Friday, July 6, 2018

సంగీత కళా సరస్వతి మంగళంపల్లి బాలమురళిగారి జయంతి

గానగంధర్వుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారి జయంతి.  తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో 1930 జూలై 06న పట్టాభిరామయ్య, సూర్యకాంతం దంపతులకు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ జన్మించారు. ఆరు నెలలు కూడా నిండకుండానే తల్లి సూర్యకాంతం చనిపోయారు.  దాంతో అన్నీ తానై పెంచారు తండ్రిపట్టాభిరామయ్య. ఆరేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడం  ఆరంభించారు బాలమురళి.

ఎనిమిదేళ్ల ప్రాయంలోనే 1938లో తొలికచేరీ చేశారు. పదకొండేళ్లకే మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుండి కచేరీ నిర్వహించారు బాల మురళీ కృష్ణ.

పండిట్ భీమసేన్ జోషి వంటివారితో కలిసి ఆయన కచేరీలు నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా,  కిశోర్ అమోన్కర్ మొదలైన వారితో జుగల్ బందీ చేశారు.

ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజ  కీర్తనలకు తన గానంతో జీవం పోశారు. భద్రాచల రామదాసు కీర్తనలకు, అన్నమాచార్య కీర్తనలకు గాత్రం అందించారు. స్వరరాగ సుధలో ఓలలాడించడమే కాకుండా వాద్యకారుడిగానూ ప్రసిద్ధుడయ్యారు.  వయోలిన్, వీణ, మృదంగం మొదలైన వాయిద్యాలలో నిష్ణాతుడు మంగళంపల్లి.

ప్రపంచ వ్యాప్తంగా భారత దేశంతో సహా  అమెరికా, బ్రిటన్, సింగపూర్, శ్రీలంక, మలేషియా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా వంటి అనేక దేశాలలో 25,000 సంగీత కచేరీలు చేశారు. అనేక భారతీయ బాషలలో సంస్కృతం, తెలుగు తో సహా, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ బాషలలో కూడా పాటలు పాడిన ఘనత ఆయనది.

సంగీత ప్రపంచానికి బాలమురళీ కృష్ణ అనేక రాగాలను అందజేశారు. తన తల్లి పేరుతో సూర్యకాంత రాగాన్ని సృజించారు. మహతి, లవంగి, ఓంకారి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి సిద్ధి మొదలైన కొత్త రాగాలను సంగీత సరస్వతికి బహుమతిగా సమర్పించారు.

ప్రపంచ స్థాయిలో ఆయనకు ఫ్రెంచ్ చెవాలియర్ పురస్కారం లభించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి మూడు జాతీయ అత్యున్నత పురస్కారాలు పొందిన ఏకైక సంగీత చక్రవర్తి. అనేక విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్ పొందిన సంగీత సరస్వతి. ఉత్తమ సినీ గాయకునిగా జాతీయ సినిమా పురస్కారాలు పొందారు.

22 నవంబర్ 2016న  దేవతలను తన గానామృతంతో మురిపించడానికి దివికేగిన బాలమురళి మనమధ్య లేకపోయినా ఆయన అందించిన సంగీతం ఎప్పటికీ మన మధ్య ఉంటుంది.  మరి సంగీత కళా సరస్వతి మంగళంపల్లి బాలమురళిగారి జయంతి సందర్భంగా ఆయన అమృతవర్షిణి రాగంలో ఆలపించిన దీక్షితర్ వారి ఆనందామృతాకర్షిణి కృతిని విందాం..(ఆడియో ఎటాచ్ చేయబడినది)
 🙏🎸🎸🎧🎸🎸🙏
ఆనందామృతాకర్షిణి - రాగం అమృత వర్షిణి - తాళం ఆది

పల్లవి
ఆనందామృతాకర్షిణి అమృత వర్షిణి
హరాది పూజితే శివే భవాని
O one who attracts the nectar of bliss!  O one who creates a  shower of  nectar! - O one worshipped by Shiva and others! O auspicious one! O wife of Shiva!

చరణమ్
శ్రీ నందనాది సంరక్షిణి
శ్రీ గురుగుహ జనని చిద్రూపిణి
O one who protects Vishnu (the joy of Lakshmi) and others!  O mother of Guruguha!  O embodiment of consciousness!

సానంద హృదయ నిలయే సదయే
సద్యస్సువృష్టి హేతవే త్వాం
సంతతం చింతయే అమృతేశ్వరి
సలిలం వర్షయ వర్షయ వర్షయ
O one dwelling in the blissful hearts (of sages)!  O merciful one! For the sake of immediate good rains,  I always think of you.  O ambrosial goddess!  Shower, shower, shower water (rains)!
〰〰🌷〰〰
గమనిక: ముత్తుస్వామి దీక్షితర్ వర్షం కోసం ఈ కృతి ని ఆలపించినపుడు అతిపెద్ద వర్షం కురిసిందిట.. మళ్ళీ ఆ వర్షాన్ని స్తంభించడానికి స్తంభయ స్తంభయ అని గానం చేసారుట.. మరి మన గానగంధర్వుడి ఈ గానం వింటుంటే కూడా మీ చుట్టుపక్కల వర్షం కురిసే అవకాశం వుంది.. కావాలంటే ప్రయత్నించి చూడండి..
🙏👇🎧👇🙏

No comments:

Post a Comment

Total Pageviews