Tuesday, August 11, 2020

ఎన్నాళ్ళయిందో..కరోనా ఎంత పని చేసావే..

 ఎన్నాళ్ళయిందో..


ఇంటికి పెళ్లి కార్డు వచ్చి..

సినిమాకెళ్ళి..

బంతి భోజనం తిని..

అమ్మలతో కలిసి భుజాన బస్తా బాగులతో బడికెళ్తున్న 

పిల్లల్ని చూసి..

కిటకిటలాడే బస్సుల్లో 

ఫుట్ బోర్డు పట్టుకు వేలాడే కుర్రకారును తిట్టి..

వీధి చివర బడి

గంట విని..

రైల్వేస్టేషన్లలో అనౌన్స్మెంట్ ఆలకించి..

కవి సమ్మేళనంలో 

మంచి కవిత వినిపించి..

పేరంటానికెళ్తున్న అమ్మలక్కల

అలంకారాలు గని..

టివిలో క్రికెట్ మాచ్ తిలకించి..

మంచి కబురు విని పులకించి..

మిత్రుడు కనిపిస్తే 

మనసారా కౌగలించుకుని..

రాత్రి పొద్దుపోయే దాకా 

జంక్షన్లో అసుక్కొట్టి..

హోటల్ కెళ్ళి విందారగించి.

పార్కుకు పోయి..

బహిరంగ సభ కవర్ చేసి..

షేక్ హాండిచ్చి..

రైల్లో కంపుకొట్టే టాయిలెట్ కు 

ముక్కు మూసుకుని 

వెళ్లి వచ్చి..

ఆకశాన రివ్వున ఎగిరెళ్లే విమానాన్ని చూసి అబ్బురపడి..

ఊరేగింపు కనబడి..

నినాదాలు వినపడి..

రోడ్ల మీద వేషాలు తిరిగి..

గ్రూప్ ఫోటో దిగి..

బడ్డికొట్లో టీ తాగి..

అంతెందుకు తనివితీరా తుమ్మి

బాధ తీరేలా దగ్గి..

ఎన్నాళ్ళయిందో..


అప్పుడెప్పుడో నాన్న పోయారు

రక్తం పంచుకుని పుట్టినోళ్ళం

ఒకరినొకరం గట్టిగా పట్టుకుని

మనస్ఫూర్తిగా ఏడ్చాం..

కష్టమే అయినా పంచుకున్నాం

గుండె బరువు దింపుకున్నాం..

మొన్న అమ్మెళ్ళిపోయింది

కొందరు రాలేకపోయారు

ఉన్నోళ్ళం భయం భయంగా

దూరం దూరంగా

భారం భారంగా..

ఖచ్చితంగా చెప్పాలంటే

ఘోరం ఘోరంగా..

ఓదార్చే స్పర్శ..

కన్నీరు తుడిచే చేయి లేవు..

పంటి బిగువున బాధ..

గుండె పట్టేసింది..

భోరున ఏడ్చే 

పరిస్థితి లేని దుస్థితి..

కష్టం చూసి కాష్టానికి

వచ్చినోళ్లే లేరు..

ఆ నలుగురూ 

దొరకడమే దుర్లభం..

ఏమి ప్రారబ్ధం..

భరించలేని నిశ్శబ్దం..


కరోనా ఎంత పని చేసావే..

సంఘజీవిని ఒంటరిని చేసి

లొంగదీసావ్..

ఆపై కృంగదీశావ్..

గత అయిదు నెలలుగా 

ఎక్కడ విన్నా 

నీ మాటే..

నీ కాటే..

పాజిటివ్..నెగిటివ్..

టెస్టులు..రెస్టులు..

క్వారెంటైన్లు..ఐసొలేషన్లు..

ఆంబులెన్సు మోతలు..

పోలీసు లాఠీల వాతలు..

లెక్కల కోతలు..

సమ సమాజం..శ్రమ సమాజం

భ్రమ సమాజమై..

చావు అసహజమై..

భయం నిజమై..

బ్రతుకు బరువై..

మనశ్శాంతి కరువై..

గుండె చెరువై..

మృత్యువు చేరువై..

సామాజిక దూరం..

వెంటరానితనం..

అలవాటై..

జీవితమే గ్రహపాటై..

సాటి మనిషిని 

కలవడమే పొరపాటై..

ఇల్లే ఖైదై..

బ్రతుకు చేదై..


సరేలే..

ఎన్నాళ్లులే నీ విలయం..

ఈ జగమే దేవాలయం..

గంట మోగదా..

పంట పండదా..

మంట రేగదా..

నీ ఆయువు మూడదా..

జగతిన మళ్లీ 

తొలి పొద్దు పొడవదా..

మానవజాతి మరో విజయగీతిక ఆలపించదా..!

No comments:

Post a Comment

Total Pageviews