పేరెంటింగ్ సూత్రం 2
నేర్పాల్సిన విషయం లో పిల్లల మీద జాలి పడద్దు. కొన్ని పాఠాలు గుర్తు ఉండాలి అంటే కొంత కష్టం నష్టం ఏమి కాదు.
నాన్న నాకు ఎన్నో విషయాలని ప్రాక్టికల్ గా నేర్పించారు.అందులో ఒకటి నోరువిప్పి అడుగు తెలియక పోతే. ఆ విషయాన్నీ నేర్పటానికి ఏమి చేసారో చెబుతున్నాఈ రోజు.
నేను ఏడు చదువుతుండగా మేము శ్రీహరిపురం లో ఉండేవాళ్ళం. ఒక రోజు నాన్న బ్యాంకు కి వెళ్లి డబ్బులు డ్రా చేయటాని కి ఫారం తీసుకురమ్మని చెప్పారు. మా ఇంటి నుంచి ఒకటే రోడ్. తిన్నగా బ్యాంకు కి వెళ్లి రావటానికి ఒక ఇరవై నిముషాలు పడుతుంది. నాన్న చెప్పగానే ఉషారుగా బయలుదేరాను. నాన్న పని చెప్పటం అంటే మనల్ని పెద్ద అయినట్టు గుర్తించటం అని అనిపిస్తుంది కదా.
బ్యాంకు కి వెళితే అక్కడ ఒక పింక్ స్లిప్ ,వైట్ ,యెల్లో స్లిప్స్ వున్నాయి.పింక్ స్లిప్ తీసుకుని బయలుదేరా ఇంటికి. నాన్న భోజనం చేస్తున్నారు. తీసుకు వెళ్లి చేతిలో పెట్టి మెచ్చుకుంటారని చూస్తున్నా. ఇది కాదు,దీన్ని డబ్బులు వేయటాని కి వాడతారు,డబ్బులు తీసేది పట్రా అన్నారు. మళ్ళి బయలు దేరా.
వేసవి కాలం,మధ్యాహ్నం ఎర్రటి ఎండలో చమటలు కక్కుతూ బ్యాంకు లో కి వెళ్లి ఎల్లో స్లిప్ తీసుకుని బయలు దేరా.ఇంటికి వెళ్లి నాన్న కి ఇచ్చాను. ఇది డిడి తీయటానికి వాడతారు. పనికి రాదు అన్నారు.అంటే ఇంక మిగిలింది వైట్ స్లిప్, అది తేవాలి వెళ్లి.
అప్పటి కి రెండు సార్లు వెళ్లానేమో ఓపిక అయిపొయింది, మొదటిసారి వున్న ఉషారు స్థానం లో ఏడుపు వస్తోంది. నాన్న మొహం లోకి చూస్తే అదేమీ పట్టనట్టు కిళ్ళీ కట్టుకుంటున్నారు. ఈసురోమని బయలుదేరా.వెళ్లి వైట్ స్లిప్ తెచ్చాను.
ఎందుకన్నా మంచిది అని రెండు తెచ్చాను. వెళ్లి నాన్న కి ఇస్తే చూసి, వెళ్లి ఆ బీరువాలో బాక్స్ వుంది అందులో పెట్టు అన్నారు.బాక్స్ తీస్తే అందులో ఒక నాలుగు వైట్ స్లిప్స్ వున్నాయి.
నాన్నా ఇందులో వైట్ స్లిప్స్ వున్నాయి అన్నాను.తెలుసు. ఇవి కూడా అందులో పెట్టు అన్నారు. అదేంటి అర్జెంటు గా కావాలి అన్నారు అన్నాను ఎండవేడి తో వచ్చిన కోపం చూబిస్తూ.
నాన్న ఇట్రా అని పిలిచి,నువ్వు నాతో చాలాసార్లు బ్యాంకు కి వచ్చావు కదా! నేను ఏ స్లిప్ రాసి ఇస్తున్నానో గమనించలేదా అన్నారు .
నాన్న సైకిల్ తీయగానే పరుగున వెళ్లి నేనూ వస్తాను అని తమ్ముడితో పోటీ పడి వెళ్లేదాన్ని.మా చెల్లి అమ్మ కూచి.ఎప్పటి కీ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతుండేది.అందుకని అది నాన్న తో సైకిల్ షికారుకు పోటీ పడేది కాదు.మా తమ్ముడు బజారు కి అయితే నన్ను తోసి మరీ నాన్న తో వెళ్ళేవాడు,ఏ బాలో,చాకలేట్ ఓ కొనిపించుకోవచ్చని. మన కి అవేమి అక్కరలేద్దు.నాన్న ఎక్కడకి వెళ్లినా నాన్నతో వెళ్ళటమే .
అందుకే బ్యాంకు కి ఎక్కువగా నాన్న తో నేనే వెళ్లే దాన్ని.వెళ్లినా మన ద్యాస నాన్న చేసే పనిమీద ఎందుకు ఉంటుంది,వచ్చే పోయే జనాలు,అక్కడ కుర్చీలో కూర్చుని చకచకా పని చేసే వాళ్ళని చూస్తూ నేను ఇలా ఉండాలి అనుకోవటం లో ఉండేదాన్ని.
ఈ రోజు నువ్వు చేసిన మూడు తప్పులు చెప్పు అన్నారు.నేనేం చేశాను. మీరు చెప్పగానే వెళ్లి తెచ్చాను కదా అన్నాను.
"ఎందుకు మూడుసార్లు వెళ్లాల్సి వచ్చింది?నాకు తెలియదు కదా నాన్నా ఏది వాడతారో డబ్బులు తీయటానికి ? దేవుడు నోరెందుకు ఇచ్చాడు? నీకు తెలియనప్పుడు పక్కవాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా ?
మొదటిసారే అక్కడ వున్న వాళ్ళని అడిగితే ఇన్నిసార్లు తిరిగేదానివి కాదుకదా?
ఏదన్నా తెలియక పోవటం తప్పు కాదు,అడిగి తెలుసుకోక పోవటం తప్పు.
ఇప్పడు ఎండలో మూడుసార్లు నడిచాక ఈ విషయం నువ్వు ఎప్పటికి మర్చిపోవు. ఈసారి పని చెబితే వివరం గా అడిగి తెలుసుకో. నువ్వు నన్ను అడుగుతావేమో చెబుదాం వైట్ స్లిప్ తే అని అనుకున్నా. నువ్వు అతి నమ్మకం తో బయలుదేరావు.
ఎప్పుడయినా ఏదన్నా తెలియక పోతే పక్కవాళ్ళని అడిగి తెలుసుకోవటానికి సిగ్గు పడకు "
అదిగో ఆ పాఠం నాకు నేర్పించటానికి ఆ రోజు బ్యాంకు కి అలా ఎండలో మూడుసార్లు తిప్పించారు నాన్న. అవసరం లేక పోయినా బ్యాంకు స్లిప్ కావాలి అని.
అలా నేర్పించాకా ఆ పాఠాన్ని మర్చిపోగలనా? మొహమాటం లేకుండా నాకు రాదు,తెలియదు అని చెప్పటం అడిగి తెలుసుకోవటం,నేర్చుకోవటం అలవాటు అయ్యింది.
ఆ తర్వాత నుంచి నాన్న బ్యాంకు పనులు నాకే చెప్పేవారు.పర్ఫెక్ట్ గా చేసేదాన్ని.క్లియర్ గా ముందే అన్ని అడిగి తెలుసుకుని.తెలియక పోతే బ్యాంకు వాళ్ళ ని అడిగి.
అలాగే నాన్నతో ఎక్కడకి వెళ్లినా నాన్న ఏం చేస్తున్నారు,ఎలా చేస్తున్నారూ అన్నది గమనించటం మొదలు పెట్టా. అలా నాన్న చెప్పకుండా,నాన్న ని చూసి నేర్చుకున్నవి ఎన్ని ఉన్నాయో. ఇది నాన్న నాకు నేర్పిన మరో పాఠం.
No comments:
Post a Comment