Friday, July 8, 2016

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?

మహిళలకు ఇష్టమైనది గోరింటాకు. గోరింటా పూసిందీ కొమ్మా లేకుండా... మురిపాలా అరచేతా మొగ్గా తొడిగిందీ ... అని ఓ కవి ఎంతో రమ్యంగా గోరింటాకు అందాలను వర్ణిం చాడు. .గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదు. చిన్నపిల్లల  నుండి బామ్మ వరకూ అందరినీ మురిపించే ముద్దుటాకు!అట్లతద్ది తర్వాత అందరూ ప్రత్యేకంగా పెట్టుకొనేది ఆషాడంలోనే.  పండుగలైనా.. ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు.ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.. కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.. ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది.ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తోంది .. అనగానే ఈ కోనులూ....కొత్తరకాల డిజైనులూ ఎన్ని ఉన్నా  ఆకు రుబ్బి
( బాగా పండటానికి అందులో చింతపండు, పటిక, కుండపెంకు వేసి  రుబ్బుతారు.)
వేళ్ళ నిండుగా ...అరచేత చందమామ, చుక్కలు, రెండుకాళ్లకు  పారాణి  పెట్టుకోవడమంటేనే చాలామందికి ఇష్టం.ఈ ఆషాడం లోనే  ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగామెరిసిపోతుంటాయి.ముద్దుపాపలు అమ్మ ఒడిచేరి నా చేయికంటే గోరింటాకు రుబ్బిన నీచేయి ఎర్రగా పండిందేమంటూముద్దు ముద్దుగా..గారాలు పోతారు .ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడంటూ అమ్మమ్మలు అన్న మాటలు గుర్తుచేసుకుంటూ ...నీకెలా పండిందంటే నీకెలా పండిందంటూ రాబోయే వరుడ్ని అరచేతి గోరింట చూసుకొని మురిసిపోతారు కన్నె బంగారు తల్లులు . కొత్త పెళ్ళికూతురు ఆషాఢపు వియోగం మరచి పండిన ఎరుపు చూసుకొని ...మగని ప్రేమ తలచుకొని సిగ్గుల మొగ్గయిపోతుంది. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక ఉన్న మర్మమేంటో.. మీకు తెలుసా..?ఆషాఢమాసంతో గ్రీష్మ ఋతువు పూర్తిగా వెళ్లిపోయి.. వర్షరుతువు ప్రారంభమౌతుంది.గ్రీష్మంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది.. మన శరీరంలో ఉన్న వేడి.. బయట చల్లబడిన వాతావరణం పరస్పరవిరుద్ధం కాబట్టి అనారోగ్యాలు మొదలౌతాయి. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది.తడిలో,నీళ్ళల్లో పని చేసే ఆడవారికి కాలి వేళ్ళ సందున పాయటం, మడమలు పగలటం సహజం. వానాకాలమైతే మరీనూ. గోరింటాకు పెట్టుకుంటే ఆ బాధలకి ఉపశమనం లభిస్తుంది. అందుకే తప్పనిసరిగా ఆషాఢ మాసంలోను,అట్ల తద్దికి, ఉండ్రాళ్ళ తద్దికి ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలని నియమం ఏర్పరచారు మన పెద్దలు. ఇది సంప్రదాయం పేరుతో ఏర్పాటుచేసిన వ్యాధి నివారణ కార్యక్రమం. ఆ విధంగా చెప్పకపోతే ఆడవాళ్ళు తమ గురించి తాము పట్టించుకుంటారా? గోరింటాకులో ఉన్న ఔషధీ గుణం పిప్పిగోళ్ళని గోరుచుట్టుని రాకుండా నివారిస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అందువల్లే గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతారు.ఆడవారే కాదు మగవారు కూడా చాలా మంది ఈ గోరింటాకును పెట్టుకుని మురిసిపోతారు. మహిళలు.. ఈ ఆషాడంలో అందంతో పాటు..ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీ అరచేతుల నిండా నింపుకోండి.

No comments:

Post a Comment

Total Pageviews