్థల పురాణం:
దాక్షారామంలో దక్షుడు యజ్ఞం చేసిన సమయంలో తండ్రిచే అవమానితురాలైన సతీదేవి ప్రాణత్యాగం చేసింది. అప్పుడు ఈశ్వరుని క్రోధావేశుడవగా, ఆ క్రోధాగ్ని నుంచి వీరభద్రుడు ఆవిర్భవించి యాగాగ్నిని ధ్వంసం చేసాడు. అక్కడివారిని పట్టసమనే దివ్యాస్త్రంతో నరికి, ఆ ఆయుధాన్ని ఇక్కడ కొండ దగ్గరున్న గోదావరీజలంలో కడిగి భద్రకాళీ సమేతుడై ఈ కొండపై వెలిసాడట.

ఇక స్థలపురాణం ప్రకారం సతీదేవి, శంకరుల వివాహానికి సమస్త దేవతలతో పాటు అన్నీ పర్వతాలు కూడ హాజరయ్యాయి. అప్పుడు కైలాస పర్వతం నీండుసభలో మిగతా పర్వతాలను అవమాన పరిచేట్లుగా మాట్లాడుతుంది. ముఖ్యంగా ఆదిశంకరుడు సతీసమేతంగా తమపై నివాసముంటున్నాడు కనుక, తన ఆధిక్యం మరింతగా పెరిగిందని చెబుతూ ప్రక్కనున్న దేవకూట పర్వతాన్ని అవమానపరుస్తుంది. ఆ పరాభవానికి తట్టుకోలేకపోయిన దేవకూటపర్వతం పుష్పగిరివైపు వచ్చే సరికి ఇంద్రుడు తన వజ్రాయుధంతో దాని రెక్కలను ఖండిస్తాడు. ఈ సంఘటనకు మరింతగా క్రుంగిపోయిన దేవకూట పర్వతానికి చేరుకోగా అటుగా వచ్చిన నారదుడు శివపంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. పంచాక్షరీప్రభావం వలన శివుడు ప్రత్యక్షంకాగా, దేవకూటపర్వతం స్వామిని సతీసమేతంగా తన శిరస్సుపై నివాసం ఉండమని కోరుకుంటుంది. అందుకు శివపరమాత్మ కాలాంతరంలో ఆ కోరిక నెరవేరుతుందని చెబుతాడు. అనంతర కాలంలో పిలువని యాగానికి వెళ్ళిన సతీదేవి యోగాగ్నిలో ప్రాణత్యాగం చేయడం, ఆ సంఘటనతో క్రోధావేశపూరితుడైన శివుని జటాజూటం నుండి వీరభద్రుడు ఆవిర్భవించి తన ఆయుధం పట్టిసంతో యాగాన్ని ధ్వంసం చేయడం, అక్కడున్న ఒక గుండం నుంచి భద్రకాళి కూడ ప్రభవించి యాగద్వంసం చస్తూండగా, దేవతల అభ్యర్థనపై అగస్త్యుడు వీరభద్రుని, భద్రకాళిని ప్రార్థిస్తాడు. గతంలో దేవకూట పర్వతానికి ఇచ్చిన వరం ప్రకారం భద్రకాళీ సమేతుడై ఇక్కడ కొలువుండమని వీరభద్రుని ఆలింగనం చేసుకున్నాడట. అలా వీరభద్రస్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిసాడట. ఇప్పటికీ ఆ స్వామి లింగరూపంపై అగస్త్యుని బాహువుల గుర్తులను చూడగలం. లింగాకృతిపై జటాజూటం ఉంది. ఇవన్నీ స్కాంద పురాణంలో ఉన్నాయి.

స్వామి ఇక్కడ వెలసినప్పట్నుంచి దేవకూట పర్వతం కైలాసంవలె పరమపావనమై, ప్రమథగణసేవితయై, మోక్షదాయక క్షేత్రంగా వెలుగొందుతోంది. ఇది శివకేశవులిద్దరికీ నిలయమైన మహాపుణ్యక్షేత్రం. తనను గురించి తపస్సు చేసిన దేవకూటునితో శివుడు, తాను అక్కడ వెలసేవరకు శ్రీమహావిష్ణువును గురించి తపస్సు చేయవలసిందనీ, అప్పుడు శ్రీమన్నారాయణుడు కూడ ఆ పర్వతంపై వెలయగలడని చెప్పాడట. అనంతరం జాంబవంతుడు కూడ ఇక్కడ తపస్సు చేయగా, ఆతని భక్తిని మెచ్చిన విష్ణువు భూనీళాదేవి సమేతుడై శ్రీభావనారాయణ స్వామిగా వెలసాడట. ఈస్వామి పాదసన్నిధిన జాంబవంతుని విగ్రహాన్ని చూడగలం. పట్టసాచల క్షేత్ర పాలకుడు శ్రీభావనారాయణుడే.

ఈ ఆలయం గురించి భద్రగిరిశతకంలో కూడ ఉదహరించబడింది. ధన్‌సా అనే బిరుదుగల ఇబ్రహీంఖాన్‌ భద్రాచలంలోని రామాలయాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నించగా, ముందుగానే ఆ విషయాన్ని తెలుసుకున్న అర్చకులు, సీతారాముల విగ్రహాలను పోలవరానికి తీసుకెళ్ళి సంతమామిళ్లలో తడికల చాటున, మరికొంత కాలం వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో దాచి ఉంచి, ఐదేళ్ళ తరువాత భద్రాచలానికి తీసుకెళ్ళినట్లు భద్రగిరిశతకంలోని పద్యాల ద్వారా తెలుస్తోంది.

ఆలయ విశిష్టత :
విజయనామ సంవత్సరంలో విగ్రహాలను తిరిగి భద్రాద్రికి చేర్చినప్పటికీ, సీతారాములు హనుమత్సమేతులై ఇక్కడ కూడ వెలిసారు. రావణుని చంపిన బ్రహ్మహత్యా పాతకనివృత్తికి శ్రీరామచంద్రుడు వీరభద్రేశ్వరుని ఆరాధించాడని పురాణకథనం. ఇంకా పరశురాముడు, శశాంకుడు, గరుడ, గంధర్వ, కిన్నెర, యక్ష సిద్దులు ఇక్కడి భద్రకుండంలో స్నాతులై భద్రకాళీ సమేతుడైన వీరభద్ర స్వామిని, శ్రీభూ, శ్రీనీళాదేవీ సమాయుక్తుడైన శ్రీభావనారాయణ స్వామిని అర్చించారట. ఈ క్షేత్రంలోనే అనిస్త్రీ, పునిస్త్రీలనే విగ్రహాలున్న దేవాలయం ఉంది. ఇదిచాలా చిన్న ఆలయం. సంతానహీనులైన స్త్రీలు 'అనిస్త్రీ' పాదాంగుష్ఠతాడనం చేయడం వలన సంతానవతులవుతారని, రజస్వలకాని కన్యలు 'పునస్త్రీ' అంగుష్ఠాతాడనం వల్ల పుష్పవతులవుతారని చెబుతారు.

చుట్టూ గోదవరి చేత ఆవరింపబడిన దేవకూట పర్వతంపై వీరేశ్వరాలయం తూర్పుముఖంగా ఉంది. గర్భాలయ, అంతరాళ, ముఖమండపాలుగా నిర్మించబడిన ఈ ఆలయాన్ని చేరుకోడానికి, దక్షిణం వైపు నుంచి 45 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. గోపురానికి వెలుపలి వైపు కాకతీయ కాలంనాటిదిగా భావించబడుతున్న గణపతి విగ్రహాన్ని చూడగలం.

కృతయుగం నుంచే ఉన్న ఈ ఆలయం కాకతీయులకాలంలో ప్రతాపరుద్రునిచే పునరుద్ధరించబడినట్లు, వారి కాలంలో అత్యున్నతస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. గర్భాలయంలో మూడు అడుగుల ఎత్తున్న పానపట్టంపై రెండున్నర అడుగుల ఎత్తుగల లింగరూపంలో వీరభద్రుడు నెలకొనిఉన్నాడు. లింగం పై భాగంపై శిఖను, అగస్త్యుడు స్వామిని ఆలింగనం చేసుకున్నందున ఆ ఋషి బాహువుల ముద్రలను నేటికీ లింగంపై స్పష్టంగా చూడగలం. అంతరాళం ద్వారంపై గజలక్ష్మి ఉంది. ముఖమండపం 16 స్తంభాలతో అలరారుతోంది. మధ్యనున్న నాలుగుస్తంభాల నడమ మూడు ఆడుగుల ఎత్తుగల నంది చూపరులను ఆకర్షిస్తోంది. నంది మండపానికి ఆగ్నేయ స్తంభంపై నాట్యగణపతి, నైఋతి స్తంభంపై నంది వాహనారూఢుడైన శివపార్వతులు, వాయువ్యస్తంభంపై గండభేరుండం, ఈశాన్యస్తంభంపై భైరవుడు, కన్నప్పలున్నారు.

పట్టసాద్రి సమంక్షేత్రం నాస్తి బ్రహ్మాండగోళకే

వీరభద్ర సమోదేవో నభూతో న భవిష్యతి

ఈ క్షేత్రంతో సమానమైన క్షేత్రం బ్రహాండ గోళంలోనే లేదనీ, వీరభధ్రేశ్వరునితో సమానుడైన దేవుడు లేడని చెబుతారు.

సౌకర్యాలు:
మునుపు దేవాలయము శిధిలమవడము వలన కొత్తగా దేవాలయ నిర్మాణము చేసారు. దేవాలయము చుట్టూ అందమైన తోటలు, పూలమొక్కలు, గడ్డి పెంచుతున్నారు. ఒకప్పుడు కనీసం మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు దేవాలయము పై బాగమునందు కూడా మంచి సౌకర్యాలు ఏర్పడినవి. ఉండేందుకు గదులు నిర్మించారు. త్రాగునీటి వసతులు. బోజనశాలలు ఏర్పడినవి. గోదవరి పడవల రేవు, స్నానాలరేవులను కొత్తగా ఏర్పాటు చేసినారు.

చేరుకునే మార్గం
ఈ క్షేత్రం రాజమండ్రి నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో కలదు. ప్రతిరోజూ రాజమండ్రి నుండి బస్సులు కలవు. లేదా ప్రకృతి ప్రేమికుల కొరకు వివిద ఆఫీసుల ద్వారా గోదావరిపై లాంచీల ద్వారా స్పీడు బోట్ల ద్వారా చేరుకొను వీలు కలదు. రాజమండ్రి నుండి గల మరొక సర్వీసు పాపికొండల టూర్. ఈ టూర్లో తప్పక పట్టిసీమ చేర్చబడి ఉంటుంది.

మరి తొందరలోనే వీలు, సెలవులు చూసుకుని ఈ క్షేత్రం చూసేద్దాం.ఏమంటారు?

శుభోదయం../\..

మనదేశాన్ని ఇలా సతత హరితం చెయ్యమని ఈ తరువు మనకు ఇస్తున్న మౌన సందేశం అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!!



Tuesday, July 12, 2016

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు.నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తేఅద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికితోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి, తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి. బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు. భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులకో, ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా పెద్దలు చెప్తారు. 
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
నవ్వు నవ్వించు ..
అనగనగా.....ఒక బీద కుటుంబం!?
బాగా ధనవంతుడైన ఒ సినిమా స్టార్‌ కొడుకుని స్కూల్లో ''బీద కుటుంబం'' అనే విషయం మీద వ్యాసం రాయమన్నారు.
ఆ కుర్రాడు ఇలా మొదలు పెట్టాడు.
''అనగనగా.....ఒక బీద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా బీదవాడు. తల్లి కూడా ఎంతో పేదది, పిల్లలు కూడా అంతే.....
వాళ్ళ కారు డ్రైవరు...వాళ్ళ తోట మాలి, వంటమనిషి పాపం అంతా పేదవారే.
చివరకు వాళ్ళ ఇంట్లో పనిచేసే నౌఖరు కూడా పేదవాడే.
ఒక రోజున వాళ్ళు పాపం.... తినడానికి తిండిలేక కారులో బయలుదేరారు.....''



శివలింగ వృక్షం శివుడి జటాజూట ఆకృతి లో వెంట్రుకలు 

విప్పరినట్లుగా ఉంటుంది. ఈ చెట్టుకి పూసే పుష్పాలు కొమ్మలకి 

పూయకుండా వెంట్రుకలలాంటి జడలకు పూస్తాయి. పువ్వు 

పైభాగాన నాగపడగ కప్పినట్లుగా ఉండి లోపల 

శివలింగాకృతిలో ఉంటాయి.అందుకే ఈ పుష్పాలను 

శివలిన్గాపుష్పాలను నాగమల్లి పుష్పాలు, మల్లికార్జున పుష్పాలు 

అని పిలుస్తారు. ఈ పుష్పాలు అద్భుతమైన సుగంధ 

పరిమళాన్ని కలిగి ఉంటాయి.ఆ పరమేశ్వరుడు ఈ శివలింగ 

పుష్పం రూపంలో కొలువై ఉన్నాడని భక్తులు భావిస్తారు. ఈ 

శివలింగ పుష్పాలు శివుడికి, మరియు సమస్త దేవతలకి 

ప్రీతికరమైన పుష్పాలు. ఈ పుష్పాలతో పూజ చేయడం 

శివభక్తులకి ఒక వరం. శివలింగ పుష్పాలతో ఆ పరమేశ్వరుని 

పూజ చేసినవారు జన్మరాహిత్యం పొంది చివరకు కైవల్యం 

పొందుతారని శివపురాణం లో ఉన్నది. 


శ్రీ పరమేశ్వరార్పణమస్తు!!






Monday, July 11, 2016

నవ్వే ఆరోగ్యం :-
" నీ జీవితంలోకి ఆరుగురు అమ్మాయిలు వస్తారు కాంతారావు '' అని కాంతారావు చేయి
చూస్తూ చెప్పాడు జ్యోతిష్యుడు.
దానికి సంబరపడుతూ, కాంతారావు "నిజమా! ఇదిగో వంద! ఎప్పుడు వస్తారు ?, ఎలా
వస్తారు ? '' అని మరింత మురిపెంగా ముందుకు చేయి చూపిస్తూ అడిగాడు.
వంద జేబులో పెట్టుకుంటూ "ఎలా ఏమిటి కాంతారావు...ఒక భార్య, ఐదుగురు కూతుళ్లూ "
అని చెప్పాడు జ్యోతిష్యుడు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కాంతారావు.
హనుమంతునికి ఇష్టమైన పువ్వులు
జానకీ శోక నాశనుడు ఆంజనేయుడు. ఆయనకు మొల్ల, పొన్నపువ్వు, మొగలి, పొగడ, నందివర్ధనము, మందారము, కడిమి, గజనిమ్మ, పద్మము, నల్లకలువ, ఎర్ర గన్నేరు, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, కనకాంబర, ములుగోరిట, మెట్ట తామర, పొద్దు తిరుగుడు పువ్వులంటే చాలా ఇష్టం
అలాగే మంకెన, బండికెరి వెంద, అడవిమల్లె, కొండగోగు దింటెన, జిల్లేడు, సురపున్నాగ, కుంకుమ పువ్వు, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం వంటి పుష్పాలతో పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ఇంకా పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, రుధ్ర జడ, తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఇష్టమని పండితులు అంటున్నారు. ఈ పుష్పాలతో స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతున్నారు.

శుభోదయం 
ప్రతి సూర్యాస్తమయం జీవితంలో ఒకరోజును తగ్గిస్తుంది కానీ 
ప్రతి సూర్యోదయం ఆశలతో కూడిన ఒక రోజును ఇస్తుంది.





Saturday, July 9, 2016

               
            తలంటు స్నానం తో ఎన్ని లాభాలో !!

మన భారతీయ జీవన విధానములో స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత వుంది . ప్రతీ రోజు 


స్నానం చెయ్యడం మన పద్దతి .కొంతమంది రెండు పూటలా చేస్తారు .పండగ వచ్చినపుడు 

ప్రత్యేక  స్నానం చెయ్యడం అందరికి తెలిసిందే .వస్తు గుణ దీపిక లో తలంటు స్నానం 

గురించి వ్రాయబడింది. సంక్రాంతి నాడు తలంటు స్నానం ఒక ప్రత్యేక  కార్యక్రమమని 

అందరికి తెలుసు .తలంటు స్నానాన్ని అభ్యంగన  స్నానమని అంటారు . కొబ్బరి 

నూనె,నువ్వులనూనె,ఆవునెయ్యి ,ఆముదం వీటిలో దేనినైన అభ్యంగన  స్నానానికి వాడవచ్చు 

.నూనె చాలా మంచిది .ముందుగా నూనె శరీరానికి బాగా పట్టించి మర్దనా చెయ్యాలి .కనీసం 

పదినిమిషాలు ఆగిన తర్వాత సున్నిపిండిలో తగినంత నీరు పోసి కలిపి  నలుగు పెట్టాలి ,

తర్వాత మరో పది నిమిషాలు ఆగాలి తర్వాత పొడి పిండి తో మొత్తం దేహానికి పట్టిన నలుగును 

వదిలించుకోవాలి. తర్వాత శరీరమంతా శుభ్రపడేలా రెండు బకెట్ నీళ్ళతో స్నానం చెయ్యాలి. 

ఈ విధముగా చేయడం వలన గజ్జి, చిడుము, సర్పి, దద్డురులు మొ .చర్మ రోగములు 

,దుస్వప్నములు దరి చేరావు. శరీరం మీద మలినాలను ,దుర్గందాల ను పోగొడుతుంది సుఖ 

నిద్ర ,శరీరం తేలికగా వుండడం ,దేహానికి పుష్టి,కాంతి , మృదుత్వం కలుగుతుంది. కండ్లకు 

చలవ చేస్తుంది, పైత్యాన్ని అనుస్తుంది .వృదాప్యం తొందరగా రాదు,అలసటనూ, వాతమును 

పోగొడుతుంది.సుఖ నిద్ర పట్టును, కాంతి, ఆయుష్షు పెరుగుదల ,బుద్ధి బలిమి ,దేహపుష్టి ,వీర్య 

వృద్ది కలుగుతాయి .జటరాగ్ని బాగుంటుంది .దేహము కాళ్ళు చేతులు ,గోళ్ళు, శిరస్సులందు 

పుట్టిన తాపమును ,మంటలను పోగొట్టును .మాడపట్టున చమురు ను వుంచి మర్దించడం వలన 

చెవులకు ,తక్కిన అవయములకు బలము నిచ్చును .తలవెంట్రుకలు 

వృద్ధిపరుచును ,మృదుత్వాన్ని ఇచ్చును .అరిపాదాలకు చమురు మర్దించడం వలన 

మంటలను పోగొట్టును .అరికాళ్ళ నొప్పులు హరించును .

అబ్యాన్గన స్నానం వలన ఇన్ని రకముల ప్రయోజనములు ఉన్నాయి  కాబట్టే మన పూర్వీకులు 

స్నానానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు .

ఆధునిక యుగంలో   అభ్యంగన స్నానానికి ప్రాధాన్యత తగ్గిపోవడము వలన దేహానికి 

అనారోగ్యం ఎక్కువ అవుతోంది .పూర్వ కాలంలో చర్మ వ్యాధులు చాలా తక్కువుగా ఉండేవి. 

వారం వారం అభ్యంగన  స్నానం చాలామంచిది .కనీసం పండగలలోనైనా  అభ్యంగన స్నానం 

చేస్తే ఎంతో   మంచిది .ఏమంటారు ? మీ అభిప్రాయం తెలుపండి.    

                             ../I\...
కులము కన్నా మంచి గుణము గొప్పది : వేమన

పూజ కన్నా నెంచ బుద్ధి నిదానంబు
మాట కన్నా నెంచ మనసు దృఢము
కులము కన్నా మిగుల గుణమే ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ
గురి కుదరని పైపై పూజ కంటే నిశ్చలమైన జ్ఞానం ముఖ్యం. మారే మాటల కంటే అచంచలమైన మనస్సు ప్రధానం. సామాజికంగా ఏర్పడిన లక్షణం స్వభావతః ఏర్పడిన లక్షణం ఎన్నదగినది. బాహ్యంగా చేసే పనులు సరే, వాటికి మూలాలు లోపల ఉన్నాయా, లేదా అని చూసుకొమ్మంటున్నాడు వేమన. పాత మాటే కావచ్చు. కాని ఎప్పటికి పాతపడని మాట అని గుర్తించుకోవాలి.
పూజ అంటే తెలియనిదెవరికి? అర్చన, దేవుడిని కొలవడం. బుద్ధి అంటే బోధ చేత ప్రకాశించేది. బోధ అంటే జ్ఞానం, అంటే వస్తువు యొక్క యదార్థ గుణాన్ని తెలిపేది. నిదానం అంటే నెమ్మది, ఓపిక అనే అర్థాలున్నా ఇక్కడ కారణం, మూల హేతువు.
అలాగే మాట అంటే పైకి చెప్పేది. మనస్సు అంటే చిత్తం. ఇది జీవాత్మకంటే భిన్నమైంది. జ్ఞానం పుట్టేది దీనిలోంచే. పైకి చెప్పే మాటకు పునాది మనస్సులో ఉంటే, ఆ మాటకు కాంతి ఉంటుంది. మనసులో పుట్టిన జ్ఞానం స్థిరమైనది అని సారాంశం.
ఇక కులం, ఇది మనిషి పుట్టిన తర్వాత వచ్చిందే. సామాజికంగా దీనిలో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. కాని మౌలికంగా మనిషి గుణమే గొప్పది.
పెద్దలమాట చద్దిమూట!!


మీ పిల్లలు ఓడిపోయారని తిట్టకండి

గెలవడానికి మరో ప్రయత్నం ఉందని గుర్తు చెయ్యండి

ఎందుకంటే తిడితే వారిని వారు తక్కువగా చేసుకొని

చేతకానివారిలా తయారు అవుతారు

తప్పేదో ఒప్పేదో నిదానంగా చెప్పండి

లేదంటే చెడి పోవటానికి దారులు వెతుక్కుంటారు !!!

Friday, July 8, 2016

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?

మహిళలకు ఇష్టమైనది గోరింటాకు. గోరింటా పూసిందీ కొమ్మా లేకుండా... మురిపాలా అరచేతా మొగ్గా తొడిగిందీ ... అని ఓ కవి ఎంతో రమ్యంగా గోరింటాకు అందాలను వర్ణిం చాడు. .గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదు. చిన్నపిల్లల  నుండి బామ్మ వరకూ అందరినీ మురిపించే ముద్దుటాకు!అట్లతద్ది తర్వాత అందరూ ప్రత్యేకంగా పెట్టుకొనేది ఆషాడంలోనే.  పండుగలైనా.. ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు.ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.. కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.. ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది.ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తోంది .. అనగానే ఈ కోనులూ....కొత్తరకాల డిజైనులూ ఎన్ని ఉన్నా  ఆకు రుబ్బి
( బాగా పండటానికి అందులో చింతపండు, పటిక, కుండపెంకు వేసి  రుబ్బుతారు.)
వేళ్ళ నిండుగా ...అరచేత చందమామ, చుక్కలు, రెండుకాళ్లకు  పారాణి  పెట్టుకోవడమంటేనే చాలామందికి ఇష్టం.ఈ ఆషాడం లోనే  ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగామెరిసిపోతుంటాయి.ముద్దుపాపలు అమ్మ ఒడిచేరి నా చేయికంటే గోరింటాకు రుబ్బిన నీచేయి ఎర్రగా పండిందేమంటూముద్దు ముద్దుగా..గారాలు పోతారు .ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడంటూ అమ్మమ్మలు అన్న మాటలు గుర్తుచేసుకుంటూ ...నీకెలా పండిందంటే నీకెలా పండిందంటూ రాబోయే వరుడ్ని అరచేతి గోరింట చూసుకొని మురిసిపోతారు కన్నె బంగారు తల్లులు . కొత్త పెళ్ళికూతురు ఆషాఢపు వియోగం మరచి పండిన ఎరుపు చూసుకొని ...మగని ప్రేమ తలచుకొని సిగ్గుల మొగ్గయిపోతుంది. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక ఉన్న మర్మమేంటో.. మీకు తెలుసా..?ఆషాఢమాసంతో గ్రీష్మ ఋతువు పూర్తిగా వెళ్లిపోయి.. వర్షరుతువు ప్రారంభమౌతుంది.గ్రీష్మంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది.. మన శరీరంలో ఉన్న వేడి.. బయట చల్లబడిన వాతావరణం పరస్పరవిరుద్ధం కాబట్టి అనారోగ్యాలు మొదలౌతాయి. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది.తడిలో,నీళ్ళల్లో పని చేసే ఆడవారికి కాలి వేళ్ళ సందున పాయటం, మడమలు పగలటం సహజం. వానాకాలమైతే మరీనూ. గోరింటాకు పెట్టుకుంటే ఆ బాధలకి ఉపశమనం లభిస్తుంది. అందుకే తప్పనిసరిగా ఆషాఢ మాసంలోను,అట్ల తద్దికి, ఉండ్రాళ్ళ తద్దికి ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలని నియమం ఏర్పరచారు మన పెద్దలు. ఇది సంప్రదాయం పేరుతో ఏర్పాటుచేసిన వ్యాధి నివారణ కార్యక్రమం. ఆ విధంగా చెప్పకపోతే ఆడవాళ్ళు తమ గురించి తాము పట్టించుకుంటారా? గోరింటాకులో ఉన్న ఔషధీ గుణం పిప్పిగోళ్ళని గోరుచుట్టుని రాకుండా నివారిస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అందువల్లే గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతారు.ఆడవారే కాదు మగవారు కూడా చాలా మంది ఈ గోరింటాకును పెట్టుకుని మురిసిపోతారు. మహిళలు.. ఈ ఆషాడంలో అందంతో పాటు..ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీ అరచేతుల నిండా నింపుకోండి.
పెద్దలమాట చద్దిమూట!!!


శుభోదయం../\..

ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ!!

అన్నిమతములకును ఆరాధ్య దైవము
ఒక్కడైన పేర్లు పెక్కుగలవు
వేరువేరు నదులు - చేరును సంద్రాన
గతులు వేరుగాని గమ్యమొకటే!!!


Thursday, July 7, 2016


శుభోదయం 
ధన..ధాన్య ప్రదేదేవి దారిద్య్ర  విధ్వంసినీ శ్రీ మహాలక్ష్మి  నమో నమః ఎన్ని జన్మల పుణ్యఫలమో - నిను కొల్చు భాగ్యం బైనది.పరమపావనమైన నీదు సన్నిధానమె..పెన్నిధి కోరి కొలిచినవారి కెన్నోకోర్కెలను కురిపించినావు నేరమెంచక నన్ను దయతో చేరదీసి బ్రోవుమమ్మా!! 


Total Pageviews