Sunday, July 3, 2016

ఋతుపవన మేఘాలు ఆకాశమంతా ఆవరించాయి,...Vadrevu Ch Veerabhadrudu

ఋతుపవన మేఘాలు ఆకాశమంతా ఆవరించాయి,జల్లులు రాలడం మొదలయ్యింది. కాని నా మనసింకా బైరాగి కవితా వాక్యం దగ్గరే ఆగిపోయింది.Ramarao Kanneganti గుర్తు చేసిన వాక్యం, విందాకరందీకర్ కవితకు బైరాగి చేసిన అనువాదం.
విందా కరందీకర్, (గోవింద వినాయక్ కరందీకర్ (1918-2010)ఆధునిక మరాఠీ సాహిత్యంలో అగ్రగామి కవి, జ్ఞానపీఠ సత్కారం పొందినవాడు, ఆయన తన ముందు తరం కవి,తన మార్గదర్శకుడు బాలసీతారాం మర్దేకర్ (1909-1956)కి నివాళి ఘటిస్తూ రాసిన వాక్యం:
'బాధల పొక్కులు గిల్లి జీవితాన్ని దర్శించిన వారి కనుల హారతులొస్తాయి నేడు నీ పూజకు.. '
ఆదిత్యకి ఫోన్ చేసాను, ఆ సంభాషణ చూసావా అనడిగాను.
రామారావు ఆ వాక్యం ప్రస్తావించి నన్నూ, ఆదిత్యనీ కూడా అపారమైన అశాంతికీ, అంతర్మథనానికీ గురిచేసాడని అర్థమయింది.
అదిత్య అన్నాడు కదా: 'ఆ సంభాషణలో మీ సమాధానం కూడా నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది, అన్నిటికన్నా ముఖ్యం, మీ sensiblity లో వచ్చిన మార్పు. గోదావరినుంచి కృష్ణ దిగువకు చేసిన ప్రయాణం '
మేమొకప్పుడు అనుకున్నాం,తెలుగు కవిత్వంలో గోదావరీ తీర కవులకొక సౌకుమార్యం ఉందనీ, కృష్ణాతీర కవులూ, ఆ నదికి దిగువనున్న ఆంధ్రప్రాంతకవుల పలుకుబడి వేరేననీ. ఆ సున్నితమైన అంతరం నన్నయ, తిక్కనలతొనే మొదలయ్యింది. గోదావరీ తీర కవులకి అక్షరరమ్యత, లాలిత్యం,శ్రవణ సుభగత్వం చాలా ముఖ్యం. కృష్ణశాస్త్రి, నండూరి, తిలక్, ఇస్మాయిల్ దాకా కూడా. కృష్ణానదికి దిగువనున్న కవులకి సత్యం చెప్పడం ముఖ్యం, జీవితానుభవాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పడం ముఖ్యం,ఆ క్రమంలో వాళ్ళ కావ్యభాష కబీర్ భాషలాగ rough rhetoric గా మారినా సరే, తిక్కన, వేమన లనుంచి రామిరెడ్డి, పఠాభి, శిష్ట్లా, బైరాగి ల దాకా.
కృష్ణా,గోదావరీ తీరాల్ని సమంగా అల్లుకోడానికి ప్రయత్నించిన కవులు ఎర్రన, శ్రీనాథుడు, విశ్వనాథ-వాళ్ళ కవితాభివ్యక్తి కూడా ఏకకాలంలో tender గానూ, grotesque గానూ కనిపిస్తుంది.
గోదావరీ తీర కవి ఎప్పటికీ కూడా 'బాధల పొక్కులు గిల్లి 'అనే మాట వాడలేడు. 'పొక్కులూ ', వాటిని 'గిల్లడమూ 'అతడికి చాలా వికృతప్రయోగాలనిపిస్తాయి. కాని, రామారావు ఆ వాక్యాన్ని గుర్తు చేసినప్పుడు, నేనా అభివ్యక్తిని అర్థం చేసుకున్నానని చెప్పడం, నాలో వచ్చిన paradigm shift గా ఆదిత్య భావించాడు. ( రామారావు కన్నెగంటీ, అదిత్యా ఇద్దరూ కూడ కృష్ణానదికి దిగువప్రాంతంనుంచి వచ్చినవాళ్ళే)
ఇంతకీ బైరాగి అనువదించిన కరందీకర్ మూలకవితలో పదాలేమిటో మనకి తెలియదు. కాని, ఒకటి మాత్రం స్పష్టంగా తెలుసు. బాలసీతారాం మర్దేకర్ మరాఠీ కవిత్వానికి బోదిలేర్ లాంటి వాడని. పందొమ్మిదో శతాబ్దిలో బోదిలేర్ యూరోప్ కి పరిచయం చేసిన decadent urban ethos ని మర్దేకర్ మరాఠీకీ,తద్వారా భారతదేశానికీ పరిచయం చేసాడు. ఆ ప్రభావమే కరందీకర్, శరశ్చంద్ర ముక్తిబోధ్, గజానన్ మాధవ్ ముక్తిబోధ్ వంటి కవుల ద్వారా బైరాగికీ, బైరాగినుండి తెలుగు కవిత్వానికీ అందింది.
'దనుజ హస్తపు దీర్ఘరేఖల వలె పరచిన రాచబాటలు
సందుగొందుల మారుమ్రోగే తాగుబోతుల వెకిలిపాటలు
జీవితాహికి వేయి నాల్కలు, లక్షచీల్కలు, కోటికోరలు
దారి తప్పిన మనుజ హృదయం ఎక్కడున్నది?ఎక్కడున్నది?'
ఈ వాక్యాల వెనక కరందీకర్, మర్దేకర్, బోదిలేర్ రాసిన The Carcass పద్యం లేవనగలమా?
ప్రసిద్ధ పాశ్చాత్య సాహిత్య, కళావిమర్శకుడు Umberto Eco ఏమన్నాడంటే, ఆధునిక పాశ్చాత్య కళాన్వేషణ అంతా beauty నుంచి ugliness కి ప్రయాణమేనని.
మధ్యయుగాల భారతదేశం సగుణ నిర్గుణ మార్గాల మధ్య కొట్టుమిట్టాడింది. ఇరవయ్యవశతాబ్దం మొదలవుతూ టాగోర్ 'రూపజలధిలో మునిగి అరూప రత్నాన్ని ' అన్వేషించాలని ప్రయత్నించేడు. కాని 50 ల తర్వాత భారతీయ చిత్రకారులూ, కవులూ కూడా రూపాన్ని వదిలి విరూపం వైపు ప్రయాణించేరు. కరందీకర్ తన కొన్ని కవితలకు 'విరూపికలు 'అని పేరు పెట్టాడు కూడా. ఇప్పటి మనచిత్రకారులు చేస్తున్నదేమిటి? ఒక్కమాటలో చెపాలంటే, distortion. ఆకృతిని విరూపం చెయ్యడం. నేటి కళాకారుడి దృష్టిలో పరిపూర్ణ సౌందర్యం ఒక అసత్యం, ఒక భ్రమ.
1938 లో శాంతినికేతన సుందర స్వప్నం నుంచి బయటపడి, పఠాభి,
తగిలింపబడియున్నది జాబిల్లి
చయినా బజారు గగనములోన, పయిన;
అనవసరంగా,అఘోరంగా!
అని రాసినప్పుడు తెలుగు కవిత్వాన్ని రొమాంటిసిజంలోంచి మాడర్నిజంలోకి రాత్రికిరాత్రే తీసుకుపోగలిగాడు.
గోదావరీ తీర కవులు కాలంతాకిడికి చెక్కుచెదరని కావ్యభాషనొకదాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అందులో 'విలసన్నవనందనములు ', 'మృదుమృణాలాంకురములు ', 'ఘనసారపాంసులు ' 'తలిరుల శయ్యలు ', 'సలిల ధారల చందన చారు చర్చలు ' ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటాయి. ఆ కావ్యభాష దామెర్ల రామారావు చిత్రలేఖనంలాగా సుకోమలంగానూ, లాలిత్యభారంతోనూ వాలిపోతూ, సోలిపోతూ ఉంటుంది.
గోదావరీ తీరం నుంచి వచ్చిన నా బోటి పిపాసికి, 'బాధల పొక్కులు గిల్లడం ' nauseating గా ఉంటుంది. కాని, ఆ nausea ఆధునిక సందర్భానిది, ప్రస్తుత నిష్టుర వాస్తవానిది, దుర్భర జీవితానుభవానిదని బైరాగి చెప్పకపోతే నేనింకా ఆ దంత హర్మ్యంలోనే ఉండిపోయి ఉండేవాణ్ణి.

No comments:

Post a Comment

Total Pageviews