Wednesday, July 18, 2018

కప్పు పెరుగు విలువ ఎంత ???



ఒక వ్యాపారికి తన 45 సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది.
అతని బంధువులు, స్నేహితులు, తనని 2వ వివాహము చేసు కొని స్థిరపడమని పరి పరి విధాల చెప్పి చూచారు..
కానీ, తనకు, తన భార్య తీపి బహుమతిగా ఒక కుమారుడు ఉన్నాడని, వానిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని, వాడి అభివృద్ధే తన ధ్యేయమని,
చెప్పి, ఎవరూ నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు.
అతని కుమారుడు, విద్యాబుద్ధులు నేర్చి, సక్రమంగా పెరిగి పెద్దవాడైన తదుపరి, అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి, తను కష్ట పడి వృద్ధిచేసిన వ్యాపారాన్ని కూడా వప్పగించి, తన వృద్ధాప్య జీవితం గడపటం మొదలు పెట్టాడు...
అలా కొంత కాలం గడచి పోయింది.
ఒకరోజు, వృద్ధుడైన వ్యాపారి భోజన సమయం లో తన కోడలిని "కొంచెం పెరుగు వుంటే వేయమని" అడిగాడు.
దానికి కోడలు "అయ్యో పెరుగు లేదండీ" అని చెప్పింది.
అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు..
భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్లిపోయిన తరువాత, కొడుకు, కోడలు భోజనానికి కూర్చున్నారు...
వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడుకు గమనించాడు..
భార్యను ఏమీ అనలేదు. మౌనంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు.

కానీ పని మీద మనసు లగ్నం చేయ లేక పోయాడు.
రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమే మనసును తొలుస్తున్నది.

తనకొఱకు తన తండ్రి చేసిన త్యాగం, ప్రేమతో పెంచిన తీరు, కష్టపడి వృద్ధిచేసి అందించిన, వడ్డించిన విస్తరి లాంటి వ్యాపారం.. అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి..
తన తండ్రి జీవితమంతా చేసిన కష్టం, ఒక కప్పు పెరుగును ఇవ్వలేక పోయిందా అనే బాధను తట్టుకోలేక పోయాడు..
తండ్రికి ఇపుడు ఇంకొక వివాహం చేస్తే, ఆ భార్య అతని బాగోగులు బాగా చూచుకొన గలదు..
కానీ ఇపుడు తండ్రి ససేమిరా ఒప్పుకోడు..

భార్యను దండించితే మనసు మారుతుందన్న నమ్మకం లేదు...

ఎంత ఆలోచించినా మార్గం తోచలేదు.
చివరకు ఒక నిర్ణయానికి వచ్చి, మరుసటి రోజు హఠాత్తుగా తన తండ్రిని వేరొక ఊరు తీసికొని వెళ్లి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరచి తండ్రిని అక్కడవుంచి తిరిగి వచ్చేసాడు.
మామగారు అంత హఠాత్తుగా ఎక్కడికి, ఎందుకు వెళ్లాడో కోడలికి అర్ధం కాలేదు..
భర్తను అడిగింది గానీ తనకు కూడా తెలియదని చెప్పటంతో ఆలోచనలో పడింది. 
ఒక వారం గడిచిపోయింది..
మామగారి విషయం తెలియటం లేదు. భర్తను అడిగే ధైర్యం చేయలేక పోయింది. సహజంగానే ఆతృత పెరిగింది.
ఆరోజు ఉదయం భర్త వెళ్లిన తరువాత, ఏదో పని మీద గుమాస్తా ఇంటికి వచ్చాడు..
కోడలు మామ గారి గురించి ఆరా అడిగింది..
ఎంజరిగిందో తెలియదు గాని...
పెద్ద వ్యాపారి గారు పెళ్లి చేసుకోబోతున్నారని... ఏర్పాట్లు పూర్తయ్యా యని,
వ్యాపారాన్ని కూడా తనే చూచు కుంటారని, ఆయన కొత్త కాపురం ఈ ఇంట్లోనే ఉంటారని, కొడుకు తన కాపారాన్ని ఒక అద్దె ఇంటి లోనికి మార్చ బోతున్నారని,
అందరూ చెప్పుకుంటున్నారనీ..
గుమాస్తా చెప్పిన విషయం
విని నివ్వెర పోయింది..
ఒక్కసారిగా కోడలి కంటిముందు, తన భావి జీవితం కనపడింది..
తాను చేస్తున్న తప్పు తెలిసింది.. ఇపుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటో అర్థం చేసు కుంది.
గుమాస్తాను,  మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు గురించి తెలుసుకొని పరుగున వెళ్ళి ఆయన కాళ్లపై పడి క్షమాపణ కోరింది. తన తప్పు తెలుసు కున్నానని, ఇకనుండి తన తండ్రిలా చూచుకుంటానని ప్రాధేయ పడింది.
ఈవిషయాలేవీ తెలియని మామగారికి పరిస్థితి అర్ధం  కాలేదు..
అపుడు వచ్చాడు కొడుకు..
కప్పు పెరుగు విలువ కోడలికి తెలియ జెప్పటానికి తాను ఎంత చేయ వలసి వచ్చిందో వివరించాడు.
తనకు తానుగా మార టానికి , భర్త పడిన కష్టం చూచి సిగ్గుపడింది..
వృద్దాప్యంలోని తల్లిదండ్రులు పిల్లలకు ATM కార్డులాంటి వారు..
అదే సమయంలో పిల్లలు వారికి ఆధార్ కార్డ్ లాంటి వారుగా ఉండాలని తెలుసుకుంటే కుటుంబ బంధాలు ఎంత సహజంగా పరిమళిస్తాయో ఒక్కసారి ఆలోచించండి...

No comments:

Post a Comment

Total Pageviews