Wednesday, October 28, 2015

రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ.... మన పిల్లలకి నేర్పిద్దాం!!

        రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....
                    
                               మన పిల్లలకి నేర్పిద్దాం!!

లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.

టీకా:

లలిత = చక్కని / అందమైన; స్కంధము = కొమ్మలతో / స్కంధములతో; కృష్ణ = నల్లని / కృష్ణుని కథలు; మూలము = వేళ్ళుతో / మూలాధారముగ; శుక = చిలుకల / శుక యోగి; ఆలాప = పలుకులతో / పలుకులచే; అభిరామంబు = రమణీయంగా / మిక్కిలి శోభాకరమై; మంజులత = అందమైన పూల తీగలతో / మనోహరమైన వాక్కులతో; శోభితమున్ = అలంకరింపబడుతూ / అలరారుతూ; సువర్ణ = మంచి రంగులు గల / మంచి అక్షర ప్రయోగాలు కలిగి; సుమనస్ = మంచి పువ్వులతో / మంచి మనసున్నవారికి; సుజ్ఞేయమున్ = చక్కగ కనిపిస్తున్న / చక్కగ తెలిసే లాగ; సుందర = అందంగా / అందమైన; ఉజ్జ్వల = బాగా పెరిగిన / విలాసవంత మైన; వృత్తంబున్ = గుండ్రముగా నున్న / చక్కటి పద్య వృత్తములతోను; మహా = పెద్ద / గొప్ప; ఫలంబు = పళ్ళతో / ఫలితా న్నిచ్ఛే లాగను; విమల = విస్తార మైన / నిర్మల మూర్తి యైన; వ్యాసా = చుట్టుకొలత గల / వ్యాసు డనే; ఆలవాలంబున్ = పాదుతో ఉన్నది/ పునాది కలిగినది; ఐ = అయ్యి; వెలయున్ = రూపుకట్టి యున్నది / రూపొంది యున్నది; భాగవత = భాగవత మనే; ఆఖ్య = పేరు గల; కల్పతరువు = కల్పవృక్షము; ఉర్విన్ = భూమిమీద / లోకంలో; సద్ద్విజ = చక్కటి పిట్టలకు / సజ్జనులకు మరియు ద్విజులకు; శ్రేయము = మేలుకూర్చునది / శ్రేయస్కరము; ఐ = అయ్యి.

భావము:

బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలు గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్చమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది.

No comments:

Post a Comment

Total Pageviews