Tuesday, May 10, 2016

7). మాంగల్య ధారణ-తలంబ్రాలు
వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం. సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు. "శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది. పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం. మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు. కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.
స్థాళీపాకం-సప్తపది-నాగవల్లి-సదశ్యం
తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా హోమం దగ్గర అన్నం వండించే పని, ఆ తర్వాత సప్తపది వుంటుంది. వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు, ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం వధువు తన అంగీకారాన్ని తెలియ పరుస్తుంది. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి. సప్తపది పూర్తైన తర్వాతనే, వధువు గోత్రం-ప్రవర-ఇంటి పేరు, వరుడి గోత్రం-ప్రవర-ఇంటి పేరు గా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ-హిందూ సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పదనాన్ని విశదపరిచే మంత్రాన్ని చదువుతారు. అందులో, "ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ, ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక" అన్న అర్థం స్ఫురిస్తుంది. వధువును అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరం నకుగానీ, ఏడు మంత్రాలతో, ఏడు అడుగులు నడిపించుతున్న వరుడితో జపం-హోమం చేయించుతారు. ఇక్కడే చెప్పిన మరో మంత్రంద్వారా వధూవరులిద్దరు, ఇకనుంచి స్నేహితులం అన్న అర్థం కూడా వుంటుంది. "మన ఇద్దరం స్నేహితులం. నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయులకు మైత్రి కలిగింది. నీ చేతిని నేనెప్పుడూ విడవను-నన్ను నీవు కూడా విడవవద్దు. మంచి మనస్సుతో అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం. పరస్పరం చర్చించుకొని కుటుంబ పనులను నెరవేరుద్దాం. అనుకూల దంపతులమై సంసార యాత్ర కొనసాగించుదాం. నువ్వు భూమివి-నేను ఆకాశాన్ని. నువ్వు వాక్కువు-నేను మనస్సును. నేను చేసే ధర్మ కార్యాలకు నీ సహకారం కావాలి. యోగ్యమైన సంతానాన్ని-సంపదను మనం ఇద్దరం కలిసి అనుభవించుదాం" అని దానర్థం. " రాత్రి గాని, పగలు గాని, ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో నువ్వుండాలి నీకు ఎటువంటి ఇబ్బందీ కలగరాదు. సుమంగళివై-సత్ సంతానంతో గృహలక్ష్మివై, అభివృద్ధి చెందాలి" అని రక రకాలుగా అనునయించే మాటలివి. సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం. సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు, వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం వుంటుంది. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు. ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమితృల కోలాహలం మధ్య "భుజం బంతి భోజనాల" హడావిడి వుంటుంది. వధూవరులిద్దరిని పక్క-పక్కన కూచోబెట్టి, వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి, వరుసకు బావా-మరదళ్లలాంటి వారి వేళా-కోళాల మధ్య భోజన చేయడం ఆరంభించుతారు అందరూ. మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో వుంచడం, పక్క వారందరూ తినమని బలవంతం చేయడం అక్కడ జరిగే వేడుక. ఉంగరాలు తీయడమనే "ప్రధానాంగుళీయకం" వేడుకలో మూత కురుచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోసి, దానిలో మెట్టెలు, ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నించే తంతుంటుంది. వుంగరం దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమితృల కోలాహలం చోటుచేసుకుంటుంది. ఆ కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది.
అప్పగింతలు-గృహ ప్రవేశం
కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో, వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ ఆ టైంలోపల జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు. కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు. భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ: "అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా, అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు. బహుశా అప్పగింతల ద్వారా, పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం చేయడం కొరకు, ఈ వేడుకను జరిపిస్తుండవచ్చు. అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో ఊయలలాగా చేసి, అందులో ఈ చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి ఆ బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాప-బాబును జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లనిపించిన తర్వాత, ఆడబిడ్డకు ఆ పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు. ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది. హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.















No comments:

Post a Comment

Total Pageviews