Saturday, December 30, 2017

తిరుప్పావై 15వ రోజు పాశురము

తిరుప్పావై 15వ రోజు పాశురము
Image result for తిరుప్పావై 15వ రోజు
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్
మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.
ఈరోజు పాశురం బయట గోపబాలికలకు లోపల గోపబాలిక మద్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్శి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకొని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.
అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, "ఎల్లే!" ఏమే "ఇళంకిళియే!" లేత చిలకా! "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.
కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని, శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి "శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్" ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు"నంగైమీర్!" పరిపూర్ణులు మీరే. "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.
బయట నుండి వాళ్ళు "వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీ నోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్" ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలో లోపల గోప బాలిక"వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు, నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది.
కాని బయట నుండి,"ఒల్లై నీ పోదాయ్" ఏమే రా! మరి ఇంక, "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరొకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి"ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.
Image result for తిరుప్పావై 15వ రోజు
"పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై" బలం కల్గిన ఏనుగు - కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.
ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మథురానగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముష్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట.
ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.

నూతన సంవత్సరం లోకి అడుకుపెట్టడం అంటే?

నూతన సంవత్సరం లోకి అడుకుపెట్టడం అంటే? 
ఒక కొత్త చైతన్యం లోకి ప్రవేశించడం 
కొత్త మార్పును ఆహ్వానించడం 
కొత్త ఆశలు, ఆశయాలు ఏర్పరచుకోవడం 
గత తప్పులను ఒకసారి సరిచూసుకుని 
సరిచేసుకుని ముందుకు సాగడం అంతేకాని
మత్తులో కేరింతలు, అర్ధరాత్రి అరుపులు, కేకలు
బైకులపై దూసుకుపోవడాలు, డి.జె లు పెట్టి గుండెలు ఆదరగోట్టడాలు
ప్రమాదాలు కోరితెచ్చుకోవడం, బైకులు కొనిస్తున్నాం! ఖరీదైన సెల్ ఫోన్లూ కొనిస్తున్నాము
వాటిని ఎలా వినియోగించాలో నేర్పించే తీరికా ఓపికా మనకి లేవు
ఎలా ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా ఒరిగేదేమిటి!
వీటికి క్యాలెండర్లు మారతాయి తప్ప జీవితంలో ఏమి మార్పు రాదు
ఎంజాయ్ చెయ్యడం ఆంటే అర్ధం మారిపోతోంది
పీకల్దాకా తాగి తిని రోడ్లపై భాద్యతా రహితంగా ప్రవర్తించడమేనా?
ఇటువంటి యువకులనేనా వివేకానందుడు కోరుకున్నది!
కలలు కనండోయ్ అని అబ్దుల్ కలాం మొత్తుకున్నది!!
తప్పు పిల్లలది కాదు మన సంస్కృతి ఇది అని తెలియ చెప్పని
మన పెద్దలదే...చాటి చెప్దాం! మన ఘన సంస్కతిని
ఈ రోజే!! ఇప్పుడే!!! 

తిరుప్పావై 14వ రోజు పాశురము


ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్
Image result for తిరుప్పావై 14వ రోజు పాశురముమన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.

"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్" ఎర్ర కలవలు వికసిస్తున్నాయి "ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్" నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు. లేదమ్మా అయితే, "ఉంగళ్ పురైక్కడై" నీ ఇంటి పెరటి "త్తోట్టత్తు వావియుళ్" తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావలిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ "నీ" అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు, ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు. పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక.
Image result for తిరుప్పావై 14వ రోజు పాశురము"శెంగల్పొడి క్కూరై" కాషాయాంభరధారులు "వెణ్బల్ తవత్తవర్" తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు "తంగళ్ తిరుక్కోయిల్ " ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి "శంగిడువాన్" తాళాలు తెరువడానికి "పోగిన్ఱార్" వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది.
అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ "ఎంగళై" మమ్మల్నందరిని "మున్నం ఎరుప్పువాన్" ముందే లేపుతాను అని "వాయ్ పేశుమ్" వాగ్దానం చేసావు. "నంగాయ్!" పెద్ద పరిపూర్ణురాలివే! "ఎరుందిరాయ్" లేవమ్మా "నాణాదాయ్!" నీకు సిగ్గు అనిపించటంలేదా "నావుడైయాయ్" పెద్ద మాటకారిదానివి.
జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో "శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ" ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.

Friday, December 29, 2017

వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టత

Image result for తిరుప్పావై 13వ రోజు పాశురముపూర్వం కృత యుగంలో చంద్రావతీ నగరాన్ని పాలించే 'మురు' డనే రాక్షసుడుండే వాడు. దేవతల్ని జయించి, వేధించే వాడు. విష్ణువు వానితో వెయ్యేండ్లు యుద్ధం చేసి, అలసి, విశ్రాంతికై ఒక గుహలో చేరి నిద్రించాడు. అట్టి శ్రీహరిని సంహరించడానికి 'మురు'డు సిద్ధ పడగా,స్వామి శరీరం నుండి దివ్య తేజస్సులతో ఒక కన్య ఉద్భవించింది. దివ్యాస్త్రాలతో యుద్ధం చేసి, ఆ కన్య మురుణ్ణి సంహరించింది. విష్ణువు మేల్కొని ఆ కన్యనూ, మరణించి యున్న మురుణ్ణీ చూచి, ఆశ్చర్య పడినాడు. కన్య నమస్కరించి, జరిగిన దంతా విన్నవించింది. సంతోషించిన విష్ణువు ఆమెను వరం కోరుకోమ్మన్నాడు. ఆమె ఆనందంతో "దేవా! నేను ఏకాదశి నాడు నీ శరీరము నుండి ఉద్భవించాను. కనుక నా పేరు ఏకాదశి. నా వ్రతం చేస్తూ ఈనాడు ఉపవాసం వుండేవారు సంసార బంధాల నుంచి తరించేట్లుగా వర మిచ్చి అనుగ్రహించండి" అని ప్రార్ధించింది. స్వామి "అట్లే ఆగుగాక!" అని వరమిచ్చి అద్రుశ్యు డైనాడు. నాటి నుండి ఏకదశీ వ్రతం భక్తితో ఆచరించేవారు సకల పాపాల నుండి విముక్తులై , విష్ణు లోకాన్ని పొందుతారన్న ప్రశస్తి ఏర్పడింది.
Image result for తిరుప్పావై 13వ రోజు పాశురముఏకాదశీ తిథికి అధిదేవత ఏకదశీదేవి. ఈమె విష్ణు దేహసముత్పన్న కనుక స్త్రీ మూర్తియైన మహా విష్ణువే! "జన్య జనకంబులకు భేద శంకలేదు" కదా! సర్వోత్తమ తిథి ఏకాదశి. ఏకాదశీ వ్రత ప్రభావాన్ని వివరించే కథలు చాలా ఉన్నాయి.
కుచేలుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించి మహైశ్వర్య వంతు డైనాడని ఐతిహ్యం. ధర్మరాజు ఆచరించి కష్టాలనుంచి గట్టెక్కినాడు. రుక్మాంగదుడు ఆచరించి పుత్ర ప్రాప్తి నోందాడు. సకల దేవతా పాత్రుడైనాడు. మోక్షగామి యైనాడు. క్షీర సాగర మధనం - లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశినాడే జరిగాయి. వైఖానాస రాజు ఆచరించి, పితరులకు ఉత్తమలోకప్రాప్తి చేకూర్చాడు. అంబరీషుని వ్రత ప్రభావం జగద్విదితం!

తిరుప్పావై 13వ రోజు పాశురము

తిరుప్పావై 13వ రోజు పాశురము
Image result for తిరుప్పావై 13వ రోజు పాశురముపుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్
ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కల్గిస్తుంది ఆండాళ్. అందరిని చిలిపి తనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్నా పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు, దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని మరి కొందరు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోయారు.
వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, వారి మధ్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళితే అక్కడ ఆమె శ్రీకృష్ణున్ని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు, భార్య సీత వాళ్లు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు... అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి "సౌమిత్రే ధనుః" అని అరిచాడు. ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణున్ని ధనస్సు తెమ్మని పిలిచాడు, ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాలకోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు, ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు.
Image result for తిరుప్పావై 13వ రోజు పాశురముకృష్ణుడి జట్టు వారు "పుళ్ళిన్ వాయ్ కీండానై" ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువారు "ప్పొల్లా అరక్కనై" రావణాసురుడిని గిల్లి పారవేసాడు రాముడు అని అన్నారు. "కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్" ఇలా స్వామి కళ్యాణగుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు.
"పిళ్ళైగళ్ ఎల్లారుమ్" గోపబాలికలందరూ "పావైక్కళం పుక్కార్" వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది. లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది, వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్పుతున్నారు. "వెళ్ళి యెరుందు" శుక్రోదయం అయ్యింది, "వియారమ్" బృహస్పతి "ఉఱంగిత్తు" అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేక పోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోధంగా ఉన్నాయి, ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి, అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరియైన సమయం.
Image result for తిరుప్పావై 13వ రోజు పాశురము"పుళ్ళుం శిలమ్బిన కాణ్" పక్షులు మాటలాడుకుంటున్నాయి "పోదరి క్కణ్ణినాయ్" తుమ్మెద వాలిన పుష్పంవంటి కళ్ళు కలదానా. తనను గుర్తించిన వాన్ని భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎంటీ కృష్ణుడే తన దగ్గరకు రానీ అంటూ పెద్దగా పట్టించు కోవడం లేదు. "కుళ్ళ కుళిర" చల చల్లటి ఆనీటిలో "క్కుడైందు" నిండా మునిగి "నీరాడాదే" అవగాహన స్నానం మనం చేయ్యాలి కదా , లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు, ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. "పళ్ళి క్కిడత్తియో" ఇంకా పడుకుని ఉన్నావా "పావాయ్!" ముగ్దత కల్గిన దానా, " నీ నన్నాళాల్" సమయం అయిపోతుంది, "కళ్ళం తవిరుందు కలంద్" మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు.

వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.

Image result for వైకుంఠ ఏకాదశికలియుగ వైకుంఠమైన తిరుమల - శ్రీ వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహా వైభవంగా నిర్వహింపబడుతుంది. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిళ్లు మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని , మరునాడు ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరుకూ శ్రీ వారి గర్భాలయానికి ఆనుకొనియున్న ముక్కోటి ప్రధక్షిన మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏకాదశీ , ద్వాదశీ రెండు రోజులూ శ్రీ వారి దర్శనాంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణామార్గంలో వెళ్తారు. ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారమని , ఆ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణమని అంటారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినంనాడు ముక్కోటి ప్రదక్షిణ మార్గం రంగురంగుల విద్ద్యుద్దీపాలతో,పూలమాలలతో మనోహారంగ అలంకరింపబడుతుంది. శ్రీ స్వామి వారికి అత్యంత సమీపంలో ఉన్నఈ ప్రదక్షిణ మార్గంలో దర్శనాంతరం వెళ్ళిన భక్తులు ఒక ఆశ్చర్య దివ్యానుభూతిని అనుభవిస్తారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులు మన అందరిపైనా ఎల్లవేళలా ఉండాలని కోరుకొంటూ ... సర్వేజనా సుఖినోభవంతు.

Wednesday, December 27, 2017

వైకుంఠ ఏకాదశి 2018


Image result for వైకుంఠ ఏకాదశి 2018తొలి వైకుంఠ ఉత్తర ద్వారా దర్శన చరిత్ర.

మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీకృష్ణపరమాత్మ ‘భగవద్గీత’ విభూతియోగంలో చెప్పాడు. అంటే, ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఈమాసం, ప్రకృతిని అంటా సౌందర్యమయం చేస్తుంది. ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. దీనినే సారమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, మన పెద్దలు సంవత్సరకాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదనీ, ఆకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే ఉత్తరాయణం దేవతలకు పగటికాలమైతే, దక్షిణాయణం రాత్రికాలమని చెప్పబడుతోంది. విష్ణుమూర్తి రాత్రికాలమైన దక్షిణాయనంలో ఆషాడ శుద్ధ ఏకాదశినుండి నాలుగునెలలపాటు యోగ నిద్రలో గడుపుతూ లోకం తీరుతెన్నులను గమనిస్తుంటాడు. అందుకే ఆషాఢ శుద్ధ  ఏకాదశిని ‘శయన ఏకాదశి’ (తొలిఏకాదశి) అని అన్నారు. తొలి ఏకాదశికి యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు కార్తిక శుద్ద ఏకాదశి రోజున మేల్కొంటాడు. అందుకే దీనినిన్ ‘ఉత్థాన ఏకాదశి’ అని అన్నారు.

తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ‘ఏకాదశి’. ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ‘ఒకటి, కృష్ణపక్షంలో  ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఆవిధంగా సంవత్సరంలో ఇరవైనాలుగు ఏకాదశులు.’ చాంద్రమానం ప్రకారం, మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులోస్తాయి. ప్రతిఏకాదశి ఓ పర్వదినమనే చెప్పొచ్చు. అసలు ఏకాదశి ఆవిర్భావం కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య ఏర్పడింది. పూర్వం మృదుమన్యుడు అనే రాక్షసుడు, శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి, ఆ స్వామిని మెప్పించి స్త్రీ పురుషుల నుండి తనకు మరణం లేకుండా ఉండేట్లుగా వరాన్ని పొందాడు. వరాన్ని అనుగ్రహించిన శివుడు అయోనిజ అయిన స్త్రీ చేతిలో మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించడం సాధారణం కాదని గ్రహించిన మృదుమన్యుడు, వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని ధాటికి దేవతలంతా పారిపోగా, వారి దేవేరులంతా ఒక ఉసిరిచెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య ఉదయించింది. ఇంతలో దేవతలను వెదుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెదకడానికి ప్రయత్నిస్తుండగా, దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయిన కన్య చెట్టుతొర్ర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుడిని సంహారించింది. ఆ కన్యక పేరే ‘ఏకాదశి’, అప్పట్నుంచి ప్రతి పక్షంలో పదకొండవ రోజున ఆమెను పూజించడం ఆచారమైంది.


Image result for వైకుంఠ ఏకాదశి 2018

ఏకాదశి మహాత్యాన్ని తెలిపే అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి. ఆ కథలలో రుక్మాంగదుని కథ ఒకటి. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ, ప్రజలను కంటి పాపలవలె చూసుకుంటుండేవాడు. ప్రజలు కూడ ధర్మవర్తనులై జీవిస్తుండే వారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారం, రంభ మోహినీ వేషధారిణియై, రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా, మార్గమధ్యంలో తారసపడిన మోహినీ రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు మొహావేశపరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తియై ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. రుక్మాంగదుని వ్రతబ్రష్టున్ని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశినాడు తనతో దాంపత్యసుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది. ఏకాదశివ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్నకొడుకును చంపడానికి నిర్ణయించుకోగా, అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై, జరిగిన మోసాన్ని అతనికి వివరించి, రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు.

ఇక ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి పర్వం సుఖసంతోషాలను అందించే పర్వంగా భక్తజనులచే ఎంతో గొప్పగా జరుపబడుతుంటుంది. మన తెలుగువాళ్ళు ఈ పండుగను ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలుచుకుంటూఉంటారు. ఈ రోజున విష్ణువు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడనీ, అందుకే ఈ పండుగ ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలువబడుతోంది అంటారు. స్వామి భూలోకానికి దిగి రావడం వెనుక ఓ ఉదంతం ఉంది. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా మురాసురుడు అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ, దేవతలను విపరీతంగా పీడిస్తుండేవాడు. అతని హింసను తట్టుకోలేక పోయిన దేవతలు, వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల అభ్యర్థనలను ఆలకించిన విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి వచ్చి మురాసురుని సంహరించాడు. ఆ సంహారం ఏకాదశినాడు జరిగినందువల్ల, ఈ రోజుకి ‘వైకుంఠ ఏకాదశి’ అని పేరు వచ్చింది.Image result for వైకుంఠ ఏకాదశి 2018

విష్ణు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈరోజున వైష్ణవ దేవాలయలలొ ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ ద్వారాన్నే వైకుంఠ ద్వారమని పిలుస్తారు. ఆరోజున భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలను, స్నానసంధ్యాలు ముగించుకుని, విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామిదర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ ప్రదక్షిణనే ముక్కోటి ప్రదక్షిణ అని అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా దైవదర్శనంవల్ల సకల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం.

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి ఒక కథ చెప్పబడుతోంది. మహాప్రళయం జరిగింది. ప్రళయానంతరం, నీటి మీద తేలుతున్న విష్ణుభగవానుడు, మరలా సృష్టి చేయడాన్ని గురించి ఆలోచిస్తూండగా, ఆయన ముందు పంచభూతాత్మకమైన (ఆకాశం, అగ్ని, గాలి, నీరు, భూమి) బ్రహ్మాండం గోచరించింది. అనంతరం ఆయన బొడ్డులో నుండి ఓ తామరపువ్వు ఉద్భావించగా, అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు. బ్రహ్మకు, విష్ణుభగవానుడు మంత్ర, తంత్ర, శాస్త్రాలను బోధించాడు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిశ్శాస్త్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకోగా, అప్పుడు స్వామి శ్రీరంగనాథుని రూపంలో, తన భార్యలతో, పరివారగణంతో ఓ విమానంలో దర్శనమిచ్చాడు. ఆ విమానం ఓంకార స్వరూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి, బ్రహ్మకు జ్యోతిశ్శాస్త్రాన్ని బోధించి, తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు కోలుచుకునేందుకై స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా, స్వామి విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువైయ్యాడు.

కొంతకాలం తరువాత ఆ విగ్రహాల విమానం సూర్యవంశ మూలపురుషుడైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఇవ్వబడి, కాలక్రమాన శ్రీరామచంద్రునికి చేరింది. రామావతారాన్ని ముగించే ముందు, శ్రీరాముడు ఆ విమాన విగ్రహాలను విభీషణుకి ఇచ్చి, తనకు చేసిన సహాయానికి గుర్తుగా తను ఆ విగ్రహాలను ఇస్తున్నట్లుగాను, వాటిని లంకకు తీసుకుని వెళ్ళి పూజాదులు చేయవలసిందిగాను, అయితే లంకకు చేరేవరకు విమానవిగ్రహాలను నేలపై పెట్టరాదని చెప్పాడు. చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు, లంకాద్వీపానికి బయలు దేరాడు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు, కావేరినదీ తీరాన్ని చేరుకునేసరికి సంధ్యావందనం చేయాల్సిన సమయమైంది. వెంటనే కావేరీతీరంలో స్నానం చేసి సంధ్య వార్చుకుందామనుకున్నాడు. అయితే విమాన విగ్రహాలను కిందపెట్టకూడదు కదా! ‘ఎలా?!’ అని అటూ ఇటూ చూసిన విభీషణుని కంట్లో బాలబ్రహ్మచారి కనపడ్డాడు. విభీషణుడు ఆ బాలబ్రహ్మచారిని బ్రతిమాలి, తాను సంధ్య వార్చుకుని వచ్చేంతవరకు విమానాన్ని పట్టుకుని ఉండాల్సిందిగా చెప్పి, సంధ్యవార్చుకునేందుకై వెళ్లాడు. దానిని తీసుకున్న బాల బ్రహ్మచారి కొన్ని ఘడియలు మాత్రమే పట్టుకుంటానని, సమయం మించితే కింద పెట్టేస్తానని చెప్పాడు. అలాగే విభీషణుడు తిరిగి వచ్చేసరికి సమయం మించిపోవడంతో బాలబ్రహ్మచారి విమానాన్ని కింద పెట్టేశాడు. అది అక్కడ భూమికి అతుక్కుపోయింది.

ఇంతలో విభీషణుడు పరుగెత్తుకుంటూ రావడాన్ని చూసిన బాలబ్రహ్మచారి అక్కడకు దగ్గరలోని కొండపైనున్న వినాయకుని గుడిలో దాక్కున్నాడు. కోపంతో వూగిపోయిన విభీషణుడు, వినాయకుని గుడిలోకి వెళ్ళి, ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక్క మొట్టికాయ వేశాడు. ఆ దెబ్బకు బ్రహ్మచారి తలపై సొట్ట పడింది. ఇంతకీ ఆ బాలబ్రహ్మచారి సాక్షాత్తూ వినాయకుడే. ఇప్పటికీ వినాయకుని విగ్రహంపై సోట్టను చూడవచ్చు. బాలబ్రహ్మచారి కింద పెట్టిన విమాన విగ్రహాలు కొలువైన ప్రాంత్రం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందగా, బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచ్చిలోని ఉచ్చి పిళ్ళైయార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది. వినాయకుడిని తలపై కొట్టిన విభీషణుడు, రంగనాథస్వామి పాదాలపై పడి లంకకు తనతో రమ్మని ప్రాధేయ పడ్డాడు. అయితే స్వామి అందుకు సమ్మతించక, తాను అక్కడే ఉండిపోనున్నట్లు, సంవత్సరంలో ఒకసారి ఇక్కడకు వచ్చి తనను ఆరాధించ వచ్చని చెబుతాడు. విభీషణుడు స్వామికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలోని సప్తప్రాకారాల్లోని మొదటి ప్రాకారంలో విభీషణుని ఆలయాన్ని చూడవచ్చు. అప్పట్నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ఆత్యంత వైభవంగా జరుపబడుతోంది.

వైష్ణవ దేవాలయాలలో మామూలు రోజులలో అయితే ఉత్తరద్వారాలను మూసి ఉంచుతారు. ముక్కోటి ఏకాదశిరోజున మాత్రం తెరచి ఉంచుతారు. మన తెలుగు రాష్ట్రాలలోని తిరుపతి, భద్రాచలం, మంగళగిరి మొదలైన క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. తిరుపతిలో ఈరోజు శ్రీవారిసన్నిథిన రావత్తు తోడక్కం జరుగుతుంది. నమ్మాళ్వారు విరచితమయిన భగవద్విషయమనబడే దివ్యప్రబంధంలోని నాలుగవ ఆయిరం అధ్యయనం జరుగుతుంది. వేదపారాయణం తోడక్కం తరువాత జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దేవస్థానం చుట్టూవున్న చూళిక ద్వారాలు తెరుబడుతాయి. భక్తులు ఈ చూళిక నుంచి ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఇక, భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని అధ్యయనోత్యవాలని పిలుస్తారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశీ మహోత్సవాలు ధను: శుద్ధ తదియతో ప్రారంభమయి ఏకాదశితో సమాప్తమవుతాయి. ఏకాదశికి ముందు పదిరోజులను అధ్యయనోత్సవాలని అంటారు. ఈ అధ్యయనోత్సవాల సమయంలో ధనుశ్శుద్ధ విదియ నుండి ధనుశ్శుద్ధ దశమి వరకు రోజుకొక అవతారం చొప్పున స్వామిని దశావతారాలతో అలంకరించి మధ్యాహ్నసమయంలో కళ్యాణమండప పందిరిలో వేంచేసి చేస్తారు. అనంతరం స్వామి తిరువీథి సేవకు బయలుదేరుతారు. ఏకాదశికి ముందురోజైన దశమినాటి సాయంత్రం గోదావరినదిలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తరువాత పదిరోజులు మొక్షోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ ఇరవై ఒక్కరోజులలో చతుర్వేద పారాయణం, నాలాయిర దివ్యప్రబంధం పారాయణం చేయబడుతుంది. ఈ ఉత్సవాలను చూసి తరించేందుకు దేశం నలుమూలల నుండి భక్తజన సందోహం తరలి వస్తుంటారు.
ఏకాదశిరోజున ఉపవాసాన్ని పాటించాలి. ఈ రోజున ఉపవాసాన్ని పాటించడం వల్ల సూర్య, చంద్రగ్రహణ సమయంలో చేసే దానం, అశ్వమేథయాగం చేసిన ఫలితాలకంటే అధికపలం లభిస్తుంది. ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణం, అదీ పాటించకలేకపోతే నీరు, పాలు, పండ్లను తీసుకోవచ్చు. అలా కుదరనప్పుడు ఒక్కపొద్దు అంటే, ఒంటిపూట భోజనం చేయవచ్చు. సుఖ సంతోషాలను పంచే పండుగ వైకుంఠ ఏకాదశి.

Total Pageviews