Monday, May 1, 2017

లీ చింగ్ చావో చైనా సాహిత్యంలో అందరికన్నా గొప్ప కవయిత్రి



నిన్న సాయంకాలమంతా మబ్బు పట్టింది. ఎన్నాళ్ళయిందో అట్లాంటి వైశాఖమాసపు అపరాహ్ణం చూసి. వాన పడకుండానే మబ్బులు చెదిరిపోయాయి. కాని రాత్రి వేసవి తెమ్మర తిరిగింది.
తక్కిన ప్రపంచానికి నాలుగే ఋతువులు. మనకి ఆరు. కానీ ప్రాచీన సంగం కవిత్వం, ప్రాకృత కవిత్వం చదువుతుంటే, మనకి ఆరు కాదు, పన్నెండు ఋతువులున్నాయని తెలుస్తుంది. వాటిని బయట ప్రపంచంలో గుర్తుపట్టడం మొదలయ్యాక ఋతుపరిభ్రమణం లో గోచరించినంత సౌందర్యం మరెక్కడా గోచరించదని తెలుస్తున్నది.
మామూలుగా మనకి వసంతం మాత్రమే తెలుసు. కాని పూర్వకవులు వసంతంలో తొలివసంతం, మలి వసంతం రెండున్నాయని గుర్తుపట్టేరు. చైత్రం తొలివసంతమైతే, వైశాఖం మలివసంతం. కాని వైశాఖం నడివేసవి కూడా. వసంతం గ్రీష్మంగా మారిపోయే కాలం. అందులో గొప్ప దిగులు ఉంటుంది. కాని చిన్నప్పటి వేసవి సెలవుల జ్ఞాపకాలతో కొంతకాలం కిందటిదాకా ఒక మాధుర్యం కూడా ఉండేది. ఇప్పుడు సెలవుల్లేని జీవితంలో, ఆ మాధుర్యానికి బదులు, వసంతం తరలిపోతున్న మధురవిషాదం మాత్రమే మలివసంతంలో పరుచుకుని కనిపిస్తుంది.
తరలిపోయే వసంతాన్ని బహుశా చైనా, జపాన్ కవులు పట్టుకున్నట్టుగా మరే కవులూ పట్టుకోలేదు. ముఖ్యంగా ప్రాచీన చీనా కవయిత్రి లీ చింగ్ చావో (1084-1151) పట్టుకున్నట్టుగా.
ఆమె కవయిత్రి అంటే పద్యాలు రాసే కవయిత్రి గుర్తొస్తుంది కాబట్టి సరిగ్గా చెప్పాలంటే పదకర్త అనాలి. పూర్వకాలపు చైనాలో కవిత్వంలో మూడు రకాల ప్రక్రియలు వాడుకలో ఉండేవి. కన్ ఫ్యూసియస్ సంకలనం చేసిన షీ-చింగ్ నుంచి మొదలైన 'షీ ' ప్రక్రియ. దాన్ని మనం మన పద్యంతోనో, శ్లోకంతోనో పోల్చవచ్చు. కాని పది-పదకొండో శతాబ్దాల్లో ఉత్తర చైనా ని మంగోల్ సైన్యాలు ఆక్రమించుకోవడంతో, చైనా చక్రవర్తులు యాంగ్ జే నదికి దక్షిణానికి తరలిపోయేరు. అట్లా దక్షిణ చైనాలో సోంగ్ సామ్రాజ్యం ఏర్పడ్డాక, 'చి 'అనే ప్రక్రియ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది లలితగీతం లాంటి ప్రక్రియ. అన్నమయ్య, క్షేత్రయ్యల పదాల్లాంటి గీతకవిత అన్న మాట. మధ్యాసియానుంచి చైనా చక్రవర్తుల ఆస్థానాల్లోనూ, అంత:పురాల్లోనూ ప్రవేశించిన యువతులు పట్టుకొచ్చిన రాగాలూ, బాణీలూ ఆ కవితలకు ఆధారాలు. అప్పటిదాకా యుగాలుగా చెక్కుచెదరకుండా పాతుకుపోయిన ప్రాచీన ఛందస్సుల్ని ఆ పాటలు పక్కకు తోసేసాయి.
లీ చింగ్ చావో చైనా సాహిత్యంలో అందరికన్నా గొప్ప కవయిత్రి అని నేటికి పూర్తిగా సాహిత్యవిమర్శకులు నిర్ణయించుకోగలిగారు, కాని ప్రజలు ఆ తీర్పు ఎప్పుడో ఇచ్చేసారు. సంప్రదాయ చైనా సాహిత్యంలో స్త్రీలకి దాదాపుగా స్థానం లేదు. కొద్ది మంది కవయిత్రులు కవిత్వం చెప్పినప్పటికీ, వాళ్ళంతా దాదాపుగా సాధారణ సామాజిక జీవితపు అంచులకి నెట్టబడ్డ వేశ్యలూ, రాజనర్తకులూ, బౌద్ధ భిక్షువులూ, డావో సన్యాసినులూ మటుకే. వాళ్ళందరి మధ్యా చింగ్ చావో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఆమె తండ్రి రాజోద్యోగి, విద్వాంసుడు, రచయిత. సోంగ్ యుగానికి చెందిన గొప్ప కవి సు-తుంగ్-పో కి మిత్రుడు కూడా. తల్లి కూడా విదుషి. వాళ్ళు తమ కూతురిని కూడా కొడుకుల్లానే పెంచారు. ఆమెకు గొప్ప విద్య, కళాభినివేశం కలిగించారు. ఆమె తనలాంటి అభిరుచి ఉన్న చావో మింగ్ చెంగ్ ని పెళ్ళి చేసుకుంది. వాళ్ళది ఆదర్శ దాంపత్యం. వాళ్ళిద్దరూ కలిసి కవిత్వం చదువుకునేవారు. ప్రాచీన తాళపత్ర గ్రంథాలూ, చిత్రలేఖనాలూ, ముద్రలూ, పింగాణి కళాకృతులూ సేకరించుకునేవారు. ప్రాచీన చిత్రకళాముద్రలమీదా, కాంస్య ముద్రలమీదా గొప్ప పరిశోధన వెలువరించారు.
కాని ఆ రోజులట్లానే కొనసాగితే అది జీవితమెందుకవుతుంది? దేశం మీద తార్తారుల దండయాత్ర మొదలయ్యింది. చావోల ఇల్లు దగ్ధమయిపోయింది. పది ఇళ్ళకు సరిపడా వాళ్ళు సేకరించిన కళాకృతులన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. మిగిలిన కొద్దిపాటి సామగ్రినీ వెంటపెట్టుకుని ఆ జంట దక్షిణాదికి తరలిపోయారు.అక్కడ చావో కి చిన్న పాటి ప్రభుత్వోద్యోగమొకటి దొరికిందిగాని, ఎక్కడో మారుమూల ఆ ఉద్యోగం కోసం పోయినప్పుడు అతడు జబ్బుపడి మరణించాడు. అప్పటికి లీ చింగ్ చావో వయసు నలభై ఆరేళ్ళు. ఆ తర్వాత ఆమె కొన్నాళ్ళు ఎక్కడా స్థిరంగా ఉండలేక దిమ్మరిలాగా బతికింది. చివరిరోజుల్లో దక్షిణ సోంగ్ రాజధాని హాంగ్ ఝౌ లో స్థిరపడింది. తన ఏకాంతాన్నీ, భరించలేని విషాదాన్నీ గీతాలుగా అల్లుతూ జీవించింది.
సుమారు ఆరు సంపుటాల ఆమె కవిత్వంలో ప్రపంచానికి ఇప్పుడు మిగిలింది 78 పాటలూ, కొన్ని పద్యాలూ మాత్రమే. ఆ పాటల్లో కూడా 43 మాత్రమే ఆమె రాసిందని నిశ్చయంగా చెప్పగలిగినవి.
కానీ మనకు మిగిలిన ఆ కొద్దిపాటి గీతాలతోనే ఆమె ప్రపంచసాహిత్యంలో తనదంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఒకసారి ఆ కవితలు పరిచయమైన సాహిత్యప్రేమికుడు ఆమెని జీవితమంతా ఆరాధిస్తూనే ఉంటాడు. ఆ కవితల ఒక ఇంగ్లీషు అనువాదానికి ముందుమాట రాస్తూ, విక్టర్ ఎచ్ మయర్ అనే ఒక విద్వాంసుడు చింగ్ చావో కవితలు చదవడం ఒక ఆదివారం అపరాహ్ణం ఎమిలీ డికిన్ సన్ ని చదవడం లాగా ఉందని రాసుకున్నాడు. (Experiencing Li Qingzhao via pen of Wang Jiaosheng is as comfortably enchanting and absorbing as communing Emily Dickinson on a dark, quiet Sunday afternoon). అంతేకాదు, ఆ కవితలు చదివాక, అవి చదవకుండానే తాను ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించి ఉండటం అన్న ఊహనే ఇప్పుడు తనని వణికిస్తోందని కూడా రాసాడు.
తరలిపోతున్న వసంత విషాదంలో కన్నీళ్ళతో తడిసిన ఆ గీతాల్ని నా హృదయానికి హత్తుకుంటూనే ఒక ఆదివారమంతా గడిపేసాను. కొన్ని గీతాల వచనానువాదం మీకోసం.
1.
చిన్న ముంగిలి, సోమరి కిటికీ
వసంతకాలపు మెత్తటి లేజాయ.
ఇంకా మడిచిపెట్టని తెరలు,
గదిలో చిక్కటి నీడ.
మేడమీద,మౌనంగా
ఎవరో శ్రుతిచేస్తున్న తంత్రులు.
దూరశిఖరాలమీంచి
తరలివస్తున్న మబ్బులు,
త్వరపడుతున్న సాయంసంధ్య.
చిరువానజల్లులో
చిక్కుకున్న వెలుతురు నీడ.
చెట్లమీద రంగువెలుస్తున్న పువ్వులు,
వాటి వన్నెచెదరకుండా
ఆపేదెవ్వరు?
2.
వసంతం తరలిపోతున్న దిగులు
ఓపికలేదు, జడవేసుకోకుండా
వదిలేసిన నా కబరీభరం.
సాయంకాలపు తెమ్మెరకు
ముంగిట్లో రాలుతున్న పూలు.
దూదిపింజల్లాంటి మబ్బులమధ్య
దోబూచులాడుతున్న జాబిలి.
ఇంకా వెలిగించని
సోమరి కర్పూరకరండం.
వాలిపోయిన కుచ్చిళ్ళు కప్పేసిన
దోమతెర లేతతెలుపు.
ఇంకా నన్నంటిపెట్టుకున్న ఈ జడపిన్ను,
శీతాకాలం చిరకాలం కాదనడానికి
ఇదొక్కటేనా నిరూపణ?
3.
నీటిగడియారం పనిచేయడం మానేసింది
ముక్కలైపోయిన నా కల.
నిన్నరాత్రి మధువు
నా దు:ఖాన్ని మరింత తీవ్రం చేసింది.
తలగడమీద రాలిన చలిగాలి.
తెరవెనక ప్రత్యూషం.
గుమ్మం ముందు రాలిన పూలరేకలు
ఎవరు తుడిచిపెట్టారు?
రాత్రంతా వీచిన ఈదురుగాలేనా?
పలచబడిపోతున్న నిర్మలవేణు స్వరాలు
ఆ గాయకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలీదు
తొందరలోనే,వసంతం కూడా, వెళ్ళిపోతుంది.
కాని వస్తానన్న మాట మటుకు
అతడు నిలబెట్టుకోలేదు.
తరలిపోతున్న మబ్బులమధ్య
వసంతదేవతని అడుగుతున్నాను:
నేనేమి చేసుకోను?
ఈ ఎదురుచూడటాన్ని?
ఈ దు:ఖాన్ని?
ఈ క్షణాన్ని?
4.
ఉత్సాహం లేదు,
నిద్రపట్టని సుదీర్ఘరాత్రి
మళ్ళా మనం మన పాతరాజధానికి
తిరిగివెళ్ళిపోతున్నట్టు కలగన్నాను.
చిరపరిచితమైన ఆ దారిపొడుగునా
వెన్నెల, విరబూసిన పూలు.
ఈ ఏడాది వసంతాగమన శుభవార్తతో
నేనా ఇంట్లో అడుగుపెట్టానట.
అందరం కలుసుకున్నాం, పిండివంటలు.
మధురభక్ష్యాలు,
మామిడిపళ్ళ వగరు, ప్రీతిపాత్రమైన మధువు
పూలసుగంధంతో
నా కేశరాశి మత్తెక్కాలని ఎంత కోరుకున్నానో.
ఆ పూలు నన్ను తేలిగ్గా
ఎగరగొట్టేసిఉండేవి,
చూస్తూండగానే! కళ్ళముందే!
ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను,
వసంతమూ, నేనూ కూడా
వయసు వాటారుతున్నాం.
5.
గాలి వీయడం లేదు
వసంతం పేరిట మిగిలిందంతా
పరిమళప్రపూత ధూళి.
రోజు పొద్దెక్కింది
అయినా ఇంకా జడ ముడుచుకోలేదు
గదిలో అన్నీ అట్లానే ఉన్నాయి
అతడు మటుకు లేడు.
ఏమీ చెయ్యాలని లేదు
మాటలు పెగిలేటంతలో
కన్నీళ్ళు పొడుచుకొస్తున్నాయి.
ఆ రెండునదులూ కూడే చోట
వసంతమింకా నిలిచే ఉంటుందట
ఒక పడవపట్టుకుని
అక్కడికి పోగలిగితే!
కాని ఆ గొల్లభామ పడవ
ఇంత దు:ఖం మొయ్యగలదా!

No comments:

Post a Comment

Total Pageviews