Tuesday, September 27, 2016

అందరికీ ముందస్తుగా దసరా శరన్నవరాత్రి శుభాకంక్షలతో


ఆశ్వీయుజ మాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దసరా పండుగ. అమ్మవారిని తొమ్మిదిరోజులు చక్కని అందమైన అలంకరణలతో ఏంటో భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తాము.మరి ఆ విశేషాలు తెలుసుకుందామా?
నవదుర్గ అవతార విశిష్టత.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు సంప్రదాయ పద్ధతి ఆచరించే ఈ నవరాత్రులను దసరా అంటారు.
ఈ రోజుల్లోనే అమ్మవారిని వివిధ అలంకారాలతో పూజించి నైవేద్యాలుసమర్పించడం పరిపాటి. వీటితోపాటు ఆదిపరాశక్తి తన అంశలతో భిన్న రూపాలను స్పృశించింది. అవి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సర్వసిద్ధిధాత్రి అనే నవ రూపాలు. వీటినే నవదుర్గలుగా కొలుస్తాం.
నవదుర్గా స్తుతి
ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయా చంద్రఘండేతి కూష్మాండేతి చతుర్దశీ
పంచమస్కంధమాతేతీ, షష్ట్యా కాత్యాయనేతి చ. సప్తమా కాలరాత్రిశ్చ, అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చేతి, నవదుర్గాః ప్రకీర్తితాః||

1.   పాడ్యమి - శైలపుత్రి
వందేశాంఛిత లాభాయ చంద్రార్థాకృత శేఖరామ్‌|
వృషారూఢాంశూలాధరం శైలపుత్రీ యశస్వనామ్‌||
దుర్గామాత మొదటి స్వరూపం శైలపుత్రి. పర్వతరాజయిన హిమవంతుడి ఇంట పుత్రికగా అవతరించినందువల్ల శైలపుత్రి అయింది. వృషభ వాహనారూఢి అయిన ఈ తల్లి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి మహిమలు, శక్తులు అనంతం. మొదటి రోజున ఉపాసనద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపరుస్తారు. యోగసాధనను ఆరంభిస్తారు. నైవేద్యంగా కట్టె పొంగలిని సమర్పించాలి.

2. విదియ - బ్రహ్మచారిణి
ధధానాకర పద్మాఖ్యామక్షమాలా కమండలా|
దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యముత్తమా||
దుర్గామాత రెండవ స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మ అంటే తపస్సు. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది అని అర్థం. 'వేదస్తత్వం తపోబ్రహ్మ'. బ్రహ్మ అనగా వేదం, తత్త్వం, తపస్సు. ఈ తల్లి తన కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తుంది. ఈ తల్లిని పూజించిన సర్వత్రా సిద్ధి, విజయం, సాధకుడికి మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. కఠిన ఆహార నియమాలు ఆచరించి అపర్ణ అయింది. నైవేద్యంగా పులిహోరను సమర్పించాలి.

3.తదియ - చంద్రఘంట
పిండజ ప్రవరారూఢా- చండకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతేమహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా||
దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈ తల్లి తన శిరసున అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండికౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ తల్లిని ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారు. ఇహలోకంలోనేకాక పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది. నైవేద్యం కొబ్బరి అన్నం.

4. చవితి - కూష్మాండ
దుర్గామాత నాల్గవ స్వరూపం కూష్మాండం. దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా సృష్టిస్తుంది. కాబట్టి ఈ పేరు వచ్చింది. ఈమె సర్వమండలాంతర్వర్తిని. రవి మండలంలో నివశించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికే ఉన్నాయి. ఈమె ఎనిమిది భుజాలతో ఉంటుంది. తన ఏడు చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ధరిస్తుంది. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్టిస్తుంది. సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈమెకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం. ఈ దేవిని ఉపాసిస్తే మనసు అనాహతచక్రంలో స్థిరంగా ఉంటుంది. ఉపాసకులకు ఆయురారో గ్యాలను ప్రసాదించటమేగాక, వారి కష్టాలను కూడా పోగొడుతుంది. నైవేద్యంగా చిల్లులేని అల్లం గారెలను సమర్పించాలి.

5.పంచమి - స్కంధ మాత
సింహాసనాగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవి స్కంధమాతా యశస్వినీ||
దుర్గామాత ఐదవ స్వరూపం స్కంధమాత. స్కంధుడనగా కుమారస్వామి. శక్తిధరుడు. దేవసేనల అధిపతి. నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు 'స్కంధమాత' అనే పేరు వచ్చింది. ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది. స్కంధుడిని పట్టుకొని పద్మం ధరించి, ఎడమచేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది. కమలవాసిని. శ్వేతవర్ణం కలిగి ఉంటుంది. సింహవాహనాన్ని అధిష్టిస్తుంది. ఈమెను ఉపాసించిన విశుద్ధచక్రంలో మనసు స్థిరమవుతుంది, భవసాగరాలనుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందవచ్చును. నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించాలి.

6.షష్టి - కాత్యాయని

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా|
కాత్యాయనీ శుభం దద్వాద్దేవీ దానవఘాతినీ||
పూర్వం 'కతి' అనే పేరుగల ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రీకుడే కాత్యాయన మహర్షి. ఇతడు ఈ దేవి తనకు కుమార్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. తపస్సు ఫలించింది. మహిషాసురుడిని సంహరించటంకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో దేవిని సృష్టించారు. మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు. కాబట్టే 'కాత్యాయని' అనే పేరు వచ్చింది. కాత్యాయని మహర్షి ఇంటిలో పుట్టింది. కాబట్టి కాత్యాయని అయింది అనే కథకూడా ఉంది. ఈమె చతుర్భుజి. ఎడమచేతిలో ఖడ్గం, పద్మాన్ని ధరిస్తుంది. కుడిచేయి అభయముద్రను, వరముద్రను కలిగి ఉంటుంది. ఉపాసించిన సాధకుడి మనసు ఆజ్ఞాచక్రంలో స్థిరమవుతుంది. తన సర్వస్వమునూ ఈ తల్లి చరణాలలో పరిపూర్ణంగా సమర్పించాలి. అప్పుడు ఆమె అనుగ్రహించి రోగాలనూ, శోకాలనూ, భయాలనూ పోగొడుతుంది. ధర్మార్థకామమోక్షాలను ప్రసాదిస్తుంది. నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పించాలి.

7.సప్తమి - కాళరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా
లంబోష్టి కర్ణికాకర్ణితైలాభ్యక్త శరీరిణి|
వామపాదోల్ల సల్లోహ లతాకంటకభూషణా
వరమూర్థధ్వజాకృష్టా కాళరాత్రీర్భయంకరీ||
ఈ తల్లి శరీర వర్ణం గాఢాంధకారంవలె నల్లనిది. తలపై కేశాలు విరబోసుకొని, మెడలో హారం విద్యుత్‌కాంతితో వెలుగుతుంది. ఈమె నాసిక నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడుతుంటాయి. ఈమె వాహనం గాడిద. కుడిచేతిలో అభయముద్ర, వరముద్ర కలిగి ఉంటుంది. ఎడమచేతిలో ముళ్ళ ఇనుప ఆయుధం, ఖడ్గం ధరిస్తుంది. చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులపాలిటి కల్పతరువు. ఈ తల్లిని గనక ఉపాసిస్తే మనస్సు సహస్రార చక్రంలో స్థిరంగా ఉంటుంది. సమస్త పాపాలు, విఘ్నాలు తొలగుతాయి. గ్రహబాధలు ఉండవు. అగ్ని, జల, జంతు, శత్రు, రాత్రి భయాలు ఉండవు. నైవేద్యంగా కూరగాయలతో అన్నాన్ని సమర్పించాలి.

8. అష్టమి - మహాగౌరి
శ్వేతేవృషే సమారూఢా శ్వేతాంబరధరాశుచిః|
మహాగౌరిశుభం దద్వాత్‌, మహాదేవ ప్రమోధరా||
ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులతో మెరుస్తుంటాయి. ఈమె వృషభ వాహనంపై ఉంటుంది. చతుర్భుజి. కుడిచేతుల్లో అభయముద్రను, త్రిశూలాన్ని ధరిస్తుంది. ఎడమచేతుల్లో ఢమరుకాన్ని, వరముద్రనూ కలిగి ఉంటుంది. శివుడిని పరిణయమాడాలని కఠోరంగా తపస్సు చేసింది. అందువల్ల ఈమె శరీరం నల్లగా అయిపోయింది. ఆమె తపస్సుకు సంతోషపడిన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరాన్ని గంగాజలంతో పరిశుద్దంచేశాడు. ఆ కారణంగా ఈమె శ్వేతవర్ణశోభిత అయింది. మహాగౌరిగా విలసిల్లింది. ఈ మాతను ఉపాసిస్తే కల్మషాలన్నీ పోతాయి. సంచితపాపం నశిస్తుంది. భవిష్యత్తులో పాపాలు, ధైన్యాలు దరిచేరవు. ఈ తల్లిని ధ్యానించి, స్మరించి, పూజించి ఆరాధించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. నైవేద్యంగా చక్కెర పొంగలి (గుడాన్నం) సమర్పించాలి.

9. నవమి - సర్వసిద్ధి ధాత్రి
సిద్ధం గంథర్వయక్షాద్వైః అసురైరమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ||
మార్కండేయ పురాణంలో అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వ, వశిత్వ, సర్వకామావసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వ, సృష్టిసంహరీకరణ, అమరత్వం, సర్వనాయకత్వం, భావసిద్ధి అని అష్టసిద్ధులు చెప్పబడ్డాయి.
ఈ తల్లి పరమశివుడితో కలసి అర్థనారీశ్వరుడిగా అవతరించింది. చతుర్భుజి. సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని. కుడిచేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమచేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారలౌకిక మనోరథాలునెరవేరతాయి.నైవేద్యంగా పాయసాన్నం సమర్పించాలి.

10.దశమి రోజున అమ్మవారు చిద్విలాసిని రాజరాజేశ్వరి.

ఈ పండుగను పదిరోజులు చేసినా రాత్రులు మాత్రం తొమ్మిదే. దశమి రోజున అమ్మవారు రాజేశ్వరి అవతారంలో రాక్షససంహారం చేసింది. ఎంతో ప్రశాంతతతో, చిరునవ్వుతో సకల విజయాలు ప్రసాదిస్తుంది. నైవేద్యంగా చిత్రాన్నం, లడ్డూలు సమర్పించాలి.
అలాగే సువాసినీ పూజ. ప్రతిరోజూ ఒక మల్లెపూవును అమ్మవారిగా భావనచేసి ఆమెకు సర్వ ఉపచారాలు చేసి, వస్త్రం, ఫలం సమర్పించాలి. ఈ పది రోజులూ పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు పంచిపెడితే సౌభాగ్యం లభిస్తుంది. దేవీభాగవత పారాయణం, శ్రీదేవీ సప్తశతీ నిత్యపారాయణం శ్రేష్ఠం. దుర్గా ద్వాత్రింశమాలాస్తోత్రం 108సార్లు పారాయణం చేస్తే అఖండ ఫలితాలు లభిస్తాయి, అలాగే కుమారీపూజను ఆచరించి మంచి ఫలితాలను పొందవచ్చు. రోజుకొక బాలికను పూజించాలి. వివిధ వయస్సులవాళ్ళు ఉంటే మంచిది. కేవలం 10 ఏళ్లలోపు బాలికలు మాత్రమే ఉండాలి. భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి కరుణను కోరితే తప్పక ఆమె కరుణిస్తుంది.

అందరికీ నవదుర్గల అనుగ్రహం అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరి అనుగ్రహం కలిగి సుఖసంతోషాలతో ఉండాలని కోరుకొంటూ సమస్తలోకా సుఖినోభవంతు.

No comments:

Post a Comment

Total Pageviews