Wednesday, October 7, 2015

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం!!

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

టీకా:
అమ్మలన్ = అమ్మలను(సప్త మాతృకలు); కన్న = కన్నటువంటి (కంటె గొప్ప దైన); అమ్మ = తల్లి; ముగురు = ముగ్గురు {ముగురు అమ్మలు - లక్ష్మి సరస్వతి పార్వతి}; అమ్మల = అమ్మలకి; మూలపు = మూల మైన; అమ్మ = అమ్మ; చాలన్ = చాలా; పెద్ద = పెద్ద; అమ్మ = అమ్మ; సురారుల = రాక్షసుల యొక్క {సురారులు – సుర (దేవతల) అరులు (శత్రువులు), రాక్షసులు}; అమ్మ = తల్లి; కడుపు = కడుపు; ఆఱడి = మంట; పుచ్చిన = కలిగించిన; అమ్మ = అమ్మ; తన్ను = తనను; లోన్ = మనసు లోపల; నమ్మిన = నమ్మిన; వేల్పు = దేవతల; అమ్మల = తల్లుల; మనమ్ముల = మనసులలో; ఉండెడి = ఉండే; అమ్మ = అమ్మ; దుర్గ = దుర్గాదేవి; మా = మా; అమ్మ = అమ్మ; కృప = దయా; అబ్ధి = సముద్రముతో; ఇచ్చుత = ఇచ్చుగాక; మహత్త్వ = గొప్పదైన; కవిత్వ = కవిత్వంలో; పటుత్వ = పటుత్వమనే; సంపదల్ = సంపదలు.

భావము:
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయ్యి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

No comments:

Post a Comment

Total Pageviews