మన కోసం చదవండి!
నేను మనసును కాను. బుద్ధిని కాను. అహంకారాన్ని కాను. చిత్తాన్ని కాను. శ్రోత్రాన్ని కాను. జిహ్వను కాను. నాసికను కాను. నేత్రాన్ని కాను. ఆకాశాన్ని కాను. భూమిని కాను. తేజస్సును కాను. వాయువును కాను. చిదానందంలో మునిగిపోవాలనుకునే జీవుడను నేను! అనే భావన కలిగివుండాలి.
మానవుడు కర్మజీవి కాబట్టి క్షణం కూడా ఏదో ఒక పని- శారీరకంగా కాకపోయినా మానసికంగానైనా చేయకతప్పదు. ఈ మనిషి జన్మ- కర్మ జనితమే కాబట్టి, అవతారపురుషుడు కృష్ణుడు తానూ కర్మ చేయకతప్పటం లేదని అర్జునుడికి చెప్పిన విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. కర్మ చేయటం ఎలాగూ తప్పదు కాబట్టి, నిరంతర స్మరణ చేస్తూ కర్తవ్యకర్మను దైవకార్యంగా నిర్వర్తించాలి.
మనం ప్రపంచాన్ని నమ్మాలి. అంటే, తోటి మనుషుల్ని నమ్మగలగాలి. మనకు వచ్చే సంపదలు ఎవరో తెచ్చివ్వాలని ఆశించకూడదు. మన ఆనందాన్ని మరెవరో కొనితేవాలని అనుకోకూడదు. మన మనసు ద్వారాలు ఎల్లవేళలా తెరిచి ఉంచితే ఆ ఆనందం, ఆ సంపద రావాల్సిన వేళకు అవే వస్తాయి! మనకోసం విధి రాసిపెట్టి ఉంటే వాటినెవరైనా ఆపగలరా! వాటికోసం సహనం వహించాల్సిన బాధ్యత మనకు లేదా!
మనలో కొందరు తోటివారిని నమ్మరు. తమ పని తాము చేయరు. అంతా తామనుకున్నట్టు జరగాలనుకుంటారు. ఈ అపనమ్మకంవల్ల తాము చేయాల్సిన పని మానేసి తోటివాళ్లు శ్రమ పడాలనుకుంటారు. బాధ్యత తీసుకోవాలనుకుంటారు. దీనివల్ల తమకు మేలు జరగదు సరికదా- ఎవరికీ మంచి జరగదు. ఈ వివేకం వారికుండదు.
దీనికి కారణం తమకే అంతా తెలుసుననుకునే అహంకారం. తక్కిన వారికన్న తామే ముఖ్యులమనుకునే అహంభావం. ఇతరుల అభిప్రాయంకన్నా తాము నమ్మిందే నిజమనుకునే మూర్ఖత్వం. తాము చేసేదేదీ తప్పు కాదనుకుంటారు. అన్నిటికీ అతీతులమనుకుంటారు. కేవలం ఇదొక మొండితనమని వారికి తోచదు. ఈ అహంకారంతో స్వార్థం తలెత్తుతుంది. ఇది అనర్థదాయకమని ఎవరు చెప్పినా వారు వినరు, కనరు, గ్రహించుకోరు.
ప్రకృతితో సహజీవనం చేసే జంతువులు, పక్షులనుంచి మనిషి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. భగవంతుడి సృష్టిలో ఐకమత్యంగా జీవించటం సహజ గుణం. విభేదించి ఒంటరిగా బతకటం విపరీత లక్షణం. వీటిలో ఏది కావాలో నిర్ణయించుకోవటం మనిషి చేతుల్లోనే ఉంది!
No comments:
Post a Comment