Wednesday, October 31, 2018

" సంక్రాంతి..! యండమూరి ప్రేమ/ ఆనందో బ్రహ్మ

" సంక్రాంతి..!

భూదేవి కొత్త పెళ్ళికూతురైతే బంతిపూలు
పసుపు! మిరపపంట కుంకుమా!!

అప్పటిదాకా రంకెలు వేసిన చలి, తనే మూడంకెవేసి
డొంకదారి బట్టింది. గెల్చిన రాజులా ఆమని, సర్వాంగ
భూషితయై రావటానికి తయారవుతూంది.

"సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణివ్వావే
తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే.
చామంతి పువ్వంటి చెల్లెల్నివ్వావే -"

మనసులో అసలు పాట అదికాదట. ఎవరో కవి అన్నాడు

మొగలి పువ్వంటి మొగుణ్ణివ్వావే...
గుమ్మడి పువ్వంటి కొడుకునివ్వావే.
అదట అసలు కోరిక!

ఊరికి ఇట్నుంచి బుడబుక్కలవాడు డమరుకాన్నీ,
అట్నుంచి జంగందేవర గంటనీ పట్టుకుని
బయల్దేరారు. అన్నాళ్ళూ ఏమయ్యారో గానీ
బాలసంతువాడు, పెద్దమాలవాడు కూడా
దర్శనమిస్తున్నారు. పెద్దెద్దువాడు బక్క చిక్కిన
గంగిరెద్దుకి వీలైనంతలో అలంకరణ చేసి
ఇంటింటిముందూ ఆపి నమస్కారం
చేయిస్తున్నాడు. పక్కూళ్ళో జరిగే పొట్టేళ్ళ పందేనికి
కుర్రకారు అప్పుడే బయల్దేరుతున్నారు.
కోడిపందేలు సరేసరి.

అప్పటికే ఆలస్యమయిపోయిందని తాతయ్య వడివడిగా
నడుస్తున్నాడు. ఆయన కదుల్తూంటే వరణా
తరంగిణీ దరవికస్వర నూత్న కమలకషాయ
గంధము.....ప్రత్యూష పవనాంకురములు
పైకొనువేళ - అన్న ప్రవరాఖ్యవర్ణన గుర్తొస్తుంది.
అయితే ఆయన ప్రస్తుతం భాషాపరశేషభోగి! అందానికి
వారసుడు మాత్రం వెనుక నడుస్తూన్న సోమయాజి.
అతడు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి. ఇంకా
కుర్రవాడు! అలేఖ్య తనూవిలాసుడవటానికి మరి
నాలుగయిదేళ్ళు పడుతుంది. అయినా
అమ్మాయిలు గొబ్బిళ్ళు సర్దే మిషమీద, ముందున్న
ముసలాయన గమనించకుండా వెనుకనున్న ఆ
కుర్రాడిని ఓరగా చూస్తున్నారు.

"ఈ రోజు కూడా బడి వుందిరా?"
"ఉంది తాతయ్యా!"
"సంక్రాంతి పూట బడి ఏమిట్రా?"
"ఈసారి మొదటిస్థానం మాకే రావాలని మావాళ్ళు చాలా
పట్టుదలగా వున్నారు తాతయ్యా అందులోనూ మా
అయ్యవారికి ఈ దేముళ్ళ మీదా, పండగలమీదా నమ్మకం
లేదు" అంటూ ఆయన మొహంలోకి చూశాడు. అయితే
ఆ మోహంలో తిరస్కారం ఏదీ కనపడలేదు.

"తనమీద తాను నమ్మకం పెంచుకున్న మనిషికి
దేముడి అవవరం లేదురా అబ్బీ. అయితే మీ
అయ్యవారు అంత ధీశాలా? లేక పిడివాదంతో తర్కంచేసే
మూర్ఖుడా?"

సోమయాజి తబ్బిబ్భై ఆయనవైపు చూశాడు. నాలుగు
వేదాల్నీ నలిగులిపట్టిన ఈ నలిమేలి దొర ఏ గొప్ప
హేతువాదికీ తీసిపోడు. అలా అని తన నమ్మకాల్తో
అవతలివారిని నొప్పించడు.

ఇంతలో రేవు దగ్గిరపడింది. మోకాలి లోతుకి దిగాడాయన. దోసిలిలోకి తీసుకున్న నీటిలోసూర్యుడు ప్రతిబింబిస్తూ వుండగా అన్నాడు -

"సంక్రాంతిలో విశేషమేమీ లేదురా మకరరాశిలోకి
సూర్యుడు ప్రవేసించటంలోనూ విశేషమేమీ లేదు.
కానీ కాసిని తిండిగింజలకోసం చెట్టుకోక పక్షిగా వెళ్ళిన
కొడుకులూ ఆడపిల్లలయిన ఈడపిల్లలూ, వాళ్ళ
కొడుకులూ అందరూ కలవటంలో విశేషం వుంది.
ఆదిరా పండగంటే! ఒక పండగ వెళ్ళగానే మరో
పండగకోసం ఎదురు చూడటంలో తృప్తి వుంది.
అదే లేకపోతే రోజులు నిస్సారంగా, మనకీ, పశువులకీ
తేడా లేకుండా గడిచిపోతాయి. మనిషి బ్రతుకే ఒక పండగ
అని నిరూపించటం కోసమే పండుగ" అంటూ చెప్పి
ఆయన నీళ్ళలో మునిగాడు"
From AANADOBRAHMA

No comments:

Post a Comment

Total Pageviews