Saturday, October 31, 2015

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం!!

        రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం 

           నేర్చుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం!!


శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని

ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా

పాలికి, వర్ణధర్మపరిపాలికి నర్జునభూజయుగ్మ సం

చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.

టీకా:

శీలి = శీలము కలవాని; కిన్ = కి; నీతిశాలి = నీతి స్వభావము గలవాని; కిన్ = కి; వశీకృత = వశపఱచుకోబడిన; శూలి = శివుడు గలవాని; కిన్ = కి; బాణ = బాణాసురుని; హస్త = చేతులను; నిర్మూలి = నిర్మూలించినవాని; కిన్ = కి; ఘోర = భయంకరమైన; నీరద = మేఘాల నుండి; విముక్త = వర్షించిన; శిలా = రాళ్ళచే; హత = కొట్టబడిన; గోప = గోపాలురను; గోపికా = గోపికల; పాలి = పరిపాలకుని; కిన్ = కి; వర్ణ = వర్ణములను {చతుర్వర్ణములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర,}; ధర్మ = ధర్మమములను {ధర్మ - వేదధర్మములను}; పరిపాలి = పరిపాలించేవాని; కిన్ = కి; అర్జున = మద్ది; భూజ = చెట్ల; యుగ్మ = జంటను; సంచాలి = కదిలించినవాని; కిన్ = కి; మాలి = మాలలు ధరించిన వాని; కిన్ = కి; విపుల = పెద్దదైన; చక్ర = చక్రముచే; నిరుద్ధ = అడ్డగింపబడ్డ; మరీచి = సూర్యకిరణములనే; మాలి = మాలికలకి కారణభూతి; కిన్ = కి.
భావము:

శీలవంతుడికి;నీతిమంతుడికి;త్రిశూలధారియైనశివుణ్ణివశం చేసుకున్నవాడి

కి; బాణాసురుని బాహువులు ఖండించిన వాడికి; ఇంద్రునిపంపున మేఘాల 

నుండి కురిసిన రాళ్ల జల్లుకు చెల్లా చెదరైన గోపాలురను, గోపికలను 

కాపాడినవాడికి; వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించిన వాడికి; జంట మద్ది చెట్లు 

పెల్లగించినవాడికి; వనమాల ధరించు వాడికి; సైంధవ సంహార సమయాన 

తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడికి.

పెళ్ళినాటి ప్రమాణాలు ............ * బ్రహ్మముడి *




                       పెళ్ళినాటి ప్రమాణాలు

                                                             * బ్రహ్మముడి *

ధృవం తే రాజా వరుణో ధృవం తే నో బృహస్పతి: 
ధృవంత ఇంద్రశ్చాగ్ని రాష్ట్రం ధారయతాం ధృవం !!

ఈ దాంపత్య సామ్రాజ్యమున ధరించునట్టి మీకు రాజగు వరుణుడును, 
దేవుడగు బృహస్పతియు, ఇంద్రుడును, అగ్నియు నిశ్చలత్వము 
కలుగచేయుదురు. ( ఈ ముడిని కేంద్రముగా చేయుదురు గాక ). అని పై 
మంత్రము చదువుతూ బ్రాహ్మణుడు వధూవరుల కొంగులు ముడి వేస్తారు.
 బ్రాహ్మణుడు ఈ బ్రహ్మముడి వేసాక వధూవరులు ఇద్దరూ అగ్నిహోత్రము
 వద్దకు వచ్చి నమస్కరిస్తారు.







Friday, October 30, 2015

ఓం నమో వేంకటేశాయ


     చేసితి దానధర్మములు చేసితినేన్నియు తీర్థయాత్రలన్
       చేసితి పుణ్యకార్యముల జేసితి నెన్నియొ దైవపూజలన్ 
      చేసితి నన్ని చేతినొక చిల్లియు గవ్వయు లేకపోయినన్ 
      చేసితినంటిగాని యవిచేసినదంతయు నీవెగా ప్రభూ!  




రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... మన పిల్లలకి నేర్పిద్దాం!!

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....
మన పిల్లలకి నేర్పిద్దాం!!

హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.

టీకా:
హారి = హారాలు ధరించువాని; కిన్ = కి; నంద = నందుని; గోకుల = గోకులములో; విహారి = విహరించువాని; కిన్ = కి; చక్ర = చక్రము వలె తిరుగు; సమీర = గాలి - సుడిగాలి రూపధారియైన; దైత్య = రాక్షసుని - తృణావర్తుని; సంహారి = సంహరించినవాని; కిన్ = కి; భక్త = భక్తులయొక్క; దుఃఖ = దుఃఖమును; పరిహారి = తీసివేయువాని; కిన్ = కి; గోప = గోపాల వంశములో పుట్టి; నితంబినీ = స్త్రీల యొక్క {నితంబిని - గొప్ప పిరుదులు గలవారు}; మనస్ = మనసులని; హారి = గెలిచినవాని; కిన్ = కి; దుష్ట = దుష్టుల; సంపద = సంపదను; అపహారి = అపహరించువాని; కిన్ = కి; ఘోష = గొల్లల; కుటీ = ఇళ్ళలోని; పయః = పాలు; ఘృత = పెరుగు; ఆహారి = తినేవాని; కిన్ = కి; బాలక = పిల్లలను; గ్రహ = పట్టుకొనే; మహా = మహా; అసుర = రాక్షసియైన; దుర్ = చెడ్డ; వనితా = స్త్రీని - పూతనని; ప్రహారి = చంపినవాని; కిన్ = కి.

భావము:
మనోహర హారాలు ధరించువాడికిం; సంద వంశం వారి గోకులంలో విహరించినవాడికి; తృణావర్తు డనే దానవుణ్ణి సంహరించిన వాడికి; భక్తుల పరితాపాలను పరిహరించువాడికి; గోపాంగనల మనస్సులను అపహరించినవాడికి; దుష్టుల సంపదలను హరించిన వాడికి; వ్రేపల్లెలో గోపికల యిండ్లలో పాలు, నెయ్యి, అపహరించినవాడికి; పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టు పెట్టినవాడికి.

పెళ్ళినాటి ప్రమాణాలు.....మంగల్యధారణ సమయంలో వరుడు చేసే ప్రమాణం.


                       పెళ్ళినాటి ప్రమాణాలు

మాంగల్యధారణ సమయంలో వరుడు చేసే ప్రమాణం.

           * మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా 
     

               కంఠే బధ్నామిసుభగె త్వం జీవశరదస్సతం *

అనే మంత్రానికి అర్ధం " ఓ మాంగల్యమా! నా జీవనానికి కారణభూతురాలైన

ఈ సౌభాగ్యవతి కంఠ మునకు నిన్ను అలంకరిస్తున్నాను. నీవు నూరు 

సంవత్సరాలు ఈమె కంఠము నందే వుందువుగాక " అని 

చెప్పి 
మాంగల్యాన్ని వధువు మెడలో మూడుముళ్ళు వేసికడతాడు. ఈ 

మూడే ముళ్ళు ఎందుకు వేయిస్తారంటే త్రిమాతలైన లక్ష్మి, పార్వతి, 

సరస్వతీ దేవతలకు అంకితంగా మూడు ముళ్ళు వరుడు వేస్తాడు.






Thursday, October 29, 2015

అట్లతద్ది సందేశం!









అట్లతద్ది సందేశం! 


అనాదిగా వస్తూ పోతూన్నఅట్లతద్ది! 
విస్తు పోతూ ఇలా అంది! 
పుచ్చ పూలా పూసిన పున్నాగ తోటల్లో 
తరపి వెన్నెల్లో తర తరాలుగా
అందమైన ఆటలాడే నాటి అమాయకపు 
ఆడపిల్లలు ఏరీ? అని ఆరాతీసింది.
తీరా చూస్తే ఏముంది? 
అచ్చమైన స్వచ్చమైన ఆ పసితనాన్ని 
కసిగా కాలరాస్తున్నఆధునిక కాలాన్ని,
సెల్లులో బందీ లయిన ఖైదీల్లా... 
కోరి చేజిక్కించుకున్న సెల్లు, కంప్యూటర్
పరికరాలకి బానిసలైపోతూ పరిసరాల్ని పరికించని...
తన రాకని సైతం పట్టించు కోని
నేటి బాల్యాన్ని చూసి నిట్టూర్చింది!
ఆ పసిడి కాలాన్ని పదికాలాలు పదిలంగా ఉంచమని..
మీ చిన్ననాటి రోజులను ఒకసారి మరల గుర్తు చేసుకోమని అమ్మలని
అదలిస్తూ... మందలిస్తూ... ఆదేశిస్తూ అంది!!
కమ్మనైన అమ్మదనపు ప్రేమని 
పదిమందికీ పంచమని... పదిమందిలో పెంచమని... 
అయ్యలను తర్జనితో బెదిరిస్తూ...నిర్దేశిస్తూ అంది!! 
అదే అదే అనాదిగా నా సందేశమని 
అనాదిగా వస్తూ పోతూన్నఅట్లతద్ది! ఆర్తితో అంది.
స్త్రీ స్త్రీత్వం నుండి విడివడి 
ఆకారంలో పురుషుడికి దగ్గిరవుతూ
పురుషుడి అనురాగానికి దూరమవుతోంది! 
అన్న యండమూరి పలుకుల్ని ములుకుల్లా గుచ్చుతూ 
రసగంగాధర తిలక్ అక్షరాలని 
సాక్షాత్కారం చెయ్యమని ప్రేమగా 
తరతరాలకి తరగని చెరగని 
దేశానికి సందేశం అందించింది!!
మణిసాయి విస్సా ఫౌండేషన్.

Wednesday, October 28, 2015

పెళ్ళినాటి ప్రమాణాలు.

పెళ్ళినాటి ప్రమాణాలు.
వివాహ విషయంలో హిందూధర్మం లో ఒక ప్రత్యేకత వుంది.  వివాహ సమయంలో వధూవరులు
 ఇద్దరు ప్రమాణాలు చేస్తారు.
" ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి ".అని వరుడు ప్రమాణం చేస్తాడు. అంటే "ధర్మమునందు గాని , సంపదలవిషయములందు గాని, శారీరిక సుఖ విషయములందు గాని, దానధర్మములవల్ల లభించు మోక్షవిశాయములందు గాని నిన్ను విడచి నడువను." అని వధూవరులచే, ముందుగా వరునితో ప్రమాణం చేయిస్తారు.




శుభోదయం



శుభోదయం
మంత్రాలయ రాఘవేంద్ర మహనీయ గుణసాంద్ర
మంత్రపూత మహాక్షరీషోడసీ పూర్ణచంద్ర !
నేటికీ నీ సమాధిలో నీ రాగం వినిపించు 
నిశ్చలమై పరికించిన నీరూపం కనిపించు !!



రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... మన పిల్లలకి నేర్పిద్దాం!!

        రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....
                    
                               మన పిల్లలకి నేర్పిద్దాం!!

లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.

టీకా:

లలిత = చక్కని / అందమైన; స్కంధము = కొమ్మలతో / స్కంధములతో; కృష్ణ = నల్లని / కృష్ణుని కథలు; మూలము = వేళ్ళుతో / మూలాధారముగ; శుక = చిలుకల / శుక యోగి; ఆలాప = పలుకులతో / పలుకులచే; అభిరామంబు = రమణీయంగా / మిక్కిలి శోభాకరమై; మంజులత = అందమైన పూల తీగలతో / మనోహరమైన వాక్కులతో; శోభితమున్ = అలంకరింపబడుతూ / అలరారుతూ; సువర్ణ = మంచి రంగులు గల / మంచి అక్షర ప్రయోగాలు కలిగి; సుమనస్ = మంచి పువ్వులతో / మంచి మనసున్నవారికి; సుజ్ఞేయమున్ = చక్కగ కనిపిస్తున్న / చక్కగ తెలిసే లాగ; సుందర = అందంగా / అందమైన; ఉజ్జ్వల = బాగా పెరిగిన / విలాసవంత మైన; వృత్తంబున్ = గుండ్రముగా నున్న / చక్కటి పద్య వృత్తములతోను; మహా = పెద్ద / గొప్ప; ఫలంబు = పళ్ళతో / ఫలితా న్నిచ్ఛే లాగను; విమల = విస్తార మైన / నిర్మల మూర్తి యైన; వ్యాసా = చుట్టుకొలత గల / వ్యాసు డనే; ఆలవాలంబున్ = పాదుతో ఉన్నది/ పునాది కలిగినది; ఐ = అయ్యి; వెలయున్ = రూపుకట్టి యున్నది / రూపొంది యున్నది; భాగవత = భాగవత మనే; ఆఖ్య = పేరు గల; కల్పతరువు = కల్పవృక్షము; ఉర్విన్ = భూమిమీద / లోకంలో; సద్ద్విజ = చక్కటి పిట్టలకు / సజ్జనులకు మరియు ద్విజులకు; శ్రేయము = మేలుకూర్చునది / శ్రేయస్కరము; ఐ = అయ్యి.

భావము:

బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలు గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్చమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది.

Tuesday, October 27, 2015

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... మన పిల్లలకి నేర్పిద్దాం!!

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... 
మన పిల్లలకి నేర్పిద్దాం!!

ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.

టీకా:
ఒనరన్ = (రచనలు) చేసేటప్పుడు; నన్నయ = నన్నయ; తిక్కన = తిక్కన; ఆది = మొదలైన; కవులు = కవులు; ఈ = ఈ; ఉర్విన్ = భూమ్మీద; పురాణ = పురాణ {పురాణలక్షణములు - సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము}; ఆవళుల్ = సమూహములు; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయుచున్ = చేస్తూ; మత్ = నాయొక్క; పురా = పూర్వ జన్మలలో; కృత = చేసిన; శుభ = పుణ్యపు; అధిక్యంబు = గొప్పతనం; తాన్ = అది; ఎట్టిదో = ఎలాంటిదో కాని; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయరు = చేయలేదు; మున్ను = ఇంతకు ముందుగ; భాగవతమున్ = భాగవతాన్ని; దీనిన్ = దీనిని; తెనింగించి = ఆంధ్రీకరించి; నా = నాయొక్క; జననంబున్ = జన్మని; సఫలంబు = సార్థకము; చేసెదన్ = చేసుకుంటాను; పునః = పునః; జన్మంబున్ = జన్మమును; లేకుండఁగన్ = లేకుండే లాగ.

భావము:
సంస్కృతంలో ఉన్న పురాణగ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడూ, తిక్కన సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశః నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని 
తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను.

శుభసాయంత్రం

శుభసాయంత్రం
ఆశకు మించిన ఔషధం లేదు రేపు మంచి జరుగుతుందన్న భావనకు మించిన ఉత్సాహం మరొకటి లేదు.
మణిసాయి - విస్సా ఫౌండేషన్.


Monday, October 26, 2015

మాతృభాషలో విద్యా బోధన, పరిపాలన

మాతృ భాషలో విద్యాబోధన జరగాలి అని అంతర్జాతీయంగా విజ్ఞులు, మేధావులు, భాషావేత్తలు, ఎంతగానో మొత్తుకుంటున్నప్పటికీ, రష్యా, చైనా, జపాన్, జర్మనీ మొదలైన అభివృద్ది చెందిన, చెందుతున్నదేశాలు అన్నీ మాతృభాషలో విద్యా బోధన, పరిపాలనలతో ఇంటింటా మాతృభాషాభిమానాన్ని తమ తమ ఘనమైన సంస్కృతులని పెంపొందించే ప్రయత్నాలు చేస్తుంటే సిలికానాంధ్ర వంటి సంస్థలు అందరికీ స్పూర్తిదాయకంగా అమెరికాలో మరియు ఇతర దేశాల్లో 'మనబడి' వంటి కార్యక్రమాలతో విశేషమైన కృషి చేస్తుంటే...."ఊరందరిదీ ఒకదారి ఉలిపిరి కట్టది ఒకదారి" అన్నట్టు మన గత ప్రభుత్వ నిర్వాకాలు తమ చేతకాని తనాన్ని ఇంతవరకూ ప్రజాభిప్రాయం చూపు ఆంగ్లమాధ్యమం వైపు ఉందంటూ కల్లబొల్లి కబుర్లతో విద్యని ప్రైవేటు పరం కార్పోరేట్ పరం చేసాయి. చూడండి ప్రజాభిప్రాయం ఎలావుందో... బ్రతుకు కోసం అమ్మ భాషను ఇంతలా బలిచేయ్యాలా?? ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం!!...ఇలా భాష పరిరక్షణకు బయట జరుగుతున్న పరిణామాలు, సిలికానాంధ్ర మనబడి కార్యక్రమాలు గమనించి...మనబడులలో, కేంద్రీయ విద్యాలయాలలో మన మాతృభాషకూ చోటిద్దాం!! మన భాష ను గౌరవిద్దాం!! ...సత్యసాయి విస్సా ఫౌండేషన్.

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... మన పిల్లలకి నేర్పిద్దాం!!

          రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....
                       
                          మన పిల్లలకి నేర్పిద్దాం!!

కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ 

గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం

గొందఱికి గుణములగు నే

నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్.

టీకా:

కొందఱు = కొంతమంది; కున్ = కి; తెనుఁగు = తెలుగు {తెనుగు గుణమగు - తెలుగు(దేశీయ) పదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుతుంది}; గుణము = బాగుగ; అగున్ = ఉండును; కొందఱకును = కొంతమందికి; సంస్కృతంబు = సంస్కృతము {సంస్కృతంబు గుణమగు - సంస్కృతమూలపదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుతుంది}; గుణము = బాగుగ; అగున్ = ఉండును; రెండున్ = రెండూ; కొందఱి = కొంతమంది; కిన్ = కి; గుణములగు = బాగుగ ఉంటాయి; నేన్ = నేను; అందఱ = అందర్ని; మెప్పింతు = మెప్పిస్తాను; కృతులన్ = రచనలలో; ఆయ్యై = ఆయా; ఎడలన్ = సందర్భానుసారంగా.
భావము:

తెలుగు పదాలతో కూర్చి రాసినవి కొంతమందికి నచ్చుతాయి. సంస్కృత పదాలుతో కూర్చి రాసిన రచనలను మరికొంతమందికి నచ్చుతాయి. ఇంకొంతమందికి రెండు రకాల పదప్రయోగాలు నచ్చుతాయి. నేను అందరు మెచ్చుకొనేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను.

Sunday, October 25, 2015

శుభోదయం


శుభోదయం 
మందాకినీ గంగాజల చందనముచే పూయబడిన మేనికలిగి,నందీశ్వర ప్రమథాధిపులకు ఏలికయైన మందార వంటి పుష్పములతో చక్కగా పూజింపబడే ఆ పరమ శివునకు శతసహస్ర  వందనములు. 





Friday, October 23, 2015

మంచిమాట

మంచిమాట 

పొగడ్తల కంటే సద్విమర్శలు మనిషికి ఎప్పుడూ మేలు చేస్తాయి, ఉపయోగపడతాయి
మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు
కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే
గొప్పతనపు పరీక్ష అవుతుంది.




శుభోదయం../\.. ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా గోవింద!


శుభోదయం../\..

 ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా గోవింద!

పిలచిన పల్కు దైవమువు పేదలపెన్నిది పారిజాతమా 
తలచినవెంట కోరికలు తప్పకతీర్తువు జాగుసేయకన్ 
తెలివి యొకింత లేని మము తీరిచి దిద్దియనుగ్రహించి మా 
కలుషములెల్ల బాపి కనికరము జూపవె వేంకటేశ్వరా!!


శుభ సాయంత్రం!!


                                                  శుభ సాయంత్రం!!

                                                   మంచి ఆలోచనలు అనే దీపం ఉంటే
                                    జీవితంలో అన్ని భాధలను అవలీలగా                                                                   జయించవచ్చు. 



                                                           


Thursday, October 22, 2015

ధన..ధాన్య ప్రదేదేవి దారిద్ర్య విధ్వంసినీ శ్రీ మహాలక్ష్మి నమో నమః

ధన..ధాన్య ప్రదేదేవి దారిద్ర్య విధ్వంసినీ శ్రీ మహాలక్ష్మి నమో నమః 

ఎన్ని జన్మల పుణ్యఫలమో - నిను కొల్చు భాగ్యం బైనది
పరమపావనమైన నీదు సన్నిధానమె..
పెన్నిధి కోరి కొలిచినవారి కెన్నోకోర్కెలను 
కురిపించినావు నేరమెంచక నన్ను
దయతో చేరదీసి బ్రోవుమమ్మా!!




శుభోదయం ../\..


శుభోదయం ../\..
అందరితో మనం ఆనందంగా ఉండాలంటే 
సర్దుకుపోయే గుణాన్ని
అందరూ మనతో ఆనందంగా ఉండాలంటే 
క్షమా గుణాన్ని మనం అలవరచుకోవాలి.



Wednesday, October 21, 2015

దసరా శుభాకాంక్షలతో..... శుభోదయం../\..


       దసరా శుభాకాంక్షలతో.....     
శుభోదయం../\..

వి- రబూయాలి చిరు దరహాసాలు

జ-యకేతనాలు ఎగుర వేయాలి

య- శోచంద్రికలు వెల్లి విరియాలి

ద- యాదాక్షిణ్యాలు కొలువుండాలి

శ-ర పరంపరలా సిరిసంపదలు

మి-రుమిట్లు గొలపాలి.

మీ ఇంటఈ విజయదశమి కావాలి మీ నోముల పంట
--------------------------------------------------------






విజయదశమి శుభాకాంక్షలు


విజయదశమి శుభాకాంక్షలు
పార్వతి జనని భవాని శ్రీ రాజరాజేశ్వరి సర్వలోకపాలిని మానిని దేవి
నీరజాక్షి పరమపావని కామాక్షి నిరంజని మామవ అంబా॥
 శ్రీకరి జనని మృడాని శ్రీ రాజరాజేశ్వరి హ్రీంకారరూపిణి హరిణాక్షి దేవి
శ్రీ కాంచీపురవాసిని కామాక్షి శ్రీ కామేశ్వరి మామవ అంబా॥
 శాంభవి జనని పురాణి శ్రీ రాజరాజేశ్వరి శర్వరీశ ధారిణి శంకరి దేవి
శ్యామకృష్ణ పరిపాలిని కామాక్షి శ్యామళాంబికే మామవ అంబా॥




శుభరాత్రి


శుభరాత్రి 
జీవితం మరియు సమయం మనకి మంచి ఉపాధ్యాయుల లాంటివారు 
జీవితం నేర్పిస్తుంది మనకి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో  
సమయం నేర్పిస్తుంది జీవితం ఎంత విలువైనదో .



Tuesday, October 20, 2015

బంధు, మిత్రులందరికీ మహర్నవమి శుభాకాంక్షలు.

బంధు, మిత్రులందరికీ మహర్నవమి శుభాకాంక్షలు.

9వ రోజు దేవీ నవరాత్రులలో అవతారము శ్రీమహిషాసురమర్దినీదేవిగా అలంకరిస్తారు.శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజశుద్ధ అష్టమినాడు అమ్మవారిని శ్రీమహిషాసురమర్దినీదేవిగా అలంకరిస్తారు. దీన్నే మహర్నవమి అని కూడా అంటారు.సింహవాహనం మీద ఆలీఢ పాద పద్ధతిలో ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దుర్గమ్మ దర్శనమిస్తుంది. అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి.ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.




Monday, October 19, 2015

మిత్రులందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు.


మిత్రులందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు.

శరన్నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.
అష్టమికి ఉన్న ప్రత్యేకత ఎమిటి అంటే ఎప్పుడైనా సరే అమ్మవారిని ఆరాధించాలి కొన్ని ప్రత్యేకమైన తిధులు ఉన్నాయి...అవి అష్టమి,నవమి,చతుర్దశి, అమావాశ్య,పౌర్ణమి, ఈ తిధులను పంచమహాపర్వములు అని అంటారు, వీటిలో ఇప్పుడు అష్టమి అంటే మహాపర్వము అని అర్ధము.ఈ తిధులలో అరాధిస్తే అమ్మ ప్రీతి చెందుతుంది.సర్వవర్ణాల వారు ,సర్వ మతాల వారు , సకల జనుల వారు, సకల జనులు నిరభ్యంతరముగా ఉపాసించదగిన దేవత ఈ అమ్మ....దుర్గమ్మ! ఈ తల్లి సర్వజీవ అంతర్యామి. సంకటనాశిని. జగన్మాత, స్త్రీ, పురుష వయో భేదం లేకుండా సర్వులు ఉపాసించవలసిన పరాదేవత ఈ దుర్గమ్మ..

ఏకవేణీ జపార్ణపూరా నగ్నా ఖరస్థితా
లంబోష్టీ కర్ణికార్ణీ  తైలాభ్యక్త శరీరిణీ!

వామపాదోల్ల సల్లోహలతాకంటక భూషణా 
వర మూర్ధధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ! 
  సర్వ స్వరూపే సర్వేశే సర్వలోక నమస్కృతే 
భయేభ్యస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే!!

అశ్వినస్య చితాష్టమ్యాం అర్ధరాత్రేతు పార్వతి
భద్రకాళి సముత్పన్నా పూర్వాషాడః సమాయుతే
తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయగ్న వినాసిని
ప్రాతుర్భూతా మహాఘోర యోగిని కోటివిస్సః

ఓం కాత్యాయనాయ విద్మహీ కన్యాకుమారి ధీమహీ తన్నో దుర్గీ ప్రచోదయాత్



Sunday, October 18, 2015

ఓం నమో భగవతీ విద్యాలక్ష్మీ దేవతాయై నమః

ఓం నమో భగవతీ విద్యాలక్ష్మీ దేవతాయై నమః 

యాదేవి సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితా 
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః !!

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!

పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని
నిత్యం పద్మాలయా దేవి సామాంపాతు సరస్వతి!!

పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది.ఆశ్వయుజ శుక్ల పక్షమున మూలా నక్షత్రమునాడు ఆ అమ్మని పూజిస్తే సకల కార్యాలు నెరవేరతాయి. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు.  సరస్వతీదేవి పలు నామాలతో విలసిల్లుతోంది. భారతి, మహవిద్య, వాక్, మహరాణి, ఆర్య, బ్రహ్మి, కామధేను, బీజగర్భ, వీణాపాణి, శారద, వాగీశ్వరీ, గాయత్రి, వాణి, వాగ్దేవి, విద్యావాచస్పతి తదితర నామాలు ఉన్నాయి.హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి". సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి. సకల సవాజ్మయానికీ మూలం. మనం నోటితో ఏదైన మధురంగా మాట్లాడుతున్నామంటే అది ఆ తల్లి చలవే. ఆమె అంతర్వాహినిగా ఉండటం వల్లే మనలో మేధాశక్తి పెంపొందుతుంది. ఆమె అనుగ్రహం లేకపోతే అజ్ఞానాంధకారం లో కొట్టుమిట్టాడవలసిందే. అందుకే ఆ చల్లని తల్లి అనుగ్రహం ప్రతీ ఒక్కరికీ అవసరం. 
      ఓం నమో భగవతీ విద్యాలక్ష్మీ దేవతాయై నమః  - 
ఓం హం ఐం శ్రీం హం ఐం శ్రీం 
ఇది సరస్వతీదేవి మూలమంత్రం. దీనిని 108 సార్లు భక్తి శ్రద్ధలతో ఈమంత్రాన్ని మనస్సులో జపిస్తే సమస్యలన్నీ తీరి మంచిస్తానాన్ని పొందుతారు. శ్రీ సరస్వతి దేవి అనుగ్రహిస్తే జ్ఞానం, పాండిత్యం, లభిస్తాయి. దానిద్వారా ఉన్నతస్థానం పొంది భోగభాగ్యాలు లభిస్తాయి. మనందరిపైనా ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకొంటున్నాను. 




శుభ సాయంత్రం


శుభ సాయంత్రం

అభిమానం సంపాదించడానికి 
ఆస్థులు..అంతస్తులు అవసరంలేదు 
మంచిపనులు చేసి మంచిపేరు తెచ్చుకుంటే 
అందరూ నీ అభిమానులే అవుతారు.




రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ... మన పిల్లలకి నేర్పిద్దాం!!

        రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి 

   మనం నేర్చుకుంటూ... మన పిల్లలకి నేర్పిద్దాం!!

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, 

శూలికైనఁ దమ్మిచూలికైన,
 
విబుధజనుల వలన విన్నంత కన్నంత

దెలియ వచ్చినంత దేటపఱతు.

టీకా:

భాగవతము = భాగవతమును; తెలిసి = తెలుసుకొని; పలుకుట = 
పలుకుట; చిత్రంబు = చిత్రమైనది; శూలి = శూలధారి శివుని; కిన్ = కి; 
ఐనన్ = ఐనప్పటికి; తమ్మి = పద్మము నందు; చూలి = పుట్టినవాని; కిన్ 
కి; ఐనన్ = అయినప్పటికి; విబుధ = విశేషమైన జ్ఞానముగల; జనుల = 
జనుల; వలనన్ = వలన; విన్న = వినిన; అంత = అంత; కన్న = చూసిన; 
అంత = అంత; తెలియవచ్చిన = తెలిసిన; అంత = అంత; తేట = తెలిసేలా; 
పఱతు = చేస్తాను.

భావము:

అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం
 అని ఎవరు చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే,
 పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ఇక నా సంగతి వేరే 
చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్ననో, వారి సన్నిధిలో ఎంత 
నేర్చుకున్ననో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్ల 
మయ్యేలా చెప్తాను.

Saturday, October 17, 2015

మంచిమాట!!

మంచిమాట!!

అహంకారం మనిషిని పతనం చేయటమేగాక 

అనామకునిగా చేయడానికి ముఖ్య కారణం అవుతుంది.




శ్రీ మహాలక్ష్మి!


 శ్రీ మహాలక్ష్మి!

మాతర్నమామి కమలే కమలాయతాక్షి 
శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః 
క్షీరోదజే కమలకోమల గర్భగౌరి 
లక్ష్మీప్రసీద సతతం నమతాం శరణ్యే!!

వందే లక్ష్మీం పరమశివమయీంశుద్ధ జంబూనదాభాం
తేజోరూపం కనకవసనాం స్వర్ణ భూషోజ్జ్వలాంగీం 
బీజాపూరం కనక కలశం హేమపద్మం దధానం 
మాన్యాం శక్తిం సకల జననీం విష్ణువామాంక సంస్థాం !!!


రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... మన పిల్లలకి నేర్పిద్దాం!!

           రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... 
                                 మన పిల్లలకి నేర్పిద్దాం!!

పుండరీకయుగముఁ బోలు కన్నుల వాఁడు
వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.

టీకా:
మెఱుఁగు = మెఱుపుతీగ; చెంగటన్ = ప్రక్కన; ఉన్న = ఉన్నటువంటి; మేఘంబు = మబ్బుల; కైవడిన్ = విధంగా; ఉవిద = స్త్రీ (భార్య) / లక్ష్మి; చెంగట = దగ్గఱ; ఉండన్ = ఉండగా; ఒప్పు = చక్కగ యండెడి; వాడు = వాడు; చంద్ర = చంద్ర; మండల = బింబపు; సుధా = వెన్నెల; సారంబు = వెలుగు; పోలిక = వలె; ముఖమున = ముఖములో; చిఱునవ్వు = చిఱునవ్వు; మొలచు = వెలయు - ప్రకాశించు; వాఁడు = వాడు; వల్లీయుత = పూలతీగతోకూడిన; తమాల = గానుగు; వసుమతీ = భూమిని; జము = పుట్టినది - చెట్టు; భంగిన్ = వలె; పలు = బలిష్టమైన; విల్లు = విల్లు; మూఁపునన్ = భుజమున; పరఁగు = ప్రవర్తిల్లే; వాఁడు = వాడు; నీల = నీల; నగ = గిరి; అగ్ర = శిఖరము; సన్నిహిత = సమీపంగానున్న; భానుని = సూర్యుడి; భంగిన్ = లాగ; ఘన = గొప్ప; కిరీటము = కిరీటము; తలన్ = తలపైన; కలుగు = కల; వాఁడు = వాడు; 
పుండరీక = పద్మముల; యుగము = జంట; పోలు = వంటి; కన్నుల = కళ్ళుకల; వాఁడు = వాడు; వెడఁద = విశాలమైన; ఉరము = వక్షముగల; వాఁడు = వాడు; విపుల = విస్తారమైన; భద్ర = శుభలక్షణముల; మూర్తి = ఆకారముగల; వాఁడు = వాడు; రాజ = రాజులలో; ముఖ్యుఁడు = ముఖ్యమైనవాడు; ఒక్కరుఁడు = ఒకడు; నా = నాయొక్క; కన్నున్ = కళ్ళ; గవ = జంట; కున్ = కు; ఎదురన్ = ఎదురగ; కానఁబడియె = సాక్షత్కరించెను;

భావము:
ఆ సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. మేఘం ప్రక్కన మెరుపులాగ ఆయన ప్రక్కన ఒక స్త్రీమూర్తి ఉంది. చంద్ర మండలంలోంచి కురిసే అమృత ధారలా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. కానుగవృక్షాన్ని చుట్టుకొన్న తీగలా ఆయన భుజాగ్రాన ధనుస్సు వ్రేలాడుతోంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగ ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విరిసిన తెల్ల దామరరేకులవంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో, ఆ రాజశ్రేష్ఠుడు నా కట్టెదుట కనువిందు విందుచేశాడు.

Friday, October 16, 2015

శుభోదయం


  ఆస్తియు పాస్తియున్ సకలయాభారణంబులు మాకు నీవెగా
      ఆస్తికులై సదాహృదిని అంకితమిచ్చుటగాక నీకు యే
      ఆస్తులునీయగాగలము అర్పణగానిక  భక్తి యొక్కటే 
      ఆస్తియు  మాకడన్  మిగిలె నారసిగైకొను, వేంకటేశ్వరా! 



ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః!!


 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః!!



శుభరాత్రి


                               శుభరాత్రి

ఐసులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా 

మాటలా నిలచిపోయే మంచితనమే గొప్పది.




రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... మన పిల్లలకి నేర్పిద్దాం!!

    రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....

                        మన పిల్లలకి నేర్పిద్దాం!!

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్

సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే

సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ

బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.

టీకా:

ఈ = ఈ; మనుజ = మానువులకు; ఈశ్వర = రాజులలో; అధముల = అధముల; కున్ = కు; ఇచ్చి = అంకితమిచ్చి; పురంబులు = ఊళ్ళు; వాహనంబులున్ = ప్రయాణ సాధనములు; సొమ్ములున్ = ధనం; కొన్ని = మొదలైన కొన్నిటిని; పుచ్చుకొని = తీసుకొని; చొక్కి = అలసిపోయి; శరీరము = శరీరము; వాసి = వదలి; కాలు = యముడి; చేన్ = చేత; సమ్మెట = సుత్తి; వ్రేటులన్ = దెబ్బలు; పడక = తినకుండ; సమ్మతి = ఇష్ట; తోన్ = పూర్వకముగా, కలిగి; హరి = హరి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్ఛి; చెప్పెన్ = చెప్పెను; ఈ = ఈ; బమ్మెర = బమ్మెర వంశపు; పోతరాజు = పోతన అనే సమర్ధుడు; ఒకఁడు = అనబడేవాడు ఒకడు; భాగవతంబున్ = భాగవతమును; జగత్ = లోకానికి; హితంబుగన్ = మేలు సమకూరునట్లుగా.

భావము:

విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా రాసిన భాగవతాన్ని మానవమాత్రులు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిగెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను.

Total Pageviews