Wednesday, August 12, 2020

పెరింటింగ్ సూత్రం నెంబర్ 1 Ramadevi Telugu one

 పెరింటింగ్ సూత్రం నెంబర్ 1

" పిల్లల ల కి ఎలాంటి షరతులు లేకుండా తోడుగా నిలబడాలి. వాళ్ళు ఏమి నేర్చుకోవాలో చెప్పటం కాదు అనుభవం లోకి వచ్చేలా చేయండి."
నాన్న,అమ్మ ఈ విషయాన్ని ఎలా పాటించారో చెప్పే రెండు సంఘటనలు ఈ రోజు పంచుకుంటున్నా.
పేరెంటింగ్ గురించి,పిల్లలకి మంచి చెడు నేర్పించటం గురించి ఎవరన్నా చెబుతుంటే వెంటనే అమ్మా,నాన్న గుర్తువస్తారు. వాళ్ళ తో పాటు పెదనాన్నలు, మేనత్తలు,పిన్నులు ,ఎందుకంటే ఇలా మన రక్తసంబంధీకులు ఎందరో మనల్ని,మన ఆలోచనల్ని ఎంతో ప్రభావితం చేస్తారు.ఈ రోజు మనం ఏంటి అని ఒకసారి చూసుకుంటే అందులో ఎందరో కనిపిస్తారు. వాళ్ళని చూసి మనం ఆకళింపు చేసుకున్న ఎన్నో విషయాలు ని పోలికలుగా చెబుతారు అనిపిస్తుంది నాకు. మా పిల్లలు కి నా చిన్న తనం గురించి, మా వాళ్ళ గురించి కథలుగా వినటం ఇష్టం.అలా వాళ్ళకి చెబుతూ ఆ చిన్నతనం లోకి ఎన్నో సార్లు వెళ్లి వచ్చాను. అలా చిన్నతనాన్ని చూసుకున్నప్పుడల్లా ఒక నలభయ్యేళ్ళ క్రితం ఒక జీవితాన్ని రూపుదిద్దటాని కి ఎంత మంది శిల్పులు ప్రయత్నించారో కదా అనిపిస్తుంది. అప్పుడు నా బాధ్యత ఏంటో కూడా తెలుస్తోంది.
ఒక్కసారిగా అమ్మమ్మ,బామ్మ ,పెద్దనాన్న,పెద్దత్త,చిన్నత్త ఇలా అందరూ నా కళ్ళముందుకు వచ్చేస్తున్నారు రాయటం మొదలు పెట్టగానే.అందరికంటే ముందు నాన్న గురించి చెప్పాలి.ఎందుకంటే ఈ రోజు నేను ఏంటి అన్నదానికి నాన్న విత్తనం నాటి నీళ్లు పోసి జాగర్తగా పెంచి పెద్దచేశారు.అమ్మ అందుకే అంటుంది ఎంతయినా నువ్వు నాన్న కూతురువి అని.అమ్మ ఎంత నమ్మినా,సపోర్ట్ చేసినా,అసలు అమ్మ ఏం చేసినా అమ్మేకదా చేయాలి, ఇంక అమ్మ గురించి చెప్పేది ఏముంటుంది చెప్పండి.
నాకు బాగా గుర్తువుండి,నన్ను ఎంతో ప్రభావితం చేసిన కొన్ని సంఘటనలు చెబుతాను.
వాటన్నిటి కంటే ముందు ఈ రోజు నాకు అత్యంత ఇష్టమయిన జ్ఞాపకం,ఎప్పుడు తలచుకున్నా కళ్ళలో నీళ్లు వచ్చి,గర్వం గా అనిపించే ఒక సంఘటన చెబుతాను.పని ని ఎంత ప్రేమించాలో నాన్న చెప్పకుండా చెప్పారు ఆ ఒక్క సంఘటన తో.
మాది సింహాచలం. అమ్మాయి పదవతరగతి కూడా పూర్తి చేయకుండానే పెళ్లి చేసే అలవాటు వున్న కుటుంబం లో LAW చదవటం అనేది ఎలా జరిగిందో ఇంకోసారి చెబుతాను. అలాంటిది అమ్మాయి ఉద్యోగం అన్న విషయం లో ఎన్ని కట్టుబాట్లు ఉండాలి ?
నేను ALL INDIA RADIO లో యువవాణి కార్యక్రమాన్ని నిర్వహించేదాన్ని. అనౌన్సర్ గా. ఆ కార్యక్రమం సాయంత్రం 5.30 నుంచి ఒక గంట ఉండేది. నెల మొదట్లో నే మాకు కాంట్రాక్ట్ ఫార్మ్స్ పంపుతారు ఆ నెలలో మా డ్యూటీ ఎప్పుడెప్పుడు అన్న తేదీ వివరాల తో . మేము సంతకం పెట్టి ఇచ్చాకా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు టైం కి వెళ్లి షో చేయాలి. అలా ఒకసారి నా డ్యూటీ దీపావళి రోజు పడింది. నేను సంతకం పెట్టేటప్పుడు దీపావళి రోజు డ్యూటీ అని చూసుకోకుండా పెట్టేసాను. దీపావళి రోజు సింహాచలం నుంచి విశాఖపట్నం లో వున్న రేడియో స్టేషన్ కి వెళ్ళాలి, అదీ సాయంత్రం అందరూ దీపాలు పెట్టి, టపాసులు కాల్చే టైం లో. బస్సు దిగి రేడియో స్టేషన్ కి ఒక పావుగంట నడవాలి. ఇంటి నుంచి బస్టేషన్ కి కూడా పావుగంట నడక.
నాన్న కి మధ్యాహ్నం డ్యూటీ. కంపెనీ కి వెళ్లిపోతున్నారు.నేను ఎలా వెళ్లాలా అని తర్జన భర్జన పడుతున్నా, నాన్న వెళుతూ పెద్దనాన్న గారి కి చెప్పాను, నీకు తోడు వస్తారు, ఆటో కి చెప్పాను వస్తుంది, నీ షో అయ్యేదాకా ఉండి తీసుకువస్తాడు అన్నారు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే , ఒక్కమాట అనలేదు నాన్న చూసుకోవద్దా సంతకం పెట్టే ముందు,?ఎలా వెళతావు అని?కామ్ గా అన్ని అరెంజ్ చేసేసారు. ఆటో లో పంపించటం ఏంటి అంత గొప్పవిషయం అంటారా? నేను డ్యూటీ చేస్తే వ చ్చేది 150/- లు, ఆటో కి అటూ,ఇటూ అంత సేపు వెయిట్ చేయటానికి అంత కంటే ఎక్కువే తీసుకున్నాడు.
అదీ ఒక 27 ఏళ్ళ క్రితం ఆటో ఎక్కటం అనేది చాలా , చాలా అపురూపం అయిన రోజుల్లో. ఇవన్నీ కాదు కానీ పెద్ద పెద్దనాన్న గారు డెబ్బయి ఏళ్ల వయసులో నాకోసం ఆటో లో నాకు తోడుగా వచ్చి, నేను లోపల కార్యక్రమం చేస్తున్నంత సేపు బయట వెయిటింగ్ హాల్ లో కూర్చోవటం. నా పని కి నాన్న, పెద్దనాన్న ఎంత విలువ ఇచ్చారో తెలిసాక ఇంక నేను చేసే పనిని ప్రేమించకుండా ఎలా ఉండగలను.
తిరిగి వస్తుంటే ఇళ్ల ముందు వెలుగుతున్న దీపాలు, ఆకాశం లో విరుస్తున్న వెలుగులు ని మించి నా లోపల వెలుగు కు విరిశాయి. పెద్ద నాన్న తో ఇబ్బంది అయ్యిందా అంటే "మా ఇంటి సరస్వతి దేవి వి ,..నువ్వు ఏమి చేసినా గర్వమ్ గా ఉంటుంది. రేడియో లో నీ గొంతు ఎంత మంది విని వుంటారో కదా! అన్నారు.
నాన్న ఆ తర్వాత ఒక్కసారన్నా ఆ విషయం గురించి మాట్లాడలేదు. ''పని లో డబ్బు ఎంత వస్తుంది అని కాదు, నువ్వు దానిని ఎంత భక్తి తో చేస్తావు, ఎంత ఆనందాన్ని పొందుతావు అన్నది ముఖ్యం ' ' నాన్న ఎప్పుడూ చెప్పే మాట ఇదే. పని నుంచి ఆనందాన్ని పొందాలంటే దాన్ని ఇష్టం గా చేయాలి. అది ఎంత కష్టం గా వున్నా. నాన్న ఈ సూత్రాన్ని నాకు అలా నేర్పించారు.
పెద్దనాన్న ఇప్పటికీ ఎక్కడినుంచో నన్ను చూస్తూనే వుంటారు, నా విజయాల కి ఆనందపడుతూనే వుంటారు.రేడియో అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికి ,అందుకు ఈ సంఘటన కూడా ఒక కారణం. నాన్న, అమ్మా నా రేడియో కార్యక్రమాలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో చెప్పటానికి ఇంకో ఉదాహరణ వుంది .
ఒకసారి అనుకోకుండా పెళ్లి చూపులకి అని ఎవరో వస్తే ఒక అరగంట తర్వాత అమ్మ వాళ్ళ తో నేరుగా చెప్పేసింది. మీరు వస్తారని ముందుగా తెలియదు కదా, అమ్మాయి రేడియో లో చేస్తోంది. ఇప్పుడు వెళ్ళాలి ఏమి అనుకోకండి అని. పెద్దత్త కూడా వత్తాసు పలికింది. అంతే పెళ్ళివాళ్ళు కాఫీ లు తాగుతుండగా నేను పట్టుచీరతో బస్సు స్టాండ్ కి బయలు దేరా. వాళ్ళ మొహాల్లో కనిపించిన ఆశ్చర్యం, మా వాళ్ళందరి మొహాల్లో కనిపించిన ఆనందం అస్సలు మర్చి పోలేను ఎప్పటికి. ఇలా రోజు కి ఒక జ్ఞాపకం. కథలు మన జీవితాల్లోనే ఎన్ని వుంటాయో చూసుకోవాలి గాని .

No comments:

Post a Comment

Total Pageviews