Sunday, October 11, 2015

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం!!

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం!!

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.

టీకా:
హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; పట్టపు = పట్టపు; దేవి = రాణి; పున్నెముల = పుణ్యముల; ప్రోవు = పోగు; అర్థంపు = సంపదలకు; పెన్ = పెద్ద; ఇక్క = నిలయము; చందురు = చంద్రుడికి; తోన్ = తో కలిసి - తోడ; పుట్టువు = పుట్టినది; భారతీ = సరస్వతి; గిరిసుతల్ = పర్వత పుత్రిల (పార్వతి); తోన్ = తో కలిసి; ఆడు = ఆడే; పూఁన్ = పూవును; పోడి = పోలినది - స్త్రీ; తామరలు = పద్మముల; అందున్ = లో; ఉండెడి = ఉండే; ముద్దు = మనోజ్ఞముగ ఉన్న; ఆలు = స్త్రీ; జగముల్ = లోకాలు; మన్నించు = గౌరవించే; ఇల్లు = గృహమునకు; ఆలు = స్త్రీ; భాసురతన్ = (తన) ప్రకాశము వలన; లేములు = దరిద్రాలను; వాపు = పోగొట్టే; తల్లి = అమ్మ; సిరి = లక్ష్మి; ఇచ్చున్ = ఇచ్చుగాక; నిత్య = నిత్యమైన; కల్యాణముల్ = శుభములు.

భావము:
దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి; రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి; సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు; వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి; అరవిందాలు మందిరంగా గల జవరాలు; అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న; చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి; ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రొహించు గాక.


No comments:

Post a Comment

Total Pageviews