Tuesday, October 27, 2015

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... మన పిల్లలకి నేర్పిద్దాం!!

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... 
మన పిల్లలకి నేర్పిద్దాం!!

ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.

టీకా:
ఒనరన్ = (రచనలు) చేసేటప్పుడు; నన్నయ = నన్నయ; తిక్కన = తిక్కన; ఆది = మొదలైన; కవులు = కవులు; ఈ = ఈ; ఉర్విన్ = భూమ్మీద; పురాణ = పురాణ {పురాణలక్షణములు - సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము}; ఆవళుల్ = సమూహములు; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయుచున్ = చేస్తూ; మత్ = నాయొక్క; పురా = పూర్వ జన్మలలో; కృత = చేసిన; శుభ = పుణ్యపు; అధిక్యంబు = గొప్పతనం; తాన్ = అది; ఎట్టిదో = ఎలాంటిదో కాని; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయరు = చేయలేదు; మున్ను = ఇంతకు ముందుగ; భాగవతమున్ = భాగవతాన్ని; దీనిన్ = దీనిని; తెనింగించి = ఆంధ్రీకరించి; నా = నాయొక్క; జననంబున్ = జన్మని; సఫలంబు = సార్థకము; చేసెదన్ = చేసుకుంటాను; పునః = పునః; జన్మంబున్ = జన్మమును; లేకుండఁగన్ = లేకుండే లాగ.

భావము:
సంస్కృతంలో ఉన్న పురాణగ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడూ, తిక్కన సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశః నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని 
తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను.

No comments:

Post a Comment

Total Pageviews