Wednesday, June 21, 2017

ఎవరు గొప్ప…..?

ఎవరు గొప్ప…..?
పూర్వము ఏడేడులోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యుడికి, ప్రాణికోటికి ప్రాణాధారమైనటువంటి వాయుదేవుడికి మద్య పోటీ మొదలయ్యింది. వారిరువురిలో ఎవరు బలవంతులన్న సమస్య ఏర్పడింది.
ఈ సమస్యను పరిష్కరించుకొనుటకు వారివురి మద్య పోటీ ఒకటి నిర్వహించుకొన్నారు. అదే సమయానికి భూలోకంలో ఒక గొఱ్ఱెలకాపరి గొఱ్ఱెలను మేపుతూ కొండప్రాంతములో సంచరించడం సూర్యుడు, వాయుదేవుడు గమనించారు.
అతను ఒక తెల్లటి వస్త్రమును శరీరముపై కప్పుకొని గొఱ్ఱెలను తోలుతూ కొండప్రాంతంలో కూనిరాగాలుతీస్తూ వెళ్తున్నాడు. 
పోటి ఏమనగా ఎవరు తన బలంతో ఆ గొఱ్ఱెలకాపరిపై వున్న వస్త్రాన్ని తొలగించగలరో వారు మహాబలవంతులని పరీక్ష పెట్టుకున్నారు.
పోటీ మొదలయ్యింది.
మొదట వాయుదేవుడు శరవేగంతో గాలిని వీచడం ప్రారంభించాడు.
కొండప్రాంతములో ఉన్నట్లుండి పెద్దహోరుగాలి మొదలయ్యింది.
గొఱ్ఱెలకాపరి ఉన్నట్టుండి మొదలైన ఎదురుగాలికి స్పందించి చెట్టు చాటుకు పరుగులుతీశాడు. వాయుదేవుడు తనప్రతాపాన్ని పెంచాడు. హోరుగాలి దుమారంగా మారింది.
గొఱ్ఱెలకాపరిని ఉన్నట్టుండి చుట్టుముట్టింది.
తన తెల్లటివస్త్రము గాలికి నిలువలేక అతని నుంచి దూరంగా ఎగరసాగింది.
గొఱ్ఱెలకాపరి గట్టిగా లాగుతూ పెనుగులాడాడు. వాయుదేవుడు తన బలాన్నంతా ప్రయోగించి వస్త్రాన్ని అతని వొంటిమీదనుంచి తొలగించడానికి ప్రయత్నించాడు.
గొఱ్ఱెల కాపరి చలికి వణుకుతూ ఈదురుగాలికి బెదరి ఒక కొండక్రింద తలదాచుకున్నాడు. వాయుదేవుడుశాంతించి తనఓటమిని అంగీకరించాడు.
పోటిపరీక్షలో తనవంతుగా సూర్యుడు బరిలోకిదిగాడు.
ఉన్నట్టుండి వేడిసెగలను వదిలాడు. దానితొ గొఱ్ఱెల కాపరికి చెమటలు పట్టాయి.
సూర్యుడు తన వేడి ఉద్రుతాన్ని పెంచసాగాడు. దానితో ఉక్కపోతకు తట్టుకోలేక గొఱ్ఱెలకాపరి వొంటిమీదవున్న వస్త్రాన్ని తొలగించి సంచిలో వేసుకున్నాడు.
సూర్యుడు పోటిపరీక్షలో జయం తనదే అని గర్వంతో విర్రవీగసాగాడు.
అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వగతుడు, సర్వసమర్థుడు అయిన శ్రీహరి ప్రత్యక్షమైనాడు.
శక్తిని పరులకు ఉపయోగపడేలా ఉపయోగించాలికాని పరులకు కీడుచేయడానికి కాదని జ్ఞానోపదేశం చేశాడు.
“మీ ఇద్దరి బల ప్రదర్శనతో గొఱ్ఱెలకాపరి భయగ్రస్తుడై అనోరోగ్యముతో రోగగ్రస్తుడైనాడని, ఒకరికొకరు బలప్రదర్శనగావిస్తే సృష్టి తలక్రిందులౌతుందని, ఎవరికర్తవ్యాన్ని వారు నెరవేర్చాలని ధర్మోపదేశాన్ని చేశాడు.
సూర్యుడు-వాయుదేవుడు తమ అజ్ఞానానికి సిగ్గుతో తలవంచి శ్రీహరిని శరణుకోరి తమ విధులను నిర్వర్తించుటకు బయలుదేరారు.
*ఇదేవిదంగా మనుష్యులైన మనము కూడా మానవత్వంతో భగవంతుడు మనకు నిర్దేశించిన కర్తవ్యాన్ని తెలుసుకొని ధానిని అమలపరచాలి. ఏకారణంతో అయినా ఇంకొకరితో మనల్ని పోల్చుకోవడం, కయ్యానికి దిగడం మంచిది కాదు. మనల్ని సృష్ఠించిన భగవంతుడే గీతలో “స్వధర్మే నిదనం శ్రేయః..” అని అన్నాడు.
కావున ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించడం
అన్ని విధాల శ్రేయస్కరం అన్న నీతిని గ్రహించాలి.

No comments:

Post a Comment

Total Pageviews