Monday, July 9, 2018

కులము కన్నా మంచి గుణము గొప్పది .

పూజ కన్నా నెంచ బుద్ధి నిదానంబు
మాట కన్నా నెంచ మనసు దృఢము
కులము కన్నా మిగుల గుణమే ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ

గురి కుదరని పైపై పూజ కంటే నిశ్చలమైన జ్ఞానం ముఖ్యం. మారే మాటల కంటే అచంచలమైన మనస్సు ప్రధానం. సామాజికంగా ఏర్పడిన లక్షణం స్వభావతః ఏర్పడిన లక్షణం ఎన్నదగినది. బాహ్యంగా చేసే పనులు సరే, వాటికి మూలాలు లోపల ఉన్నాయా, లేదా అని చూసుకొమ్మంటున్నాడు వేమన. పాత మాటే కావచ్చు. కాని ఎప్పటికి పాతపడని మాట అని గుర్తించుకోవాలి.

పూజ అంటే తెలియనిదెవరికి? అర్చన, దేవుడిని కొలవడం. బుద్ధి అంటే బోధ చేత ప్రకాశించేది. బోధ అంటే జ్ఞానం, అంటే వస్తువు యొక్క యదార్థ గుణాన్ని తెలిపేది. నిదానం అంటే నెమ్మది, ఓపిక అనే అర్థాలున్నా ఇక్కడ కారణం, మూల హేతువు.

అలాగే మాట అంటే పైకి చెప్పేది. మనస్సు అంటే చిత్తం. ఇది జీవాత్మకంటే భిన్నమైంది. జ్ఞానం పుట్టేది దీనిలోంచే. పైకి చెప్పే మాటకు పునాది మనస్సులో ఉంటే, ఆ మాటకు కాంతి ఉంటుంది. మనసులో పుట్టిన జ్ఞానం స్థిరమైనది అని సారాంశం.

ఇక కులం, ఇది మనిషి పుట్టిన తర్వాత వచ్చిందే. సామాజికంగా దీనిలో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. కాని మౌలికంగా మనిషి గుణమే గొప్పది.

No comments:

Post a Comment

Total Pageviews