Friday, September 30, 2016

బతుకమ్మ

బతుకమ్మ

పువ్వులమ్మ బతుకమ్మ సంబరాల గురించి ముచ్చట్లు చెప్పుకుందాం! ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈరోజు బతుకమ్మ సంబురాలకు పల్లెలు, పట్నాల నుంచి మహా నగరాల దాకా పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహపూరితంగా ఉన్న ఈ శుభవేళ! బాగా ప్రాచుర్యంలో ఉన్న కధ! ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం "బతుకమ్మా !" అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు. ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసినారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది.
మరో కధ!.ఓ ముద్దుల చెల్లి, ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు. అంతా వీరాధివీరులే. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం అసూయ! ఆ బంగారుబొమ్మని బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్లిన అన్నలు, ఎంతకాలమైనా తిరిగిరాలేదు. అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆతర్వాత అన్నలొచ్చారు. ముద్దుల చెల్లి ఎక్కడని.భార్యల్ని నిలదీశారు. విషయం అర్థమైంది. తిండీతిప్పల్లేవు, నిద్రాహారాల్లేవు. చెల్లి కోసం వెదకని పల్లెలేదు, ఎక్కని గుట్టలేదు. ఓ వూరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా ... పెద్ద తామరపూవొకటి కనబడింది. వాళ్లను చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది. ఆతర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు. ఆ పూవును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెర్వు చూపింది కాబట్టి బతుకమ్మ అయ్యింది! ఇదో జానపద గాథ. మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో ఐతిహ్యం. ఆత్మత్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారూ ఉన్నారు....
......../\........

No comments:

Post a Comment

Total Pageviews