Wednesday, July 13, 2016

పట్టిసం వీరేశ్వరుడు

పట్టిసం, పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలానికి చెందిన గ్రామము. నిజానికి ఇది ఒక గ్రామముగా లెక్కలలో ఉన్నా ఇది ఒక ప్రసిద్ద శైవ క్షేత్రము. ఈ క్షేత్రము కొవ్వూరుకు 25 కి.మీ. దూరంలో ఉన్నది.

గోదావరీతీర పుణ్యక్షేత్రాలలో పట్టిసాచలం ఒకటి. ద్వాదశజ్యోతిర్లింగాలు, అష్టాదశశక్తి పీఠాలవలె దేశవ్యాప్తంగా ఉన్న వీరభద్రక్షేత్రాల్లో ఇదొకటి. అలాగే వీరభద్రస్వామి లింగరూపంలో పూజలందుకుంటున్న అరుదైన క్షేత్రాలలో ఇదొకటి. అందుకే..

శ్రీశైలం కాశి కేదారం కాళహస్తించ పట్టసం
పంచక్షేత్ర పఠేన్నిత్యం మహాపాతకనాశనం

అని అన్నారు. శ్రీశైలం, కాశి, కేదారం, కాళహస్తి, పట్టసం క్షేత్రాలను స్మరించినంతమాత్రానే సర్వపాతకాలు నశిస్తాయి. అగస్త్యమహర్షి కొల్లాపురానికి వెళుతూ లోపాముద్రకు పట్టసాచలంలో వెలసిన వీరభద్రస్వామి గురించి వివరించినట్లు శ్రీనాథ కవిసార్వభౌముడు తన కాశీఖండంలో ఈ క్రింద విధంగా వివరించాడు.

అంతః ప్రవాహమై యావిర్భవించె నే
ధరణీధరము పొంత దుల్యభాగ
పాఱెనే శైలము పాదమూలంబున
గల్లేటితో వృద్ధగంగవాసి
యుదయించె నేకొండ యుత్తరాశా రసా
తల క్షుక్షి సప్తగోదావరంబు
జనియించె నే శిలోచ్చయము దక్షిణమున
గణ్యవాహిని యుప్పుగడలికొమ్ము
దక్షిణానంద విపినమధ్యంబు నందు
గ్రతువిధి ధ్వంసవేళ దేవతలనుం పె
వీరభద్రేశుడీయద్రి వెన్నుదన్ని
గౌతమీవారి దవనాలు గడిగివాడు

స్థల పురాణం:
దాక్షారామంలో దక్షుడు యజ్ఞం చేసిన సమయంలో తండ్రిచే అవమానితురాలైన సతీదేవి ప్రాణత్యాగం చేసింది. అప్పుడు ఈశ్వరుని క్రోధావేశుడవగా, ఆ క్రోధాగ్ని నుంచి వీరభద్రుడు ఆవిర్భవించి యాగాగ్నిని ధ్వంసం చేసాడు. అక్కడివారిని పట్టసమనే దివ్యాస్త్రంతో నరికి, ఆ ఆయుధాన్ని ఇక్కడ కొండ దగ్గరున్న గోదావరీజలంలో కడిగి భద్రకాళీ సమేతుడై ఈ కొండపై వెలిసాడట.

ఇక స్థలపురాణం ప్రకారం సతీదేవి, శంకరుల వివాహానికి సమస్త దేవతలతో పాటు అన్నీ పర్వతాలు కూడ హాజరయ్యాయి. అప్పుడు కైలాస పర్వతం నీండుసభలో మిగతా పర్వతాలను అవమాన పరిచేట్లుగా మాట్లాడుతుంది. ముఖ్యంగా ఆదిశంకరుడు సతీసమేతంగా తమపై నివాసముంటున్నాడు కనుక, తన ఆధిక్యం మరింతగా పెరిగిందని చెబుతూ ప్రక్కనున్న దేవకూట పర్వతాన్ని అవమానపరుస్తుంది. ఆ పరాభవానికి తట్టుకోలేకపోయిన దేవకూటపర్వతం పుష్పగిరివైపు వచ్చే సరికి ఇంద్రుడు తన వజ్రాయుధంతో దాని రెక్కలను ఖండిస్తాడు. ఈ సంఘటనకు మరింతగా క్రుంగిపోయిన దేవకూట పర్వతానికి చేరుకోగా అటుగా వచ్చిన నారదుడు శివపంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. పంచాక్షరీప్రభావం వలన శివుడు ప్రత్యక్షంకాగా, దేవకూటపర్వతం స్వామిని సతీసమేతంగా తన శిరస్సుపై నివాసం ఉండమని కోరుకుంటుంది. అందుకు శివపరమాత్మ కాలాంతరంలో ఆ కోరిక నెరవేరుతుందని చెబుతాడు. అనంతర కాలంలో పిలువని యాగానికి వెళ్ళిన సతీదేవి యోగాగ్నిలో ప్రాణత్యాగం చేయడం, ఆ సంఘటనతో క్రోధావేశపూరితుడైన శివుని జటాజూటం నుండి వీరభద్రుడు ఆవిర్భవించి తన ఆయుధం పట్టిసంతో యాగాన్ని ధ్వంసం చేయడం, అక్కడున్న ఒక గుండం నుంచి భద్రకాళి కూడ ప్రభవించి యాగద్వంసం చస్తూండగా, దేవతల అభ్యర్థనపై అగస్త్యుడు వీరభద్రుని, భద్రకాళిని ప్రార్థిస్తాడు. గతంలో దేవకూట పర్వతానికి ఇచ్చిన వరం ప్రకారం భద్రకాళీ సమేతుడై ఇక్కడ కొలువుండమని వీరభద్రుని ఆలింగనం చేసుకున్నాడట. అలా వీరభద్రస్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిసాడట. ఇప్పటికీ ఆ స్వామి లింగరూపంపై అగస్త్యుని బాహువుల గుర్తులను చూడగలం. లింగాకృతిపై జటాజూటం ఉంది. ఇవన్నీ స్కాంద పురాణంలో ఉన్నాయి.

స్వామి ఇక్కడ వెలసినప్పట్నుంచి దేవకూట పర్వతం కైలాసంవలె పరమపావనమై, ప్రమథగణసేవితయై, మోక్షదాయక క్షేత్రంగా వెలుగొందుతోంది. ఇది శివకేశవులిద్దరికీ నిలయమైన మహాపుణ్యక్షేత్రం. తనను గురించి తపస్సు చేసిన దేవకూటునితో శివుడు, తాను అక్కడ వెలసేవరకు శ్రీమహావిష్ణువును గురించి తపస్సు చేయవలసిందనీ, అప్పుడు శ్రీమన్నారాయణుడు కూడ ఆ పర్వతంపై వెలయగలడని చెప్పాడట. అనంతరం జాంబవంతుడు కూడ ఇక్కడ తపస్సు చేయగా, ఆతని భక్తిని మెచ్చిన విష్ణువు భూనీళాదేవి సమేతుడై శ్రీభావనారాయణ స్వామిగా వెలసాడట. ఈస్వామి పాదసన్నిధిన జాంబవంతుని విగ్రహాన్ని చూడగలం. పట్టసాచల క్షేత్ర పాలకుడు శ్రీభావనారాయణుడే.

ఈ ఆలయం గురించి భద్రగిరిశతకంలో కూడ ఉదహరించబడింది. ధన్‌సా అనే బిరుదుగల ఇబ్రహీంఖాన్‌ భద్రాచలంలోని రామాలయాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నించగా, ముందుగానే ఆ విషయాన్ని తెలుసుకున్న అర్చకులు, సీతారాముల విగ్రహాలను పోలవరానికి తీసుకెళ్ళి సంతమామిళ్లలో తడికల చాటున, మరికొంత కాలం వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో దాచి ఉంచి, ఐదేళ్ళ తరువాత భద్రాచలానికి తీసుకెళ్ళినట్లు భద్రగిరిశతకంలోని పద్యాల ద్వారా తెలుస్తోంది.

ఆలయ విశిష్టత :
విజయనామ సంవత్సరంలో విగ్రహాలను తిరిగి భద్రాద్రికి చేర్చినప్పటికీ, సీతారాములు హనుమత్సమేతులై ఇక్కడ కూడ వెలిసారు. రావణుని చంపిన బ్రహ్మహత్యా పాతకనివృత్తికి శ్రీరామచంద్రుడు వీరభద్రేశ్వరుని ఆరాధించాడని పురాణకథనం. ఇంకా పరశురాముడు, శశాంకుడు, గరుడ, గంధర్వ, కిన్నెర, యక్ష సిద్దులు ఇక్కడి భద్రకుండంలో స్నాతులై భద్రకాళీ సమేతుడైన వీరభద్ర స్వామిని, శ్రీభూ, శ్రీనీళాదేవీ సమాయుక్తుడైన శ్రీభావనారాయణ స్వామిని అర్చించారట. ఈ క్షేత్రంలోనే అనిస్త్రీ, పునిస్త్రీలనే విగ్రహాలున్న దేవాలయం ఉంది. ఇదిచాలా చిన్న ఆలయం. సంతానహీనులైన స్త్రీలు 'అనిస్త్రీ' పాదాంగుష్ఠతాడనం చేయడం వలన సంతానవతులవుతారని, రజస్వలకాని కన్యలు 'పునస్త్రీ' అంగుష్ఠాతాడనం వల్ల పుష్పవతులవుతారని చెబుతారు.

చుట్టూ గోదవరి చేత ఆవరింపబడిన దేవకూట పర్వతంపై వీరేశ్వరాలయం తూర్పుముఖంగా ఉంది. గర్భాలయ, అంతరాళ, ముఖమండపాలుగా నిర్మించబడిన ఈ ఆలయాన్ని చేరుకోడానికి, దక్షిణం వైపు నుంచి 45 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. గోపురానికి వెలుపలి వైపు కాకతీయ కాలంనాటిదిగా భావించబడుతున్న గణపతి విగ్రహాన్ని చూడగలం.

కృతయుగం నుంచే ఉన్న ఈ ఆలయం కాకతీయులకాలంలో ప్రతాపరుద్రునిచే పునరుద్ధరించబడినట్లు, వారి కాలంలో అత్యున్నతస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. గర్భాలయంలో మూడు అడుగుల ఎత్తున్న పానపట్టంపై రెండున్నర అడుగుల ఎత్తుగల లింగరూపంలో వీరభద్రుడు నెలకొనిఉన్నాడు. లింగం పై భాగంపై శిఖను, అగస్త్యుడు స్వామిని ఆలింగనం చేసుకున్నందున ఆ ఋషి బాహువుల ముద్రలను నేటికీ లింగంపై స్పష్టంగా చూడగలం. అంతరాళం ద్వారంపై గజలక్ష్మి ఉంది. ముఖమండపం 16 స్తంభాలతో అలరారుతోంది. మధ్యనున్న నాలుగుస్తంభాల నడమ మూడు ఆడుగుల ఎత్తుగల నంది చూపరులను ఆకర్షిస్తోంది. నంది మండపానికి ఆగ్నేయ స్తంభంపై నాట్యగణపతి, నైఋతి స్తంభంపై నంది వాహనారూఢుడైన శివపార్వతులు, వాయువ్యస్తంభంపై గండభేరుండం, ఈశాన్యస్తంభంపై భైరవుడు, కన్నప్పలున్నారు.

పట్టసాద్రి సమంక్షేత్రం నాస్తి బ్రహ్మాండగోళకే

వీరభద్ర సమోదేవో నభూతో న భవిష్యతి

ఈ క్షేత్రంతో సమానమైన క్షేత్రం బ్రహాండ గోళంలోనే లేదనీ, వీరభధ్రేశ్వరునితో సమానుడైన దేవుడు లేడని చెబుతారు.

సౌకర్యాలు:
మునుపు దేవాలయము శిధిలమవడము వలన కొత్తగా దేవాలయ నిర్మాణము చేసారు. దేవాలయము చుట్టూ అందమైన తోటలు, పూలమొక్కలు, గడ్డి పెంచుతున్నారు. ఒకప్పుడు కనీసం మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు దేవాలయము పై బాగమునందు కూడా మంచి సౌకర్యాలు ఏర్పడినవి. ఉండేందుకు గదులు నిర్మించారు. త్రాగునీటి వసతులు. బోజనశాలలు ఏర్పడినవి. గోదవరి పడవల రేవు, స్నానాలరేవులను కొత్తగా ఏర్పాటు చేసినారు.

చేరుకునే మార్గం
ఈ క్షేత్రం రాజమండ్రి నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో కలదు. ప్రతిరోజూ రాజమండ్రి నుండి బస్సులు కలవు. లేదా ప్రకృతి ప్రేమికుల కొరకు వివిద ఆఫీసుల ద్వారా గోదావరిపై లాంచీల ద్వారా స్పీడు బోట్ల ద్వారా చేరుకొను వీలు కలదు. రాజమండ్రి నుండి గల మరొక సర్వీసు పాపికొండల టూర్. ఈ టూర్లో తప్పక పట్టిసీమ చేర్చబడి ఉంటుంది.

మరి తొందరలోనే వీలు, సెలవులు చూసుకుని ఈ క్షేత్రం చూసేద్దాం.ఏమంటారు?

No comments:

Post a Comment

Total Pageviews