Monday, June 13, 2016

శ్రీమద్భగవద్గీత - కర్మసంన్యాసయోగం

                అనాశ్రిత: కర్మఫలం కార్యం కర్మ కరోతి య: ।
                స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియ: ॥1॥
                   అనాశ్రితః-కర్మఫలం-కార్యం-కర్మ-కరోతి-యః
                   సః-సంన్యాసీ-చ-యోగీ-చ-న-నిరగ్నిః-న-చ-అక్రియః

ఎవడు తను నిర్వర్తించవలసిన కర్మను ఫలాన్ని ఆశ్రయించక చేస్తున్నాడో వాడే సన్యాసి, యోగికూడా. అగ్నులనుంచుకొనక నిష్క్రియంగా వుంటున్నవాడు కాదు.

అనాశ్రితః, ఆశ్రయించనివాడై – దేనిని? కర్మఫలం, కర్మల ఫలాన్ని, ఆశ్రయించనివాడై, కర్మఫలమందు కోరికలేనివాడై; కర్మ ఫలమందు కోరికగలవాడు కర్మఫలాన్ని ఆశ్రయిస్తాడు. కానీ, వీడు అందుకు విరుద్ధమైనవాడు. కాబట్టి, కర్మఫలాన్ని ఆశ్రయించనివాడు.

ఇటువంటివాడై, వాడి కార్యం కర్మ, నిర్వర్తించవలసిన కర్మలను, కర్తవ్యాన్ని, కామ్యకర్మలకు విరుద్ధమైన అగ్నిహోత్రాది నిత్యకర్మలను; య:, యెవడు; కరోతి, చేస్తున్నాడో, నిర్వర్తిస్తున్నాడో - ఈ విధంగా కర్మను ఆచరిస్తున్నవాడు ఇతరవిధమైన కర్మలను ఆచరిస్తున్నవారికంటే విశిష్ఠమైనవాడు. ఈ అర్థాన్నే చెబుతూ భగవాన్, సః, వాడు; సన్న్యాసీ, సన్యాసి; ఇంకా వాడు యోగీ చ, యోగి కూడా; అని చెబుతున్నారు. సన్యాసం అంటే పరిత్యజించడం. ఇది యెవరివద్ద వుంటున్నదో వాడు సన్యాసి. వాడు యోగికూడా. యోగం అంటే చిత్త ఏకాగ్రత. ఎవడికి యిది వుంటున్నదో వాడు యోగి. వీడు యిటువంటి గుణసంపన్నుడని అనుకొనవలెను. కేవలం, అగ్నిని వుంచుకొనని వాడిని, (‘నిరగ్ని:’) కర్మను చేయనివాడిని (‘అక్రియ:’) సన్యాసి అనిగానీ, యోగి అనిగానీ అనుకొనరాదు.

నిరగ్ని:, ఎవడినుండి కర్మలను నిర్వహించడానికి అంగాలైన అగ్నులు® నిష్క్రమించినవో వాడు నిరగ్ని:; క్రియా: అంటే అగ్నిని సాధనంగా లేకుండా ఆచరింపబడే తపస్సు, దానంవంటి కర్మలు. అక్రియా:, నిష్కర్మణ్యుడు, అటువంటి కర్మలుకూడా నిర్వర్తించవలసిన అవసరంలేనివాడు॥1॥

ఆక్షేపణ: వేదాలలో, స్మృతులలో యోగశాస్త్రాలలో అగ్నులను వుంచుకొనని వాడికి నిష్క్రియంగా వుంటున్నవాడికి సంబంధించి మాత్రమేగదా సన్యాసిత్వం, యోగిత్వం ప్రసిద్ధంగా వుంటున్నది. ఎందుకు యిక్కడ ఈ సన్యాసిత్వాన్ని, యోగిత్వాన్ని అగ్నులుంచుకొంటూ కర్మను అనుష్ఠిస్తున్నవాడికి సంబంధించి అప్రసిద్ధమైనదానిని భగవాన్ చెబుతున్నారు?

బదులు: ఇది దోషం కాదు. (సామాన్యంగా వుంటున్న) ఏదో ఒక గుణవిశేషతను తీసుకొని సన్యాసిత్వాన్ని యోగిత్వాన్ని – ఈ రెండు భావనలను గృహస్థుడియందు సంపాదింపజేయడం భగవాన్ యొక్క ఉద్దేశ్యం కావడంచే.

ఆక్షేపణ: అది యే విధంగా?

కర్మఫలసంకల్పాన్ని సన్యసించడంచే సన్యాసిత్వం, (ధ్యాన)యోగంయొక్క అంగంగా కర్మను అనుష్ఠించడంచే, చిత్త కకావికలతకు కారణమైన కర్మఫలసంకల్పాన్ని పరిత్యజించడం యోగిత్వం. ఈ రెండూ గౌణంగా (అప్రధానంగా) ఉపయోగింపబడినవి. సన్యాసిత్వ యోగిత్వాలను ముఖ్యంగా (ప్రధానంగా) తీసుకోవడం అభిమతంకాదు. ఈ అర్థాన్ని సూచించే దృష్టితో భగవాన్ అంటున్నారు .....

No comments:

Post a Comment

Total Pageviews