Wednesday, July 11, 2018

స్వామీజీలు,పీఠాధిపతులు,అర్చకులు, బ్రాహ్మణులు మన ధర్మానికి దేశానికి ఏంచేస్తున్నారు?

స్వామీజీలు,పీఠాధిపతులు,అర్చకులు, బ్రాహ్మణులు మన ధర్మానికి దేశానికి ఏంచేస్తున్నారు?

ఈమధ్య హిందూ అని చెప్పుకునే అనేకమంది ప్రశ్న ఇది.ఈప్రశ్న వేసేవారందరూ నిజానికి ఆయా పీఠ సంప్రదాయాల గురించి కానీ త్రిమతాచార్యుల గురించి గానీ అసంఖ్యాక అర్చక సంప్రదాయాలగురించి ఓనమాలు తెలియని వారే.

పేరుకు సర్వసంగ పరిత్యాగులైనా ప్రతీ పీఠానికి ఒక నిర్దిష్ట సంప్రదాయం, మూర్తి అర్చన ,గోపూజ,వేద,సంస్కృత పాఠశాలల నిర్వహణ,సువాసినీపూజ,శ్రీచక్రార్చన,లింగ లేక సాలిగ్రామార్చన లాంటి దైనందిన ఆచార పరంపర తప్పనిసరిగా ఉంటుంది.

వీరు ఎక్కడికో ఏకార్యక్రమం సందర్భంగానో ఏసీ కార్లలో వచ్చింది చూసి విమర్శించేవారు వారి నిత్యజీవన విధానాన్ని గానీ వారి మఠాలతరఫున నిర్వహించే గోశాలలు గానీ, వేద సంస్కృత పాఠశాలలు గానీ,విద్యాసంస్థల నిర్వహణ గానీ, వైద్యసేవలు కానీ,చాతుర్మాస్య సందర్భంగా వారి నియమనిష్టలు కానీ చూడకుండానే వారు ఏసీ రూముల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని భ్రమపడి అనవసరంగా నిందలు వేసి నోరుపారేసుకుంటున్నారు.వారు ఏసీ కార్లలో రావడం చూసిన వారుండొచ్చు కానీ నిత్యం ఏసీరూముల్లో గడపడం చూసినవారెంతమంది?

ఈ విమర్శలు చేసేవారందరూ పీఠాధిపతుల జీవనశైలిని కనీసం ఒక నెలరోజుల పాటు వారితో ఉండి గమనిస్తే ఇలాంటి విమర్శలు చేయరు.ఇలాంటి విమర్శలు చేసేవారు ఎంత కలిగిన వారైనా సరే..తమ ఇంటికి  స్వయంగా తమ  రక్తసంబధీకులైన బంధువులొస్తేనే ఒక వారం పదిరోజుల పాటు వారిని పోషించడానికి నానా తిప్పలు పడతారు.ఒక్క గోమాతను జీవితాంతం పోషించమంటే గుడ్లు తేలేస్తారు.ఇక ఇలాంటి వారు ఒక చిన్న దేవాలయాన్ని స్వయంగా నిర్మించాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే.

అలాంటిది అనేక దేవాలయాలు,వేదపాఠశాలు,విద్యా వైద్యసంస్థలు,గోశాలలద్వారా వందలవేల మందికి విద్యాదానం ద్వారా తమకు ఏసంబంధంలేని అనేకమంది విద్యార్థులను మరియు వందలాది గోవులను పోషించే వారిని అకారణంగా దూషించడం అపచారమే ఔతుంది.

ధర్మరక్షణ ,పీఠాధిపత్యం,అర్చకత్వం, వేదాధ్యయనం అంటే తొలుత సెక్యులర్ గా ఉండి రెండు మూడు సంవత్సరాలకింద ఫేస్ బుక్ లోకొచ్చి,ఫ్రీగా వచ్చిన జియో సిమ్ వేసుకుని ఖాళీ ఉన్నప్పుడు నాలుగు పోస్ట్ లు పెట్టి, ఏదైనా ధార్మిక కార్యక్రమానికి హాజరై నాలుగు సెల్ఫీలు దిగి పోస్ట్ చేసి రాత్రికి ఒక బీరు,ఒక నైన్టీ కొట్టి తొంగోవడం కాదు.

ఉపనయనం ఐన దగ్గర నుంచి వేదాధ్యయనం, తరువాత తల్లిదండ్రుల అనుమతితో సన్యాసం, గురుశుశ్రూష,అనేక వైదిక మరియు లౌకిక విద్యా విషయ సంగ్రహం  దశాబ్దాలపాటు చేసినవారే పీఠాధిపత్యానికి అర్హులు.

అర్థరాత్రి దాకా ఫోన్ పట్టుకుని పడుకుని,మధ్యాహ్నం దాకా నిద్ర లేవని వాళ్లు బ్రాహ్మీముహూర్తంలో లేచి నిత్యపూజాదికాలు చేసుకునే అర్చకులను నిిందింస్తుంటే దేనితో నవ్వాలో అర్థం కావడం లేదు.

మిషనరీలకు దీటుగా కంచిపీఠం తరఫున వైద్యసేవలుండాలని భావించిన జయేంద్ర సరస్వతి స్వామి వారు శంకరనేత్రాలయ స్థాపించడంవల్ల ఎదురుగా ఉన్న విదేశీ మతమాఫియాల కుట్రలకు,జయలలిత తప్పుడు కేసులకు జైలుపాలైతే ఈకట్టర్ హిందువులంతా ఎక్కుడదాక్కున్నారో అర్థం కాదు.

ఈ పీఠాధిపతులు చేసే ఏదైనా కార్యక్రమానికి గానీ ఉద్యమానికి గానీ మీడియా సహకరించదు. ప్రభుత్వ సహాయం ఉండదు.పూర్ణకుంభ స్వాగతం తప్ప  దేవాలయాల నిర్వహణలో ఏమాత్రం నిర్ణయాధికారం ఉండదు.ఈ రాజకీయ గోలెందుకని కనీసం తమ మానాన తమ పనేదో తాము చేసుకుంటున్న పాపానికి సాటి హిందువులుగా సహకరించపోయినా ఫర్వాలేదు. రాళ్ళు మాత్రం వేయకండి.

ఆదిశంకరులు కాలినడకన దేశంతిరిగారనీ ఈనాటి స్వాములకు ఏసీకార్లెందుకని మరో వెధవ లాజిక్.అదే ఆదిశంకరులు కౌపీనవంతః ఖలుభాగ్యవంతః,అర్థమనర్థం భావయనిత్యం అనికూడా అన్నారు. ఆదిశంకరులమీద అంత గౌరవం ఉన్నవారైతే  మీరంతా కేవలం గోచీలుపెట్టుకుని తిరగొచ్చుకదా?ఆదిశంకరుల కాలానికి కత్తులు,బాణాలు మాత్రమే ఉన్నాయి. ఈకాలంలో అవేపట్టుకుని యుద్ధానికి వెళతామనడం ఎలాంటిదో వీరివాదనలు అలాంటివే.మన తాతముత్తాతలకున్న బలం,ఓపిక మనకున్నాయా?మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసిన ఇంటిపని,వంటపని ఈరోజు మన ఇంటి ఆడవాళ్లు చేస్తున్నారా?

అలాగే "చాతుర్వర్ణం మయాసృష్టం" అనే గీతా శ్లోకాన్ని పట్టుకుని వక్రభాష్యాలు చెప్పడం వీళ్ళు చేసే మరో పని.పుట్టుకతో కులం రాదనీ గుణం వల్లవస్తుందనీ ఈమేధావుల లాజిక్.ఈవాదన చేసే వారందరికీ తమతమ కులాలు, కులవృత్తులు, వాటితో వచ్చే ప్రభుత్వ ప్రయోజనాలు  పుట్టుకతో కావాలి.కానీ ఒక్క బ్రాహ్మణుడికి మాత్రమే కులం పుట్టుకతో ఉండకూడదు.కులవృత్తి ఐన అర్చకత్వం పౌరోహిత్యం వారికి మాత్రమే ఎందుకు అని దబాయింపు.ఒక మంగలికి క్షవరం-మేళం,రజకుడికి బట్టలుతకడం,ఒక గముళ్ళకు కల్లుగీయడం,వడ్రంగికి చెక్కడం కులవృత్తిగా ఉండడం వీరికి అసహజం అనిపించదు.కానీ ప్రభుత్వ మద్దతు లేక ఉద్యోగాలకు రిజర్వేషన్లు లేక కేవలం కులవృత్తితో పొట్టపోసుకుంటున్న అర్చకులకు మాత్రమే పుట్టుకతో కులం ఉండకూడదు.వారేవా!

గీతాచార్యుడి వాక్యంపై మీకు అంత విశ్వాసమే ఉంటే అదే గీతాచార్యడు గోవర్ధనగిరి ఎత్తిన సందర్భంగా ఏంచేశారో, ఏంచెప్పారో తెలుసుకోవాలి.ఇంద్రుడికి హవిర్భాగం ఇవ్వకపోయినా, యజ్ఞం చేయకపోయినా నష్టం లేదని చెప్పి కేవలం గోకులంలో  గోబ్రాహ్మణపూజ మాత్రమే చేసిన శ్రీకృష్ణుడిపై ఆగ్రహించి ఇంద్రుడు రాళ్ళవర్షం కురిపిస్తే కేవలం గోబ్రాహ్మణారాధనశక్తివల్ల ఇంద్రుడిని సైతం జయించి గోవర్ధన గిరి ఎత్తానని పరమాత్మ చెప్పలేదా?ఏంచేసినా చేయకపోయినా గోబ్రాహ్మణపూజ వల్ల సమస్తయజ్ఞఫలాలు దక్కుతాయని చెప్పలేదా?

ఒక నిరుపేద బ్రాహ్మణుడిని శ్రీకృష్ణపరమాత్మ ఎలా ఆదరించి గౌరవించారో  కుచేలోపాఖ్యానంలో చదవలేదా?అంతటి దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న సందంర్భంలోనూ కుచేలుడు నోరుతెరిచి నాకిదికావాలి కృష్ణా అని అడిగాడా?(వీరు ఏనాడైనా పురాణేతిహాసాలు పూర్తిగా చదివితేకదా? )ఎందుకంటే బ్రాహ్మణులు అల్పసంతోషులు.సరిగ్గా నాటి కుచేలుడి పరిస్థితే  నేడు అనేకమంది బ్రాహ్మణులదికూడా.

శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ పరమశివుడు కానీ అమ్మవారుకానీ గణపతి కానీ సుబ్రహ్మణ్యుడుకానీ ఏఅవతారంలోనైనా బ్రాహ్మణులను రక్షించారు,పూజించారు కానీ మీలా ఎకసెక్కాలాడి అవమానించి దూషించారా?విష్ణు సహస్రనామ స్తోత్రములో వాక్యాలప్రకారం బ్రహ్మణో బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః-అంటే శ్రీమహావిష్ణువు బ్రాహ్మణప్రియుడు మాత్రమే కాదు ఆయనే స్వయంగా బ్రాహ్మణుడు కూడా.

అలాగే బ్రాహ్మణులైన మన పురాణరచయితలు సైతం ధర్మాన్ని కొలమానంగా తీసుకున్నారేతప్ప కులాన్ని కాదు.బ్రాహ్మణుడైన రావణుడిని వధించిన శ్రీరాముడిని బ్రాహ్మణ వంశజులైన మహర్షులంతా పరమాత్మగా స్తుతించారుతప్ప మాకులంవాడిని చంపావని నిందించలేదు.ఆయన ఆలింగనం కోసం మరుజన్మలో తమ కులాన్ని కూడా విడిచిపెట్టి గోపకన్యలుగా జన్మించారు.

ఇక ప్రస్తుత కాలానికి వస్తే ఈదేశంలో రైతులతరువాత కనీసవేతనం,పనిగంటలు లేనిది అర్చకులు, పురోహితులే.ఐనప్పటికీ రైతులాగే ఎవరినీ నిందించకపోవడమే కాకుండా లోకాత్సమస్తాత్ సుఖినోభవంతు అనగలిన వైదిక సంస్కారం అర్చకబ్రాహ్మణులది.అలాంటి సాధుజీవులపై కంచెఐలయ్యలాంటి హిందూ ద్వేషవర్గం,విదేశీ మతమాఫియాలు ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయో సరిగ్గా అలాంటి ప్రచారమే హిందూ అనిచెప్పుకునే వారూ చేస్తే వారికీ వీరికి తేడా ఏంటి?

రెండు దశాబ్దాల క్రితం సంస్క్రతం రెండవభాషగా తీసుకుని చదువుకునే విద్యార్థులు ఉండేవారు. కమ్యూనిస్టుల సిలబస్ కారణంగా సాధారణ విద్యార్థులు దేవభాషకు దూరమయ్యారు. ఇప్పుడు మిగిలింది పండితబ్రాహ్మణులు,కొద్దిమంది భాషాభిమానులే.వారి తరం అంతరిస్తే మిషనరీలు,బహుళజాతి కంపెనీలు ఆడింది ఆట పాడింది పాట.

పసుపు దగ్గరనుండి వేపపుల్లదాగా గోమూత్రం దగ్గరనుంచి ఆయుర్వేదం దాకా దేన్నైనా పేటెంట్ చేసుకోవచ్చు.వైదిక సిద్ధాంతాలు,వేద గణితాలు తమవిగా ప్రచారం చేసుకోవచ్చు.అప్పటికి గ్రంథాలుంటాయి కానీ అర్థం చేసుకుని చెప్పగలిగే వారు మాత్రం అంతరిస్తారు.వారి ఏజెంట్లు,పెయిడ్ మీడియా చెప్పిందే అర్థంగా చలామణీ ఔతుంది. బ్రాహ్మణులు, అర్చకులు,పీఠాధిపతులు త్వరగా అంతరించడమో,లేక హిందూ సమాజంపై పూర్తిగా పట్టుకోల్పోవడమో విదేశీమాఫియాలకు  అత్యవసరం.

ఒక్క ఉదాహరణ చూపాలంటే సుభాష్ పాలేకర్ గారు గోఆధార వ్యవసాయం గురించి తిరుపతి యూనివర్సిటీలో వివరిస్తుంటే సైన్స్ ను అవమానించారని ఆయూనివర్సిటీ ప్రొఫెసర్లు ధర్నాకు దిగారంటే రాబోయే కాలంలో ఏంజరగబోతుందో అర్థం చేసుకోవచ్చు.
వందేళ్ళ క్రితం మనదేశంనుండి ఉచితంగా ఒంగోలు ఎద్దులను తీసుకెళ్ళిన బ్రెజిల్, ఇంగ్లండ్ లు ఈరోజు మనం  అదేజాతి  ఎద్దు ఒక్కటివ్వమనడిగితే చెప్పిన ధర అక్షరాలా ఒక మిలియన్ డాలర్లు( సుమారు ఆరుకోట్లు ).

హైదరాబాద్ రుద్రారం వద్ద అల్ కబీర్ కంపెనీ పెట్టినప్పుడు ఎన్నో బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు వ్యతిరేకించినా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించుకోలేదు.రెండు దశాబ్దాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మేలుజాతి గోసంపదమొత్తం వధించబడి విదేశాలకు ఎగుమతి అయిపోయింది.ఫలితంగా రైతులకు రెండవ ఆదాయంగా ఉండే పాడి పశువుల ద్వారా వచ్చే ఆదాయం పోయి ఆత్మహత్యలు పెరిగాయి.

పైరెండూ చిన్న ఉదాహరణకు చెప్పాను.భారతదేశపు సంప్రదాయ మత,వైద్య, రసాయన, వైజ్ఞానిక ,వైదిక గ్రంథాలను అర్థం అయ్యేలా చెప్పగలిగే వారు అంతరిస్తే ప్రతీరంగంలోనూ రంజిత్ ఓఫిర్లు ప్రవేశించి వక్రభాష్యాలు చెపుతారు.కాబట్టి హిందూ అని చెప్పుకునేవారు ఆగట్టునుంటారో ఈగట్టుకొస్తారో తేల్చుకోవాలి.

మీరు హిందూ ధర్మంలోని దొంగస్వాములపై పోరాడాలనుకుంటే నిత్యానంద, రమణానంద,ప్రభోదానంద లాంటి స్వయంప్రకటిత దైవజనులు బోలెడుమందిఉన్నారు.మీకు చేవవుంటే మీకు చేతనైతే వారిపై పోరాడండి.

అంతేకానీ ఈధర్మంలో ఉంటూ ఈధర్మంలో భాగమైన వారిని అవమానించడమంటే తినేకంచంలో ఊయడం,ఒకసారి ఊశాక తిరిగి ఆఊసిన కంచంలోనే మళ్ళీ మళ్ళీతినడంలాంటిది.ఇది తినేవారికేకాదు చూసేవారికికూడా అసహ్యకరం.

గమనిక-ఈ పోస్ట్ కేవలం వేదాధ్యయనం,అర్చకత్వం ,పౌరోహిత్యం,పీఠాధిపత్యం లాంటి సంప్రదాయ బ్రాహ్మణ ధర్మంలో నిమగ్నమై ఉన్న బ్రాహ్మణుల గురించి మాత్రమే. లౌకిక ఉద్యోగ,వ్యాపారాల్లోఉన్న  బ్రాహ్మణులకు మద్దతుగా కాదు.

గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం
లోకాత్సమస్తాత్ సుఖినో భవన్తు

No comments:

Post a Comment

Total Pageviews