Tuesday, May 17, 2016

అంతఃశ్శుద్ధి

అనగనగా ఒక ఊరిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక గురుకులం విద్యార్థులతో నిండి వుంది. అక్కడ విద్యార్థులు గురుబోధనలు వింటూ, విన్న బోధనలను తమ ఆచరణలోకి తెచ్చుకుంటూ, తమ విద్యాభ్యాసాన్నికొనసాగిస్తూ వుంటారు. ఆ గురుకులంలో విద్యార్థులంతా రోజు వారీ వంతుల ప్రకారం గురువుగారి పనులు, ఆశ్రమ పనులు, భిక్ష, గోవులను కాయుట, వాటికి గ్రాసము సమకూర్చుట వంటి పనులను పంచుకుంటూ.... గురు శుశ్రూష చేస్తూ గురువుగారి వద్ద విద్యను అభ్యసిస్తూ వుంటారు.

ఆ గురుకులానికి ఒక రోజు నిర్మలుడు అనే పేరుగల బాలుడు వచ్చాడు. చూడడానికి బాలుని వలె వున్నా ఆ బాలుడిలో దివ్య తేజస్సు తాండవిస్తుంది. ఆ విద్యార్థిని చూసిన గురువుగారు, వీనికి మిగితా విద్యార్థుల మాదిరి బోధన చేయక, అనుష్ఠాన పద్దతిలో బోధించాలనే భావన కలిగింది. ఆనాటి నుంచి ఆ బాలునికి రకరకాలైన చిన్న చిన్న పనులను అప్పజెప్తూ, ఆ పనిద్వారా అతను ఏమి గ్రహించాడో పని పూర్తి అయ్యాక తిరిగి వచ్చి గురువుగారికి చెప్పవలెననెడి నియమము పెట్టారు. ఆ నిర్మలుడు గురువుగారు చెప్పిన నియమాన్ని ఎక్కడా ఉల్లంఘించకుండా, చేస్తున్న పనిని మరింత శ్రద్ధతో చేస్తూ, ఈ పని నాకేమి బోధిస్తున్నది? దీనిలో నేను గ్రహించవలసినది ఏమిటి? అనే విచారణ చేయుచు, తన రోజు వారి పనులను చేస్తూ, వేదాభ్యాసం చేసేవాడు.


కొంతకాలం గడిచాక, ఒక రోజు వంటపాత్రలను శ్రద్ధగా కడుగుతున్న నిర్మలుని చూచిన గురువుగారు, ఆతని వద్దకు వచ్చి నాయనా! ఆశ్రమ వాతావరణం ఎలా వున్నది? నీ విద్యాభ్యాసం నీకు సంతృప్తిని ఇస్తున్నదా? అని అడిగారు. తన పాటికి తాను శ్రద్ధగా పనిలో నిమగ్నమై అంట్లు తోముతున్న నిర్మలుడు గురువుగారిని చూసి, లేచి నమస్కరించి, అయ్యా! మీ సాంగత్యము వలన నాకు మహదానందముగా వున్నది. మీరు చెప్పిన విధంగా, ఏ పనైనా చేసేముందు... ఈ పని ద్వారా నేను తెలుసుకోవలసిన తత్వమేమి? అనే ప్రశ్నతో పనిని ప్రారంభిస్తున్నాను, పని పూర్తయ్యే సరికి, పనితో పాటు, నా యందలి విచారణ కూడా పూర్తి అయ్యి, ఆ పని నాకొక జ్ఞానవాక్యాన్ని అందిస్తున్నదని వినయంగా చెబుతాడు.

అప్పుడు గురువుగారు, నిర్మలుడుతో... "మంచిది నాయనా! సరే, ఇంతకు ఈ పాత్రలను శుభ్రం చేస్తున్నావు కదా, ఈ పని ద్వారా నీకు ఏమి గ్రహించావో వివరించు" అంటారు.

అంతట ఆ నిర్మలుడు, గురువర్యా! "పాత్రలు బయిట శుభ్రంగా వుండడం కంటే, లోపల శుభ్రంగా వుండడం ఎంతో ముఖ్యం" అని గ్రహించాను తండ్రీ! అని బదులిస్తాడు.

నిర్మలుని సమాధానంతో సంతుష్ఠులైన గురువుగారు, ఆనాటి నుంచీ అతనికి సకల వేదవేదాంగాలను బోధించసాగారు.

వంట పాత్రలు లోపల శుద్ధం లేకపోతే... ఆ గిన్నెలలో పాలు వంటివి కాచినప్పుడు అవి విరగిపోతాయి, పాకం (కూర) చెడుతుంది. అలానే మానవుడు తన అంతరంగాన్ని శుద్ధపరుచుకోకుండా ఎంత జ్ఞానబోధలు విన్నప్పటికీ అవి సరైన ఫలితాన్ని ఇవ్వలేవు.

అంచేత బాహ్యంగా శుచిత్వం కలిగివుండడంతో పాటు, అంతరంగంలో కూడా శుచిత్వాన్ని కలిగివుండడమనేది జ్ఞానార్థికి ఆవశ్యకమై వున్నది.

No comments:

Post a Comment

Total Pageviews