Friday, July 6, 2018

*స్నేహమంటే నమ్మకం*(పిల్లలకు చెప్పే కధ )

 ఒక అడవిలో కుందేలు ఒకరోజు ఒక ఏనుగుని చూసింది. దాని భారీ శరీరం చూసి బిత్తరపోయింది. దాని చేటంత చెవులు, స్తంభాల్లాంటి కాళ్లు చూసి దాని ఆశ్చర్యానికి అంతేలేదు.
పొదల చాటుకెళ్లి దాక్కోవడం కూడా మరిచిపోయి నోరు తెరిచి చూస్తున్న ఆ బుజ్జి కుందేలును ఏనుగు గమనించింది. చూపులకే మెత్తగా ఉన్న ఆ తెల్లని రూపాన్ని ఏనుగు కూడా ముచ్చటగా అలా చూస్తూ ఉండిపోయింది. రెండిటి చూపులూ కలుసుకున్నాయి. ఆ చూపుల్లో స్నేహం నిండి ఉంది. కుందేలు ధైర్యంగా ముందుకు వచ్చింది. సుతిమెత్తగా ఉన్న ఆ కుందేలును ఏనుగు సుతారంగా తొండంతో ఎత్తి తన వీపుపై ఉంచుకుంది. ఆ చుట్టుపక్కలంతా షికారు తిప్పింది.
రోజూ తనకి కొండమీదున్నట్లు ఎత్తుగా కనిపించే చెట్ల మీద కోతులు తన ఎత్తులో ఉండటంతో కుందేలు కేరింతలు కొట్టింది. అంత ఎత్తు నుంచి కిందికి చూడటం దానికి భలే వింతగా, గమ్మత్తుగా ఉంది. ఏనుగు ప్రోత్సాహంతో అది కొమ్మనున్న కాయకోసి తింది. తర్వాత కుందేలును బొరియ వద్ద దింపి ఏనుగు వెళ్లిపోయింది.
అది మొదలు వాటి స్నేహం కొనసాగింది. రోజూ కలిసి ఆడుకునేవి. ఒక రోజు కుందేలు దాగుడుమూతలు ఆడదామని సరదాపడింది. ఏనుగుని కళ్లుమూసుకోమని ఒక పొదలో దాగింది.
ఏనుగు ఒక్కోపొదని మెల్లిగా ఒత్తిగిస్తూ కుందేలుని కనుక్కుంది. అప్పుడు కుందేలు ఏనుగుని దాక్కోమంది. పాపం ఏనుగు తెల్ల మొహం వేసింది. తను దాక్కోగల ప్రదేశమేదీ దానికి తోచలేదు. కాదని కుందేలును బాధపెట్టడం దానికిష్టం లేకపోయింది. వెళ్లి ఒక చెట్టు వెనక నుంచుంది. కళ్లు తెరిచిన కుందేలు ఏనుగు ఒళ్లు సగం బయటకే కనబడుతుండటంతో పకపకా నవ్వింది. దాని ఆనందం చూసి ఏనుగు సంతోషించింది. మంచి చోటు వెతుక్కోమని కుందేలు పోరడంతో ఏనుగు దూరంగా వెళ్లింది. ఒక గుహ చూసింది. బాగుంది కానీ అందులో సింహం ఉండొచ్చని అనుమానించింది. ఇంతలో వెదురుపొదలు కనిపిస్తే వాటి వెనుక దాగింది.
ఏనుగును వెతుకుతూ వచ్చిన కుందేలు కూడా గుహని చూసింది. అందులో దాక్కుందేమోనని అటుగా వెళ్లబోయింది. దానిని ఏనుగు వారించేలోపే నక్క ఆపింది. ‘అందులో సింహం ఉంది. వెళ్లకు’ అంది. పైగా మెల్లిగా ‘ఆ మాయదారి ఏనుగు తను గుహలో దాక్కున్నానని నీకు చెప్పమంది. తెలుసా?’ అంది.
‘ఎందుకు?’ అంది కుందేలు అమాయకంగా.
‘ఓసి పిచ్చిదానా! నీ ముత్తాత ఇంకో సింహాన్ని చూపిస్తానని ఈ సింహం ముత్తాతను నూతిలో పడేలా చేశాడుట. అందుకే సింహం నీపై పగబట్టింది. నీతో స్నేహం నటించి నిన్ను తనకి అప్పగిస్తే అరటి తోటలు, వెలగ చెట్లు చూపిస్తానని ఏనుగుని ఆశపెట్టింది. అందుకే ఏనుగు ఇలా చేసింది. నన్ను నమ్ము’ అంది.
కుందేలు ఎంతో స్థిరమైన గొంతుతో ‘ఏం కాదు. నా మిత్రుడు అలా ఎన్నటికీ చేయడు. *స్నేహం అంటే నమ్మకం*. నాకది నా స్నేహితుడిపై పూర్తిగా ఉంది. మా చెలిమి చూసి ఓర్వలేక అసూయతో నువ్విలా అంటున్నావు.’ అంది.
వెదురు పొదలచాటు నుంచి ఈ మాటలు విన్న ఏనుగు ఆనందంతో కంటనీరు కార్చింది. కోపంతో ఘీంకరిస్తూ నక్కను చంపబోయింది. దానిని కుందేలు వారించింది. రెండూ కలిసి నక్క కుటిల బుద్ధిని, ఓర్వలేని తనాన్ని అడవంతా చాటాయి. ‘అప్పటి నుంచి నక్కకు గుంటనక్క అనే పేరు స్థిరపడింది’.

No comments:

Post a Comment

Total Pageviews