'ఒక వైపు నుంచి చూస్తే శివుడు సన్నని నెలవంక లాగా కనిపిస్తాడు '
ఈ మాటలన్నది మాణిక్యవాచకరో, అక్కమహాదేవినో, శ్రీనాథుడో కాదు,ఆధునిక ఫ్రెంచి మహాశిల్పి అగస్టె రోడె (1840-1917).
డెబ్భై ఏళ్ళ వయసులో, 1911 లో,ప్రపంచంలోనే అత్యున్నతుడైన శిల్పిగా ప్రఖ్యాతి చెందిన వేళ, రోడేకి మిత్రుడొకాయన 27 ఫొటోలు పంపించాడు. చెన్నై మూజియంలో ఉన్న రెండు నటరాజ శిల్పాల ఫొటోలు అవి. ఆ మిత్రుడు రష్యన్ పురాతత్త్వవేత్త విక్టర్ గొలోబెఫ్. అతడు రోడేకి ఆ ఫొటోలు పంపించి వాటి గురించి ఒక పత్రికకి ఏదైనా వ్యాసం రాయమని అడిగాడు.
రోడే ఆ ఫొటోలు చూసినప్పటి తన అనుభూతిని ఆ ఫొటోల వెనకపక్కనే చిన్నచిన్న వాక్యాలుగా రాసాడు. అది కూడా రెండేళ్ళ తరువాత, 1913 లో. కాని అవి కేవలం వాక్యాలు కావు. అత్యున్నత స్థాయి కవితలు.
సరిగ్గా ఆ సమయంలోనే రోడే ఫ్రెంచి కెతడ్రల్ కట్టడాల మీద ఒక పుస్తకం రాస్తూ ఉన్నాడు. నటరాజ శిల్పాల ఫొటోల వెనక రోడే రాసిన వాక్యాలు కొన్ని The cathedrals of France(1914) లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెంచి కెతడ్రల్ నిర్మాణాల మీద రోడే తన అనుభూతిని వ్యక్తం చేయడానికి మొదట్లో ఒక సింబలిస్టు కవినీ, తర్వాత రోజుల్లో రేనర్ మేరియా రిల్కనీ సహాయకులుగా పెట్టుకున్నాడు. కాబట్టి కెతడ్రల్ నిర్మాణాలమీద రోడే అభివ్యక్తిలోని కవితాత్మకతకి ఆ కవులు కూడా చాలావరకూ కారణమని చెప్పాలి. కాని నటరాజమూర్తుల్ని చూసినప్పుడు రోడే ప్రకటించిన పారవశ్యం, కవితాభివ్యక్తి అతడి స్వంతం. పూర్తిగా పండిన ఒక జీవితకాలపు కళాభివ్యక్తి చేరుకున్న చరమసీమ అది. బహుశా, అత్యుత్తమ భారతీయ కవిత్వానికి సరితూగగల రచన అది.
1921 లో ఒక పత్రికలోనూ, 1998 లో మరొకసారీ అసంపూర్తిగా ప్రచురించబడిన ఆ రచనను Rodin and the Dance of Shiva' (నియోగి బుక్స్, 2016) పేరిట, ఇప్పుడు మరింత సమగ్రంగా వెలువరించారు.
ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన కతియా లెగెరెట్ మనోఛాయ పారిస్ విశ్వవిద్యాలయంలో రంగస్థలశాస్త్రాన్ని బోధిస్తున్నది. నటరాజమూర్తి పైన రోడే రాసిన కవితాభివ్యక్తి పూర్తి పాఠంతో పాటు ఆయన రచన వెనక ఉన్న ప్రభావాలనూ, రోడే జీవితకాల అన్వేషణనీ, దాహార్తినీ పదకొండో శతాబ్ది చోళ శిల్పాలరూపంలో శివుడెట్లా తీర్చాడో ఆమె ఈ పుస్తకంలో ఎంతో సమగ్రంగా వివరించింది.
మొత్తం 7 ఖండికలుగా ఉన్న ఆ శివకవితనంతటినీ ఇక్కడ తెలుగులోకి తీసుకురావాలని ఉంది. నటరాజమూర్తిని చూడగానే రోడే అనుభవించిన తాదాత్మ్యత, అపూర్వ ప్రశాంతి, ఆత్మసాక్షాత్కారాల్ని వ్యక్తం చేస్తున్న ఆ ఖండికల్లో ప్రతి ఒక్క వాక్యమూ విలువైనదే.
మూడు నాలుగు ఖండికలు, మీ కోసం.
1.
శివుణ్ణి పూర్తిగా చూసినప్పుడు
_______________________________
_______________________________
జీవితం పరిపూర్ణంగా వికసించినప్పుడు, జీవితప్రవాహం, వాయుప్రసారం, సూర్యుడు, అస్తిత్వ స్పృహ అట్లా పొంగిపొర్లిపోతూండటం చూస్తున్నాను. దూర ప్రాచ్య కళ మనముందు ప్రత్యక్షమైనప్పుడు మనకి కలిగే అనుభవమిది.
ఆ సమయంలో మానవదేహం ఒక దివ్యస్వభావాన్ని సంతరించుకుంటుందని చెప్పవచ్చు. అంటే అప్పుడు మనం మన ప్రాదుర్భావవేళలకి సన్నిహితంగా జరిగామని కాదు, ఎందుకంటే మనదేహాలు ఈ ఆకృతికి ఎప్పుడో చేరుకున్నాయి, కాని మనం వర్తమానానికి దాస్యం చెయ్యనవసరం లేని స్థితికి చేరుకోగలమని నమ్మాం కాబట్టి, స్వర్గలోకంలోకి తేలిపోగలిగాం కాబట్టీ అది సాధ్యపడింది, కానీ ఆ సంతోషానికి మనం నిజంగా దూరమైపోయాం..
ఒక కోణంలోంచి చూస్తే, శివుడు సన్నని నెలవంక.
ఎటువంటి ప్రతిభ, దేహాకృతి పట్ల ఎంత పారవశ్యం!
ఇప్పుడిది కాంస్యంలో స్థిరీకరించబడ్డ శాశ్వత సౌందర్యం. ఒక అగ్రాహ్య కాంతివిన్యాసం. శిల్పం మీద పడుతున్న వెలుగు ఎటు జరిగినా ఆ కాంతికిరణాల్లో ఈ నిశ్చల కండరాలు గొప్ప చలనంగా మారిపోడానికి సిద్ధంగా ఉన్నాయా అనిపిస్తున్నది.
ఎంతోకాలంగా చీకటిలో ఉన్న ఈ శిల్పం మీద నీడలు మరింత మరింత దగ్గరగా జరిగి ఈ కళాకృతిని ఆవహించి దీనికొక శీతలలావణ్య సమ్మోహనీయతని చేకూర్చనున్నాయా అనిపిస్తున్నది.
ఈ కృతి పరిపూర్ణతపొందినట్టు ఎట్లాంటి సూచనలు లభిస్తున్నవి!ఈ దేహాకృతి ఎటువంటి పొగమంచులాగా ఉంది!ఒక దివ్యాదేశం ప్రకారం తీర్చిదిద్దినట్టుంది. ఎట్లాంటి ఉల్లంఘనా లేదు. ప్రతి ఒక్కటీ ఉండవలసిన స్థానంలోనే ఉన్నట్టుంది. ఆ భుజస్కంధాన్ని పరిశీలిస్తే, ఆ మోచేయి విశ్రాంతిలో కూడా చలిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఆ భుజస్కంధమెట్లా ముందుకు చొచ్చుకు వచ్చిందో, ఆ ఉర:పంజరం, ఆ పక్కటెముకలు ఆ రెక్క ఎముకను ఎంత ఆరాధనీయంగా అతుక్కుని, ఏ క్షణాన్నాయినా చలించడానికి ఎట్లా సంసిద్ధంగా ఉన్నాయో. ఆ దేహపార్శ్వం ఇంతలో సన్నగా, ఇంతలోనే బిగువుగా, ఆ పైన రెండు ఊరువులుగా విస్తృతమవుతూ, రెండు దండాలుగా, పరిపూర్ణకోణాకృతిలో కుదురుకున్న రెండు తులాదండాలుగా నేలమీద నడయాడడానికి సిద్ధంగా ఉన్న కాళ్ళు...
3
శివుణ్ణి ముఖాముఖి చూస్తూ
___________________________
శివుణ్ణి ముఖాముఖి చూస్తూ
___________________________
ఈ భంగిమ కళాకారులకి తెలిసినదే, కాని అదే సమయంలో అసాధారణమైంది కూడా. ఎందుకంటే ప్రతి భంగిమ కూడా స్వాభావికంగా కనిపిస్తున్నప్పటికీ, మనకీ, తనకీమధ్య ఎంత దూరం! కొంతమంది చూడలేనిదేదో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది: ఆ తెలియరాని లోతులు, జీవితం తాలూకు లోతులవి. ఆ సొగసులో ఒక అనుగ్రహం ఉంది. ఆ అనుగ్రహంమీద ఆధారపడి ఒక ఆదర్శం ఉంది.ఆ అనుభూతికి అంతు లేదు. అది ఉదాత్తంగా ఉందనిపిస్తుంది మనకి. వట్టి ఉదాత్తత మాత్రమేనా, కాదు, అత్యంత శక్తిమంతమైన ఉదాత్తత, ఏమో, మాటలు చాలడం లేదు..
ఆ భుజస్కంధం మీంచి కటిబంధందాకా,నీడలు పూలమాలల్లాగా పరుచుకున్నాయి,తిరిగి మళ్ళా కటిబంధం మీంచి ఊరువులమీదకి సమకోణాకృతిలో..
5
ఈ శిల్పం అనాగరిక కళ అనేవాళ్ళ విషయంలో
____________________________________
ఈ శిల్పం అనాగరిక కళ అనేవాళ్ళ విషయంలో
____________________________________
అజ్ఞాని దేన్నైనా తేల్చిపారేయ్యాలనుకుంటాడు, అతడి చూపు చాలా మొరటుగా ఉంటుంది. చాలా తక్కువరకం ఇష్టం కోసం అతడు అత్యున్నమైన కళాకృతినుంచి జీవాన్ని లాగెయ్యాలని చూస్తాడు. చివరికి ఏదీ చూడలేకపోతాడు, దేన్నీ పొందలేకపోతాడు. నిజంగా ఆసక్తి పుట్టాలంటే, నిజంగా చూడాలంటే, మనం మరింత అధ్యయనం చెయ్యాల్సి ఉంటుంది..
6
శివవదనాన్ని మరింత ధ్యానపూర్వకంగా చూసాక
_____________________________
శివవదనాన్ని మరింత ధ్యానపూర్వకంగా చూసాక
_____________________________
అ నోరు బాగా కొట్టొచ్చినట్టుగా ఉంది, ఒక ఇంద్రియాసక్త సంతోషం అక్కడ అతిశయించి కనిపిస్తోంది.
కోమలమైన ఆ నోరు, ఆ నేత్రాలు ఒకదానికొకటి సరితూగుతున్నాయి.
ఆ పెదాలు సంతోషసరోవరంలా ఉన్నాయి, వాటిని ఆనుకుని ఆ ముక్కుపుటాలు ఆభిజాత్యంతో కంపిస్తున్నాయి.
ఆ నోరు ఆస్వాదయోగ్యమైన ఆర్ద్రతలో ఓలలాడుతున్నది, పాములాగా వంకర తిరిగింది, ఆ నేత్రాలు మరింత విశాలంగా కన్రెప్పల మధురపేటికలో ముకుళితమయ్యాయి.
ఆ వదనవేదిక మీద నాసిక పూర్తిగా రెక్కలు విప్పుకుంది.
వాక్కుని సృజించే ఆ అధరాలు, కదుల్తూనే తప్పించుకుపోయేలా ఉన్నవి, ఎటువంటి సర్పవిన్యాసం!
ఒక రేఖానైర్మల్యంలో ఆ నేత్రాలు ఒదిగిపోయాయి. నక్షత్రమండలాల నిశ్శబ్దంవాటి చుట్టూ. అక్షుభిత నేత్రాలవి. అదంతా ఒక ప్రశాంత చిత్రలేఖనం, ప్రశాంతమానసం పొందే శమదమాల సంతోషం.
ఈ రేఖాలాస్యమంతా వంపు తిరిగి చుబుకం దగ్గర చేరి ఆగింది.
ఆ అభివ్యక్తి అట్లా కొనసాగి ముగిసిపోయే చోట మరొక చోటమళ్ళా కొత్తగా మొదలయ్యింది. నోరు చూపిస్తున్న చలనం కపోలాల్లో అదృశ్యమయ్యింది.
చెవులనుంచి ముందుకు సాగిన వక్రరేఖ ఒకవైపు నోటిదగ్గరా మరొక వైపు నాసికాపక్షాలదగ్గరా చిన్న వంపు తిరిగింది. నాసికకిందుగా, చుబుకాన్ని చుట్టి చెంపలమీదుగా వంపు తిరిగిన ఒక వృత్తమది.
ఆ ఎత్తైన కపోలాలు కూడా వంపుతిరిగాయి.
No comments:
Post a Comment